ప్రతినెలా స్టైపెండ్‌తో పరిశోధన కోర్సులు!

పరిశోధనలే ప్రగతికి సోపానం. చిన్న తరగతుల నుంచే విద్యార్థులను ఆ దిశగా సంసిద్ధులను చేయడానికి ప్రత్యేక సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.  ఇలా ఏర్పడినవాటిలో.. ఇండియన్‌  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు ముఖ్యమైనవి. పరిశోధనలతో కూడిన ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తోన్న ఇంటర్‌ విద్యార్థులు ఈ సంస్థలు అందించే కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

Published : 08 Apr 2024 00:10 IST

పరిశోధనలే ప్రగతికి సోపానం. చిన్న తరగతుల నుంచే విద్యార్థులను ఆ దిశగా సంసిద్ధులను చేయడానికి ప్రత్యేక సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.  ఇలా ఏర్పడినవాటిలో.. ఇండియన్‌  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు ముఖ్యమైనవి. పరిశోధనలతో కూడిన ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తోన్న ఇంటర్‌ విద్యార్థులు ఈ సంస్థలు అందించే కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. వీటిలో సీటు పొందినవారు ప్రతి నెలా స్టైపెండ్‌ అందుకోవచ్చు.

కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో తిరుపతి, బరంపురం, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురంలో ఐఐఎస్‌ఈఆర్‌లు నెలకొల్పారు. నాణ్యమైన బోధన, అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ, వసతి సౌకర్యాలు ఈ సంస్థల్లో పొందవచ్చు. ఇక్కడ ఐదేళ్ల వ్యవధి ఉండే బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో చేరినవారికి మొదటి రెండేళ్లు సైన్స్‌లో ప్రాథమికాంశాలు బోధిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఐదో సంవత్సరం ఆర్‌అండ్‌డి సంస్థలు, సైన్స్‌ అంశాలతో ముడిపడిఉన్న పరిశ్రమలను సందర్శిస్తారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండేళ్లు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలతోపాటు కొన్ని హ్యుమానిటీస్‌ కోర్సులు, ఆర్ట్‌, ఎర్త్‌సైన్స్‌లు అభ్యసిస్తారు. కోర్సు మొత్తం పది సెమిస్టర్లు.

ఇవీ కోర్సులు

బీఎస్‌-ఎంఎస్‌

బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్సెస్‌ / ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, జియలాజికల్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌.

బీఎస్‌ (భోపాల్‌లోనే)

ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), ఎకనామిక్స్‌ సైన్సెస్‌. వ్యవధి నాలుగేళ్లు. బీఎస్‌ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు. ఎకనామిక్స్‌ కోర్సులో చేరినవారు బీఎస్‌ తర్వాత మరో ఏడాది చదువు పూర్తిచేసుకుంటే ఎంఎస్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు.

బీఎస్‌-ఎంఎస్‌: ఐఐఎస్‌ఈఆర్‌: బరంపురం- 180, భోపాల్‌- 255, కోల్‌కతా- 250, మొహాలీ- 250, పుణె- 288, తిరుపతి- 275, తిరువనంతపురం- 320 సీట్లు ఉన్నాయి.
బీఎస్‌: ఇంజినీరింగ్‌ సైన్సెస్‌లో 84, ఎకనామిక్‌ సైన్సెస్‌లో 31.

ఏడు సంస్థల్లోనూ 1933 సీట్లను ఐఐఎస్‌ఈఆర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఐఏటీ) స్కోరుతో భర్తీ చేస్తారు.

ఐఏటీ ఇలా..

ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ ఒక్కో సబ్జెక్టులో 15 చొప్పున 60 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకూ 4 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లోఅడుగుతారు.

గత ఏడాది వరకు కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజనకు ఎంపికైనవారు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపినవారితో 25 శాతం సీట్లు భర్తీ చేసేవారు. మిగతా సీట్లను ఆప్టిట్యూడ్‌ టెస్టు ఆధారంగా నింపేవారు. ఈ ఏడాది నుంచి అన్ని సీట్లూ ఆప్టిట్యూడ్‌ పరీక్షలో ప్రతిభతోనే భర్తీ చేస్తారు.

సన్నద్ధత

  •  సిలబస్‌ వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వాటిని గమనించాలి.
  • ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ సిలబస్‌ నుంచే వస్తాయి. అందువల్ల వాటిని శ్రద్ధగా చదవాలి. ముందుగా ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవాలి.
  • సిలబస్‌ ప్రకారం పాఠ్యాంశాలు బాగా చదివిన తర్వాత, ఐఐఎస్‌ఈఆర్‌ పాత ప్రశ్నపత్రాలు అధ్యయనం చేయాలి. 2017 నుంచి 2023 వరకు వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న చాప్టర్లకు అధిక ప్రాధాన్యమివ్వాలి. అలాగే ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గమనించి సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి.
  • ఈఏపీసెట్‌, జేఈఈ మెయిన్స్‌, బిట్‌శాట్‌...తదితర ప్రశ్నపత్రాల అధ్యయనమూ ఉపయోగపడతుంది.
  • పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఫలితాలు విశ్లేషించుకుని, వెనుకబడిన అంశాలపై శ్రద్ధ పెట్టాలి.
  • రుణాత్మక మార్కులు ఉన్నాయి. అందువల్ల తెలియనివాటిని వదిలేయాలి.
  • ఐఐఎస్‌ఈఆర్‌ వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు అందుబాటులో ఉంచారు. సన్నద్ధత పూర్తయిన తర్వాత దాన్ని రాసి, జవాబులు సమీక్షించుకోవాలి.

ముఖ్య సమాచారం

అర్హత: ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపుతో 2022/ 2023లో 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55) శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారూ అర్హులే.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 13.
దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000
ఆప్టిట్యూడ్‌ పరీక్ష: జూన్‌ 9న.
వెబ్‌సైట్‌: www.iiseradmission.in/


ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), బెంగళూరు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించింది. ఉన్నత ప్రమాణాలకు ఈ సంస్థ చిరునామాగా నిలుస్తోంది. అత్యున్నత నిపుణులు, శాస్త్రవేత్తలతో బోధన, అధునాతన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఐఐఎస్సీ సొంతం. ఇక్కడ నాలుగేళ్ల బీఎస్సీ రిసెర్చ్‌ కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రపంచస్థాయిలో పేరున్న సంస్థల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఐఐఎస్సీలోనే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎమ్మెస్సీ డిగ్రీ పొందవచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్చు. ఈ సంస్థ అందిస్తోన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసెర్చ్‌) కోర్సుల్లోకి జాతీయ స్థాయిలో నిర్వహించే మేటి పరీక్షల్లో ప్రతిభ చూపినవారికి అవకాశం దక్కుతుంది.  

కోర్సు స్వరూపం

బీఎస్సీ రిసెర్చ్‌ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు అందరికీ ఉమ్మడిగా కొనసాగుతాయి. ఆ తర్వాత మూడు సెమిస్టర్లలో స్పెషలైజేషన్‌లో అధ్యయనం ఉంటుంది. నాలుగో సంవత్సరం పరిశోధన దిశగా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రొజెక్టులో లీనమవుతారు. కోర్సులో చేరినవాళ్లు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, మెటీరియల్స్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ వీటిలో ఏ సబ్జెక్టునైనా స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. అలాగే ఆసక్తి ప్రకారం కాంబినేషన్‌ కోర్సులు ఎంచుకోవచ్చు. అయితే విద్యార్థి అభిరుచితోపాటు మొదటి మూడు  సెమిస్టర్లలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన స్పెషలైజేషన్‌ కేటాయిస్తారు. నాలుగు కోర్సులను మేజర్‌, మైనర్‌ డిసిప్లిన్లుగా ఎంచుకోవాలి. ఇంజినీరింగ్‌ నుంచి ఒక ఎలెక్టివ్‌ కోర్సు, హ్యుమానిటీస్‌లో ఒక సెమినార్‌ కోర్సు తీసుకోవడం తప్పనిసరి. కోర్సు పూర్తయిన తర్వాత డిగ్రీలను అభ్యర్థులు తీసుకున్న మేజర్‌ డిసిప్లిన్‌ పేరుతో ప్రదానం చేస్తారు. కోర్సులోకి మొత్తం 111 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. మహిళలకు 10 శాతం సూపర్‌ న్యూమరరీ కోటా సీట్లు ఉంటాయి. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ట్యూషన్‌ ఫీజు కూడా నామమాత్రమే. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి ఏడాదికి రూ.పదివేలు. అలాగే స్కాలర్‌షిప్పులూ అందిస్తారు.

అర్హత: ఎంపీసీ గ్రూపుతో 2023లో ఇంటర్‌ పూర్తిచేసినవాళ్లు, 2024లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారు అర్హులు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లు తప్పనిసరిగా చదివుండాలి. ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు పాసైతే సరిపోతుంది.

ఎంపిక: పరీక్షలేమీ నిర్వహించరు. కేవీపీవై, జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌, నీట్‌ యూజీ- వీటిలో ఎందులోనైనా చూపిన ప్రతిభ ద్వారా సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది నుంచి ఐఐఎస్‌ఈఆర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టుతోనూ అవకాశం కల్పిస్తున్నారు. అభ్యర్థులు వీటిలో ఏదైనా స్కోరుతో ఐఐఎస్సీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు వెలువడనివాళ్లు హాల్‌టికెట్‌ వివరాలు అందిస్తే సరిపోతుంది. జేఈఈ మెయిన్‌ లేదా అడ్వాన్స్‌డ్‌ లేదా నీట్‌ యూజీ లేదా ఐఐఎస్‌ఈఆర్‌లో జనరల్‌ అభ్యర్థులైతే 60 శాతం, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలైతే 54 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు సాధించాలి. ఇలా కనీస మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 7.
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈబీసీలకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
వెబ్‌సైట్‌: https://bs-ug.iisc.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని