మెరిపించే మెలకువలు!

మార్చి 17న ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమనరీ (స్క్రీనింగ్‌) జరగనుంది. ఈ స్క్రీనింగ్‌లో రెండు పేపర్లు, ప్రతి పేపర్‌లో 120 ప్రశ్నలు.. 120 మార్కులు. అంటే పోటీ 240 మార్కులకు ఉంటుంది. సగటు స్థాయి ప్రశ్నపత్రం వచ్చినప్పుడు 60 నుంచి 65 శాతం మార్కులతో ప్రిలిమినరీ గట్టెక్కి మెయిన్స్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది.

Updated : 26 Feb 2024 03:41 IST

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 

మార్చి 17న ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమనరీ (స్క్రీనింగ్‌) జరగనుంది. ఈ స్క్రీనింగ్‌లో రెండు పేపర్లు, ప్రతి పేపర్‌లో 120 ప్రశ్నలు.. 120 మార్కులు. అంటే పోటీ 240 మార్కులకు ఉంటుంది. సగటు స్థాయి ప్రశ్నపత్రం వచ్చినప్పుడు 60 నుంచి 65 శాతం మార్కులతో ప్రిలిమినరీ గట్టెక్కి మెయిన్స్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందుకు ఏయే మెలకువలు అనుసరించాలి? నిపుణుల సూచనలు ఇవిగో!  

 మెజారిటీ అభ్యర్థులు ఇటు గ్రూప్‌-2తో పాటు గ్రూప్‌-1కు కూడా సిద్ధం అవుతున్నారు. సివిల్స్‌ అభ్యర్థులు కూడా ప్రత్యామ్నాయంగా గ్రూప్‌-1ను లక్ష్యంగా నిర్ణయించుకోవడం, డీఎస్సీ పోటీ పరీక్షలో తగినన్ని పోస్టులు లేకపోవడం.. దీంతో చాలామంది గ్రూప్‌-1పై దృష్టి నిలిపారు. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైనవారు కెరియర్‌ నిర్మాణంలో భాగంగా కూడా గ్రూప్‌-1 రాస్తున్నారు. ఇలాంటి వివిధ కారణాల వల్ల ఈసారి ప్రిలిమినరీలో పోటీ తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో బాగా కష్టపడిన అభ్యర్థులే రాణించే వీలుంది. పైగా ప్రిలిమినరీలో రెండు పేపర్లు ఉండటం వల్ల కూడా చదవాల్సిన పరిధి, లోతు విస్తృతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మిగిలిన కొద్ది సమయాన్ని  రివిజన్‌కి కేటాయించి స్కోరింగ్‌ అంశాలకు ప్రాముఖ్యం ఇచ్చి తయారైతే కావలసిన మార్కులు సాధించవచ్చు.

 గ్రూప్‌-1లో ఉన్న రెండు పేపర్ల విధానంలో రాణించాలంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలి ఉన్న ఈ కొద్ది రోజుల్లో ఈ కింది అంశాలపై దృష్టి పెట్టి రివిజన్‌ చేయడం మంచిది.

గ్రూప్‌ 2 గుణపాఠం

ఆదివారం జరిగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల సమగ్ర సమాచార పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు ఇచ్చారు. ముఖ్యమైన చాప్టర్లను బిట్స్‌ చదివిన అభ్యర్థులకు భంగపాటు తప్పదు. పూర్తిగా బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ వరకు అవగాహన పెంచుకున్న అభ్యర్థులకే అత్యధిక స్కోరుకు ఆస్కారముంది.

పేపర్‌ 1

  •  పునశ్చరణంలో ప్రధానంగా భారతదేశ చరిత్ర, భౌగోళిక అంశాలు, ఆర్థిక, రాజ్యాంగ అంశాల బేసిక్స్‌ను పాఠశాల పుస్తకాల ఆధారంగా, విశ్వవిద్యాలయాల పుస్తకాల ఆధారంగా ఒకసారి రివిజన్‌ చేయాలి. చాలామంది అభ్యర్థులు ఈ బేసిక్స్‌లో బలహీనంగా ఉంటారు. అందువల్ల మార్కులు కోల్పోతూ ఉంటారు.
  •  భారత రాజ్యాంగ అంశాలకు సంబంధించి తాజా కోర్టు కేసులు, తాజా సవరణలు, కరెంట్‌ అంశాలను అనుసంధానం చేసుకోవటం ముఖ్యం.
  • భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు 2024- 25 మధ్యంతర బడ్జెట్‌ విడుదలైంది. ప్రభుత్వ ప్రాధాన్యాలు, వివిధ పథకాలకు కేటాయించిన నిధులు, దాంతోపాటు రాబోయే ఐదేళ్లకు సంబంధించిన కార్యాచరణ మొదలైన అంశాలపైనా దృష్టి నిలపటం సరైన నిర్ణయం. 2023-24 ఆర్థిక సర్వే అని ప్రత్యేకంగా సభలో ప్రవేశపెట్టకపోయినా దశాబ్ద కాలపు పరిణామాలను ఉటంకిస్తూ ఎన్డీఏ- యూపీఏ దశాబ్ద పాలనల మధ్య అంతరాలను ప్రస్తావిస్తూ ప్రవేశపెట్టిన ఆర్థిక సమీక్షలో అనేక తాజా సూచికలు, గణాంకాలు ప్రస్తావించారు. వాటిపైన దృష్టి నిలపటం మంచిది. అదే సందర్భంలో 2023- 24 బడ్జెట్‌ ప్రధాన గణాంకాలనూ ఓసారి మననం చేసుకుంటే మంచిది. ఇంధన, బ్యాంకింగ్‌ రంగాలు, కరెంట్‌ ఖాతాలో పరిణామాలు, వ్యవసాయ ప్రగతికి తీసుకుంటున్న చర్యలు మొదలైనవి సమీక్షించుకోవడం మేలు.
  • భారతదేశ చరిత్ర- సంస్కృతి, భౌగోళిక అంశాలపై గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను సాధన చేయటం మంచిది. దాదాపుగా అలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సబ్జెక్టులపై ప్రధానంగా ప్రభుత్వ ప్రచురణలు (తెలుగు అకాడమీ, పాఠశాల స్థాయి పుస్తకాలు) పేర్కొదగినవి. వాటిని ఒకసారి రివిజన్‌ చేసుకోవాలి.

పేపర్‌ 2

  •  ఈ పేపర్లో అత్యధికంగా 60 మార్కులు సాధారణ మానసిక సామర్ధ్యాలు, మానసిక- పరిపాలన సామర్ధ్యాలకు కేటాయించారు. ఈ విభాగాలను సరిగా అర్థం చేసుకోలేకపోతే కేవలం మెంటల్‌ ఎబిలిటీ మాత్రమే ప్రిపేరై బాగా సిద్ధమయ్యామని అనుకుంటే పరీక్ష హాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. పరిపాలన సామర్థ్యాల్లో నాయకత్వం, నిర్ణయీకరణం, ప్రసారం, సామూహిక సహకారం, ప్రేరణ మొదలైనవి పరిగణిస్తారు. ఈ పాఠ్యాంశాలన్నీ దాదాపుగా సైద్ధాంతిక పరమైన అవగాహనతో ఉంటాయి. వీటిని ప్రశ్నల రూపంలో మార్చుకుని అధ్యయనం చేసుకుంటే తేలికగా సమాధానాల్ని గుర్తించే నైపుణ్యం అలవడుతుంది. ఇప్పటికే ఇదే సిలబస్‌తో జరిగిన ప్రశ్నపత్రాల పరిశీలన ద్వారా అవగాహన పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్ట్స్‌ విద్యార్థులు ఈ విభాగంలో తడబడుతుంటారు. కానీ పట్టుదలగా కృషి చేస్తే మెయిన్స్‌ అర్హత సాధించటంలో ఈ మార్కులు చాలా ఉపయోగపడతాయి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి 30 మార్కులు. అడిగే ప్రశ్నల్లో దాదాపు 50 శాతం ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. గత ఆరు- ఎనిమిది నెలలుగా జరిగిన కరెంట్‌ అఫైర్స్‌తో సబ్జెక్టు అంశాల్ని అనుసంధానం చేసుకుంటే మేలు. శాస్త్ర సాంకేతిక ప్రగతి కోసం దేశంలో జరిగిన అవస్థాపన ఏర్పాటుతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య ధోరణి అర్థం చేసుకుంటే ఏ విభాగాలపై ప్రశ్నలు రావడానికి వీలుందో స్పష్టమవుతుంది. ఇటీవలి కాలంలో గ్రీన్‌ ఎనర్జీకి ప్రాముఖ్యం పెరిగింది. దేశం రోదసీ రంగంలో సాధిస్తున్న ప్రగతి కూడా ముఖ్యమే. తాజా మధ్యంతర బడ్జెట్లో కూడా శాస్త్ర సాంకేతిక రంగ ప్రాధాన్యం.. దాని ద్వారా భవిష్యత్తును వెలుగుల్లోకి పయనింపజేసే ప్రయత్నాన్ని ప్రస్తావించారు. అలాంటి విధానపరమైన అంశాలూ, వాటి నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కొద్ది రోజుల్లో రెగ్యులర్‌గా ఉండే కంటెంట్‌తో పాటు ఈ దృక్కోణంలో కూడా తయారైతే మంచి మార్కులతో రాణించే అవకాశం ఉంటుంది.
  • పేపర్‌ 2లో మరో 30 మార్కులున్న విభాగం- వర్తమాన విషయాలు. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలుగా చదవాల్సి ఉంటుంది. వర్తమాన అంశాలను అనుసంధానించుకుంటూనే జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలను కూడా మననం చేసుకోవాలి. ఏపీపీఎస్‌సీ గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పరీక్షల ధోరణిని పరిశీలిస్తే ఒక సంవత్సర కాలాన్ని పరిగణించి వర్తమాన అంశాలు చదువుకోవడం మంచిది. ముఖ్యంగా గత ఆరు నెలల కాలంలో ఎక్కువ ప్రశ్నలు అడగొచ్చు. ప్రాంతీయ స్థాయి వర్తమాన అంశాల నుంచి తక్కువ సంఖ్యలోనే ప్రశ్నలు రావచ్చు. సమయాభావం వల్ల ఏది వదిలేయాలి అనుకుంటే ప్రాంతీయ వర్తమానాంశాలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు.

ఇతరాలు

  • ఇటీవల ఏపీపీఎస్‌సీ పరీక్షలలో సుదీర్ఘమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ముందుగా అలాంటి ప్రశ్నల జోలికి వెళ్లకుండా బహుళైచ్ఛిక ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేసి ఆ తర్వాత సమయ లభ్యతను బట్టి వాటిపై దృష్టి పెట్టండి.
  • అనేక స్టేట్మెంట్స్‌ ఇచ్చి వాటిని అధ్యయనం చేసేందుకు ఎక్కువ సమయం పట్టేలా ప్రశ్నలు వస్తున్నాయి. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
  • అసర్షన్‌ - రీజన్‌ ప్రశ్నలు కూడా తరచూ ఇస్తున్నారు. అలాంటివాటిని ఎలా సాధన చేయాలి అనే ఆలోచనతో అధ్యయనం చేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని