సెలవుల సద్వినియోగం ఇదిగో... ఇలా!

చివరి పరీక్ష రాసిన తర్వాత ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. భారం దిగిపోయినట్టుగా... గాల్లో తేలుతున్నట్టుగా.. రకరకాలుగా ఉంటుంది. సెలవు రోజుల ఆనంద సమయాన్ని ప్రయోజనకరంగా మలచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది! అదెలాగో చూద్దామా?

Published : 01 May 2024 00:22 IST

చివరి పరీక్ష రాసిన తర్వాత ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. భారం దిగిపోయినట్టుగా... గాల్లో తేలుతున్నట్టుగా.. రకరకాలుగా ఉంటుంది. సెలవు రోజుల ఆనంద సమయాన్ని ప్రయోజనకరంగా మలచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది! అదెలాగో చూద్దామా?

డాదిలో మొత్తం సమయమంతా తరగతులకు హాజరుకావడానికీ, పరీక్షలకు సిద్ధంకావడానికే సరిపోతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా.. సమయం ఏమాత్రం సరిపోదు. దాంతో తర్వాత చూద్దామని ఎన్నో పనులను వాయిదా వేస్తుంటారు చాలామంది. ఈ వేసవి సెలవుల్లో కావాల్సినంత సమయం దొరుకుతుంది. కాబట్టి దాన్ని ఇష్టమైన పనులెన్నో చేయడానికి వినియోగించుకోవచ్చు.

ఇప్పడు దొరికిన ఈ వ్యవధిలో మీ పనితీరును ఒకసారి సమీక్షించుకోవాలి. ఏ సబ్జెక్టుల్లో వెనకబడి ఉన్నారు.. సెలవుల్లో వాటిని మెరుగుపరుచుకునే మార్గాల గురించి కాస్త ముందుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏ సబ్జెక్టులకు అదనపు సమయాన్ని కేటాయించాలనే విషయంలోనూ స్పష్టత తెచ్చుకోవచ్చు.  

ఇంటర్న్‌షిప్‌లు

కొన్ని రకాల ఇంటర్న్‌షిప్‌లకు వేసవి సెలవుల్లో దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. దాని కోసం ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు. తరగతులు జరిగేటప్పుడు తీరిక లేకపోవడం వల్ల వీలుకాకపోయి ఉండొచ్చు. లేదా విషయం మీకు తెలిసేనాటికే గడువుతేదీ దాటిపోవచ్చు. ఇప్పుడు అలాంటి ఇబ్బందేమీ ఉండదు. వివిధ ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఆసక్తిగా సేకరించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రణాళిక

ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసినట్లయితే శిక్షణ తరగతులకు వెళ్లొచ్చు. అవి మీ ప్రాంతంలో లేకపోయినా, ఆర్థిక స్థోమత సహకరించకపోయినా.. సబ్జెక్టుల ప్రకారం ప్రణాళిక వేసుకుని శ్రద్ధగా చదువుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.

షార్ట్‌టర్మ్‌ కోర్సులు

ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికీ, కొత్తవాటిని నేర్చుకోవడానికీ ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు. షార్ట్‌టర్మ్‌ కోర్సుల్లో చేరి విదేశీ భాషలను నేర్చుకోవచ్చు. దీని కోసం ఆన్‌లైన్‌ వేదికలనూ ఉపయోగించుకోవచ్చు.

పుస్తకాల పఠనం

పుస్తక పఠనం మీ అభిరుచి అయితే.. సెలవుల్లో మీకు నచ్చిన వివిధ  పుస్తకాలు చదువుకోవచ్చు. సబ్జెక్టుకు సంబంధించిన రచనలు చదివి కూడా పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అలాగే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలూ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉన్నా సమయం సరిపోనప్పుడు.. ఈ సెలవులను చక్కగా వినియోగించుకోవచ్చు. వీటితో పద సంపద పెరగడంతోపాటు.. సృజన, భావవ్యక్తీకరణ నైపుణ్యాలూ మెరుగవుతాయి.

పార్ట్‌టైమ్‌ జాబ్‌

విద్యార్థులందరి ఆర్థిక పరిస్థితీ ఒకే విధంగా ఉండదు కదా. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులెందరో నగరాలకు వెళ్లి చదువుకుంటారు. పుస్తకాలు కొనుక్కోవడానికీ, కాలేజీ, ట్యూషన్‌ ఫీజులు చెల్లించడానికీ పార్ట్‌టైమ్‌ జాబ్‌లనూ ప్రయత్నించొచ్చు. ట్యూషన్లు చెప్పొచ్చు, ఆన్‌లైన్‌ సంస్థల వస్తువులూ, ఫుడ్‌ డెలివరీ చేయొచ్చు. నిర్ణీత వేళల్లో టూవీలర్‌, ఫోర్‌వీలర్‌ డ్రైవర్‌గానూ పనిచేయొచ్చు. కష్టపడి పనిచేయడాన్ని అవమానంగా భావించకూడదు. ప్రముఖ వ్యక్తులెందరో ఇలా కష్టపడి పైకి వచ్చినవాళ్లే.

పొందిగ్గా

పరిసరాల ప్రభావం అందరి పైనా ఉంటుంది. గదిలోని పుస్తకాలు, వస్తువులు చిందరవందరగా పడివుంటే.. ప్రశాంతంగా ఉండలేరు. ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టి, గదిని శుభ్రంగా ఉంచితే చూడచక్కగా ఉండటంతోపాటు మనసంతా హాయిగానూ ఉంటుంది. కాబట్టి సెలవుల్లో చదువుకునే  గదినే కాకుండా, ఇంటినీ, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు మీ ఇంటికి దగ్గర్లోని పార్క్‌ మాసిన గోడలతో, విరిగిన బెంచీలతో అపరిశుభ్రంగా ఉందనుకుందాం. స్నేహితులతో కలిసి దాన్ని బాగుచేయొచ్చు. గోడలను అందమైన చిత్రాలతో తీర్చిదిద్దొచ్చు. బెంచీలకు రిపేర్లు చేయించొచ్చు. మన కోసమే కాకుండా నలుగురి కోసం ఏవైనా చేయాలనే తపన ఉంటే ఇలాంటి మంచి పనులెన్నో చేయొచ్చు.

మనసుంటే మార్గాలెన్నో. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉండాలిగానీ వాటికి వేసవి సెలవులను మించిన మార్గం ఉండదు. ఇష్టమైన పనులన్నీ చేసుకోవచ్చు. క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, హస్తకళలు.. ఇలా ఎన్నో నేర్చుకోవచ్చు. అయితే ఈ సెలవులు పూర్తయ్యేలోపే అన్నిట్లోనూ నిష్ణాతులు కాలేకపోవచ్చు. కానీ ఆసక్తి ఉంటే అంతటితో వదిలిపెట్టేయకుండా ఆ తర్వాతా కొనసాగించొచ్చు.


బ్లాగ్‌ రాయొచ్చు..

స్నేహితులతో మీ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకుంటూనే ఉంటారు కదా. అలాగే బ్లాగ్‌ మొదలుపెట్టి.. చక్కగా రాయడమూ అలవాటు చేసుకోవచ్చు. బాల్య స్మృతులు, విహార యాత్రల అందమైన అనుభవాలు, స్కూలు లేదా కాలేజీలో జరిగిన సరదా సంఘటనలు, స్నేహితులతో చేసిన చిలిపి అల్లర్లు.. ఇలా ప్రతి విషయాన్నీ ఆసక్తికరంగా రాతపూర్వకంగా పంచుకోవచ్చు.


టెడ్‌ టాక్స్‌

ఎంత జాగ్రత్తగా చదివినా ఒక్కోసారి అనుకున్న ఫలితాలను పొందలేరు. అలాంటప్పుడు ఒకలాంటి నిరాశానిస్పృహలూ ఆవరిస్తుంటాయి. కోరుకున్న కొలువును సాధించగలమా లేదా అనే అనుమానమూ పట్టి పీడిస్తుంది. ఇలాంటప్పుడు ‘టెడ్‌ టాక్స్‌’ చూడటం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నో కష్టాలూ, నష్టాలకు ఓర్చుకుని అనుకున్నది సాధించినవారి అనుభవాల నుంచి విలువైన జీవిత పాఠాలెన్నో నేర్చుకోవచ్చు. అవన్నీ మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచి దిశానిర్దేశం చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని