ఏ నైపుణ్యం తగ్గింది?

విద్యాసంవత్సరం పూర్తి కావొస్తోంది. ఇక పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థి కలా ఉద్యోగమే! అందుకోసం తమ అన్ని నైపుణ్యాలకూ పదును పెట్టుకుని ఇంటర్వ్యూలకు సిద్ధమవుతుంటారు. కానీ ఉద్యోగ జీవితానికి అవసరమయ్యే కొన్ని అంశాల్లో మాత్రం వెనుకబడుతుంటారు.

Updated : 30 Jan 2024 04:12 IST

విద్యాసంవత్సరం పూర్తి కావొస్తోంది. ఇక పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థి కలా ఉద్యోగమే! అందుకోసం తమ అన్ని నైపుణ్యాలకూ పదును పెట్టుకుని ఇంటర్వ్యూలకు సిద్ధమవుతుంటారు. కానీ ఉద్యోగ జీవితానికి అవసరమయ్యే కొన్ని అంశాల్లో మాత్రం వెనుకబడుతుంటారు. ముఖ్యంగా ఐటీ రంగంలో తరచూ కంపెనీలు చెప్పే మాట .. ‘మాకు కావాల్సిన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు దొరకడం లేదు’ అని! మరి రోజువారీ ఐటీ కొలువులో ఎటువంటి స్కిల్స్‌ అవసరం అవుతాయో, పూర్తిస్థాయిలో ముఖాముఖీలకు సిద్ధమవ్వాలనుకునే అభ్యర్థులు ఏ అంశాలపై దృష్టిపెట్టాలో ఒకసారి చూద్దామా!

కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టేవారు అందరూ ఎన్నోకొన్ని నైపుణ్యాలు కలిగే ఉంటారు. కానీ కొందరు మాత్రమే కోరుకున్న కొలువును వెంటనే సాధించగలుగుతారు... ఎందుకు? అందరికీ నైపుణ్యాలున్నా, ఆ కొందరిలో ఏదో ప్రత్యేకత కనిపించడమే ఇందుకు కారణం. అలా అభ్యర్థులను ప్రత్యేకంగా నిలబెట్టే వాటిలో ఇప్పుడు చెప్పబోయే నైపుణ్యాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

  • తాజాగా చేసిన ఒక సర్వే ప్రకారం చాలావరకూ కంపెనీలు తాము అభ్యర్థుల నుంచి ఆశిస్తున్న కనీస విద్యార్హతలను తగ్గిస్తున్నాయి. వాటి స్థానంలో వారికి ఉండాల్సిన నైపుణ్యాలను పెంచుతున్నాయి. దాదాపు 42 శాతానికి పైగా సంస్థలు అభ్యర్థుల స్కిల్స్‌ ఆధారంగా మాత్రమే వారిని రిక్రూట్‌ చేసుకునేలా ఇప్పటికే మ్యాట్రిక్స్‌ తయారుచేసుకుంటున్నాయి.

అడాప్టబిలిటీ

ళ్లవేళలా అన్ని పరిస్థితులూ మనకు అనుకూలంగా ఉండవు.. ఏది ఎలా ఉన్నా ఆ సందర్భానికి తగిన విధంగా మనల్ని మనం మార్చుకోవడం, ఒదిగిపోవడం ముఖ్యమైన అంశం. ఇది బృందాల్లో కలిసిపోయి పనిచేసేందుకు దోహదం చేయడమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదలకూ తోడ్పడుతుంది. అడాప్టబిలిటీ లేకపోతే సవాళ్లనూ, సమస్యలనూ దాటలేక వెనుకబడతాం. మార్పులను ఆహ్వానించి, ఆస్వాదించగలిగినప్పుడు వృత్తి జీవితం సాఫీగా, విజయవంతంగా సాగుతుంది. అందుకే ఐటీ కంపెనీలు ఈ లక్షణం కలిగిన అభ్యర్థుల కోసం వెతుకుతుంటాయి.


ఆర్గనైజింగ్‌ స్కిల్స్‌

వృత్తి జీవితంలో విజయవంతం కావాలంటే ఆర్గనైజింగ్‌ స్కిల్స్‌ తప్పనిసరి. స్థిరమైన ప్రణాళికతో ముందుకెళ్లడం లక్ష్యాలను గడువులోగా చేరుకోవడానికే కాదు, ఉత్పాదకతను పెంచడానికి కూడా సాయం చేస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఉద్యోగి ప్రదర్శన, తద్వారా బృందం పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి లేని వారు టాస్కులను సకాలంలో పూర్తిచేయలేక, ఏది ముఖ్యమో ఏది కాదో తేల్చుకోలేక, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక సతమతమవుతారు.


కమ్యూనికేషన్‌

కేవలం మౌఖిక భావ ప్రసారం కాకుండా రాతపూర్వకమైన కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఐటీలో అత్యంత ఆవశ్యకం. మన భావాలను ఎదుటివారితో ఎటువంటి సందేహాలకు తావులేకుండా పంచుకునేందుకు, చక్కగా సంభాషించి కొత్త కొత్త ఆలోచనలు చేసేందుకు సంభాషణ నైపుణ్యాలు కావాలి. చాలాసార్లు రాతపూర్వకంగా కూడా ఈ సంభాషణలను సాగించాల్సి రావడం వల్ల భాషను మెరుగుపరుచుకోవాలి. అభ్యర్థులు తమ కమ్యూనికేషన్‌ తీరుపై కచ్చితంగా శ్రద్ధ వహించాలి.


యాక్టివ్‌ లిసనింగ్‌

మాట్లాడటం మాత్రమే కాదు, వినడం కూడా ఒక కళే. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడం, విన్నాకే మాట్లాడటం,  ముందస్తు అభిప్రాయాలతో వినకపోవడం, కేవలం సమాధానం చెప్పడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి వినడం, మధ్యలోనే ఒక నిర్ణయానికి వచ్చేయకుండా పూర్తిగా విన్నాకే ఆలోచనలు పంచుకోవడం.. ఇవన్నీ యాక్టివ్‌ లిసనింగ్‌లో భాగం. తాము చెప్పేది పూర్తిగా వినేవారంటే ఎదుటివారికి నమ్మకం, ఆసక్తి ఏర్పడతాయి. ఇది బృంద ప్రదర్శనను మెరుగుపరుస్తుంది.


ప్రొయాక్టివ్‌నెస్‌

దేనిలో అయినా చురుగ్గా పాలుపంచుకుంటూ నిత్యం ఉల్లాసంగా కనిపించేవారు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఆహ్లాదంగా మార్చగలరు. ఏ పని చెప్పినా నన్ను కాదు అన్నట్లు ఊరుకోవడం, చేయగలిగి కూడా పిలిచేవరకూ స్పందించకపోవడం, పనుల పట్ల అనాసక్తితో ఉన్నట్లు కనిపించడం.. ఉద్యోగ జీవిత ఎదుగుదలకు అంత మంచిది కాదు. ముఖ్యంగా కెరియర్‌ ఆరంభంలో ఉన్నవారు ప్రొయాక్టివ్‌గా ఉండటం చాలా అవసరం.


గ్రాటిట్యూడ్‌

కంపెనీ పట్ల, సహోద్యోగుల పట్ల కృతజ్ఞతతో మెలగడం సహృదయతను చాటుతుంది. సహాయపడిన వారిని అభినందించడం, పక్కవాళ్ల పనికి క్రెడిట్‌ తీసుకోకుండా నిజాయతీగా ఉండటం, ఎదుటివారి తప్పులను ఎత్తిచూపకుండా సామరస్యంగా చర్చించడం- ఇవన్నీ గ్రాటిట్యూడ్‌కు అదనంగా మరికొన్ని అంశాలు. ఎదుటివారి విజయాలను మనస్ఫూర్తిగా అభినందించగలిగినప్పుడే బంధాలు బలపడతాయనే విషయాన్ని గుర్తించాలి.


అగ్రీ టు డిస్‌అగ్రీ

లుగురు కలిసి ఒకచోట పనిచేసేటప్పుడు భిన్నాభిప్రాయాలు అత్యంత సహజం. మన ఆలోచన, అభిప్రాయాల కంటే కూడా ప్రాజెక్టు/టీమ్‌కు ఏది మెరుగైన ఆలోచన అనేది ఎంచుకుని దాన్నే సమర్థించగలిగేలా ఉండాలి. అన్నీ మనకు నచ్చాల్సిన పని లేదు.. కాని అవసరం అనుకున్నప్పుడు మన ఆలోచనతో ఏకీభవించని అంశాన్ని సైతం అంగీకరించడం నేర్చుకోవాలి. ఈ ప్రక్రియలో మానసికంగా స్థిరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇదే సమయంలో విమర్శలను స్వీకరించడం కూడా సాధన చేయాలి. విభిన్నమైన అభిప్రాయాలను గౌరవించాలి.


టైమ్‌ మేనేజ్‌మెంట్‌

ప్రొడక్ట్‌ కంపెనీలైనా, సర్వీస్‌ కంపెనీలైనా అభ్యర్థుల టైమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ను ఒక ముఖ్యవిషయంగా పరిగణిస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిడి ఉండే ఈ రంగంలో డెడ్‌లైన్‌లతో పోటీపడుతూ పనిచేసేవారే కంపెనీలకు కావాలి. బృందాలవారీగా పనిచేసేటప్పుడు కేవలం ఒక అభ్యర్థి వద్ద జరిగే ఆలస్యం మొత్తంగా ప్రదర్శనను, తద్వారా ప్రాజెక్టు పురోగతిని దెబ్బతీయగలదు. పెద్ద టాస్కులను చిన్నవిగా విభజించుకోవడం, ముఖ్యమైన వాటిని ముందుగా పూర్తిచేయడం, పనికి తగిన టూల్స్‌ను ఎంచుకోవడం, పూర్తిస్థాయిలో ఫోకస్‌ నిలిపేలా సాధన చేయడం.. ఇటువంటి వాటితో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ను మెరుగు పరుచుకోవచ్చు.


ప్రొఫెషనలిజం

శ్రద్ధ, అంకితభావం, బాధ్యత అనేవి ఒక సాధారణ అభ్యర్థిని అసాధారణ ఉద్యోగిగా మార్చగలవు. ప్రొఫెషనల్‌గా ఉండటమనేది ఐటీకి చాలా అవసరం. తమ పాత్ర, పనులకు జవాబుదారీగా ఉండటం, సమస్యలను ఎదుర్కోవడం, విమర్శలను తీసుకోవడం, సంస్థ పేరుప్రఖ్యాతులను కాపాడేలా నడుచుకోవడం, సహోద్యోగులతో పద్ధతిగా మెలగడం.. ఇవన్నీ అభ్యర్థి ప్రొఫెషనలిజాన్ని నిలబెట్టేవే. ముఖ్యంగా క్లయింట్లతో తరచూ కలసి మాట్లాడాల్సిన పోస్టుల్లో ఉండేవారికి ఇది కచ్చితంగా ఉండాల్సిన లక్షణం.


క్రిటికల్‌ థింకింగ్‌

నిరంతరం మారిపోయే టెక్నాలజీ, విశ్లేషణాత్మకంగా, సృజనను మేళవించి పనిచేయాల్సిన రంగం కావడంతో దీనికి క్రిటికల్‌ థింకింగ్‌ నైపుణ్యాలు చాలా ముఖ్యం. ఏదైనా విషయాన్ని పరిశోధించేందుకు, దానిపట్ల మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు, స్వతంత్రంగా వ్యవహరిస్తూనే బృందాలతో కలిసి పనిచేసేందుకు, లక్ష్యసాధనలో స్థిరంగా ఉండేందుకు, విమర్శనాత్మకంగా ఆలోచించేందుకు.. ఇలా అన్నింటికీ క్రిటికల్‌ థింకింగ్‌ అవసరం అవుతుంది. ఏదైనా విషయాన్ని పైపైన చూసేసి నిర్ణయానికి వచ్చేయకుండా అన్నికోణాల్లోనూ అర్థం చేసుకునేందుకు ఇది చాలా అవసరం.


కోఆపరేషన్‌

రస్పర అంగీకారం, సహకారం మిగతా వృత్తులతో పోలిస్తే ఐటీలో అధికంగా అవసరం. ఎందుకంటే ఈ ఉద్యోగులు తరచూ వివిధ బృందాలతో పనిచేయాల్సి వస్తుంది. కోఆపరేటివ్‌ ధోరణి లేకపోతే అలా పనిచేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరమైనప్పుడు రాజీపడటం, విభిన్న ఆలోచనలున్నా బృందంగా ముందుకు వెళ్లడం.. ఇవన్నీ అవసరం అవుతాయి. ఇలా ఉండటం వ్యక్తిగత వికాసానికి, నిరంతర అభ్యాసానికి సైతం దోహదపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని