రాబోయే రోజుల్లో.. నియామకాల జోరు!

ఉద్యోగ నియామకాలు 2009లో తగ్గినా అది తాత్కాలికమే అయింది. 2015లో మరోసారి ఇవి మందగించినా అదీ కొంతకాలమే. ఇప్పుడు 2024లోనూ రిక్రూట్‌మెంట్లు నెమ్మదించాయి.

Published : 17 Apr 2024 00:06 IST

జాబ్‌ స్కిల్స్‌ - 2024

ఉద్యోగ నియామకాలు 2009లో తగ్గినా అది తాత్కాలికమే అయింది. 2015లో మరోసారి ఇవి మందగించినా అదీ కొంతకాలమే. ఇప్పుడు 2024లోనూ రిక్రూట్‌మెంట్లు నెమ్మదించాయి.
గత అనుభవాలను బట్టి ఈ స్థితి కూడా కొద్ది నెలలే అని భావించవచ్చు. అందుకే రాబోయే రోజుల్లో కొలువుల జోరు ఊపందుకుంటుందని అంచనా. దీనికోసం  అన్నిరకాలుగా సిద్ధం అవటం అభ్యర్థుల కర్తవ్యం!

సీజన్‌ క్యాంపస్‌ నియామకాలు ఏమంత ఆశాజనకంగా లేవు. ఏటా ఈపాటికి ప్రాంగణ నియామకాలు ముగింపు దశకు చేరుకునేవి. కానీ ఈ సంవత్సరం పావు శాతం కూడా పూర్తి కాలేదు. ప్రతి సంవత్సరం వచ్చే కంపెనీలు ఈసారి ముఖం చాటేయగా దిగ్గజ సంస్థలు మాత్రం పాలపై మీగడను తీసుకునేందుకు వచ్చినట్టు గుప్పెడు మందిని ఎంచుకుని, చప్పుడు కాకుండా వెళ్లిపోయాయి. వేలమంది ఉద్యోగార్థులు రేపోమాపో కంపెనీలు వస్తాయని ఇంకా ఎదురుచూస్తున్నా వారి నిరీక్షణ ఫలించే అవకాశాలున్నాయని చెప్పలేము.

ఎందుకీ పరిస్థితి?

ఐటీ పరిశ్రమలో ప్రతి ఐదారేళ్లకు ఒకసారి ఇటువంటి పరిస్థితి వస్తుంటుంది. కొత్త నియామకాల రీత్యా స్తబ్ధత ఆవరిస్తుంటుంది. 2009లో ఇలాగే తాజా నియామకాల్లో మంద గమనం సాగింది. మళ్లీ 2015లో ఇదేవిధంగా నియామకాలపట్ల నిరాసక్తత చూపాయి. ఇదే ధోరణి 2024లో పునరావృతమైంది. అయితే రిక్రూట్‌మెంట్‌ ఏటా రివ్వున సాగుతుండగా ఉన్నట్టుండి ఎందుకిలా ఐదారేళ్లకు బ్రేక్‌ పడుతుంటుందన్నది ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న. ఐటీ పరిశ్రమ తిరోగమనానికి ఇదేమైనా సంకేతమా? అన్న సందేహం వస్తుంటుంది. ఐటీ పరిశ్రమకు ఎటువంటి ఢోకా లేదు కానీ, ఈ స్థితిని స్థిరీకరణ (కన్సాలిడేషన్‌) అంటున్నారు.  

పరుగుపందెంలో గాలికంటే వేగంగా పరుగెడుతున్న క్రీడాకారుడు అక్కడక్కడా లిప్తపాటు ఆగి... ఊపిరి తీసుకొని మరుక్షణం లక్ష్యం వైపు దూసుకెళతాడు. సరిగ్గా ఇలాగే ఐటీ రంగం ఐదారేళ్లకు ఒకసారి ప్రస్తుత భవిష్యత్‌ అవసరాలు, సిబ్బంది లభ్యతలను సరిచూసుకుంటుంది. 2009, 2015ల్లో జరిగింది ఇదే. అధిక ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయనో, కొత్త ప్రాజెక్టులు పుష్కలంగా వస్తాయనో అంచనా వేసి ఐటీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా నియామకాలు చేసుకున్నాయి. అయితే ఆ తర్వాత ప్రాజెక్టులపరంగా అనుకున్నంత ఊపు రాకపోవడంతో తర్వాతి సంవత్సరాల్లో నియామకాల వేగాన్ని కాస్త తగ్గించారు. ఆ తర్వాత మళ్లీ జోరందుకుంది. అంటే రిక్రూట్‌మెంట్ల వేగం తగ్గడం తాత్కాలికమేనని గుర్తించాలి. మంచి కాలం ముందుందని గత అనుభవాలు నిరూపించాయి.

తిరుగులేని ఐటీ

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం పరుగులు పెడుతూనే ఉంటుందనడానికి బలమైన తార్కాణం ఉంది. ఈ రంగం తన సహస్ర బాహువులతో ఏటా కొత్త రంగాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే విస్తరించిన జీవన రంగాల్లో నూతన సరిహద్దులు తాకుతోంది. దూరంగా ఉన్న రంగాలను దగ్గరగా తీసుకుంటోంది. ఐటీ శక్తితో సంపన్నమైన రంగాలు ద్విగుణీకృత ఉత్సాహంతో మరింతగా టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. మొత్తమ్మీద దేశ ఐటీ రంగం ‘తగ్గేదేలే’ అన్నట్టు దూసుకుపోతోంది.

ఈ సంవత్సరంలో మందగించిన నియామకాలు 2025లో తేరుకొని, 2026లో ‘ఫుల్‌ జోష్‌’లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. అందువల్ల 2024 బ్యాచ్‌ కాస్త ఇబ్బంది పడుతున్నా 2025 బ్యాచ్‌ల పరిస్థితి మెరుగై, 2026 బ్యాచ్‌కి పూర్వ వైభవం వస్తుందని ప్రాంగణ నియామక అధికారులు భావిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో జరిగిన రెండు, మూడు పరిణామాలు 2024 నియామకాల సర్దుబాటుకు కారణంగా చెబుతున్నారు. కొవిడ్‌ దీర్ఘ కాలం కొనసాగుతుందని అంచనా వేసిన ఐటీ పరిశ్రమ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పని విధానాన్ని కొనసాగించాలనుకుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా కార్యాలయ మౌలిక వసతులపై తగ్గిన వ్యయాన్ని అదనపు ఉద్యోగులను నియమించడంలో కంపెనీలు వెచ్చించాయి. అదేసమయంలో హెల్త్‌ కేర్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలనుంచి వస్తున్న కొత్త ప్రాజెక్టులకోసం నియామకాల్లో దూకుడు ప్రదర్శించాయి. ఆ తర్వాత మూడేళ్ల పాటు సాధారణస్థాయి ప్రాంగణ నియామకాలు యథావిధిగా కొనసాగాయి. కొవిడ్‌ అనంతరం ఇప్పుడిక మార్కెట్‌ పూర్తిగా సాధారణస్థితికి చేరుకోవడంతో కొన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి స్వస్తి పలికితే చాలా సంస్థలు వారంలో కొన్నిరోజులు ఇంటినుంచీ, పరిమిత రోజులు కార్యాలయం నుంచీ పనిచేసే ‘హైబ్రిడ్‌’ పద్ధతిలోకి మారిపోయాయి. మరోపక్క కొత్త ప్రాజెక్టులను పంచుకునే కంపెనీలు ఎక్కువయ్యాయి. దీంతో 2024 ఏడాదిని కంపెనీలు సిబ్బంది సర్దుబాటు సంవత్సరంగా పరిగణిస్తున్నాయి. అందుకే సంస్థలు క్యాంపస్‌లను సందర్శించే ఉద్ధృతి తగ్గింది.

ముందుంది మంచికాలం

ఐటీ స్పర్శతో వివిధ జీవన రంగాలు నవచైతన్యంతో కళకళలాడుతున్నాయి.  

  • దేశంలో ఎలక్ట్రానిక్‌ వెహికిల్స్‌ (ఈవీ) అమ్మకాలు శరవేగంగా పెరుగుతున్నాయి. 2022-2023 సంవత్సరాల మధ్య దేశంలో ఈవీల అమ్మకాలు ఏటా 49% చొప్పున పెరుగుతూ వెళతాయని 2023 ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2023 సంవత్సరానికి దేశంలో కోటి వాహనాలు అమ్ముడవుతాయని వెల్ల్లడించింది. ఈ ఉత్సాహంతో దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీలు ఉరకలేస్తున్నాయి. దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు ఈవీల తయారీ, ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. సువిశాలమైన మైదానంలా ఉన్న ఈవీ మార్కెట్‌లో బలమైన వాటాతో పోటీదారులకు అందనంత ఎత్తులో తమ కోటలను నిర్మించాలని పరుగులు పెడుతున్నాయి. దీని ప్రభావం ప్రాంగణ నియామకాలపై ప్రస్ఫుటంగా ఉంటుంది. ఇప్పటివరకూ ఆటోమొబైల్‌ కంపెనీలు మెకానికల్‌, ఆటోమొబైల్‌ బ్రాంచ్‌లË తాజా అభ్యర్థులను రిక్రూట్‌మెంట్‌ డ్రైౖవ్‌లో ఎంపిక చేసుకుంటుండగా వారితోపాటు ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ విద్యార్థులకోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నాయి. ఎలక్ట్రికల్‌ నేపథ్యంతో సాంకేతిక, ఉద్యోగ నైపుణ్యాలున్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రాబోయే మూడేళ్లు ఈ మూడు బ్రాంచ్‌ల విద్యార్థుల అవసరం ఆటోమొబైల్‌ పరిశ్రమకు బాగా ఉంటుంది.
  • సెమీ కండక్టర్స్‌ తయారీ రంగం నిశ్శబ్ద విప్లవంలా విస్తరిస్తోంది. ప్రస్తుతం రాజ్యమేలుతున్న ఎలక్ట్రానిక్‌ చిప్స్‌కి సెమీ కండక్టర్‌ గుండెకాయ వంటిది. ఎలక్ట్రానిక్‌ మాడ్యూల్స్‌లో విద్యుత్‌ ప్రవాహాన్ని అజమాయిషీ చేసే సెమీ కండక్టర్స్‌ కొరత అన్ని పరిశ్రమలనూ వెంటాడుతోంది. 2023లో సెమీ కండక్టర్స్‌ లభ్యత సజావుగా లేక దేశీయ ఆటోమొబైల్‌ రంగం విలవిల్లాడింది. కార్ల డెలివరీలకోసం వినియోగదారులు నెలల తరబడి వేచి చూడాల్సివచ్చింది. దేశంలో సెమీ కండక్ట్టర్స్‌ పరిశ్రమ 2023- 2032 సంవత్సరాల మధ్యకాలంలో 20 శాతం వృద్ధిరేటుతో పరుగెడుతోంది. మార్కెట్‌లో సెమీ కండక్టర్స్‌ కొరత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. కొత్త కంపెనీలు ఊపిరి పోసుకుంటున్నాయి. దీని ప్రభావం ప్రాంగణ నియామకాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈసీఈ బ్రాంచ్‌లో కాస్త కోడింగ్‌ (ప్రోగ్రామింగ్‌) తెలిసిన మెరికల్లాంటి విద్యార్థులను కంపెనీలు వెంటబెట్టుకు వెళుతున్నాయి. ఇతర బ్రాంచ్‌ల విద్యార్థులకు ఐదారు లక్షల రూపాయిల ప్యాకేజీ ఇవ్వడం కష్టమవుతున్న సమయంలో 24 లక్షల రూపాయిల ప్యాకేజీని ఆఫర్‌ చేస్తున్నాయి. అది కూడా మధ్యస్థాయి సెమీ కండక్టర్‌ సంస్థలే. పెద్ద కంపెనీలు ఆఫర్‌ చేసే ప్యాకేజీల బరువు ఇంకా ఎక్కువేనని చెప్పనవసరం లేదు.  
  • నాలుగేళ్ల కిందట కొవిడ్‌ సంక్షోభంతో ఆకాశాన్నంటిన ఆరోగ్యరంగం అక్కడినుంచి దిగకుండా చూసుకునేందుకూ, ఆరోగ్య పరిరక్షణను ఆనందదాయకం చేసేందుకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఊతంగా చేసుకుంటోంది. బైపాస్‌ సర్జరీలు సునాయాసంగా చేయగలగడం, మోకాలు కీళ్ల మార్చిడి ఏ బాధా లేకుండా తేలిగ్గా ముగించడం వంటివి రోబోటిక్‌, ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యమవుతున్నాయి. ఏటా 22% వృద్ధిరేటుతో ఎదుగుతున్న ఆరోగ్యరంగంలో ఐటీ వినియోగం పెరగడంతో నియామకాలు ఊపందుకున్నాయి. సైన్స్‌ నేపథ్యం గల విద్యార్థులను మాత్రమే కాకుండా కోడింగ్‌ వంటి ఐటీ నైపుణ్యాలున్నవారిని రిక్రూట్‌ చేసుకోవడంపై ఈ రంగం ఆసక్తి చూపుతోంది. ఈ ఏడాదిలోనూ మెరుగ్గా ఉన్న ఆరోగ్య రంగ నియామకాలకు వచ్చే మూడేళ్లపాటు ఎటువంటి ఢోకా ఉండదని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.

ఏ నైపుణ్యాలతో సిద్ధంగా ఉండాలి?

ఈ సంవత్సరం కాస్త మందగించినా రాబోయే రెండేళ్లలో పుంజుకునే నియామకాల Ëకోసం ఎలాంటి నైపుణ్యాలతో సిద్ధంగా ఉండాలన్నది ప్రధానం. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మారుతున్న నేపథ్యంలో తగిన నైపుణ్యాలతో స్థిరంగా ఉంటేనే రాబోయే అవకాశాలు అందుకోవచ్చు.

స్తబ్ధంగా ఉన్న ప్రస్తుత రోజులు త్వరలోనే ముగుస్తాయి. నియామకాల రీత్యా మంచిరోజులు రాగానే ఉన్నత అవకాశాలు అందుకునేందుకు ఉద్యోగార్థులు సన్నద్ధంగా ఉండాలి. రిక్రూట్‌మెంట్ల రీత్యా మహర్దశను అందుకునేందుకు ఉద్యుక్తులు కావాలి.

యస్‌.వి.సురేష్‌, సంపాదకుడు-ఉద్యోగ సోపానం

  • సొంత డొమైన్‌లో పటిష్ఠంగా ఉండటం పదేపదే చెప్పే విజయ సూత్రం. ఈ నైపుణ్యం లేనిదే మరిన్ని అదనపు హంగులున్నా అన్నీ బలాదూరే. అందుకే ఎంపికల్లో అగ్రతాంబూలం డొమైన్‌ పరిజ్ఞానానికే.
  • తాజా టెక్నాలజీ నైపుణ్యాలపై అవగాహన ఉండాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతపై ప్రాజెక్టు వర్క్‌ చేస్తే.. నియామకాల్లో ప్రాధాన్యం లభిస్తుంది.
  • సాఫ్ట్‌ స్కిల్స్‌ను ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. కమ్యూనికేషన్‌, ప్రజెంటేషన్‌ నైపుణ్యాలను అలవర్చుకోవాలి. ఎంపిక సమయంలో ఇవి అభ్యర్థులకు కవచంగా ఉపయోగ
  • పడతాయి.
  • ఐక్యూని ప్రతిబింబించే అకడమిక్‌ రికార్డుతోపాటు ఎమోషనల్‌ కోషెంట్‌ ను ప్రతిఫలించే విజయకాంక్షను పెంచుకునే మార్గాలు చూసుకోవాలి. ఇప్పటికే ఎంపికైన సీనియర్ల విజయగాధలు ఇందుకు దోహదం చేస్తాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని