3 నెలల్లో గేట్‌ మొదటి ర్యాంకు!

మనదేశంలో ఏటా దాదాపు 8 లక్షల మందికిపైగా గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) పరీక్ష రాస్తుంటారు.

Updated : 26 Mar 2024 07:22 IST

మనదేశంలో ఏటా దాదాపు 8 లక్షల మందికిపైగా గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) పరీక్ష రాస్తుంటారు. ఇంజినీరింగ్‌ తర్వాత ఎంటెక్‌లో చేరి ఉన్నత విద్యను అభ్యసించడానికి మాత్రమే కాదు.. ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, గెయిల్‌, ఐవోసీఎల్‌ వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం గేట్‌ స్కోర్‌ ప్రామాణికం. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన పరీక్షలో ఈఈఈ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు గజ్వేల్‌కు చెందిన ఏడెల్లి సాయికిరణ్‌. ఈ విజయం ఎలా సాధ్యమైందో తన మాటల్లోనే...

మాది సిద్ధిపేట్‌ జిల్లా గజ్వేల్‌. అమ్మానాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, చెల్లి ఇంటర్మీడియట్‌ చదువుతోంది. జేఈఈలో ఆలిండియా 7వ ర్యాంకు వచ్చింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో చేరాను. చాలా మంది ఆ ర్యాంకుతో కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకోవచ్చు, ఎలక్ట్రికల్‌ ఎందుకు అనేవారు. కానీ నాకు ఈ సబ్జెక్టు బాగా నచ్చింది. అందరూ వెళ్తున్నారని నచ్చని మార్గంలో వెళ్లలేం కదా! అందువల్ల నేను అనుకున్న ఈఈఈలోనే చేరాను. మా అమ్మానాన్నలు కూడా నా నిర్ణయానికి మద్దతిచ్చారు.

  • బీటెక్‌ పూర్తవుతుంది అనగా ప్రాంగణ ఎంపికల్లో ఏడాదికి రూ.30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అందులో చేరిపోదాం అనుకున్నా. 2023 ఏప్రిల్‌లో చదువు పూర్తయ్యింది, అక్టోబరులో ఉద్యోగంలో చేరాలి. కానీ జాయినింగ్‌ డేట్‌కు రెండు రోజుల ముందు ఆర్థిక మాంద్యం కారణంగా నా జాబ్‌ ఆఫర్‌ను రివోక్‌ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో కొంచెం గందరగోళానికి గురయ్యాను.
  • అప్పటికే గేట్‌ పరీక్షకు దరఖాస్తు చేసి ఉన్నాను. ఉద్యోగం వస్తే అందులో చేరి పరీక్షకు సన్నద్ధం అవుదాం అనుకున్నాను. కానీ రాకపోయే సరికి పూర్తిగా గేట్‌ మీదనే దృష్టిపెట్టాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరీక్ష జరిగింది. అంటే అక్టోబరు చివరి నుంచి ఫిబ్రవరి వరకూ మాత్రమే నాకున్న సమయం. ఇంచుమించు మూడు నెలల కాలంలో చదవగలనా అనే సందేహం నాకు రాలేదు. అప్పటికే జేఈఈ ర్యాంకు సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలా అయినా ఫస్టు ర్యాంకు కొట్టాలని చదవడం మొదలుపెట్టాను.

వ్యూహాత్మకంగా..

  • సాధారణంగా గేట్‌ పరీక్ష సన్నద్ధత కోసం విద్యార్థులు ఏడాది వరకూ సమయం కేటాయిస్తారు. కానీ నాకు దొరికింది కేవలం మూడు నెలలు. అందువల్ల బేసిక్స్‌ చదవడానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఎగ్జామ్‌కి ఏది ముఖ్యం, ప్రశ్న ఎలా రావచ్చు అనేది ఆలోచిస్తూ చదువుతూ వెళ్లాను. ఏస్‌ అకాడమీ ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌ ఉపయోగపడ్డాయి. కొన్ని చాప్టర్లకు యూట్యూబ్‌ వీడియోలు.. తక్కువ సమయంలో ఎక్కువ విషయం చెప్పేవి ఎంచుకుని చూసేవాడిని. మరికొన్నింటికి పుస్తకాలు చదివాను. సులభంగా చదవగలిగే అంశాలు, ఎక్కువ మార్కుల వెయిటేజీ కలిగిన పాఠాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ మిగతావాటిని సెకండరీ ప్రయారిటీతో చదువుకున్నాను.
  • పరీక్షకు నెల రోజుల సమయం ఉందనగా పూర్తిగా టెస్ట్‌ సిరీస్‌లు రాయడం మొదలుపెట్టాను. అదే సమయంలో రివిజన్‌ కూడా చేశాను. సగటున రోజుకు 6 నుంచి 10 గంటలు చదివాను. కచ్చితంగా ఫస్ట్‌ ర్యాంకు కొట్టాలని ప్రయత్నించినా.. పేపర్‌ బాగా కష్టంగా వచ్చింది. ఎగ్జామ్‌ రాశాక ఆశించిన ర్యాంకు రాదేమోనని భయపడ్డాను. ఫలితాలు వచ్చాక లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా అనిపించింది.
  • మొత్తం 100 మార్కుల పేపర్‌లో ఇంగ్లిష్‌, ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ల్లో 25 మార్కులు పూర్తిగా వచ్చేలా ప్రిపేర్‌ అయ్యాను. మిగతా అంతా సబ్జెక్టు మీద ప్రశ్నలు ఉంటాయి కాబట్టి చదవాల్సిన టాపిక్స్‌ను శ్రద్ధగా చదువుకున్నాను.
  • ఏ సబ్జెక్టు చదివినా సరే అందులో లోతైన అవగాహన ఉంటే మార్కెట్‌లో అవకాశాలు ఉంటాయి. అందువల్ల విద్యార్థులు ఉద్యోగాల కోసం నచ్చని సబ్జెక్టులు చదువుతూ ఇబ్బంది పడనవసరం లేదు. పరీక్ష ఏదైనా ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో పూర్తి ప్రయత్నం చేస్తే ఫలితం లభిస్తుంది.’
  • చాలామంది విద్యార్థులు కోచింగ్‌ లేకుండా మంచి మార్కులు రావడం కష్టం అనుకుంటారు, అది కేవలం అపోహ మాత్రమే. టైమ్‌ను సరిగ్గా మేనేజ్‌ చేసుకోవడం వస్తే ఎలాంటి శిక్షణ లేకుండానే చదువుకోవచ్చు. ప్రస్తుతం మొదటి ర్యాంకు రావడం వల్ల నచ్చిన కాలేజీలో సీటు దొరుకుతుంది. ఎక్కడ చేరాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నా. అదే సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని