జీవ శాస్త్రాల్లో కొలువుకు ఇవిగో అస్త్రాలు!

దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కళకళలాడుతున్నాయి. జాబిల్లిపై వాలిన చంద్రయాన్‌ కావచ్చు. వైద్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు కావచ్చు. శాస్త్ర విజ్ఞాన రంగానికి సాంకేతిక పరిజ్ఞానం అనే ఇంజిన్‌ను అమర్చడం ద్వారా ఇలాంటి అపురూప విజయాలెన్నో సాధ్యమవుతున్నాయి.

Updated : 20 Mar 2024 00:23 IST

జాబ్‌ స్కిల్స్‌ 2024

దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కళకళలాడుతున్నాయి. జాబిల్లిపై వాలిన చంద్రయాన్‌ కావచ్చు. వైద్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు కావచ్చు. శాస్త్ర విజ్ఞాన రంగానికి సాంకేతిక పరిజ్ఞానం అనే ఇంజిన్‌ను అమర్చడం ద్వారా ఇలాంటి అపురూప విజయాలెన్నో సాధ్యమవుతున్నాయి. ఫలితంగా గతంలో  ఎన్నడూ లేనన్ని ఉద్యోగాలకు ఆస్కారం ఏర్పడుతోంది!  

అంతరిక్షంలో భారత్‌ విజయాలు కేవలం దేశ ప్రతిష్ఠను దేదీప్యమానం చేయడమే కాదు, విశ్వ అంతరిక్ష విపణిలో మన వాటాను గణనీయంగా పెంచుతున్నాయి. 486 బిలియన్ల డాలర్ల గ్లోబల్‌ స్పేస్‌ మార్కెట్‌లో పది బిలియన్‌ డాలర్లు ఉన్న భారత్‌ వాటా 2025 నాటికి 10 శాతం మార్కెట్‌ వాటా కైవసం చేసుకుంటుందని అంచనా. ఈ రంగంలో సైన్స్‌తో పాటు సాంకేతికతను అందిపుచ్చుకున్న యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంది.  

  • జీవ సాంకేతిక శాస్త్ర రంగం (బయోటెక్నాలజీ) రేసుగుర్రంలా పరుగెడుతోంది. 2023లో 92 బిలియన్‌ డాలర్లు ఉన్న ఈ రంగం 2030 నాటికి ఏకంగా 300 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఆరేళ్ల్లలో మూడింతలు పెరుగుతుందంటే దీనిలో ఎంతగా ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయో ఊహించవచ్చు.  
  • ఫుడ్‌ టెక్నాలజీ పరిశ్రమ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 14 శాతం ఆవరించింది. ఈ రంగ ఎగుమతులు 13 శాతం వరకు విస్తరించాయి. తగిన కోర్సులు చేస్తే తక్షణ ఉద్యోగావకాశాలు సొంతం చేసుకునే రంగంగా ఈ పరిశ్రమ ఆహ్వానం పలుకుతోంది.  

ఇలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతర్భాగంగా ఉన్న ఏ ఉపరంగాన్ని తీసుకున్నా అది పురోగమన దిశగా సాగుతోంది. అంటే దీని అర్థం- సుభిక్షమవుతున్న ఈ క్షేత్రాల్లో విద్యావంతులైన యువతకు అపార ఉద్యోగావకాశాలకు ద్వారాలు తెరచి ఉన్నాయని!

కల్పవృక్షం.. ఐటీ రంగం

సైన్స్‌ స్ట్రీమ్‌లో వివిధ కోర్సులు చేసినవారికి శాస్త్ర, సాంకేతిక రంగాలు ప్రధాన ఉద్యోగ క్షేత్రాలు (కోర్‌ సెక్టర్లు) అవుతాయి. ఇదికాక, ఏ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్‌ అయినా సహస్ర బాహువులతో స్వాగతం పలికే ఐటీ రంగమనే సాగరం ఎలాగూ ఉంది. తొలిదశలో సైన్స్‌ స్ట్రీమ్‌ నుంచైైనా...తమకు కావలసిన లాంగ్వేజెస్‌, టెక్నాలజీ నేర్చుకున్న గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లను ఐటీ కంపెనీలు నియమించుకుంటాయి. తమకు వచ్చే ప్రాజెక్టులు, క్లయింట్లను బట్టి సంబంధిత స్ట్రీమ్‌ నుంచి వచ్చిన ఉద్యోగులను దానిలోకి తరలిస్తాయి. ఉదాహరణకు భారత అంతరిక్ష దిగ్గజం ఇస్రో ఏదైనా ప్రాజెక్టుకు ఐటీ సాంకేతికత అవసరమై సాఫ్ట్‌వేర్‌ కంపెనీని సంప్రదిస్తే ఆ కంపెనీ తన ఉద్యోగుల్లో సైన్స్‌ స్ట్రీమ్‌ నుంచి ముఖ్యంగా ఫిజిక్స్‌, స్పేస్‌ నేపథ్యం నుంచి వచ్చిన ఉద్యోగులను ఏరికోరి ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటారు. మిగతా స్ట్రీమ్‌ల నుంచి వచ్చినవారు ఆ పని చేయలేరని కాదు కానీ సైన్స్‌ గ్రూపుల నుంచి వచ్చినవారు త్వరగా అర్థం చేసుకోగలరని మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది.  

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 90 శాతం కోర్సు పూర్తవుతుండగానే ఉద్యోగాల్లో చేరేందుకు ఇష్టపడతారు. కానీ సైన్స్‌ గ్రాడ్యుయేట్లలో 90 శాతం మంది పీజీ చేసేందుకే సుముఖత చూపుతారు. ఆర్థిక స్థోమత కలవారు ఆ దిశగా వెళ్లినా, ఉద్యోగం తక్షణ అవసరం ఉండి పై చదువులపై మమకారం తగ్గనివారికి ప్రధాన ఐటీ కంపెనీలు ఆ అవకాశం కల్పిస్తున్నాయి. ఆసక్తిగల ఉద్యోగులకు టీసీఎస్‌ ఉద్యోగం, ఉన్నత విద్యాభ్యాసం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ కంపెనీ బిట్స్‌ పిలానీతో ఉన్న ఒప్పందం మేరకు తమ ఉద్యోగులకు ఆరు గంటలే పని కేటాయించింది. సగం రోజులో ఉద్యోగ బాధ్యతలు ముగించి, మిగతా పూట పీజీ కోర్సును మూడేళ్ల పాటు చదువుకోవచ్చు. ఒకపక్క నెలవారీ జీతమూ వస్తుంది, మరోపక్క పీజీ కూడా పూర్తవుతుంది. విప్రో, ఇతర కంపెనీలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి.  

ఉద్యోగ ప్రవేశం ఎలా?

ఇంతకీ సైన్స్‌ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ ప్రవేశం ఎలా? సైన్స్‌, బయోటెక్నాలజీ, ఫార్మసీ, చదివిన విద్యార్థులను మిగతావారితో సమానంగా ఐటీ కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి.  

  • గ్రాడ్యుయేషన్‌ చేసిన  సైన్స్‌ స్ట్రీమ్‌లో డొమైన్‌ పరిజ్ఞానంపై పటిష్ఠంగా ఉండటం ప్రాథమిక అవసరం.  
  • దీనితోపాటు ఐటీ నాలెడ్జ్‌ తప్పనిసరి. ఈ విషయంలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసినవారిలా ఐటీ నైపుణ్యాలను ఆశించరు కానీ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, పీపీటీ లాంటి ప్రాథమిక కంప్యూటర్‌ అక్షరాస్యతను కోరుకుంటారు. విద్యార్థి వీటితోపాటు చొరవ, ముందు చూపుతో కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లుు, ప్రోగ్రామింగ్‌ నేర్చుకొనివుంటే అటువంటివారిని ఏ కంపెనీ అయినా వదలదు.  
  • సైన్స్‌ గ్రాడ్యుయేట్లను మిగతా గ్రాడ్యుయేట్ల మాదిరి ఎంట్రీస్థాయి ఉద్యోగాల్లోనే ఎంపిక చేసుకుంటున్నారు. అదే ఔషధ, ఆరోగ్యరంగ కంపెనీలయితే క్వాలిటీ అస్యూరెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌, సేల్స్‌ వంటి విభాగాల్లోకి తీసుకుంటాయి. టెక్నికల్‌ రౌండ్స్‌ సహా అన్ని రౌండ్స్‌లో మంచి ప్రతిభ చూపి, అధునాతన సాంకేతికతల్లో ఏదైనా ఒకదానిపై ప్రాజెక్టువర్క్‌ చేసిన అభ్యర్థులను ఔషధ కంపెనీలు ఆర్‌ అండ్‌ డీ విభాగంలో నియమిస్తున్నాయి. సహజంగానే మిగతా విభాగాలకంటే ఆర్‌ అండ్‌ డీలో ప్లేస్‌మెంట్‌ కల్పిస్తే ప్యాకేజీ ఎక్కువగా ఉంటుంది.  

ప్లేస్‌మెంట్స్‌ ఏ సంస్థల్లో?

సైన్సెస్‌లో మంచి అకడమిక్‌ ట్రాక్‌ ఉండి సబ్జెక్టు రౌండ్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌లో మంచి ప్రతిభ చూపినవారిని పెద్ద కంపెనీలే హైర్‌ చేస్తున్నాయి.  

విప్రో టెక్నాలజీస్‌, యాక్సెంచర్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, హెచ్‌.సి.ఎల్‌. టెక్నాలజీ, కాగ్నిజెంట్‌ సొల్యూషన్స్‌, ఐ.బి.ఎం. ఇండియా, జెన్‌ప్యాక్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌, అపోలో, డెలాయిట్‌, టి.సి.ఎస్‌., ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీల్లో వారి అవసరాలను బట్టి నియామకాలు జరుపుతున్నారు. అభ్యర్థి ప్రతిభ, కంపెనీ అవసరాల ప్రకారం వివిధ హోదాలకు వేర్వేరు ప్యాకేజీలను ఆఫర్‌ చేస్తున్నారు. టెక్నాలజీ కన్సల్టెంట్స్‌కు రూ.12 లక్షలు, డేటాసైంటిస్ట్‌కు రూ.10 లక్షలు, రిస్క్‌ అనలిస్ట్‌కు   రూ.ఐదున్నర లక్షలు, రిసెర్చ్‌ సైంటిస్ట్‌కు రూ.3 లక్షలు వేతనం చెల్లిస్తున్నారు.

సబ్జెక్ట్టుపై నిజమైన ఆసక్తి, ఎన్ని గంటలు పనిచేసినా తగ్గని అనురక్తి ఉంటే సైన్స్‌ స్ట్రీమ్‌ విద్యార్థులకు రాణింపు ఉంటుంది. అటువంటివారిని గుర్తించడంలో కంపెనీలు ముందుంటాయి.


ఏ కోర్సులకు ఎక్కడ అవకాశాలు?

  • బీఎస్సీ, ఎమ్మెస్సీ, డేటాసైన్స్‌, స్టాటిస్టిక్స్‌ చేసిన విద్యార్థులను ఐటీ కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి.  
  • బీఎస్సీ బయో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ చేసినవారు ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగ కంపెనీల్లోకి వెళ్లిపోతున్నారు. ప్రొడక్ట్‌ నాణ్యతా ప్రమాణాలు పరీక్షించే విభాగాల్లో వీరి సేవలు వినియోగించుకొని రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు.
  • బీఎస్సీ లేదా ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చేసి సబ్జెక్టులో పటిష్ఠంగా ఉన్న అభ్యర్థులకు హెల్త్‌కేర్‌ రంగంలో రిసెర్చర్స్‌గా అవకాశం కల్పిస్తున్నారు. ఫైనాన్స్‌, మార్కెట్‌ రిసెర్చ్‌ విభాగాల్లో నియమిస్తున్నారు. ఈ ఉద్యోగులు సమాచార సమీకరణ (డేటా కలెక్షన్‌), విశ్లేషణ సేవలు అందిస్తారు.  
  • ఔషధ, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో క్లినికల్‌ రిసెర్చ్‌ కీలక ఘట్టంగా అవతరించడంతో సైన్స్‌ కోర్సులు చేస్తే క్లినికల్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌గా నియమిస్తున్నారు. ఫార్మా, బయోటెక్నాలజీ, వైద్య పరికరాల ఉత్పత్తి కంపెనీల్లో ఈ ఉద్యోగావకాశాలు ఉంటున్నాయి.  
  • లైఫ్‌ సైన్సెస్‌తో పాటు స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుపై పట్టున్నవారిని ప్రజారోగ్య రంగం, జీవశాస్త్ర రంగాల్లో బయోస్టాటిస్టీషియన్‌గా తీసుకుంటున్నారు. లభ్యమయ్యే సమాచారాన్ని అర్థం చేసుకొని, విశ్లేషించి సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో యాజమాన్యం నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ఉద్యోగులు తగిన సమాచారం రూపొందించాలి.  
  • బయాలజీతో పాటు కెమిస్ట్రీ సబ్జెక్టులను నేర్చుకున్న విద్యార్థులను జీవ శాస్త్రవేత్తలుగా నియమిస్తున్నారు. కణాల పెరుగుదల, విభజన, పోషణ ప్రక్రియలను అధ్యయనం చేసేందుకు వినియోగిస్తున్నారు.

సైన్స్‌లో సక్సెస్‌ మార్గం

సైన్స్‌ నేపథ్యం ఉన్న అభ్యర్థులు కేవలం సబ్జెక్టులనే నమ్ముకుంటే నేటి టెక్నాలజీ శకంలో అవకాశాలు అందిపుచ్చుకోలేరు. తమ డొమైన్‌ పరిజ్ఞానంతో పాటు కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లు, వర్తమాన టెక్నాలజీపై కనీస అవగాహన, ప్రాథమికంగా పనిచేయగల సామర్థ్యం అలవర్చుకోవాలి.  

  • అభ్యర్థికి ఆసక్తిగల లాంగ్వేజ్‌ జావా/ పైతాన్‌లో కనీసం వారంపాటు ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలి.
  • సింపుల్‌ కోడింగ్‌ ఐదు నుంచి ఏడు రోజుల పాటు సాధన చేయాలి. ‘కింది వాటిలో ఏది ప్రైమ్‌ నంబరు?’ లాంటి సులభ ప్రశ్నలతో ప్రారంభించి క్రమేపీ స్థాయి పెంచుతూ వెళ్లాలి.
  • తర్వాత సమాచార నిర్మితుల (డేటా కన్‌స్ట్రక్షన్స్‌) అధ్యయనం ప్రారంభించాలి. అరేస్‌, స్ట్రింగ్స్‌, స్టాక్స్‌, క్యూస్‌ తదితర ఫార్మాట్లను మూడు వారాలపాటు అధ్యయనం చేయాలి. వీటిపై కనీసం 30 ప్రశ్నలను సాధన చేయాలి.  
  • యూట్యూబ్‌లో కొన్ని కోడింగ్‌ ప్రాజెక్టులను డౌన్‌లోడ్‌ చేసుకొని ఒకటికి రెండు సార్లు వీక్షిస్తూ, అధ్యయనం చేయాలి.  

ఇప్పుడిక అభ్యర్థి కొంతమేర సిద్ధమైనట్టుగా పరిగణించి క్యాంపస్‌/ ఆఫ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌కి హాజరు కావచ్చు. పోటీ పడుతున్న కంపెనీకి సంబంధించిన గత ప్లేస్‌మెంట్‌ టెస్టులు అందుబాటులో ఉంటే వాటిని సాధన చేసి ఎంపికకు వెళ్లడం ఇంకా మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని