కోడ్‌ కూస్తే కొలువే!

ఆ రహస్యాన్ని ఛేదిస్తే ఉద్యోగ చదరంగంలో రాజును చేస్తుంది. చేతకాక తలపట్టుకుంటే బంటుగానూ తగవంటుంది. అందుకుంటే అందలం ఎక్కించి, అందుకోలేకపోతే అక్కడే ఉండమంటుంది.

Updated : 03 Apr 2024 00:53 IST

జాబ్‌ స్కిల్స్‌ -  2024

ఆ రహస్యాన్ని ఛేదిస్తే ఉద్యోగ చదరంగంలో రాజును చేస్తుంది. చేతకాక తలపట్టుకుంటే బంటుగానూ తగవంటుంది. అందుకుంటే అందలం ఎక్కించి, అందుకోలేకపోతే అక్కడే ఉండమంటుంది. కంప్యూటర్‌ లోకాన్ని శాసిస్తున్న ఆ నైపుణ్యం పేరు కోడింగ్‌. కంప్యూటర్‌  సామ్రాజ్యంలో సాఫ్ట్‌వేర్‌ క్షేత్రాలను ఏలాలంటే తప్పక ఎక్కవలసిన మెట్టు ఇది. ఒక్కోమెట్టు ఎక్కుతూ పైకి చూస్తుంటే ఇంకా ఎక్కవలసిన మెట్లు ఆకాశం వరకు   కనిపిస్తుంటాయి. ఎక్కిన మెట్టు లోతును బట్టీ, దక్కిన సామర్థ్యాన్ని బట్టీ ఏడాదికి లక్ష నుంచి కోటి రూపాయిల వరకు వేతనాన్నిచ్చే వరప్రదాయిని కోడింగ్‌.

మనకేం కావాలో కంప్యూటర్‌కు చెప్పే వారధి కోడింగ్‌. ఇది మన భావాలనూ, భాషనూ కంప్యూటర్‌కు చేర్చి అద్భుత ఫలితాలను రాబట్టే సామర్థ్యం. కోడింగ్‌ సామర్థ్యం దిగంతాలను కలిపే మహాసాగరం. ఎవరినైనా...ఏ విద్యానేపథ్యంతో వచ్చేవారినైనా కోడింగ్‌ సహస్ర బాహువులతో స్వాగతిస్తుంది. అయితే ఈ జలధిలో అడుగు పెట్టాలంటే కొన్ని కనీస నైపుణ్యాలుండాలి.

  •  గణితంపై కనీస అవగాహన అవసరం. గణాంకాలను చూస్తే నీరుకారిపోవడం కాక ఉత్సాహపడే స్వభావం ఉండాలి. మ్యాథ్స్‌ చూస్తే మైమరచి కాలాన్ని లెక్కచేయకుండా సమస్యల డొక్కచించగల హుషారుంటే మరీ మంచిది. అంకెల గమనాన్ని అర్థం చేసుకొని వాటివెంట పరుగెత్తగల సత్తా ఉన్నా చాలు.
  •  కోడింగ్‌ వైపు చూడాలంటే ఉండాల్సిన మరో లక్షణం- అంకెలు, సంఖ్యలను నిర్లిప్తంగా, నిస్తేజంగా చూడటం కాకుండా వాటి అమరిక వెనుక ఉన్న తార్కికతను పసిగట్టగలగాలి. 1, 2, 4, 8, 16, 32, 64, 128 ఈ వరుసను చూస్తే తెలిసిన అంకెలే కదా అనిపిస్తుంది. అయితే వీటిని యథాలాపంగా పేర్చుకుంటూ వెళ్లలేదు. ఒక అంకె నుంచి మరొక అంకె మధ్య ప్రయాణంలో ఒక లాజిక్‌ దాగి ఉంది. ప్రతి రెండు అంకెల మధ్య రెట్టింపు బలం పెరిగింది. ఈ అంకెల వరుస చూసీ చూడగానే వీటి వెనుక ప్రాతిపదిక తట్టినవారికే తార్కికంగా చూసే దృష్టి ఉన్నట్టు. ఈ లక్షణాలుంటే కోడింగ్‌ దిశగా అడుగులు వేయవచ్చు. ఈ కెరియర్‌ వైపు దృష్టి పెట్టవచ్చు.  
  • అనుసంధాన సంకేత భాష

ఒక ఉద్యోగం లేదా వృత్తిలో ఏం చేయాలో తెలుసుకుంటే ఏవిధమైన నైపుణ్యాలు సముపార్జించాలో తెలుస్తుంది. మనకూ కంప్యూటర్‌కూ మధ్య అనుసంధాన సంకేత భాషే కోడింగ్‌. మరయితే కోడింగ్‌లోకి అడుగుపెట్టినవారు ఏం చేయాలి?

  • మనకూ, కంప్యూటర్‌కూ మధ్య వారధిగా ఉపయోగపడేది బైనరీ సంకేత భాష. స్థూలంగా చెప్పాలంటే అంకెలలోని  0-1లను ఉపయోగిస్తూ వ్యక్తీకరించే గణిత పదభాష. డిజిటల్‌ సాంకేతికతకు మూలధాతువు.
  •  కావలసిన ఫలితాన్ని (టాస్క్‌) రాబట్టేందుకు గణిత భాషలో కొన్ని జతల ఆజ్ఞల (కమాండ్స్‌) రూపంలో ఇచ్చి సిస్టమ్‌ను ఆ దిశగా పనిచేయించి ఫలితాన్ని సాధించడాన్నే కోడింగ్‌ స్క్రిప్ట్‌ రాయడం అంటారు.

క్లుప్తంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించడం

వెబ్‌సైట్స్‌, మనం విస్తృతంగా వినియోగిస్తున్న మొబైల్‌ అప్లికేషన్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ వెనుక మౌనంగా, అవిశ్రాంతంగా పనిచేసేది కోడింగే. మనం ఓ చాయ్‌ తాగి పది రూపాయిలు మొబైల్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయడం వెనుక పనిచేస్తున్నది నిర్దిష్ట ఆదేశాలతో రూపొందించిన కోడింగే.  
ఇంతకీ కోడర్‌ చేయవలసిందేమిటి? అంటే కొత్తగా సాంకేతిక భాషలో కోడ్‌ రాయడంగానీ లేదా అప్పటికే రాసి ఉన్న కోడ్‌లో మార్పులు చేర్పులు చేయడంగానీ, కోడ్‌ను అన్ని కోణాలనుంచి ఆశించిన ఫలితాలు ఇస్తుందా అని పరీక్షించడం (టెస్టింగ్‌) గానీ చేయాలి. ఇవి కనీస బాధ్యతలయితే, విస్తృత ప్రయోజనం కలుగజేసే, విస్తృతంగా వినియోగించే పది కాలాల పాటు నిలబడే కోడింగ్‌ స్క్రిప్ట్‌ను అతి తక్కువ ఆదేశాల కమాండ్స్‌తో రాయగలిగే ఉద్యోగార్థిని కంపెనీలు నెత్తిన పెట్టుకుంటాయి. కళ్లు చెదిరే ప్యాకేజీలు ఇచ్చేది ఇటువంటి కోడింగ్‌ జాతిరత్నాలకే!  

పెరుగుదల ఏ రీతిలో?

నాస్కామ్‌ గణాంకాల ప్రకారం 2020 నాటికే దేశంలో 44 లక్షల మంది ఐటీ, ఐటీ ఆధారిత సేవారంగంలో పనిచేస్తున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అయితే, ఇక్కడ మనం గుర్తించాల్సింది - కోడింగ్‌ ఆధారిత పొజిషన్లు ఏటా ఏమేరకు పెరుగుతున్నాయన్నది.

  • కంప్యూటర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ -15%
  •  వెబ్‌ డెవలపర్‌- 11%
  •  కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అనలిస్ట్‌- 7%
  •  నెట్‌వర్క్‌ ఆర్కిటెెక్ట్‌- 5%
  •  డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌- 4%  

అంటే ఈమేరకు ఉద్యోగావకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఫ్రెషర్స్‌ పొజిషన్లలో దేనికి తమ నైపుణ్యం నప్పుతుందో, ఏది తమకు ఆసక్తిదాయకంగా ఉంటుందో ఆ  సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు.

కోడింగ్‌ ఆధారిత ఉద్యోగాలేమిటి?

కోడింగ్‌ స్క్రిప్ట్‌ రాసేవారిని సాఫ్ట్‌వేర్‌ నిపుణులుగా పేర్కొంటున్నప్పటికీ ఇందులో నాలుగైదు రకాల వేర్వేరు హోదాలున్నాయి. నైపుణ్యాన్ని బట్టి హోదా, హోదాను బట్టి వేతనాలుంటాయి.
కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌: ఈ కోవలో అగ్రభాగాన నిలిచే కొలువు ఇది. వ్యాపార, వాణిజ్యాల్లో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలిగేలా కోడింగ్‌

సవరణ/ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేసేవారిని ఈ హోదా వరిస్తుంది. తొలుత లభ్యమయ్యే పుష్కలమైన సమాచారాన్ని శోధించి ఆపై వ్యాపారాభివృద్ధికి దోహదం చేయగల కోడింగ్‌ను రచించగలిగే సామర్థ్యం అత్యుత్తమమైనది. ఉదాహరణకు దేశవ్యాప్తంగా వందలాది రిటైల్‌ స్టోర్స్‌ ఉన్న కంపెనీ లక్షలాది వినియోగదారుల వస్తు విక్రయ సమాచారాన్ని సూక్ష్మ పరిశీలన చేసి వారిద్వారా కంపెనీ కొత్త ఉత్పత్తులను కొనిపించే ఆఫర్లు సృష్టించగల సాఫ్ట్‌వేర్‌. దీన్ని రూపొందించే నిపుణునికి ఎంత విలువ ఉంటుందో చెప్పనవసరంలేదు.  

వెబ్‌ డెవలపర్‌: కోడింగ్‌ అంతర్లీనంగా ఉండే మరో హోదా ఇది. ప్రతి వ్యాపార, ప్రజా అవసరానికి వెబ్‌సైట్‌ అవసరమవుతున్న నేటి తరుణంలో వెబ్‌సైట్‌ రూపకల్పన గొప్ప సామర్థ్యం అనిపించుకోదు. వెబ్‌సైట్‌ను దర్శించే వినియోగదారునికి సౌకర్యవంతంగా ఉండేలా, పండిత- పామరులు వినియోగించుకునే వెసులుబాటుతో వెబ్‌సైట్‌ చేయడం వెనుక కోడింగ్‌ నైపుణ్యం ఇమిడి ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌పై ఎంతగా పట్టుంటే అంత సులభతరంగా ఉండేలా వెబ్‌సైట్‌ చేయగలుగుతారు.
నెట్‌వర్క్‌ ఆర్కిటెక్ట్‌: భారీ సంస్థల్లో, బహుళ ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థల్లో కంప్యూటర్ల వ్యవస్థ సంక్లిష్టంగా ఉంటుంది. వీటన్నింటినీ అనుసంధానిస్తూ, నియంత్రిస్తూ సంస్థ లక్ష్యాల దిశగా నడిపే నిపుణులే నెట్‌వర్క్‌ ఆర్కిటెక్ట్స్‌. విభిన్న నెట్‌వర్క్‌ను సంస్థ పనితీరుకు తగ్గట్టు ప్రోగ్రామింగ్‌ రూపకల్పన, అవసరమైనప్పుడు మార్పులు చేర్పులు, సైబర్‌ సెక్యూరిటీ లాంటి బాధ్యతలు మోసే వీరికి మంచి డిమాండ్‌ ఉంది.
కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అనలిస్ట్‌: ప్రతి కంపెనీలో ఐటీ ప్రొఫెషనల్స్‌, నాన్‌-ఐటీ ప్రొఫెషనల్స్‌ ఉంటారు. వీరిమధ్య సయోధ్య వాతావరణం కుదిర్చి వారధిగా వ్యవహరించేవారే కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అనలిస్ట్స్‌. సంస్థకు కావలసిన సరైన కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంపిక, అమలు, తగిన హార్డ్‌వేర్‌ ఏర్పాటు చేసి వ్యాపారపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించగల సామర్థ్యం ఉన్నవారిని ఈ పొజిషన్‌లో నియమిస్తారు.  
డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌: సమాచారమే సంపద సృష్టికి దారితీస్తున్న నేపథ్యంలో డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్లకు కంపెనీలు విలువ ఇస్తున్నాయి. సమాచార సేకరణ, నిర్వహణ, డేటా భద్రత డేటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్ల బాధ్యత. డేటా పరిరక్షణ, అవసరమైనప్పుడు సకాలంలో డేటాను అందుబాటులోకి తీసుకురావడం డి.బి.ఎ.ల కెరియర్‌ను ఉజ్వలం చేస్తున్నాయి.  


మెరుగుపరచుకునేదెలా?

1 స్వతస్సిద్ధంగా ఉండాల్సిన తార్కిక ఆలోచనా దృక్పథం, గణిత పరిజ్ఞానం, ఆసక్తి ఉంటే కోడింగ్‌ను నేర్చుకునేందుకు కొన్ని టెక్నాలజీ వేదికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే కాస్త నైపుణ్యం ఉండీ మెరుగుపరచుకునేందుకు దోహదపడేవి. మరికొన్ని కోడింగ్‌ను మొదటిమెట్టు నుంచీ నేర్చేవి.

2 గీక్స్‌ ఫర్‌ గీక్స్‌, లీట్‌కోడ్‌, హ్యాకర్‌ ర్యాంక్‌, కోడ్‌ షెఫ్‌, కోడ్‌ ఫోర్సెస్‌ వంటి సాంకేతిక వేదికలు కోడింగ్‌ నైపుణ్యాలకు మెంటర్స్‌లా ఉపయోగపడతాయి. కోడ్‌ టెస్టింగ్‌, కోడింగ్‌ చేసిన నమూనాను మెరుగుపర్చడం తదితర సామర్థ్యాలను పెంపొందించుకునే అవకాశం కల్పిస్తాయి. దీనితోపాటు ఐటీ ప్లేస్‌మెంట్స్‌లో టెక్నికల్‌ రౌండ్‌ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు సూచనలు అందిస్తాయి.
3 ఇప్పటికే కోడింగ్‌లో పట్టు తెచ్చుకున్న ఉద్యోగార్థులు తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకూ, కోడింగ్‌లో జాతీయస్థాయిలో తమ స్థాయి తెలుసుకునేందుకూ పోటీలునిర్వహించే సాంకేతిక వేదికలు- కోడ్‌ షెఫ్‌, కోడ్‌ ఫోర్సెస్‌. ఇవి నిర్వహించే పోటీల్లో పాల్గొనడంవల్ల ఉద్యోగార్థి తన స్థాయిని గుర్తించి ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవచ్చు.

4  కోడింగ్‌లో ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్వహించే పోటీల్లో పాల్గొనడంవల్ల మరొక ప్రయోజనం ఉంది. ఈ సంస్థలు ప్రకటించే మెరిట్‌ జాబితా ఆధారంగా కొన్ని కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌కి కూర్చున్నప్పుడు తన కోడింగ్‌ క్రెడిట్‌ను రెజ్యూమెలో పేర్కొనవచ్చు. ఇంకా కోడింగ్‌ టెస్ట్‌లో అగ్రభాగాన నిలిస్తే ఆ సంస్థలు ప్రకటించిన నగదు బహుమతినీ అందుకోవచ్చు.
5  కోడింగ్‌ అనేది ఒక సాంకేతిక నైపుణ్యంగా  కనిపిస్తున్నప్పటికీ ఇదొక ఆలోచనా సరళి. ఒక విషయాన్ని లోతుగా ఆలోచించడం, కళ్లకు కనిపిస్తున్న వాటి వెనుక నిక్షిప్తమైన తార్కిక ప్రాతిపదికను గుర్తించగలగడం, సమస్యా పరిష్కారం... ఇవన్నీ ఉన్న ఉద్యోగార్థులు కోడింగ్‌ సామర్థ్యాన్ని వేగంగా        అందిపుచ్చుకోగలుగుతారు.


దీంతో పాటు కోడింగ్‌ నైపుణ్యంలో ఉన్నతస్థాయికి చేరి ఎంతటి సంక్లిష్ట పరిస్థితులనయినా ఛేదించి ఐటీ ప్రొఫెషనల్‌ జాబ్‌ సాధించాలంటే నిర్దిష్ట సూత్రాలు గ్రహించాలి.కోడింగ్‌లో ఇమిడి ఉన్న సవాళ్లను తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి కొలువైనా సులువుగా దక్కుతుంది!  

- యస్‌.వి. సురేష్‌ సంపాదకుడు, ఉద్యోగ సోపానం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని