ఒత్తిడిని చిత్తు చేసే ఆర్‌ఆర్‌ఆర్‌ మంత్ర!

చదవాల్సిన పాఠ్యాంశాలు, రాయాల్సిన అసైన్‌మెంట్లూ ఏడాది పొడవునా ఎన్నో ఉంటాయి. వీలు చూసుకుని మెల్లగా ఒకదాని తర్వాత మరోటి చేసేద్దాం అనుకోవడానికి వీల్లేదు.

Updated : 22 Feb 2024 04:35 IST

చదవాల్సిన పాఠ్యాంశాలు, రాయాల్సిన అసైన్‌మెంట్లూ ఏడాది పొడవునా ఎన్నో ఉంటాయి. వీలు చూసుకుని మెల్లగా ఒకదాని తర్వాత మరోటి చేసేద్దాం అనుకోవడానికి వీల్లేదు. నిర్ణీత  సమయం లోపలే అన్నింటినీ పూర్తిచేయాల్సివుంటుంది. ఇలా విపరీతమైన నిరంతర ఒత్తిడితో శారీరకంగా, మానసికంగా అలసిపోవడమే బర్న్‌ అవుట్‌! మరి దీనికేం చేయాలి?

ఎంతో ప్రశాంతంగా తమ పనులు చేసుకునే విద్యార్థులూ దీని ప్రభావంతో విపరీతమైన కోపావేశాలకు గురవుతుంటారు. ఆ తర్వాత తమ పొరపాటును గుర్తించినా.. సరిదిద్దుకునే అవకాశం ఉండకపోవచ్చు కూడా. అందుకే ఊహించని ఎన్నో అనర్థాలకు కారణమయ్యే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏంచేయాలో చూద్దామా...

బర్న్‌అవుట్‌ నుంచి బయటపడాలంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మంత్రాన్ని ప్రయోగించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వివిధ స్థాయుల్లో ఉండే ఒత్తిడిని నియంత్రించడానికి ఈ మూడు ‘ఆర్‌’లు ఉపయోగపడతాయి. నిజానికి ఒత్తిడి అనేది.. ఒక స్థాయి వరకూ మంచి ఫలితాలనే ఇస్తుంది. ఒక మోస్తరు ఒత్తిడి వల్ల పనులను సకాలంలో పూర్తిచేయగలుగుతారు కూడా. కానీ విపరీతమైన ఒత్తిడికి గురికావడం వల్ల బర్న్‌అవుట్‌ అయ్యి నష్టపోయే సందర్భాలూ ఉంటాయి. రబ్బర్‌బ్యాండ్‌ను రెండు వైపులా పట్టుకుని సాగదీశారు అనుకుందాం. ఒక దశవరకూ బానే ఉంటుంది. ఆ తర్వాత అది తెగిపోయి.. చేతికి చురుక్కుమని తగులుతుంది కూడా. విపరీతమైన ఒత్తిడి వల్ల ఇలాగే బర్న్‌అవుట్‌కూ గురికావల్సివస్తుంది. ‘3 ఆర్‌’ పద్ధతిని ఉపయోగించడం వల్ల ప్రతి దశలోని ఒత్తిడినీ నియంత్రించవచ్చు. అవేమిటో తెలుసుకుందామా...

1 రికగ్నైజ్‌ (గుర్తించటం)

ముందుగా ఏయే సందర్భాల్లో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించాలి. దీంతోపాటుగా దేనివల్ల ప్రేరేపితమైన ఒత్తిడికి గురవుతున్నారనే కారణాన్నీ కనుక్కోవడానికి ప్రయత్నించాలి. అసలు కారణాన్ని కనుక్కుంటే ఇబ్బంది నుంచి త్వరగా బయటపడొచ్చు.  

ఈ సందర్భంలో శ్వాస వ్యాయామాలను సాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. దీర్ఘంగా గాలి పీల్చుకుని.. దాన్ని కాసేపు అలాగే నిలిపివుంచి.. కొన్ని నిమిషాల తర్వాత మెల్లగా బయటకు వదిలేయాలి. కొంతకాలంపాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల పరిస్థితిలో వచ్చే మార్పును మీరే స్వయంగా అనుభూతి చెందుతారు.

2 రివర్స్‌ (వెనక్కి తిప్పటం)

ఏ సందర్భాల్లో ఒత్తిడికి గురవుతున్నారో గుర్తిస్తే.. ఇబ్బంది నుంచి బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతారు. కానీ ఇలా వీలుకానప్పుడు మరో విధంగానూ ప్రయత్నించవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే సందర్భాల్లో.. సాధారణంగా నిరవధికంగా ఆలోచనలు వస్తుంటాయి కదా. కాబట్టి ముందుగా ఆ ఆలోచనలను నిరోధించాలి. అంటే ఒత్తిడి రాకముందే దాన్ని అధిగమించడానికి మీ వంతుగా ప్రయత్నాలను ప్రారంభించాలన్న మాట.

ఉదాహరణకు ఒక సబ్జెక్టులో మంచి మార్కులు సంపాదించలేరేమోననే ఆలోచనలు పదేపదే వస్తున్నాయనుకుందాం. వీటిని నిరోధించడానికి అదే సబ్జెక్టు మీద పట్టుసాధించాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే దిశగా ఆలోచించడం మొదలు పెట్టాలి. అధ్యాపకులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలా.. ట్యూషన్‌కు వెళ్లాలా.. లేదా స్నేహితుల సహాయం తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా.. ఇలా వివిధ కోణాల్లో ఆలోచించడం మొదలుపెట్టాలి. ఇక్కడో విషయాన్నీ  గుర్తుంచుకోవాలి. సమస్య గురించి పదేపదే   ఆలోచించడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఒక్కసారి పరిష్కార మార్గాల దిశగా ఆలోచించడం మొదలుపెడితే సమస్య తీవ్రత తగ్గుతుంది.

3 రెసీలియెన్స్‌ (పూర్వస్థితికి రావటం)

ఒత్తిడిని కలిగించే సందర్భాల్లో చిక్కుకున్నప్పుడు.. యథాస్థితికి రావడానికి ప్రయత్నించగలగాలి. ఎంత త్వరగా, తేలిగ్గా ఒత్తిడి నుంచి బయటపడాలనేది ముఖ్యం కాదు. కానీ దాన్ని నివారించి పూర్వపు స్థితికి రావడమే ప్రధానం. ఎందువల్ల ఒత్తిడి కలుగుతుందో ధ్రువీకరించుకోవడం, దాని గురించి అవగాహన పెంచుకోవడం, శ్వాస వ్యాయామాలు చేయడం.. ఇవన్నీ కూడా పూర్వపు స్థితికి తీసుకొస్తాయి. ఒత్తిడికి గురైన సందర్భాల్లో ఈ సాధనాలను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.

మరికొన్ని ముఖ్యాంశాలు

  • ఇతరులు ఏయే సందర్భాల్లో ఒత్తిడికి గురవుతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నాలు చేయకూడదు. ఇలాచేస్తే అలాంటి సందర్భాల్లో మీరు కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశం లేకపోలేదు.
  • చుట్టుపక్కల ఎప్పుడూ సానుకూల ఆలోచనలు చేసే వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడికి దూరంగా.. మానసిక ప్రశాంతతకు దగ్గరగా ఉండగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని