డేటా సైన్స్‌ తెలిసుంటే.. తిరుగులేదంతే!

అందుబాటులోకి వచ్చిన అపార సమాచారాన్ని మధించి వ్యాపారావకాశాల అమృతాన్ని వెలికి తీసేదే డేటా సైన్స్‌. ఈ రంగంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు 45 శాతం పెరుగుతున్నాయి. ఇంత ప్రాముఖ్యం ఉన్న డేటా సైన్స్‌లో పనిచేయాలన్న ఆసక్తి ఉంటే ఏ అర్హతలూ, నైపుణ్యాలూ పెంచుకోవాలో తెలుసుకుందాం! ఒక ఈ-కామర్స్‌ ఆప్‌ని రోజూ లక్షమంది తమకు కావలసిన వస్తువుల కోసం సందర్శిస్తారు. కొద్దిరోజులకే తాము ఆసక్తి చూపిన వస్తువులపైనే ఆఫర్లతో ప్రత్యక్షమయ్యేసరికి వినియోగదారులు ఆనందాశ్చర్యాలతో ఆర్డర్లు పెట్టేస్తుంటారు.

Updated : 17 Jan 2024 03:20 IST

అందుబాటులోకి వచ్చిన అపార సమాచారాన్ని మధించి వ్యాపారావకాశాల అమృతాన్ని వెలికి తీసేదే డేటా సైన్స్‌. ఈ రంగంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు 45 శాతం పెరుగుతున్నాయి. ఇంత ప్రాముఖ్యం ఉన్న డేటా సైన్స్‌లో పనిచేయాలన్న ఆసక్తి ఉంటే ఏ అర్హతలూ, నైపుణ్యాలూ పెంచుకోవాలో తెలుసుకుందాం!

క ఈ-కామర్స్‌ ఆప్‌ని రోజూ లక్షమంది తమకు కావలసిన వస్తువుల కోసం సందర్శిస్తారు. కొద్దిరోజులకే తాము ఆసక్తి చూపిన వస్తువులపైనే ఆఫర్లతో ప్రత్యక్షమయ్యేసరికి వినియోగదారులు ఆనందాశ్చర్యాలతో ఆర్డర్లు పెట్టేస్తుంటారు. ఎడ్యుకేషన్‌ ఫేర్‌కి వెళ్లినపుడు నిర్వాహకులు ఇచ్చిన ‘ఫీడ్‌ బ్యాక్‌’ ఫారం పూర్తిచేసి వచ్చాక రకరకాల ఎడ్యుకేషన్‌ అబ్రాడ్‌ ప్యాకేజీల సమాచారం అందుకోవడం తల్లిదండ్రులను విస్మయపరుస్తుంది. అచ్చంగా కోరుకున్నవాటినే ప్రత్యేక ఆఫర్లుగా ప్రకటించి మన మనసుల్ని చూరగొనడం ఆ సంస్థలకు ఎలా సాధ్యమైంది? ఆ వాణిజ్య సంస్థలకున్న లక్షల మంది విభిన్న వినియోగదారుల్లో ఎవరి అవసరాలూ, అభిరుచులకు అనుగుణంగా కచ్చితంగా వాటికే పట్టం గట్టడం ఎలా వీలయింది? ఇదంతా సుసాధ్యం చేసింది...డేటా సైన్స్‌!

పదిహేనేళ్లుగా పరుగులు

మనదేశంలో పాతికేళ్లనుంచి సాఫ్ట్‌వేర్‌ సేవలు ఊపందుకోవడంతో జన జీవితంలో సంక్లిష్టమైన పనులు సులభతరం అయ్యాయి. ఏ సవాళ్లకైనా దీటైన పరిష్కారం ఇవ్వగల సత్తాను సాఫ్ట్‌వేర్‌ రంగం సంతరించుకుంది. సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు కావలసిన ముడిసరుకు, సమాచార క్రోడీకరణ ఒక శాస్త్రంగా అవతరించింది. భౌతిక, భూగోళ, రసాయన, పర్యావరణ శాస్త్రాల్లాగా సమాచార శాస్త్రం (డేటా సైన్స్‌) దశాబ్దిన్నర నుంచి బాగా అభివృద్ధి చెందింది.

ఎనలిటిక్స్‌ ఇండియా మ్యాగజీన్‌ అంచనాల ప్రకారం.. 2021-2031 మధ్య పదేళ్ల పాటు డేటా సైన్స్‌ ఉద్యోగ ప్రపంచంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతుంది. ఏటా డేటా సైన్స్‌ ఉద్యోగాలు 45 శాతం పెరుగుతున్నాయి. డేటా ఎనలిస్ట్‌, మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌, డేటా ఇంజినీర్‌, డేటా సైంటిస్ట్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, ప్రొడక్ట్‌ అనలిస్ట్‌, ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ వంటివి డేటా సైన్స్‌ రంగం కల్పిస్తున్న కొలువులే!

ఏ నైపుణ్యాలు ?

డేటా సైన్స్‌కు అల్గారిదమ్సే ఆధారం. వీటి గుర్తింపు, కొత్తగా సృష్టి, నిర్వహణలకు డేటా సైన్స్‌ స్పెషలిస్టులు అవసరం. నూతన ఆదాయ వనరుల కోసం కొత్త అల్గారిదమ్స్‌ను సృష్టించగలిగినవారి సేవలకు మంచి గుర్తింపు ఉంటుంది. కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌పై పట్టు సాధించినా డేటా సైన్స్‌ స్పెషలిస్ట్‌గా రాణింపు లభిస్తుంది. ఎస్‌.ఎ.ఎస్‌, ఎక్సెల్‌, టాబ్‌లీక్‌, ఎస్‌.క్యు.ఎల్‌. వంటివీ ఉపకరిస్తాయి.

  • ఎంట్రీ స్థాయి ఫ్రెషర్లు బీటెక్‌ గ్రాడ్యుయేషన్‌తో  పాటు స్టాటిస్టిక్స్‌పై పట్టు పెంచుకుంటే డేటా సైన్స్‌ ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు.
  • మిడ్‌ లెవెల్‌ ఎంట్రీకి మూడు నుంచి ఐదేళ్లలోపు డేటా సైన్స్‌ రంగంలో పనిచేసిన అనుభవం, ఎంటెక్‌ వంటి మాస్టర్‌ డిగ్రీ ఉండాలి. అప్పుడే కంపెనీలు ఆహ్వానం పలుకుతాయి.
  • సీనియర్‌ పొజిషన్లు ఆశించేవారైతే డేటాసైన్స్‌ రంగంలో ఆరేడేళ్ల అనుభవంతోపాటు..గతంలో కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసివుండాలి. చీఫ్‌ డేటా ఆఫీసర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ డేటా సైన్సెస్‌, హెడ్‌ ఆఫ్‌ డేటా ఎనలిటిక్స్‌ వంటి పోస్టులను మంచి ప్యాకేజీతో ఆఫర్‌ చేస్తారు.

సాఫ్ట్‌ స్కిల్‌ సంగతి?

సాంకేతిక నైపుణ్యాలతో పాటు మెరుగైన సాఫ్ట్‌ స్కిల్స్‌ అలవరచుకున్న అభ్యర్థులకు ఈ రంగంలో రాణింపు లభిస్తుంది. పనిచేయడంపై మక్కువ, వ్యాపార దృక్పథం, బృందంలో ఒకరిగా సమర్థంగా పనిచేయగల స్ఫూర్తి, కొత్త ఆలోచనలు గల వారికి నియామక  కంపెనీలు పెద్దపీట వేస్తాయి.


ఎంట్రీ స్థాయి ఫ్రెషర్లు బీటెక్‌ గ్రాడ్యుయేషన్‌తో పాటు స్టాటిస్టిక్స్‌పై పట్టు పెంచుకుంటే డేటా సైన్స్‌ ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు.


ఏమేం అవసరం?

డేటా సైన్స్‌లో పనిచేయాలన్న ఆసక్తిగలవారు.. ఆధారపడగల సమాచార గుర్తింపు, నాణ్యమైన సమాచార లభ్యతపై దృష్టి పెంచుకోవాలి. ఎందువల్లనంటే డేటా మేళవింపు, మదింపు ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి. సమాచార స్వచ్ఛతనూ గమనించగలగాలి. విస్తృతమైన సమాచారాన్ని శోధించి వినియోగదారుల ఆలోచనా ధోరణి, ఖర్చు చేస్తున్న సరళిని నిశితంగా ఒడిసిపట్టుకునేందుకు డేటా సైన్స్‌ స్పెషలిస్టు కృషి చేయాల్సి వుంటుంది.

  • మెడికల్‌ రంగంలో ఇమేజి విశ్లేషణ, ఫార్మా రంగంలో పరిశోధన, నూతన ఫార్ములాల రూపకల్పనకూ..
  • ఈ-కామర్స్‌లో భవిష్యత్తులో అమ్మకాలకు అవకాశం గల వస్తువుల గుర్తింపు, వినియోగదారుల కొనుగోళ్ల ధోరణి, అమ్మకాల్లో కొత్త ఊపు తెచ్చే నిర్ణయాలు తీసుకోవడంలో డేటా సైన్స్‌ సేవలు అమోఘంగా దోహదపడుతున్నాయి.

ప్రస్తుత సమాచార ఆధారిత సమాజం (నాలెడ్జ్‌ బేస్డ్‌ సొసైటీ)లో డేటా బేస్‌ మార్కెట్‌ను సృష్టించగల సామర్థ్యం డేటా సైన్స్‌ స్పెషలిస్టులకు ఉంది. అలాంటి నిపుణుల కోసమే ఎన్నో కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. ఆ దిశగా సన్నద్ధం కావడమే ఉద్యోగార్థుల లక్ష్యం కావాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు