మీ ‘సామాజిక’ ఖాతా ప్రొఫెషనల్‌గా ఇలా!

ఒక మంచి ఉద్యోగావకాశాన్ని అందుకోవడం అంత సులువు కాదు.. నియామక సంస్థలతో తరచూ సంప్రదింపులు చేయడంలో ప్రొఫెషనల్‌ సోషల్‌ మీడియా ఖాతాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

Published : 02 Apr 2024 00:38 IST

ఒక మంచి ఉద్యోగావకాశాన్ని అందుకోవడం అంత సులువు కాదు.. నియామక సంస్థలతో తరచూ సంప్రదింపులు చేయడంలో ప్రొఫెషనల్‌ సోషల్‌ మీడియా ఖాతాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటిని ఎంత పద్ధతి ప్రకారం నిర్వహిస్తే, అంత వేగంగా, మెరుగైన అవకాశాలను చేజిక్కించుకోగలం. జాబ్‌ మార్కెట్‌లో ఒక నానుడి ఉంది.. ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ కలిగించడంలో సెకెండ్‌ ఛాన్స్‌ ఉండదు’ అని! అందుకే మొదటిసారే మనం తెలపాల్సిన వివరాలు పూర్తిస్థాయిలో ఇచ్చేయగలగాలి. మరి ఇందుకు నిపుణులు సూచిస్తున్న మెలకువలు చూద్దామా!

ప్రస్తుతం ఉన్న విపణిలో ప్రతి చిన్న అవకాశమూ అపురూపమే! అయితే వాటిని అందుకోవడంలో మన సోషల్‌ మీడియా ఖాతా కూడా ప్రభావం చూపగలదు. అభ్యర్థి ఆన్‌లైన్‌లో ఎలా ఉంటున్నారు, ఎలాంటి వివరాలు పంచుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇలా అన్నింటినీ పరిశీలిస్తారు. ఇందుకోసం ఆసక్తికరమైన ఖాతా ఉండటం అవసరం. వాటిలో క్రియాశీలకంగా ఉంటూ అవసరమైన మేరకు వివరాలను పంచుకోవాలి. ఈ విధంగా మార్కెట్‌లో మనకంటూ ఒక స్థానం సంపాదించుకోగలుగుతాం. అలా అని ఉన్న సోషల్‌ మీడియా ఖాతాలన్నింటినీ ఒకేలా, తరచూ వాడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన ప్రొఫెషనల్‌ సైట్లను సక్రమంగా నిర్వహిస్తే సరిపోతుంది.

ఒకే పేరు

మొత్తం అన్ని సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ ఒకే పేరు, హ్యాండిల్‌తో ఖాతాలుంటే రిక్రూటర్లకు మనల్ని గుర్తించడం సులభతరం అవుతుంది. అన్ని సోషల్‌ ఖాతాల్లోనూ ఒకే విధమైన హ్యాండిల్‌ అందుబాటులో ఉందో లేదో తెలుసుకునేందుకు కొన్ని ఉచిత టూల్స్‌ కూడా ఉన్నాయి. ఉదాహరణకు ‘నేమ్‌చెకర్‌’ అనే టూల్‌ ద్వారా మనం ఎంచుకున్న హ్యాండిల్‌ ఏయే ఖాతాల్లో అందుబాటులో ఉందో, వేటిల్లో వేరే వాళ్లు తీసుకున్నారో తెలుసుకోవచ్చు. ఇలా ఎంచుకుని అన్నిచోట్లా ఒకే విధమైన పేరుతో ఉండటం వల్ల ఎవరు వెతికేందుకు ప్రయత్నించినా సులభంగా ఖాతా కనిపిస్తుంది.

వివిధ ఖాతాల్లో..

వెంటనే ఉపయోగించినా, లేకున్నా.. అన్ని సోషల్‌ మీడియా వేదికల్లోనూ ఖాతాలు ఉండటం అవసరం. కొందరు కొన్నింటినే అధికంగా వినియోగిస్తుంటారు. అందువల్ల ఎవరు ఎందులో వెతికినా మన వివరాలు కనిపించేలా ఖాతాలు ఉండటం మంచిది. కనీస వివరాలతోపాటు ముఖ్యమైన అంశాలను అందులో పంచుకుంటే ఎటువంటి అవకాశాలూ చేజారవు. అయితే వేదిక ఎటువంటిది అయినా ఖాతా మాత్రం ప్రొఫెషనల్‌గా ఉండేలా జాగ్రత్త వహించడం ప్రధానం.

ఒకే చిత్రం

ఖాతాలు అనేకం ఉన్నా, వాటికి ఉపయోగించే ప్రొఫైల్‌ ఫొటో మాత్రం ఒక్కటే ఉండాలి. అది వీలైనంత నాణ్యతతో, చక్కగా కనిపించేలా ఉండటం మంచిది. ఆఫీసుకు వేసుకువెళ్లే దుస్తులు, అధికారికంగా కనిపించే లుక్‌తో ఉండటం ఎదుటివారికి సదభిప్రాయాన్ని కలిగిస్తుంది. కావాలంటే సభలు, సమావేశాలు వంటి వాటిలో మాట్లాడే స్టిల్స్‌ కూడా పెట్టుకోవచ్చు. ఒకే చిత్రం అన్నిచోట్లా ఉండటం వల్ల రిక్రూటర్లు ప్రొఫైల్‌ గుర్తుపట్టడానికి సులభంగా ఉంటుంది. సోషల్‌ మీడియా ఖాతాలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

చిత్రం వెనుక..

ప్రొఫైల్‌ చిత్రాన్ని పక్కన పెడితే.. వెనుక ఉండే బ్యాక్‌గ్రౌండ్‌ కవర్‌ను మాత్రం నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. మన ఆసక్తి, అభిరుచులు, లక్ష్యాలు, విజయాలు.. వేటినైనా ప్రతిబింబించేలా ఆ చిత్రాలు ఉండవచ్చు. అయితే సాధారణంగా ప్రొఫైల్‌ పిక్చర్‌ కంటే వీటికి ఎక్కువ రిజల్యూషన్‌తో కూడిన చిత్రాలు అవసరం అవుతాయి. వ్యక్తిగత చిత్రాలు ఉంటే సరి, లేదంటే ఆన్‌లైన్‌లో సేకరించిన వాటినైనా ఉపయోగించవచ్చు. ఎటొచ్చీ ఎంత మంచి చిత్రాలను ఎంచుకున్నాం, ఎటువంటి రంగులు మన ప్రొఫైల్‌లో కనిపిస్తున్నాయో రిక్రూటర్లు గమనిస్తారనే సంగతి దృష్టిలో ఉంచుకోవాలి.

పోస్టులు

ఖాతాల్లో పోస్ట్‌ చేసే సమాచారం, ఇతర విషయాలేవైనా హుందాగా, వివాదరహితంగా, ఇబ్బందికి తావు లేనివై ఉండాలి. సందర్భానుసారం పోస్ట్‌ చేయడం, సరైన పద్ధతిలో ఖాతాను నిర్వహించడం మెరుగు. ప్రభుత్వాలు, మతాల వంటి సున్నితమైన అంశాల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. బలమైన, ఆసక్తికరమైన పోస్టుల ద్వారా రిక్రూటర్లు మన ప్రొఫైల్‌పై ఎక్కువ సమయం గడిపేలా ప్రయత్నించవచ్చు.

గోప్యత  

కొందరు ఖాతాలను లాక్‌ చేసుకోవడం, ప్రైవసీ సెట్టింగ్స్‌ను ఉపయోగించడం వంటివి చేస్తుంటారు. అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మాత్రం మన ఖాతాను అందరూ చూసేలా ఉంచడమే మంచిది. వీలైనంత మందికి కాంటాక్ట్‌ షేర్‌ కావాలి. అప్పుడే ఎక్కువ సంస్థలకు మన గురించి తెలిసే వీలుంటుంది.

ప్రత్యేకమైన బయో

ప్రపంచానికి మనమేంటో మన మాటల్లోనే చెప్పే అవకాశమే మనం రాసే బయో. అది క్లుప్తంగా, పొందికగా తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారం ఇచ్చే విధంగా ఉండాలి. ప్రతి వేదికకూ పదాల నిడివి ఉంటుంది. దానికి తగిన విధంగా అందులోనే మన గురించి తెలియజేయాలి. మనకు సంబంధించిన సానుకూల వివరాలు మాత్రమే అందులో ఉండాలి. హ్యాష్‌ట్యాగ్‌లను తగిన విధంగా, మరీ ఎక్కువ - మరీ తక్కువ కాకుండా ఉపయోగించాలి.

పర్యవేక్షణ

కేవలం మనం పోస్ట్‌ చేసే కంటెంట్‌ సరిగ్గా ఉంటే సరిపోదు.. ఇతరులు మనల్ని ట్యాగ్‌ చేసే అంశాలు, వారు పెట్టే కామెంట్ల వంటి వాటిపైనా జాగ్రత్త వహించాలి. దీని ద్వారా మనం ఎంత శ్రద్ధగా ఖాతాలు, అవి ఇతరులకు ఇచ్చే అభిప్రాయం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నామో తెలుస్తుంది. అశ్లీలకరమైన, వివాదాస్పద విషయాల్లో పరోక్షంగానైనా జోక్యం చేసుకోకుండా ఉండాలి.

లింకులు

మన ఖాతాల సోషల్‌ మీడియా లింకులు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. వేరే ఖాతాలుంటే వాటి ద్వారా ప్రొఫెషనల్‌ అవసరాలకు ఉపయోగించే ఖాతాలు ఎలా కనిపిస్తున్నాయో చూసుకుంటూ ఉండటం, లింకులు సక్రమంగా తెరుచుకుంటున్నాయో లేదో పరిశీలించడం చేస్తుండాలి. ఒక్కోసారి సాంకేతిక సమస్యల వల్ల సరిగ్గా లింకులు ఓపెన్‌ కాకపోతే మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది!  

నమ్మకం పెంచుకునేలా..  

ప్రొఫైల్‌ను వీలైనన్ని చోట్ల వెరిఫై చేయించుకోవడం కూడా నమ్మకాన్ని చూరగొనేందుకు ఉపయోగపడుతుంది. అందులో వాడుతున్న భాష తప్పులు లేకుండా ఉండాలి. అలా తప్పులతో కూడిన ప్రొఫైల్స్‌ ఆసక్తిని తగ్గిస్తాయి, తక్కువ అభిప్రాయాన్ని కలిగిస్తాయి. చక్కని భాష వాడుతూ, ఎంత కావాలో అంతే పోస్ట్‌ చేస్తూ ఉండటం అవసరం. మార్కెట్‌ బజ్‌ వర్డ్స్‌ను ఉపయోగించుకుంటూనే మనకున్న నైపుణ్యాలను జోడించడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని