చలో.. నైపుణ్యాల బాటలో!

 బ్లాక్‌ చెయిన్‌: సమాచారాన్ని బ్లాక్స్‌గా విడివిడిగా నిక్షిప్తం చేస్తూ ఎటువంటి సైబర్‌ దాడులకూ, డేటా చౌర్యానికీ అవకాశం లేకుండా చేస్తుంది బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ. పూర్తిస్థాయి రక్షణ కల్పించేలా అత్యున్నత సాంకేతికత పరిజ్ఞానమిది

Updated : 27 Dec 2023 06:05 IST

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగం.. ఎంతోమంది విద్యార్థుల కల. దీన్ని నూతన సంవత్సరంలో సాకారం చేసుకోవాలనుకోవడం అభినందనీయమైన మంచి సంకల్పం. ఇందుకు కావాల్సిన కొన్ని నైపుణ్యాల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం కదా! మరికొన్ని అంశాలూ ఉన్నాయి. అవేమిటో చూద్దాం!

 బ్లాక్‌ చెయిన్‌: సమాచారాన్ని బ్లాక్స్‌గా విడివిడిగా నిక్షిప్తం చేస్తూ ఎటువంటి సైబర్‌ దాడులకూ, డేటా చౌర్యానికీ అవకాశం లేకుండా చేస్తుంది బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ. పూర్తిస్థాయి రక్షణ కల్పించేలా అత్యున్నత సాంకేతికత పరిజ్ఞానమిది. పబ్లిక్‌, ప్రైవేట్‌, పర్మిషన్డ్‌, కన్సార్టియమ్‌ బ్లాక్‌ చెయిన్స్‌గా సృష్టించి దీన్ని అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవచ్చు. సప్లై చెయిన్‌, హెల్త్‌కేర్‌, రిటైల్‌, మీడియా అండ్‌ అడ్వర్టైజింగ్‌, టెలి కమ్యూనికేషన్స్‌, ట్రావెల్‌ తదితర రంగాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా ఈ టెక్నాలజీ వినినియోగం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో అధికం. గత కొంతకాలంగా మంచి ఆదరణ పొందుతున్న ఈ టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా సంబంధిత రంగాల్లో అవకాశాలు పొందవచ్చు.
మేనేజ్‌మెంట్‌: బృంద సభ్యులను, ప్రాజెక్టును, పనిని.. దేన్నయినా సరే సమర్థంగా నిర్వహించగలిగే మెలకువలు నేర్చుకోవడం నేటి ఉద్యోగార్థులకు చాలా అవసరం. అధిక పనీ, ఒత్తిడీ ఉండే ఐటీ లాంటి రంగాల్లో నిర్వహణ నైపుణ్యాలున్న ఉద్యోగులకు ఎల్లప్పుడూ గిరాకీ ఉంటుంది. విభిన్న మనస్తత్వాలుండే వ్యక్తులతో మాట్లాడటం, సమస్యలను పరిష్కరించడం, పరిస్థితులను చక్కదిద్దడం, పని సజావుగా పూర్తయ్యేలా చూడటం, మొత్తంగా లక్ష్యాన్ని చేరుకునేలా నడిపించడం లాంటి మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు పెంచుకుంటే.. ఆ అభ్యర్థులను కంపెనీలూ వదులుకోవు. అందువల్ల అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిన మరో ముఖ్యమైన అంశం.. నిర్వహణ. ఇందులో ప్రత్యేకంగా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ గురించి కూడా నేర్చుకోవచ్చు.
క్రిటికల్‌ థింకింగ్‌: ఈ ఆలోచనాధోరణిలో ఉండే అంశాలేమిటంటే.. ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలించి, అన్ని కోణాల్లోనూ విశ్లేషించటం, ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకుని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవటం, స్థిరంగా ఆలోచించి అన్నివిధాలా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవటం. ప్రస్తుతం ఉద్యోగం ఆశించే అభ్యర్థులు తప్పకుండా నేర్చుకోవాల్సిన అంశాల్లో ఇదీ ఒకటి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌కు అవసరమైన సృజనాత్మక విధానాలను ఇది సూచించగలదు. ముఖ్యంగా నాయకత్వం వహించే స్థానాలకు ఎదగాలని ఆశపడేవారికి ఇది తప్పక ఉండాల్సిన నైపుణ్యం. డేటా, టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌, వ్యక్తులు.. అనే నాలుగు అంశాల ఆధారంగా ఆలోచనలను ఏ విధంగా అమలు చేయాలో క్రిటికల్‌ థింకింగ్‌ చెబుతుంది. నిర్ణీత సమయం కేటాయిస్తూ నిరంతరం సాధన చేయడం ద్వారా దీనిలో మెలకువలు నేర్చుకోవచ్చు.
యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌: ఒక ప్రొడక్ట్‌, సిస్టమ్‌ లేదా సర్వీస్‌తో వినియోగదారునికి ఎటువంటి అనుభూతి కలుగుతోంది అనే విషయాన్ని అర్థం చేసుకుని మెరుగైన యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ కలిగేలా చేసే నిపుణులే వీరు. తమ నైపుణ్యాన్ని ఉపయోగించి వినియోగదారునికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ రాకుండా, పని చివరివరకూ మెరుగైన విధంగా జరిగేలా జాగ్రత్త వహిస్తారు. యూఎక్స్‌ డిజైన్‌ ముఖ్యమైన మార్కెటింగ్‌ అవసరాలను టార్గెట్‌ చేస్తుంది. యూజర్‌ ఎలా భావిస్తారనే విషయాన్ని ముందుగానే గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు దోహదపడుతుంది. ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు సులభంగా చేజిక్కించుకోవాలి అనుకున్నప్పుడు అభ్యర్థులకు ఇది బాగా ఉపయోగపడే నైపుణ్యం.

డేటా సైన్స్‌: మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, స్పెషలైజ్డ్‌ ప్రోగ్రామింగ్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ లాంటివి ఉపయోగిస్తూ ఆర్గనైజేషనల్‌ డేటా నుంచి ఇన్‌సైట్స్‌ తీసుకునేందుకు డేటా సైన్స్‌ ఉపయోగపడుతుంది. డేటాను పూర్తిస్థాయిలో సాంకేతికంగా డీల్‌ చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇటువంటి డేటా ఇన్‌సైట్స్‌.. డెసిషన్‌ మేకింగ్‌, స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌లో ఎంతగానో ఉపయోగపడతాయి. డేటాను ఉపయోగించుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం సంస్థలు దీనిపై ఆధారపడుతున్నాయి. ముఖ్యమైన సాంకేతిక ఉద్యోగాలు సాధించాలి అనుకునేవారు దీన్ని తప్పకుండా నేర్చుకోవాలి. ప్రాచుర్యం పొందిన ప్రొఫెషనల్‌ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ మార్కెట్‌లో నిలదొక్కుకోవచ్చు.
నెట్‌వర్కింగ్‌: పరిచయాలు పెంచుకోవడం.. మంచి అవకాశాలు అందుకోవడానికి నాంది. కొత్తగా కెరియర్‌ను మొదలుపెట్టినప్పుడు నెట్‌వర్కింగ్‌ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా మనం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నామనే విషయం అందరికీ తెలుస్తుంది. ఎక్కువ సోర్స్‌ ఉన్నప్పుడు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే ఇప్పటికే కంపెనీల్లో పనిచేస్తున్నవారి ద్వారా రిఫరెన్స్‌ వచ్చినప్పుడు సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి. చాలా ఉద్యోగాలు లోలోపలే బయటకు చెప్పాల్సిన అవసరం లేకుండానే రిక్రూట్‌ చేస్తుంటారు. అందువల్ల సరైన వ్యక్తులతో పరిచయాలు ఎన్నడూ ఉపకరిస్తాయి. వీలైనన్ని ఎక్కువ నెట్‌వర్కింగ్‌ ఈవెంట్లకు హాజరుకావడం ద్వారా కూడా దీన్ని సాధించవచ్చు.
కంపెనీలతో నేరుగా సంప్రదింపులు: చాలా కంపెనీలకు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్లు ఉన్నాయి, వాటిని తరచూ అనుసరిస్తూ ఉండటం వల్ల ఎప్పుడైనా నియామకాలు జరుగుతుంటే తెలుస్తుంది. వారికి ప్రొఫైల్‌ను ఇవ్వడం ద్వారా తక్షణ నియామకం లేకపోయినా త్వరలో ఉంటుందనుకున్నప్పుడు సంప్రదిస్తారు. ఏ కంపెనీల్లో ఖాళీలు ఉన్నాయి, వాటినెలా సంప్రదించవచ్చు అనేది ఒకచోట రాసుకోవడం, ప్రతి కంపెనీకి దరఖాస్తు చేసేటప్పుడు విడివిడిగా కవర్‌ లెటర్స్‌ రాయడం, అందులో మీరు ఏవిధంగా వారికి సరైన ఎంపికనో చెప్పేందుకు ప్రయత్నించడం.. ఇలాంటివాటి ద్వారా రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించవచ్చు.
జాబ్‌ సెర్చ్‌ వేదికల వినియోగం: ఒకేసారి ఎక్కువ ఉద్యోగాల గురించి సమాచారం తెలుసుకోవాలన్నా, దరఖాస్తు చేయాలి అనుకున్నా జాబ్‌ సెర్చ్‌ వేదికలను ఉపయోగించుకోవడం మంచిది. వీటిలో లొకేషన్‌, జీతభత్యాలు, ఇతర కీవర్డ్స్‌ ఆధారంగా ఉద్యోగాలను వెతకడం కుదురుతుంది. తద్వారా ఎక్కువ సమాచారం మనవద్ద ఉంటుంది.
జాబ్‌ ఫేర్‌లకు వెళ్లడం: దగ్గర్లో జరిగే జాబ్‌ ఫేర్‌లకు హాజరుకావడం ద్వారా కూడా మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కంపెనీలు ఫ్రెషర్లను ఎక్కువగా తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అన్ని స్థాయుల్లో ఉన్న సంస్థలూ ఇటువంటి చోట్ల కనిపిస్తాయి. వీటికి హాజరయ్యే ముందు వచ్చే సంస్థల గురించి తెలుసుకోవడం, అంతా సిద్ధమై హాజరు కావడం ఉపకరిస్తుంది.
సోషల్‌ మీడియా: ఇప్పుడున్న అనేక సోషల్‌ మీడియా వేదికలను ఉద్యోగ ప్రయత్నాల కోసం ఉపయోగించుకోవచ్చు. కంపెనీల పేజెస్‌ ద్వారా వారితో సంప్రదించి కాంటాక్ట్‌ పెంచుకోవచ్చు. ఇదే సమయంలో మన ఖాతాలు ప్రొఫెషనల్‌గా ఉండేలా జాగ్రత్తపడాలి. సంస్థలకు మనం సరిపోతామనే భావన వారిలో కల్పించేలా హుందాగా ఉండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు