ఫ్యాషన్‌ కెరియర్‌లో ప్రవేశిస్తారా?

ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తోంది ఫ్యాషన్‌. పల్లె, పట్నం.. తేడా లేకుండా అందరూ ప్రత్యేకంగా కనిపించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకోసం దుస్తులు, వస్తువుల ఎంపికపై శ్రద్ధ పెడుతున్నారు. దీంతో ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులు చదివిన వారికి డిమాండ్‌ పెరిగింది.

Updated : 12 Dec 2023 01:03 IST

నిఫ్ట్‌ యూజీ, పీజీ కోర్సుల ప్రకటన

ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తోంది ఫ్యాషన్‌. పల్లె, పట్నం.. తేడా లేకుండా అందరూ ప్రత్యేకంగా కనిపించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకోసం దుస్తులు, వస్తువుల ఎంపికపై శ్రద్ధ పెడుతున్నారు. దీంతో ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులు చదివిన వారికి డిమాండ్‌ పెరిగింది. మేటి సంస్థలెన్నో వీరికి అవకాశాలు అందిస్తున్నాయి. అందువల్ల ఫ్యాషన్‌లో ఆసక్తి ఉన్నవారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)ల్లో చేరి, రాణించవచ్చు. ఈ సంస్థలు పలు యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!

హైదరాబాద్‌ సహా దేశంలో 18 నిఫ్ట్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగేళ్ల యూజీ, రెండేళ్ల పీజీ కోర్సులు చదువుకోవచ్చు. యూజీ డిజైన్‌లో భాగంగా.. యూక్సెసరీ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, లెదర్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సులు ఉన్నాయి. నిఫ్ట్‌లు ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సునూ యూజీలో అందిస్తున్నాయి. పీజీలో డిజైన్‌, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. సృజనాత్మకత, డిజైన్‌పై ఆసక్తి, ఊహలకు రూపమివ్వగలిగే నైపుణ్యం, స్కెచింగ్‌ ప్రావీణ్యం ఉన్నవారు ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సుల్లో చేరితే రాణించగలరు.


ఇవీ అర్హతలు..

1 బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సమాన ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.

2 బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌  టెక్నాలజీ

అర్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల డిప్లొమా. చివరి ఏడాది విద్యార్థులూ అర్హులే.

వయసు: పై రెండు కోర్సులకూ ఆగస్టు 1, 2024 నాటికి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్లు మినహాయింపు.

3 మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: ఈ కోర్సులకు ఏదైనా డిగ్రీ లేదా నిఫ్ట్‌/ నిడ్‌ నుంచి కనీసం మూడేళ్ల వ్యవధితో యూజీ డిప్లొమా.

4 మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ

అర్హత: ఈ కోర్సులకు నిఫ్ట్‌ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌) లేదా ఏదైనా సంస్థ నుంచి బీఈ/బీటెక్‌. చివరి ఏడాది విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధన లేదు.


సీట్లు ఎన్ని?

అన్ని నిఫ్ట్‌ల్లోనూ కలిపి యూజీ, పీజీల్లో 5289 సీట్లు ఉన్నాయి.

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో.. ఫ్యాషన్‌ డిజైన్‌- 742, లెదర్‌ డిజైన్‌- 172, యాక్సెసరీ డిజైన్‌- 654, టెక్స్‌టైల్‌ డిజైన్‌- 743, నిట్‌వేర్‌ డిజైన్‌- 346, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌- 742 సీట్లు.
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో.. అపారల్‌ ప్రొడక్షన్‌- 652 సీట్లు.
  • పీజీ కోర్సులైన మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌లో 304, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో 786, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో 148 సీట్లు.


ప్రశ్నలు ఈ విభాగాల్లో...

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: కూడికలు, గుణింతాలు, భాగహారం, తీసివేతలు, శాతాలు, భిన్నాలు, వడ్డీ రేట్లు, పని-కాలం, దూరం-వేగం, నిష్పత్తి, సగటు.. తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు తేలిక, మధ్యస్థంగా ఉంటాయి. హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోని ఈ అంశాలు చదువుకుంటే సరిపోతుంది. ప్రాథమికాంశాలపై పట్టున్నవారు సులువుగానే ఎక్కువ మార్కులు పొందగలరు.

కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: అభ్యర్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. దైనందిన జీవితంలో మాట్లాడటానికి అవసరమైన పదసంపద, వ్యాకరణం ఉన్నాయో, లేదో పరీక్షించేలా ప్రశ్నలు సంధిస్తారు. ఆంగ్లంలో పాసేజ్‌లు ఇచ్చి వాటిపై ప్రశ్నలడుగుతారు. ఈ విభాగంలోని ప్రశ్నలు హైస్కూల్‌ స్థాయిలో ఉంటాయి. వ్యాకరణ ప్రాథమిక నియమాలు, ప్రాథమిక స్థాయి పదసంపద పరిజ్ఞానం ఉండాలి. సమానార్థాలు, వ్యతిరేకార్థాలు, సామెతలు, సింగ్యులర్‌, ప్లూరల్‌, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్‌, స్పెల్లింగ్‌ కరెక్షన్‌ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి.

ఎనలిటికల్‌ ఎబిలిటీ: అభ్యర్థి తర్కాన్నీ, విశ్లేషణనూ పరీక్షించడానికి ఈ సెక్షన్‌ను కేటాయించారు. కొంత సమాచారం ఇచ్చి, దాన్నుంచే జవాబులు గ్రహించగలిగేలా ప్రశ్నలు వస్తాయి. ఈ సెక్షన్‌ ద్వారా అభ్యర్థి ఆలోచనా స్థాయినీ పరీక్షిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని బాగా విశ్లేషించగలిగితే సులువుగానే సమాధానం గుర్తించగలరు. గణితంలో పరిజ్ఞానం ఉన్నవారు ఈ విభాగంలో రాణించగలరు.  

జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌: వర్తమాన సంఘటనలతో ముడిపడిన ప్రశ్నలడుగుతారు. జనరల్‌ నాలెడ్జ్‌లో అభ్యర్థికి సమాజం, పరిసరాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. తాజా పరిణామాలపై అవగాహన ఉంటే సులువుగానే కరెంట్‌ అఫైర్స్‌ సమాధానాలు రాయొచ్చు. రోజూ ఏదైనా పత్రిక చదివి ముఖ్యాంశాలను నోట్సు రూపంలో రాసుకుంటే సమాచారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి, 2023 నుంచి జరిగిన ప్రధాన సంఘటనలను మననం చేసుకోవాలి.

క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌: అభ్యర్థికి డిజైనింగ్‌లో సృజనాత్మకత ఎలా ఉందో ఈ పరీక్ష ద్వారా పరిశీలిస్తారు. రంగులను ఎలా ఉపయోగిస్తున్నారు, పరిశీలనాశక్తి ఏ విధంగా ఉంది, కొత్తదనం ఏమైనా ఉందా, ఇలస్ట్రేషన్‌, కళాత్మక నైపుణ్యం..తదితర అంశాల మేళవింపుతో ఈ పరీక్ష ఉంటుంది. స్కెచింగ్‌ నైపుణ్యం, ఊహాశక్తి బాగున్నవారు రాణించగలరు.

కేస్‌ స్టడీ: ఈ విభాగంలో ఫ్యాషన్‌ పరిశ్రమ సమాచారం ఉంటుంది. అభ్యర్థి మేనేజీరియల్‌ నైపుణ్యం పరిశీలిస్తారు. ఫ్యాషన్‌ ప్రపంచంలో తాజా పోకడలపై అవగాహన పెంచుకోవాలి.
రాత పరీక్షలో అర్హత సాధించినవారికి కోర్సును బట్టి సిచ్యువేషన్‌/ స్టూడియో టెస్ట్‌, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

సిచ్యువేషన్‌/ స్టూడియో టెస్టు: ఇందులో అభ్యర్థిలోని సృజన, 3డీ మోడలింగ్‌ నైపుణ్యం పరీక్షిస్తారు. ఇచ్చిన కాన్సెప్ట్‌పై అభ్యర్థికి ఉన్న స్పష్టత, ఆ అంశంపై ఉన్న పరిజ్ఞానం.. మొదలైనవి పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. ఫ్యాషన్‌ టెక్నాలజీ/డిజైన్‌ రంగాల్లో స్పష్టమైన అవగాహన, స్కెచింగ్‌ నైపుణ్యం, రంగులు మేళవించడంలో పట్టు ఉన్నవారు ఇందులో రాణించగలరు.

ఇంటర్వ్యూలో: అభ్యర్థికి ఫ్యాషన్‌ కెరియర్‌పై ఏ మేరకు ఆసక్తి ఉంది? ఈ రంగంపై పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది? అకడమిక్‌ ప్రతిభ, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, కమ్యూనికేషన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌, క్రియేటివిటీ, లేటరల్‌ థింకింగ్‌.. తదితర కోణాల్లో పరిశీలిస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 3

ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 5

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.

వెబ్‌సైట్‌:www.nift.ac.in/node/132 


ఏయే అవకాశాలు?

దేశంలో ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో నిఫ్ట్‌లదే పైచేయి. అందువల్ల ఈ సంస్థల్లో చదువు పూర్తిచేసుకున్నవారిని కార్పొరేట్‌ కంపెనీలు ప్రాంగణ నియామకాల ద్వారా ఆకర్షణీయ వేతనాలు, హోదాలు అందిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హుందాగా కనిపించాలనే తపన దాదాపు అందరిలోనూ పెరుగుతోంది. ప్రతి సందర్భాన్నీ వేడుకగా చేసుకునే సంస్కృతి విస్తరిస్తోంది. ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా తళుక్కుమనడానికి ఫ్యాషన్‌ ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. అందువల్ల ఆకట్టుకునేలా, వైవిధ్యం ఉట్టిపడేలా.. దుస్తులు, వివిధ వస్తువులను డిజైన్‌ చేయగలిగే నైపుణ్యం ఉన్నవాళ్లు రూ.లక్షల్లో సంపాదించగలరు. కోర్సులు విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత ఫ్యాషన్‌ డిజైనర్‌, స్టైలిస్ట్‌ (స్టోర్స్‌), ఫ్యాషన్‌ రిటైలర్‌, ఫ్యాషన్‌ ఆంత్రప్రెన్యూర్‌, పర్సనల్‌ స్టైలిస్ట్‌/ సెలబ్రిటీ స్టైలిస్ట్‌ తదితర హోదాలతో రాణించవచ్చు. సొంతంగా బొటిక్‌ నడపవచ్చు.


పరీక్షలో...

కోర్సును బట్టి ప్రశ్నపత్రం మారుతుంది. రుణాత్మక మార్కులు లేవు. ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (జీఏటీ) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌కు మొత్తం వంద ప్రశ్నలుంటాయి. వీటిలో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 20, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ 40, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ 15, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 25 ప్రశ్నలు అడుగుతారు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి.. జనరల్‌ ఎబిలిటీ టెస్టు (జీఏటీ) నిర్వహిస్తారు. ఇందులో రెండు సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిని మూడు గంటల్లో పూర్తిచేయాలి. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ పరీక్షలో: క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 35, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అండ్‌ ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ 40, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ 30, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. కేస్‌ స్టడీకి 20 మార్కులు కేటాయించారు.


రాణించాలంటే..

  • ఇది అకడమిక్‌ నేపథ్య పరీక్ష కాదు. అందువల్ల పాత ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలిస్తే ప్రశ్నలు ఎలాంటి వస్తాయి, వాటికోసం వేటిని అధ్యయనం చేయాలో తెలుస్తుంది.
  • మార్కెట్‌లో దొరికే ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకుని, పూర్తిగా అధ్యయనం చేస్తే సరిపోతుంది. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  • పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు సమీక్షించుకుని, సన్నద్ధతలో మార్పులు చేసుకుంటే ఎక్కువ మార్కులు పొందగలరు.

వెయిటేజీ ఎంత?

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో వంద శాతం జీఏటీ వెయిటేజీ ఉంటుంది. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో సీఏటీ 50, జీఏటీ 30, సిచ్యుయేషన్‌ టెస్టుకి 20 శాతం వెయిటేజీ ఉంది. మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో సీఏటీ 40, జీఏటీ 30, పీఐ 30 శాతం వెయిటేజీ కల్పించారు. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో జీఏటీ 70, పీఐ 30 శాతం వెయిటేజీ వర్తిసుంది. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో జీఏటీ 70, జీడీ/పీఐ 30 శాతం వెయిటేజీ ఇచ్చారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని