కెరియర్‌లో గేమ్‌ ఛేంజర్‌

చాలాకాలం తర్వాత ఈమధ్యే క్యాంపస్‌ నియామకాల జోరు పెరిగింది. గ్రాడ్యుయేషన్‌ ఆఖరి సంవత్సరం నుంచే విద్యార్థులు అటు ఉద్యోగాలు చేస్తూ, ఇటు సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్న సందర్భాలు బోలెడు. అయితే చిన్న వయసు నుంచే కెరియర్‌ ప్రారంభించడంఅనేక ప్రయోజనాలతోపాటు సవాళ్లనూ తీసుకొస్తుంది.

Updated : 30 Apr 2024 00:51 IST

చాలాకాలం తర్వాత ఈమధ్యే క్యాంపస్‌ నియామకాల జోరు పెరిగింది. గ్రాడ్యుయేషన్‌ ఆఖరి సంవత్సరం నుంచే విద్యార్థులు అటు ఉద్యోగాలు చేస్తూ, ఇటు సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్న సందర్భాలు బోలెడు.

అయితే చిన్న వయసు నుంచే కెరియర్‌ ప్రారంభించడంఅనేక ప్రయోజనాలతోపాటు సవాళ్లనూ తీసుకొస్తుంది. ముఖ్యంగా కాలేజీ నుంచి ఆఫీసు వాతావరణానికి మారడంలో అభ్యర్థులు కొంత గందరగోళానికి గురవుతుంటారు.

మరి కొత్తగా ఇలా ఉద్యోగాల్లోకి వెళ్లే వారు అక్కడ తమకంటూ ఒక ఇమేజ్‌ను ఎలా ఏర్పరుచుకోవాలి? విజయవంతమైన ఉద్యోగిగా ఎలా నిలబడాలి? తమను తాముఎలా ప్రొజెక్ట్‌ చేసుకోవాలి?.. చూద్దామా!

కప్పుడు పర్సనల్‌ బ్రాండింగ్‌ ఉంటే బాగుంటుంది అనుకునేవారు.. కానీ ప్రస్తుత సామాజిక మాధ్యమాల కాలంలో ఇది తప్పనిసరి అయింది. ముఖ్యంగా కెరియర్‌లో ఇది ‘గేమ్‌ ఛేంజర్‌’ అని చెప్పవచ్చు. చాలా కంపెనీల్లో ఉద్యోగుల పర్సనల్‌ బ్రాండింగ్‌ ఒక శక్తిమంతమైన అంశంగా మారుతోంది. తమ వృత్తిలో వారు అందుకోబోయే కొత్త ఎత్తులను ఇది నిర్దేశించగలుగుతోంది.

అసలు ఏమిటిది?: ఇతరులకు మనల్ని మనం ఎలా రిప్రజెంట్‌ చేసుకుంటున్నాం అనేదే పర్సనల్‌ బ్రాండింగ్‌. మన నైపుణ్యం, వ్యక్తిత్వాలను ఏ విధంగా చూపించుకుంటున్నాం అనేదే ఇది. మన గురించి మనం చెప్పుకునే తీరు, మసులుకునే విధానంతోనే ప్రొఫెషనల్‌ బంధాలు, కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలం. పర్సనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ అనేది కాలం గడిచేకొద్ది బలపడుతుంది. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాం, ఎటువంటి కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో పంచుకుంటాం అనేవి ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇతరులు మనల్ని ఎలా గుర్తిస్తారు అనేది దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

వ్యక్తులు పొందేవి..

  • దీని ద్వారా వృత్తి పరిజ్ఞానం పెరుగుతుంది.
  • ఉపయోగకరమైన సంభాషణలు జరిగే ఆస్కారం ఉంటుంది.
  • నమ్మకమైన ఆన్‌లైన్‌ రిలేషన్స్‌ ఏర్పడతాయి.
  • కొత్త కెరియర్‌ అవకాశాలు దొరుకుతాయి.
  • ప్రొఫెషనల్‌ అభివృద్ధికి దోహదపడుతుంది.
  • ఉద్యోగిగా కంపెనీలో విలువ పెరుగుతుంది.
  • ఎంచుకున్న రంగంలో నిపుణులుగా గుర్తింపు లభిస్తుంది.

పనిచేసే చోట ప్రతి ఒక్కరిమీదా ఇతరులకు ఒక అభిప్రాయం అంటూ ఉంటుంది. కానీ అది సానుకూల కోణంలో ఉండేలా మనమే చూసుకోవాలి, అదే బ్రాండ్‌ ఇమేజ్‌. ఇది ఇక్కడ మాత్రమే కాదు, వేరే సంస్థల్లో చేరినా అక్కడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ చేసే ప్రతి పనిలో మన ముద్ర తప్పకుండా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది.

ప్రయోజనాలు

సాధారణంగా వ్యక్తులు అప్పటి తమ పరిస్థితి, ఒత్తిడి, మూడ్‌ను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మొత్తంగా చూసేటప్పుడు దాని ద్వారా మన మీద ఇతరులకు ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది అనేది ఆలోచిస్తే, వివిధ విషయాలకు మనం రియాక్ట్‌ అయ్యే విధానం మారుతుంది. తద్వారా సానుకూల ఇమేజ్‌ ఏర్పడుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం వృత్తిలో ఉన్నప్పుడు సొంత ఆలోచనలు, నమ్మకాలు, విధానాల కంటే నలుగురితోనూ కలిసి వెళ్లడమే కొంతవరకూ శ్రేయస్కరం.. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్‌గా ఉపయోగపడగలదు. మరీ ఇబ్బందికర పరిస్థితుల్లో తప్ప వీలైనంత వరకూ మనపై ప్రతికూల ప్రభావం పడుతుంది అనుకున్న విషయాలను విస్మరించడమే ఉత్తమం. వృత్తిలో బలమైన వ్యక్తులుగా కనిపించినప్పుడే మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంటుంది.

ప్రాముఖ్యం

సోషల్‌ మీడియా మొదలైన కొత్తల్లో కొన్ని సంస్థల్లో వివిధ పాలసీలు ఉండేవి. మార్కెటింగ్‌లో లేని వారు పని ప్రదేశంలో సోషల్‌ మీడియా ఖాతాలు ఏవైనా ఉపయోగిస్తే సంస్థలు క్రమశిక్షణ చర్యలు తీసుకునేవి.

ప్రస్తుతం అవే సంస్థలు తమ ఉద్యోగులను వారి సోషల్‌ మీడియా ఖాతాల ఆధారంగా విధుల్లోకి తీసుకుంటున్నాయి. అలాగే ఖాతాల్లో చురుకుగా ఉండమని ప్రోత్సహిస్తున్నాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి తన లింక్డిన్‌ ప్రొఫైల్‌లో తాను పనిచేసే సంస్థ గురించి పోస్టులు తరచూ పెడుతున్నాడే అనుకుందాం.. తద్వారా తమ కంపెనీ గురించి మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుంది అని ఆ సంస్థ భావించే రోజులు వచ్చాయి. ఇది అటు సంస్థకూ, ఇటు ఉద్యోగికీ ఇద్దరికీ లాభం చేకూర్చే విషయం. ఇదంతా ఇమేజ్‌ బిల్డింగ్‌లో భాగమే!

ఆన్‌లైన్‌లో..

దీనికోసం ముఖ్యంగా ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ఉపయోగపడతాయి. మన రంగంలో ఉన్న వివిధ కంపెనీలు, నిపుణులతో వీటి ద్వారా అనుసంధానం కావడం బ్రాండ్‌ ఇమేజింగ్‌లో ముఖ్యపాత్ర పోషించగలదు. నెట్‌వర్క్‌ను పెంచుకునేందుకు, మంచి  ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు వారానికి రెండుమూడు సార్లు ఈ సైట్లలో కంటెంట్‌ పోస్ట్‌ చేయడం ఒక వ్యూహం. ఇందులో ప్రొఫెషనల్‌ ఆసక్తులు, రంగం, ఇతర వృత్తిగత అంశాలు.. ఏమైనా ఉండొచ్చు. అలా అని నిరంతరం దీనిపై దృష్టి పెట్టాల్సిన పని లేదు. కేవలం రోజులో కొన్ని నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది.

చేయడం ఎలా?

సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను వృత్తిపరంగా వినియోగించడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా పర్సనల్‌ బ్రాండింగ్‌ను వృద్ధి చేసుకోవచ్చు. సేల్స్‌, మార్కెటింగ్‌, కోడింగ్‌, టెక్నికల్‌.. నేపథ్యం ఏదైనా సరే, స్థిరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, దాన్ని పంచుకోవడం చేయాలి. పనిలో, టాస్కులను పూర్తిచేయడంలో, సక్సెస్‌లో ఇతరుల కంటే మనల్ని భిన్నంగా చూపించే విషయాలపై దృష్టి పెట్టాలి. పరిశ్రమలో సీనియర్లను అనుసరించడం ద్వారా మంచి కాంటాక్ట్‌లు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో సంస్థల మార్గదర్శకాలను పాటించడం అవసరం. కంటెంట్‌ విషయంలో జాగ్రత్తగా ఉండటం, కంపెనీతోపాటు వ్యక్తిగత అభివృద్ధికి పాటుపడటం ద్వారా చక్కని పాజిటివ్‌ ఇమేజ్‌ను పెంచుకునే వీలుంటుంది.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని