నిర్ణయాలు తీసుకునేముందు..

విద్యార్థులు.. ఉద్యోగులు.. సామాన్యులు.. ప్రముఖులు అనే తేడా లేకుండా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం అందరికీ ఎంతో అవసరం.

Published : 16 Apr 2024 00:03 IST

విద్యార్థులు.. ఉద్యోగులు.. సామాన్యులు.. ప్రముఖులు అనే తేడా లేకుండా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం అందరికీ ఎంతో అవసరం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వీటిని తీసుకోవాల్సిన సందర్భాలెన్నో ఎదురవుతుంటాయి. సరైన నిర్ణయం తీసుకోవడమనేది కత్తి మీద సాములాంటిదే. అన్నీ ఆలోచించి తీసుకుంటే అనుకున్నది సాధిస్తారు. అనాలోచితంగా తీసుకుంటే నష్టపోతారు. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దామా?

చిన్‌కి లెక్కలంటే చాలా ఇష్టం. పదో తరగతిలోనూ మంచి మార్కులు సంపాదించాడు. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ తీసుకోవాలనుకున్నాడు. కానీ లెక్కలంటే భయపడే స్నేహితులు వేరే గ్రూపులో చేరితే.. తను కూడా వాళ్లతో పాటు అదే గ్రూపులో చేరిపోయాడు.  

హర్షితకు సైన్స్‌ అంటే ప్రాణం. డాక్టర్‌ కావాలని ఆశపడేది. కానీ సైన్స్‌ గ్రూప్‌ తీసుకోవాలంటే పక్క ఊళ్లోని కాలేజీలో చేరాలి. రోజూ అంతదూరం ప్రయాణించడం కష్టమనే ఉద్దేశంతో తన నిర్ణయాన్ని అయిష్టంగానే మార్చుకుంది.

పరిస్థితుల ప్రభావంతో మరో ఆలోచన లేకుండా తమ నిర్ణయాలను మార్చేసుకునేవాళ్లు ఎందరో ఉంటారు. కానీ ఇలాంటప్పుడు కూడా తార్కికంగా ఆలోచించి సరైన దారిలో ప్రయాణిస్తే.. ఆ తర్వాత అసంతృప్తితో ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.

  • కొంతమంది విద్యార్థులకు అతి విశ్వాసం ఉంటుంది. తెలివితేటలు, పరిజ్ఞానం, పనితీరుల మీద నమ్మకం ఉండటంలో తప్పులేదు. కానీ వాటిని కాస్త ఎక్కువగా ఊహించుకుని నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు.  అవగాహన లేమి, అతి విశ్వాసం, అత్యుత్సాహంతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ సత్ఫలితాలను ఇవ్వవు.
  • అనాలోచిత నిర్ణయాల వెనుక కొన్ని ప్రమాదాలూ పొంచివుంటాయి. ఉదాహరణకు తక్కువ సమయంలోనే కాలేజీకి వెళ్లాలనే తొందరలో అతి వేగంగా బైక్‌ నడపాలని నిర్ణయించుకున్నారనుకుందాం. దీనివల్ల ప్రమాదాల బారినపడే అవకాశం లేకపోలేదు.  
  • సరైన దిశగా ఆలోచించడం వల్ల చక్కని నిర్ణయాలు పుట్టుకొస్తాయి. విద్య, ఉద్యోగాల విషయంలో నిర్ణయానికి వచ్చే ముందు లాభనష్టాల గురించి ఆలోచించాలి.
  • అయితే అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుందిగానీ తగ్గదని గుర్తుపెట్టుకోవాలి.
  • గతంలో చేసిన తప్పులూ, పొరపాట్ల ప్రభావం భవిష్యత్తు నిర్ణయాల మీదా పడుతుంది. ఉదాహరణకు గతంలో పునశ్చరణకు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదనుకున్నారు. కానీ దాని వల్ల సత్ఫలితాలు పొందలేకపోయారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
  • ప్రతిరోజూ సంతోషంగానే గడవదు. కొన్ని సందర్భాల్లో ఆనందంగా, మరికొన్నిసార్లు విచారంగానూ ఉండటం సహజం. అలాగే ఏ ఒక్కరూ భావోద్వేగాలకు అతీతులూ కారు. అయితే విచారం, దుఃఖం, ఆందోళన, ఒత్తిడి, నిరాశ.. లాంటి భావోద్వేగాలకు గురైనప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సత్ఫలితాలను ఇవ్వవు. మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే నిదానంగా ఆలోచించి నిర్ణయానికి రావాలి.
  • కొన్ని సందర్భాల్లో.. మీరొక సమస్యతో సతతమతం అవుతూ ఎటూతేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నారనుకుందాం. అలాంటప్పుడు అదే స్థితిలో ఉన్న స్నేహితులకు మీరెలాంటి సలహా ఇస్తారో ఒకసారి ఆలోచించాలి. అదే సూచనను మీ విషయంలోనూ పాటించాలి. ఇలాచేస్తే ఒక నిర్ణయానికి రావడం సులువవుతుంది.
  • ప్రతికూల ఆలోచనలు  నిర్ణయానికి రావడానికి అవరోధంగా మారతాయి. ‘స్టేజి మీద మాట్లాడలేను. బృంద చర్చల్లో పాల్గొని.. అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించలేను..’ అంటూ ప్రతికూలంగా ఆలోచిస్తే.. అదే నమ్మకం మనసులో స్థిరపడిపోతుంది. ఈ విషయంలో నిర్ణయాన్ని మార్చుకోలేకపోవచ్చు. అలా కాకూడదంటే ఆశావహ దృక్పథంతో ఆలోచించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని