సుపరిపాలనే ఆదిత్య హృదయం!

ఐఐటీ చదువు, కార్పొరేట్‌ కంపెనీ కొలువు.. ఏవీ తనకు సంతృప్తి ఇవ్వలేదు.. చుట్టూ ఉన్న సమాజానికి ఏదో చేయాలనే తపన, దేశంలో అట్టడుగున ఉన్న ప్రతి పౌరుడికీ ప్రభుత్వం నుంచి సుపరిపాలన అందించాలనే తాపత్రయం..

Updated : 22 Apr 2024 04:33 IST

సివిల్స్‌ ఆలిండియా టాపర్‌ వాయిస్‌

ఐఐటీ చదువు, కార్పొరేట్‌ కంపెనీ కొలువు.. ఏవీ తనకు సంతృప్తి ఇవ్వలేదు.. చుట్టూ ఉన్న సమాజానికి ఏదో చేయాలనే తపన, దేశంలో అట్టడుగున ఉన్న ప్రతి పౌరుడికీ ప్రభుత్వం నుంచి సుపరిపాలన అందించాలనే తాపత్రయం.. వెరసి యూపీఎస్‌సీ పరీక్ష వైపు అడుగులు వేశారు. మొదటిసారి ప్రిలిమ్స్‌ దశలోనే వైఫల్యం, అయినా పట్టువీడలేదు. రెండోసారి ఐపీఎస్‌కు ఎంపికైనా, తాను కన్న ఐఏఎస్‌ కలను మూడో ప్రయత్నంలో సాకారం చేసుకున్నారు లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఈ ప్రయాణం ఎలా సాగిందో ‘ఈనాడు’తో వివరించారిలా..

చిన్ననాటి నుంచి లఖ్‌నవూలోనే చదువుకున్నా, నాన్న కాగ్‌లో పనిచేస్తున్నారు. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. ఇంటర్‌ తర్వాత ఐఐటీ కాన్పూర్‌లో ఇంజినీరింగ్‌ సీటు రావడంతో అక్కడకు వెళ్లాను. బీటెక్‌లో 9.7, ఎంటెక్‌లో 10 గ్రేడ్‌ పాయింట్లతో చదువు పూర్తిచేశాను. ఎలక్ట్రానిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కూడా వచ్చింది. పట్టా పుచ్చుకుంటూనే గోల్డ్‌మన్‌ సాచెస్‌ సంస్థలో నెలకు రెండున్నర లక్షల రూపాయల జీతంతో మంచి కొలువు దొరికింది. దీంతో అందులో పనిచేసేందుకు బెంగళూరు వెళ్లాను. అక్కడ పరిస్థితులు అంతా బాగున్నాయి, ఉన్నతశ్రేణి విధులు నిర్వహించాను. అయినా నాలో ఏదో అసంతృప్తి, ఇంతకంటే మెరుగ్గా ఏదైనా చేయాలనే ఆలోచన కలిగింది. ప్రజల కోసం పని చేయాలనే ఆశ, క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరికీ సుపరిపాలన ఫలాలు అందాలనే ఆకాంక్ష నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. పేదలనూ, వెనుకబడిన వర్గాల వారినీ ఆదుకోవాలి అనిపించింది. అప్పుడే ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీఎస్‌సీ పరీక్షలకు చదవాలనుకున్నా. ఇంట్లోవారు మొదట ఆ నిర్ణయం గురించి విని చాలా కంగారుపడ్డారు. అప్పుడే స్థిరపడ్డ జీవితాన్ని మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడం ఏమిటని అనుకున్నారు. కానీ నా పట్టుదల చూశాక ఒప్పుకొని ప్రోత్సహించారు.వారి అంగీకారంతో ఇక యూపీఎస్‌సీ సన్నద్ధతలో పడ్డాను.

  • నేను ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. ప్రాథమికకాం శాల నుంచి సొంతంగా చదువుకున్నాను. ఇద్దరు మెంటర్స్‌ సహాయంతో పరీక్ష గురించి తెలుసుకుంటూ సన్నద్ధమయ్యాను. ఒకవైపు పాఠ్యపుస్తకాలు చదువుతూనే మరోపక్క నమూనా పరీక్షలు రాశాను. అక్టోబర్‌ 2020 నుంచి సన్నద్ధత మొదలుపెట్టి 2021లో మొదటిసారి ప్రయత్నించాను. కానీ అప్పుడు ప్రిలిమ్స్‌ కూడా దాటలేదు. కేవలం 85 మార్కులు రావడంతో మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయాను. కానీ ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. హార్డ్‌వర్క్‌తోపాటు స్మార్ట్‌వర్క్‌ చేయడం మొదలుపెట్టాను. విభిన్న రకాలైన టెస్ట్‌ సిరీస్‌లు రాశాను. ఒక టాపిక్‌ రాకపోతే ఎన్ని గంటలైనా కానీ దాని మీదే కూర్చునేవాడిని. ప్రిలిమ్స్‌ మీద బాగా దృష్టిపెట్టడంతో రెండోసారి 114 మార్కులతో మెయిన్స్‌, ఇంటర్వ్యూలకూ అర్హత సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. రెండోసారి లక్ష్యానికి చేరువగా వచ్చినా నేను అనుకున్న ఐఏఎస్‌ మాత్రం చేజారింది.

  • ప్రస్తుతం హైదరాబాద్‌లోని అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణ తీసుకుంటున్నాను. అయితే నా అసలైన లక్ష్యం ఐఏఎస్‌ కావడంతో మరోసారి ప్రయత్నించాలి అనుకున్నా. ముస్సోరిలో ప్రాథమిక శిక్షణ సమయంలో మూడో ప్రయత్నానికి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రాసేశాను. హైదరాబాద్‌ వచ్చాక వారాంతాల్లో చదువుతూ ఇంటర్వ్యూకు హాజరయ్యా. ముఖాముఖి తర్వాత కచ్చితంగా ఈసారి ముందుకంటే మెరుగైన ఫలితం వస్తుందనుకున్నా. టాప్‌ 20లో ఉంటానని అనుకున్నానే గానీ ఏకంగా ఆలిండియా మొదటి ర్యాంకు వస్తుందని మాత్రం ఊహించలేదు. ఫలితాలు వచ్చాక చాలా సంతోషంగా అనిపించింది. మొదటి నుంచి సమాజానికి మంచి చేయాలనే ఆలోచన ఉండేది. ప్రజలకు సేవ చేసే అదృష్టం అందరికీ కలగదు, నాకు ఆ అవకాశం రావడం చాలా సంతోషం. ఇంటర్వ్యూలో నా హాబీల గురించి ఎక్కువగా అడిగారు. డైనోసార్ల అంతర్ధానం, వాటి గురించి సాంకేతికంగా మాట్లాడారు. ప్యానెల్‌ స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే నా గురించి లోతుగా తెలుసుకుంది.

  • రోజుకు ఇన్ని గంటలు చదవాలి అని నియమాలేవీ పెట్టుకోలేదు. ఎంత సమయం పట్టినా సరే డైలీ టార్గెట్స్‌ పూర్తిచేసేవాణ్ని. వ్యాసాలు రాసేటప్పుడు వాక్యనిర్మాణం ఎలా ఉండాలో బాగా తెలుసుకున్నాను. మిగతా టాపర్లు ఎలాంటి పుస్తకాలు చదువుతారో నేను కూడా అవే చదివాను, వేరే ఏవిధమైన ప్రత్యేకతలూ నాలో లేవు. కేవలం మన సన్నద్ధతలో స్థిరత్వం, వ్యక్తిత్వంలో నిజాయతీ, సమాధానాల్లో ముక్కుసూటితనం మిగతావారికంటే మనల్ని భిన్నంగా నిలబెడతాయి. ఎవరైనా యూపీఎస్‌సీ పరీక్షలో విజయం సాధించవచ్చు, ప్రయత్నలోపం లేకుండా కష్టపడితే చాలు!

సడలని సంకల్పంతో..

టాపర్‌గా నా స్కోరు 54.27 శాతం వచ్చింది. మెయిన్స్‌ పరీక్షలో 1750 మార్కులకు 1099 వచ్చాయి. స్థిరత్వం (కన్సిస్టెన్సీ) అనేదే యూపీఎస్సీ ప్రిపరేషన్‌ మంత్రం. నిరంతర ప్రేరణ ఉండాలి, ఎక్కడా సంకల్పం సడలకూడదు. యుద్ధంలో వ్యూహం ఎంత ముఖ్యమో ఈ సన్నద్ధతలో ప్రణాళిక కూడా అంతే ముఖ్యం. అనుకున్న ప్లాన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకోకూడదు, ఒకవేళ అది తగిన ఫలితాలను ఇవ్వలేదనుకుంటే మళ్లీ ఆలోచించి వ్యూహాత్మకంగా ప్రణాళిక రచించుకోవాలి. అభ్యర్థులు అందరూ అవే పుస్తకాలు చదువుతారు, కానీ ఎలా చదువుతున్నాం అనే దానిలోనే ఉంది- మ్యాజిక్‌ అంతా! ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో కూడా వీలైనన్ని నమూనా మౌఖిక పరీక్షలకు (మాక్‌ ఇంటర్వ్యూలు) హాజరు కావాలి. అప్పుడే మనం ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలో తెలుస్తుంది.
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ నాకు అత్యంత ఆసక్తి కలిగిన సబ్జెక్టు కావడంతో ఆప్షనల్‌గా దాన్నే ఎంచుకున్నాను. అభ్యర్థులు ‘ఈ సబ్జెక్టు అయితే స్కోరింగ్‌కు అవకాశాలు ఎక్కువ, మరో సబ్జెక్టు అయితే సులభం’ అనుకోకుండా మొదటి నుంచి దేనిలో పట్టు ఉంటే ఆ సబ్జెక్టులోనే ప్రయత్నించాలి. విజయావకాశాలను ఎంతగానో ప్రభావితం చేసే ఆప్షనల్‌ విషయంలో పొరపాట్లు చేయకూడదు. 2022లో ఐపీఎస్‌కు ఎంపికైనా.. తిరిగి ఐఏఎస్‌కు ప్రయత్నించడానికి కారణం ఇలాంటి ఆలోచనా ధోరణే. మనకు వచ్చింది చేయడం కాదు, నచ్చినదాని కోసం పోరాడాలి! యూపీఎస్‌సీ సన్నద్ధతలో మన తప్పులే మనకు ప్రధానమైన పోటీదారులు. వాటిని ఎంతగా ఓడిస్తే (తగ్గించుకుంటే).. అంతగా విజయావకాశాలు మెరుగుపడతాయి.  నా ప్రయత్నం అంతా ప్రజల కోసం పనిచేయాలనే! ఈ ఐఏఎస్‌ ప్రయాణం మొదలైన కొత్తలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు పక్కాగా అందేలా చూస్తాను. తర్వాత నేనే వారికి అన్ని విధాలా అనుకూలమైన విధానాలు తీసుకొచ్చే స్థాయికి వెళ్లాలని  ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా చిన్నారుల ఆరోగ్యం, విద్య కోసం కృషి చేయాలనేదే నా సంకల్పం!

చంద్రమౌళిక సాపిరెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని