ఆఫర్‌ అందాక... ఆరు సూత్రాలు!

కళాశాల ప్రాంగణ నియామకాల్లో ఆఫర్‌ లెటర్‌ పొందడానికీ, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అందుకోవడానికీ మధ్య అభ్యర్థులు ఒక సంక్లిష్ట దశలో ఉంటున్నారన్నది నిజం. దీన్ని అధిగమించేందుకు ఆఫర్‌ లెటర్‌ అందుకున్నాక ఆరు సూత్రాల ప్రణాళికను అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 28 Feb 2024 00:07 IST

కళాశాల ప్రాంగణ నియామకాల్లో ఆఫర్‌ లెటర్‌ పొందడానికీ, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అందుకోవడానికీ మధ్య అభ్యర్థులు ఒక సంక్లిష్ట దశలో ఉంటున్నారన్నది నిజం. దీన్ని అధిగమించేందుకు ఆఫర్‌ లెటర్‌ అందుకున్నాక ఆరు సూత్రాల ప్రణాళికను అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల సానుకూల ఫలితం సాధించవచ్చు!

ఐ.టి., కార్పొరేట్‌ నియామకాల్లో ఇటీవలికాలంలో ఒక ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో ఎంపికై ఆఫర్‌ లెటర్‌ అందుకున్నా అంతిమంగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఉద్యోగార్థి చేతికి చిక్కడం లేదు. ఆరో సెమిస్టర్‌లోనో, ఏడో సెమిస్టర్‌లోనో ఎంపికై ఆఫర్‌ లెటర్‌ అందుకుంటున్నాం కానీ ఎప్పుడు చేరాలో సమాచారం మాత్రం రావడం లేదని క్యాంపస్‌ వదలిపెట్టిన తర్వాత ఉద్యోగార్థులు బాధపడుతున్నారు. ఒకప్పుడు ఇబ్బడిముబ్బడిగా సెలక్షన్స్‌ చేసేసి కంపెనీలోకి తీసుకున్నా ఆపై ప్రాజెక్టు ఇవ్వకుండా బెంచ్‌పై కూర్చోబెట్టారన్న వ్యాఖ్యలు వినవస్తుండేవి. ఇప్పుడా పరిస్థితి మారింది!

ఆఫర్‌ లెటర్‌ తర్వాత అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకోవడమే కష్టసాధ్యమవుతోందంటే.. ఇందుకు కంపెనీలను తప్పు పట్టాల్సిన పనిలేదు. సంస్థలకు కొత్త ప్రాజెక్టులు గగనమవుతున్న నేపథ్యంలో ఏరికోరి ఎంపిక చేసుకోవడంలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థివైపు నుంచి అనుసరించాల్సిన ఆరు సూత్రాలేమిటో తెలుసుకుందాం..


1. ఏది కావాలో తెలుసుకో, అది నేర్చుకో 

ఆఫర్‌ లెటర్‌ వచ్చిన తర్వాత అభ్యర్థి సంబరపడిపోకుండా ఒక వాస్తవాన్ని గుర్తించాలి. తాను ఎంపికైన కంపెనీకి కావలసిన మౌలిక అర్హతలు దాటి వచ్చినందువల్లే అవకాశం ఇచ్చారు తప్ప, నిత్య ఉద్యోగ విధులకు కావాల్సిన నైపుణ్యాలు వేరుగా ఉంటాయని గ్రహించాలి. ఇందుకు కొంత కసరత్తు చేసి కంపెనీ వెబ్‌సైట్‌, కంపెనీ ప్రస్తుత ఉద్యోగులు, తన కంటే ముందు ఎంపికైన సీనియర్ల ద్వారా కంపెనీలో రాణించేందుకు ఎటువంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకోవాలి. కంపెనీకి ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు, ఉపయోగిస్తున్న టెక్నాలజీని గుర్తించడం వల్ల అభ్యర్థి తాను ఏ దిశగా సాధన చెయ్యాలో తెలుసుకోవచ్చు. ఎటువంటి స్వల్పకాలిక కోర్సులు చెయ్యాలో స్పష్టత ఏర్పరుచుకోవచ్చు. వీటిని నేర్చుకుంటే ఉద్యోగంలో చేరాక కేటాయించిన పనిని చేయడానికి సిద్ధంగా ఉండటం సులువు అవుతుంది. 


2. ఆకట్టుకునేలా అంగీకార లేఖ 

ఆఫర్‌ లెటర్‌ అందుకున్నాక ఏ రకమైన స్పందనా ఉద్యోగార్థి నుంచి లేకపోతే అది దేనికి సంకేతం? కొలువు పట్ల అంతగా ఆసక్తిగా లేరని పరోక్షంగా సంకేతం పంపినట్లే కదా! అందుకే ఆఫర్‌ లెటర్‌ అందుకున్న తర్వాత దాన్ని పంపిన ఆఫీసర్‌కు గానీ, హెచ్‌.ఆర్‌. శాఖకు గానీ చక్కటి అంగీకార లేఖ రాయాలి. దీనిలో కంపెనీ గురించి నాలుగు మంచి మాటలు రాసి, తాను అందులో చేరబోతున్నందుకు తన ఆనందాన్ని తెలిపితే బాగుంటుంది. అదే లేఖలో కంపెనీ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులను ప్రస్తావించి, తాను కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను పేర్కొనడం వల్ల హెచ్‌.ఆర్‌. శాఖ ఉద్యోగార్థి చొరవకు సంతృప్తి చెందుతుంది. ఇంకా అదే లేఖలో... తాను చేరేందుకు పట్టే సమయాన్ని తెలియజేయమని కోరుతూ ఆ వ్యవధిలో నేర్చుకోవాల్సిన మరిన్ని నైపుణ్యాలను సూచించమని కోరవచ్చు. దీనివల్ల ఉద్యోగార్థి ఉత్సాహాన్నీ, నూతన నైపుణ్యాలను నేర్చుకోవడం పట్ల ఉన్న ఆసక్తినీ కంపెనీ తప్పక అభినందిస్తుంది.


3. దరఖాస్తు చేసిన ఇతర కంపెనీలకు లేఖ 

ఒక కంపెనీ నుంచి అభ్యర్థి ఆఫర్‌ లెటర్‌ అందుకొని, అందులోనే చేరాలని నిర్ణయించుకున్నాక తాను దరఖాస్తు చేసిన/ క్యాంపస్‌ సెలక్షన్స్‌కు హాజరైన ఇతర కంపెనీలకు లేఖ రాసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలి. తాను ఎంపికైన కంపెనీని ప్రస్తావిస్తూ పోటీపడిన ఇతర కంపెనీలకు కృతజ్ఞతలు తెలుపుతూ మెయిల్‌ రాయవచ్చు. తాను ఆఫర్‌ పొందిన కంపెనీ పట్ల సానుకూల వ్యాఖ్యలు జోడిస్తూ, ఇతర కంపెనీల పట్ల కూడా అదే తరహా భావనను వ్యక్తం చేయాలి. దీనివల్ల ఆయా కంపెనీలు ఉద్యోగార్థితో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇకపై జరపవు. అదే సమయంలో ఉద్యోగార్థి బాధ్యతాయుతంగా స్పందించినందుకు సదరు కంపెనీలు కృతజ్ఞత తెలిపే అవకాశముంది. దీనివల్ల ఉద్యోగార్థికి ఒక సౌలభ్యం ఉంది. భవిష్యత్తులో తాను ఆధారపడ్డ కంపెనీనుంచి అనుకోని కారణాలవల్ల అపాయింట్‌మెంట్‌ ఆర్డరు రాకపోతే, తిరిగి ఆ పాత కంపెనీలకు ఆఫర్‌ కోసం లేఖ రాసే నైతిక ఆస్కారం ఏర్పడుతుంది.  


4. నెట్‌వర్కింగ్‌ పెంపొందించుకోవాలి

ఐ.టి., కార్పొరేట్‌ రంగంలో ప్రవేశించి దశాబ్దాల పాటు ఒడుదొడుకులు లేకుండా రాణించాలంటే పరిచయాలు (నెట్‌వర్కింగ్‌) అవసరం. అందుకు ఆఫర్‌ లెటర్‌ మరింత నాంది పలకాలి. అభ్యర్థి తనతోపాటు అదే కంపెనీకి ఎంపికైన వారితో పరిచయాలు పెంచుకోవాలి. తరచూ సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉండాలి. దీనివల్ల ఎప్పటికప్పుడు ఏది జరుగుతోందో, తనలాగా కంపెనీకి ఎంపికైన వారికి ఏదైనా సమాచారం వస్తోందో తెలుస్తుంటుంది. ఉదాహరణకు తన సాటి అభ్యర్థికి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ వచ్చినట్లయితే తాను కూడా కంపెనీని సంప్రదించవచ్చు. అదేవిధంగా కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న తన సీనియర్లు ఎవరైనా ఉంటే గుర్తించి వారితో పరిచయాలు పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.


5. తరచూ సంప్రదింపులు

ఆఫర్‌ లెటర్‌ అందుకున్న తర్వాత కంపెనీ మేనేజర్‌ని తరచూ సంప్రదిస్తూ ఉండాలి. కంపెనీ గురించి సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ కంపెనీలో తరచూ టచ్‌లోకి వెళ్లవచ్చు. ఉదాహరణకు ఇటీవల ఒక ప్రముఖ ఐ.టి. కంపెనీ తన ఉద్యోగుల్లో రెండు లక్షలమందికి ఏఐలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదే కంపెనీకి ఎంపికైన ఉద్యోగార్థి ఆ విషయాన్ని ఉటంకిస్తూ నేటి అవసరాలకు తగిన టెక్నాలజీని నేర్పిస్తున్న కంపెనీలో తాను కూడా భాగస్వామిని కానున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మెయిల్‌ ఇవ్వవచ్చు. దీని వల్ల ఉద్యోగార్థి కంపెనీ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడని ఆ మేనేజర్‌కు సదభిప్రాయం ఏర్పడుతుంది. తాము నేర్పబోయే కొత్త సాంకేతిక పరిజ్ఞానం పట్ల కూడా ఉద్యోగార్థి ఆసక్తిగా ఉన్నాడని స్పష్టమవుతుంది.  


6. మార్పునకు సిద్ధమని తెలపాలి

ఆఫర్‌ లెటర్‌ అందుకున్నాక కొన్ని సందర్భాల్లో ఎంతకీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అందని పరిస్థితి ఎదుర్కొనవలసి రావచ్చు. దీనికి కంపెనీ వైపు నుంచి కొన్ని అంతర్గత కారణాలుంటాయి. కంపెనీ తొలుత ఒక భారీ ప్రాజెక్టు ఆశించి ఫ్రెషర్స్‌ని పెద్ద ఎత్తున నియమించడానికి సంసిద్ధమై ఉండవచ్చు. కానీ కొన్ని కారణావల్ల ఆ కంపెనీకి సదరు ప్రాజెక్టు దక్కకపోవచ్చు. ఫలితంగా ఎంపికైన ఫ్రెషర్స్‌కి కంపెనీ హెచ్‌.ఆర్‌. శాఖ నుంచి రిగ్రెట్‌ లెటర్‌ రావచ్చు. దీన్ని చూసి ఉద్యోగార్థులు హతాశులు అవడం కంటే చురుగ్గా స్పందించాలి.

కంపెనీ రిగ్రెట్‌ లెటర్‌కి సమాధానమిస్తూ కంపెనీ ఆశించిన ప్రాజెక్టుకు బదులు మరొక ప్రాజెక్టులో తన సేవలు అందించేందుకూ.. అందుకు కావలసిన కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాననీ తెలుపవచ్చు. కంపెనీకి మరొక కొత్త ప్రాజెక్టు వచ్చేవరకు నిరీక్షిస్తానని కూడా మెయిల్లో సమాచారం ఇవ్వవచ్చు. దీనివల్ల ఉద్యోగార్థి సానుకూల ప్రతిస్పందనను కంపెనీ హెచ్‌.ఆర్‌. విభాగం గుర్తిస్తుంది. ఇటువంటి అభ్యర్థి వల్ల కంపెనీకి ఉపయోగం ఉంటుందని ఆ విభాగం భావిస్తే ఉద్యోగార్థికి త్వరలోనే మరొక ఉద్యోగం దక్కవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని