మలి సెషన్లో మెరవండి ఇలా!

జేఈఈ మెయిన్‌-2024 సెషన్‌-2 పరీక్ష ఏప్రిల్‌ 4 నుంచి ఆరంభం కాబోతోంది. ఇప్పుడు మిగిలిన ఈ కొద్దిరోజుల్లో సన్నద్ధతను ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తే.. పరీక్షలో గరిష్ఠ స్కోరు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. 

Published : 26 Mar 2024 00:03 IST

జేఈఈ మెయిన్‌

జేఈఈ మెయిన్‌-2024 సెషన్‌-2 పరీక్ష ఏప్రిల్‌ 4 నుంచి ఆరంభం కాబోతోంది. ఇప్పుడు మిగిలిన ఈ కొద్దిరోజుల్లో సన్నద్ధతను ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తే.. పరీక్షలో గరిష్ఠ స్కోరు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది.  

నవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌-2024 మొదటి సెషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే జేఈఈ మెయిన్‌-2024 మొదటి సెషన్‌ రాసిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జేఈఈ మెయిన్‌-2024 సిలబస్‌ను కొంతమేరకు తొలగించినందువల్ల (ముఖ్యంగా కెమిస్ట్రీ) ఈ సంఖ్య కాస్త పెరిగిందని చెప్పొచ్చు.  

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ప్రశ్నపత్రాల సరళి, ప్రశ్నల స్థాయిని పరిశీలిస్తే, 2023లో కంటే కాస్త తక్కువగా ఉన్నాయనిపిస్తుంది. జేఈఈ మెయిన్‌-2023లో జనవరి, ఏప్రిల్‌ సెషన్స్‌ రెండింటిలోనూ మ్యాథ్స్‌, కెమిస్ట్రీల్లో పలు షిప్ట్‌ల్లో ప్రశ్నల స్థాయి కాస్త కఠినంగానే ఉంది. కఠినమంటే.. కొన్ని ప్రశ్నలు కాస్త అడ్వాన్స్‌డ్‌ పరీక్షలోని ప్రశ్నల స్థాయిని పోలివుంటే.. మరికొన్ని ప్రశ్నలు.. సాధన కోసం ఎక్కువ సమయం పట్టేలా ఉన్నాయి. కానీ జేఈఈ మెయిన్‌-2024 సెషన్‌-1లో గణితంలో కాస్త సమయం తీసుకునేవి 4 నుంచి 6 ప్రశ్నలను ఒకటి రెండు షిఫ్టులు మినహా మిగిలిన అన్నింటిలోనూ ఇచ్చారు. కెమిస్ట్రీలో మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకం అంశాలతో ముడిపడిన ప్రశ్నలు మాత్రమే, చాలావరకూ తేలికపాటివి అడిగారు. ఫిజిక్స్‌ వరకు తేలిక స్థాయి నుంచి మధ్యమ స్థాయి ప్రశ్నలను అడిగారు.

మొదట కెమిస్ట్రీతో మొదలుపెట్టి, తర్వాత ఫిజిక్స్‌పై దృష్టిపెట్టి, ఈ రెండు సబ్జెక్టులను 90 నిమిషాల కాలవ్యవధిలో పూర్తి చేస్తే.. మ్యాథ్స్‌లోని ప్రశ్నలను సాధించడానికి మిగిలిన 90 నిమిషాలు చక్కగా సరిపోతాయి. ఇలా సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్న విద్యార్థికి మూడు సబ్జెక్టుల్లో మంచి స్కోరు సాధించడం కష్టమేమీ కాదు.

ముందుగా తెలుసుకోవాల్సిన అంశాలు

  • సెషన్‌-1లో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ఎక్కువగా ప్రశ్నలు అడిగిన చాప్టర్లు ఏవి?
  • అందులో ఎన్ని చాప్టర్లు ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరానికి చెందినవి?
  • ఇప్పుడున్న వ్యవధిలో పట్టు సాధించాల్సిన చాప్టర్లు ఏవి?

ఈ విషయాలపై అవగాహన చాలా అవసరం.

మ్యాథమెటిక్స్‌లో...

సెషన్‌-1లో 10 పేపర్లలో మ్యాథ్స్‌లో ఎక్కువ ప్రశ్నలు అడిగిన చాప్టర్లు-

1. సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్‌ 2. వెక్టర్స్‌
3. 3డీ 4. లిమిట్స్‌, కంటిన్యుటీ అండ్‌ డిఫరెన్షియబిలిటీ
5. డెఫినిట్‌ ఇంటిగ్రేషన్స్‌ 6. డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌
7. ఏరియాస్‌ అండర్‌ ద కర్వ్‌ 8. బైనామియల్‌ థియరం
9. ప్రాబబిలిటీ అండ్‌ పెర్‌మ్యుటేషన్స్‌ - కాంబినేషన్స్‌
10. కాంప్లెక్స్‌ నంబర్స్‌

ఇందులో డెఫినిట్‌ ఇంటిగ్రేషన్స్‌, ఏరియాస్‌ అండర్‌ ద కర్వ్‌, డిఫరెన్సియల్‌ ఈక్వేషన్స్‌, ప్రాబబిలిటీ అండ్‌ పెర్‌మ్యుటేషన్స్‌- కాంబినేషన్స్‌, కాంప్లెక్స్‌ నంబర్స్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరపు సిలబస్‌లోనివి.

ఫిజిక్స్‌లో: ఎక్కువగా ప్రశ్నలు అడిగిన చాప్టర్లు -  

1. వర్క్‌, పవర్‌, ఎనర్జీ
2. రిజిడ్‌ బాడీ డైనమిక్స్‌
3. ఫ్లూయిడ్స్‌, సర్ఫేస్‌ టెన్షన్‌, వెలాసిటీ
4. ఎలాస్టిసిటీ  
5. థర్మోడైనమిక్స్‌
6. ఎర్రర్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్‌
7. ఎలక్ట్రోస్టాటిక్స్‌
8. గ్రావిటేషన్‌
9. కరెంట్‌ ఎలక్ట్రిసిటీ
10. మ్యాగ్నటిజం, ఈఎంఐ, ఏసీ 11. ఆప్టిక్స్‌

ఇందులో 7 నుంచి 11 వరకు చాప్టర్లన్నీ రెండో సంవత్సరం సిలబస్‌లోనివే.

కెమిస్ట్రీలో... ఎక్కువ ప్రశ్నలు అడిగిన చాప్టర్లు- ఆర్గానిక్‌ కెమిస్ట్రీ:

1. నామిన్‌క్లేచర్‌ 2. ఈడీఈ 3. హాలోజన్‌ డెరివేటివ్స్‌
4. కార్బోనిల్స్‌ కాంపౌండ్స్‌ 5. ఆరోమేటిక్‌ కాంపౌండ్స్‌
6. ప్యూరిఫికేషన్‌ అండ్‌ స్పెసిఫికేషన్‌ టెక్నీషియన్‌
వీటిల్లో 2, 3 చాప్టర్లు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి చెందినవి.

ఫిజికల్‌ కెమిస్ట్రీ:

1. మోల్‌ కాన్సెప్ట్‌ 2. థర్మోడైనమిక్స్‌ అండ్‌ పీసీ
3. కెమికల్‌ కైనటిక్స్‌ 4. ఎలక్ట్రో కెమిస్ట్రీ
3, 4 చాప్టరు ద్వితీయ సంవత్సరానికి చెందినవే.

ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ:

1. పీరియాడిక్‌ ప్రాపర్టీస్‌ 2. కెమికల్‌ బాండింగ్‌
3. కోఆర్డినేషన్‌ కాంపౌండ్‌ 4. పి-బ్లాక్‌
5. డి-ఎఫ్‌-బ్లాక్‌ 6. సాల్ట్‌ ఎనాలిసిస్‌ (ప్రాక్టికల్‌ కెమిస్ట్రీ)

ఇందులో 3, 4, 5, 6 చాప్టర్లు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి చెందినవే.

ఉన్న వ్యవధిలో కనీసం పైన పేర్కొన్న ద్వితీయ సంవత్సరంలోని చాప్టర్లపై పట్టు సాధిస్తే జేఈఈ మెయిన్‌ సెషన్‌-2లో గణనీయంగా స్కోరు పెంచుకోవచ్చు.

వీటిని పాటించండి

  • మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ఎక్కువ శాతం ప్రశ్నలు వచ్చిన చాప్టర్ల నుంచి మొదటి సంవత్సరానికి సంబంధించినవి సాధన చేయడం మంచిది.
  • కెమిస్ట్రీ సబ్జెక్టు వరకు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోని అంశాలపైనే దృష్టి పెట్టండి. ఎందుకంటే సెషన్‌-1లో ఒకటి లేదా రెండు పేపర్లలో మినహా 99.9 శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోని అంశాలకు మాత్రమే పరిమితమై ఇచ్చారు. చాలా తేలిక స్థాయిలో ప్రశ్నలు వచ్చాయి. సెషన్‌-2లో కూడా అలాగే ఉండొచ్చు. అందుకని ఈవిధంగా చదివితే సాధారణ విద్యార్థి కూడా కెమిస్ట్రీలో 100కు 60కి పైగా మార్కులు సులువుగా సాధించవచ్చు.
  • ఫిజిక్స్‌లో ప్రశ్నలు ఎక్కువ శాతం తేలికపాటి నుంచి మధ్యమ స్థాయిలో ఉన్నాయి. ఎక్కువ శాతం డైరెక్ట్‌ ఫార్ములా బేస్డ్‌ ప్రాబ్లమ్స్‌, థియరీ ప్రశ్నలు అడిగారు. ఇచ్చిన న్యూమరికల్‌ ప్రాబ్లమ్స్‌ సాధించడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోనవసరం లేదు. ప్రతి పేపర్లో 15 నుంచి 20 ప్రశ్నలు చాలావరకు తేలికగా, డైరెక్టుగా ఉన్నాయి. కచ్చితత్వం మెరుగుపరుచుకునే దిశగా సాధన చేయండి.
  • జేఈఈ మెయిన్‌లో కీలకమైన పాత్ర మ్యాథమెటిక్స్‌దే. కాన్సెప్ట్‌, ఫార్ములాల్లో పట్టు సాధించినవారికి మ్యాథమెటిక్స్‌ ఏ మాత్రం కష్టం కాదు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో పోలిస్తే మ్యాథమెటిక్స్‌ సెషన్‌-1లో జరిగిన 10 పేపర్లలో ప్రతి పేపర్లో 4 నుంచి 5 కాస్త సమయం తీసుకున్నవి
  • ఉన్నాయి. కానీ అన్నీ సిలబస్‌ దాటి పోలేదన్న విషయం మరిచిపోవద్దు.
  • ఎక్కువ మాక్‌ టెస్ట్‌లు సాధన చేయటం మేలు.
  • సెషన్‌-1లోని ప్రశ్నపత్రాలన్నీ సాధన చేయండి. అంతేకాకుండా ప్రశ్నల శైలిని అర్థం చేసుకుని అటువంటి తరహా ప్రశ్నలు మరింతగా సాధన చేయడం మరవద్దు.
  • నమూనా పరీక్ష రాసేటప్పుడు వచ్చే సందేహాలన్నింటినీ పరీక్ష తర్వాత అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోండి.
  • జేఈఈ-మెయిన్‌లో మొదట వీలైనంతవరకు గరిష్ఠ స్కోరు సాధించే దిశగా ప్రణాళికలు వేసుకోవాలి. దానికి ఏ సబ్జెక్టుకు ఎంత టైమ్‌ ఇవ్వాలి అనేది చాలా ముఖ్యం. పేపర్‌ని బట్టి ప్రణాళికలు మార్చుకోవాలి.
  • సెషన్‌-1లో మాదిరిగానే సెషన్‌-2 ఉంటుంది అనే స్థిరమైన అభిప్రాయానికి వెంటనే రాకండి. ‘పేపర్‌ ఎలా ఇచ్చినా, నేను బాగా రాయాలి’ అనే సంకేతాలు మీ మెదడుకు ఇచ్చుకుని ముందుకు సాగండి.  
  • మంచి ఆహారం, నిద్ర ఎంతైనా అవసరం. ఒత్తిడి అనేది సహజం. మీకు మాత్రమే ఒత్తిడి ఉంటుందన్న అపోహ నుంచి బయటకు రండి.
  • ఎన్ని ప్రశ్నలు రాశారన్నది ముఖ్యం కాదు. ఎన్ని సరిగ్గా గుర్తించారన్నదే ముఖ్యం. అదే మీ మార్కులనూ, ర్యాంకునూ నిర్ణయిస్తుంది.
  • సీబీఎస్‌ఈ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రాక్టికల్‌ మాన్యువల్స్‌ చదవడం మరిచిపోవద్దు. వాటి నుంచి 4-5 ప్రశ్నలు వస్తాయి.

ఎం. ఉమాశంకర్‌ శ్రీచైతన్య ఐఐటీ జాతీయ సమన్వయకర్త


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని