శరీర భాష.. చక్కగా ఇలా!

ఇంటర్వ్యూ ఏదైనా.. అభ్యర్థి ఇచ్చే జవాబులతోపాటు అతడి విజయంలో ముఖ్యపాత్ర పోషించే మరో కీలక అంశం బాడీ లాంగ్వేజ్‌! అసలు మన గురించి మన మాటలకంటే శరీర భాషే ఎక్కువగా చెప్పగలుగుతుంది అంటే అతిశయోక్తి కాదేమో! అందుకే సరైన శరీర భాషను సాధన చేయడం అభ్యర్థులకు అవసరం.

Updated : 06 Dec 2023 01:13 IST

ఇంటర్వ్యూ ఏదైనా.. అభ్యర్థి ఇచ్చే జవాబులతోపాటు అతడి విజయంలో ముఖ్యపాత్ర పోషించే మరో కీలక అంశం బాడీ లాంగ్వేజ్‌! అసలు మన గురించి మన మాటలకంటే శరీర భాషే ఎక్కువగా చెప్పగలుగుతుంది అంటే అతిశయోక్తి కాదేమో! అందుకే సరైన శరీర భాషను సాధన చేయడం అభ్యర్థులకు అవసరం. అకడమిక్‌ ఇయర్‌ పూర్తవుతూ ఇంటర్వ్యూలు అధికంగా జరుగుతున్న ఈ సమయంలో మరి ఈ అంశం గురించి వివరంగా తెలుసుకుందామా!

శరీర భాష చాలా విషయాలను చెప్పకనే చెబుతుంది. కళ్లు, చేతులు, నడక, కూర్చునే తీరు.. ఇలా ప్రతి కదలికా బాడీ లాంగ్వేజ్‌లో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకోవడం ద్వారా ముఖాముఖి సమయాల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వగలుగుతాం. సందర్భానికి తగిన విధంగా  హుందాగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాం.

కళ్లలోకి చూడటం

ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ఎందరు ఉన్నా అందరితోనూ కళ్లలోకి నేరుగా చూస్తూ మాట్లాడటం అత్యంత ప్రధానమైన అంశం. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని, మనమిచ్చే జవాబులపై మనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. గది పైకప్పు వైపు, మూలలవైపు చూడటం, పదే పదే ఫోన్‌ లేదా వాచ్‌ చూసుకోవడం, మాట్లాడేటప్పుడు తరచూ కళ్లు మూసుకోవడం, ఎదుటి వారి కళ్లలోకి చూడలేకపోవడం అనేది మనసులోని ఆందోళనలను, ఆత్మవిశ్వాస కొరతను సూచిస్తుంది. అలా అని చూపు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోతే ఎదుటివారిని కొంత ఇబ్బందికి గురిచేసే ప్రమాదం ఉన్నందున సందర్భానికి తగిన విధంగా, వారిని ఇబ్బంది పెట్టకుండా చూడటం అవసరం.

  • ఐ కాంటాక్ట్‌కు ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే ఎదుటివారి కళ్లలోకి చూస్తూ మాట్లాడినప్పుడే వారు నిజంగా మనతో సంభాషణలో మమేకం కాగలరు. ఎంత ఇంటర్వ్యూ అయినా అది చివరికొచ్చేసరికి ఒక సంభాషణగానే మిగులుతుంది. అందుకే మన ఆసక్తినీ, ఆత్మవిశ్వాసాన్నీ వ్యక్తపరిచే ఐ కాంటాక్ట్‌ విషయంలో అశ్రద్ధ వహించకూడదు.

చిరునవ్వు

ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లిన దగ్గర్నుంచి చిరునవ్వుతో పలకరించడం, ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం, అవసరమైనప్పుడు ఆ నవ్వును కొనసాగించడం ద్వారా అక్కడి వాతావరణాన్ని తేలికపరచొచ్చు. ఒక మంచి సానుకూల వాతావరణంలో సంభాషణ జరిగితే వచ్చే ఫలితాలు కూడా ఆశావహంగా ఉంటాయనేది నిపుణుల సూచన. అదే సమయంలో సాంకేతిక అంశాలు, సీరియస్‌ అంశం మాట్లాడేటప్పుడు ఆ సందర్భానికి తగిన విధంగా ముఖకవళికలు ఉండటం అవసరం.

వినేటప్పుడు..

మాట్లాడటం మాత్రమే కాదు, వినడం కూడా ఒక కళే. ఎదుటివారు చెప్పేది సాంతం వినడం, అర్థం చేసుకోవడం, అప్పుడే తిరిగి జవాబు ఇవ్వడమనేది తప్పక సాధన చేయాల్సిన విషయం. మన గురించి చెప్పుకోవాలి అనుకోవడం, తెలిసిన సబ్జెక్టు మాట్లాడేయాలి అనుకోవడం, ఆ కంగారులో సరిగా వినకపోవడం అనేది సాధారణంగా జరుగుతుంటాయి. కానీ వీలైనంతగా ఆ తప్పులను చేయకుండా ఉండటం సాధన చేయాలి. ఇంటర్వ్యూవర్‌ అభ్యర్థి అర్హత, అనుభవంతోపాటు ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ను కూడా అంచనా వేస్తారు. ఇందులో వినడమనేది ఒక ముఖ్య విషయం.

కూర్చునే తీరు

రీర బరువును మనం ఏ కోణంలో ఉంచుతున్నాం అనే అంశం కూడా చాలా ముఖ్యం. నిటారుగా కూర్చోవడం, భుజాలను రిలాక్స్‌డ్‌గా ఉంచడం, కాళ్లను దగ్గరగా ఉంచుకోవడం.. ఇవన్నీ పాటించడం అవసరం. అభ్యర్థి అందరితోనూ సులభంగా కలిసిపోతాడా, నలుగురిలోనూ మాట్లాడేందుకు ఇబ్బంది పడతాడా, చెప్పే జవాబుల్లో ఎంతవరకూ నిజం ఉంది, వ్యక్తిత్వం ఎటువంటిది.. వంటివన్నీ కూర్చునే తీరుతో అంచనా వేయొచ్చు.

  • అప్రమత్తంగా ఉండటం, అవసరమైనప్పుడు తక్షణం స్పందించడం ఇక్కడ ప్రధాన లక్ష్యం. జవాబులు ఇచ్చేటప్పుడు చిన్నగా ముందుకు వంగి మాట్లాడటం ద్వారా మనం ఆసక్తిగా, సంభాషణలో మిళితమై ఉన్నట్లు కనిపించవచ్చు. సందర్భాన్ని బట్టి చిన్నగా తల ఆడించడం కూడా ఇందులో భాగం.

చేతులు

నమే కాదు.. మన చేతులు కూడా మాట్లాడతాయి తెలుసా? చెబుతున్న అంశానికి తగిన విధంగా చేతులను కదిలించడం ద్వారా మన సమాధానాలను మరింత స్థిరంగా తెలియజేయవచ్చు. అలాగే మాట్లాడటం ఆపినప్పుడు చేతులను న్యూట్రల్‌ పొజిషన్‌లో ఉంచడం ద్వారా వినడంపై ఏకాగ్రత పెంచవచ్చు. ఎదురుగా ఉన్న టేబుల్‌ లేదా డెస్క్‌పై కుదిరితే చేతులను రెస్ట్‌ పొజిషన్‌లో ఉంచుకోవచ్చు. అదే సమయంలో మరీ అధికంగా ఉపయోగించకుండా జాగ్రత్త వహించడం అవసరం, అలా చేస్తే ఎదుటి వారి ఏకాగ్రత మనం మాట్లాడే అంశం మీద నుంచి పక్కకు వెళ్లే పరిస్థితి తలెత్తుతుంది.

తిరిగి వెళ్లేటప్పుడు..

రావడం ఎంత ఆత్మవిశ్వాసంతో లోపలికి అడుగుపెడతామో.. వెళ్లేటప్పుడు కూడా అంతే హుందాగా వెళ్లడం ద్వారా ఇంటర్వ్యూవర్‌ వద్ద మంచి అభిప్రాయాన్ని కొనసాగించవచ్చు. చక్కని చిరునవ్వు, కరచాలనంతో తిరిగి వెళ్లేటప్పుడు ‘థాంక్యూ’ చెప్పవచ్చు. గది తలుపు మూసేటప్పుడు కూడా ఇదేవిధంగా ఉండాలి.

సాధనతో..

ఇంటర్వ్యూలకు సమాధానాలు ఎలా అయితే సాధన చేస్తామో బాడీ లాంగ్వేజ్‌ను కూడా అదే విధంగా సాధన చేయడం అవసరం.అప్పుడే మెరుగైన ప్రదర్శన కనబరచగలం. నిజానికి మనసులో భయం ఉన్నా నిరంతరం సాధన చేయడం ద్వారా దీన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో కనిపించవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌లో వివిధ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో చాలా కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు