రూ.కోటి ప్యాకేజీ కావాలా?

ప్లేస్‌మెంట్స్‌లో శిఖర సమానమైనవి ‘మాంగ్‌’ కంపెనీలు. వీటిల్లో ప్రవేశం నేటితరం ఇంజినీర్లకు ఓ విశేషమైన కల. ఏమిటీ మాంగ్‌? ఈ సంస్థల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది? వీటిలో చేరాలంటే ఏయే అర్హతలు పెంచుకోవాలి?

Updated : 01 May 2024 06:57 IST

ప్లేస్‌మెంట్స్‌లో శిఖర సమానమైనవి ‘మాంగ్‌’ కంపెనీలు. వీటిల్లో ప్రవేశం నేటితరం ఇంజినీర్లకు ఓ విశేషమైన కల. ఏమిటీ మాంగ్‌? ఈ సంస్థల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది? వీటిలో చేరాలంటే ఏయే అర్హతలు పెంచుకోవాలి?

‘క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో కోటి రూపాయిల వార్షిక వేతనంతో విద్యార్థి ఎంపిక’, ‘కోటీ పాతిక లక్షల ప్యాకేజీతో ఎంపిక’ ... ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఇది నిజమా? అన్న సందేహం వస్తుంది. ఎన్నో చిన్న కంపెనీల వార్షిక టర్నోవరంత వేతనం ఒక ఫ్రెషర్‌ సొంతం చేసుకోవడం సాధ్యమా? అనిపిస్తుంది. కానీ, ఇది నిజం. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ జరిగే ప్రతి సీజన్‌లోనూ ఇటువంటి విజయ గాథలను వింటూనే ఉంటాం. అయితే మన దృష్టికి అప్పుడప్పుడూ వచ్చినా ఇలాంటి వీరులు ప్రతి వేయిమందికి ఒకరుంటారని ప్లేస్‌మెంట్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇలాంటివారిని చూసి అసూయపడకుండా, అదృష్ట జాతకులని సరిపెట్టుకోకుండా...ఆ విజయం వెనుకున్న ప్రాతిపదికలేమిటో తెలుసుకుంటే ఫలితం ఉంటుంది. రేపటి వేయి   మందిలో ఆ ఒకరుగా గెలిచి, నిలిచేందుకు అవకాశం ఉంటుంది!


టార్గెట్‌ ‘మాంగ్‌’

కోటి రూపాయల వార్షిక వేతనం సాధించాలంటే మాంగ్‌ కంపెనీల గురించి ముందు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులతో విస్తరించిన టాప్‌ ఐదు కంపెనీల (మెటా, అమెజాన్‌, ఆపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌) మొదటి అక్షరాలతో కలిపి ఈ పదబంధం ఏర్పడింది. వీటిలో మొదటి అక్షరం మెటా కంపెనీ లేదా మైక్రోసాఫ్ట్‌ కంపెనీగా అనుకోవచ్చు. మాంగ్‌ కంపెనీల్లో జాబ్‌ చేసేందుకు యువతరం ఇంజినీర్లు ఉవ్విళ్లూరతారు. లేటెస్ట్‌ టెక్నాలజీ, అద్భుతమైన పని వాతావరణం, కళ్లు మిరుమిట్లు గొలిపే ప్యాకేజీని ఆఫర్‌ చేసే మాంగ్‌ కంపెనీల్లో దేనిలో ఉద్యోగం వచ్చినా జాక్‌పాట్‌ తగిలినట్టే.

మాంగ్‌ కంపెనీల వైపు కన్నెత్తి చూడాలంటే కొన్ని యోగ్యతలు ఉండాలి. ఆపై ఎంపిక పద్మవ్యూహంలోకి ప్రవేశించి విజయవంతంగా బయటికి రాగలిగితే కోటి రూపాయల ఆఫర్‌ లెటర్‌తో వార్తల్లో వ్యక్తి అవుతారు!


అడుగు పెట్టే  దారి

  • మాంగ్‌ కంపెనీల ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు పిలుపు రావాలంటే ముందు విద్యార్థికి గ్రాడ్యుయేషన్‌లో అత్యధిక స్కోరింగ్‌ ఉండాలి. అంటే టెన్‌ అవుటాఫ్‌ టెన్‌ జి.పి.ఎ. స్కోరింగ్‌. ఇక, ఇందులో ఏమాత్రం రాజీపడరు. అంతటి స్కోరింగ్‌ ఉన్నవారినే ఎంపిక ప్రక్రియకు ఆహ్వానిస్తారు. గ్రాడ్యుయేషన్‌తో పాటు విద్యార్థి దశలో ముందు నుంచీ అకడమిక్‌ ట్రాక్‌ ఎంత ఉజ్వలంగా ఉంటే అంతగా రెజ్యూమె పటిష్ఠమవుతుంది.  
  • మాంగ్‌లో ఉన్నవన్నీ ఐటీ కంపెనీలే కాబట్టి కంప్యూటర్‌ సైన్స్‌లో బలంగా ఉండాలి. అంటే ప్రతి సబ్జెక్టులోనూ ‘తగ్గేదే లే’ అన్నట్టుండాలి. ఏ ప్రాజెక్టును తీసుకున్నా దానిలో రాణించాలి. కోడింగ్‌ అవలీలగా చేయగల నైపుణ్యం సాధించి ఉండాలి. ఎటువంటి ప్రోగ్రామింగ్‌నయినా సునాయాసంగా చేయగలగాలి. ప్రోగ్రామింగ్‌లో ఆధునిక టెక్నాలజీతో ప్రాజెక్టులు చేసి ఉండాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక టెక్నాలజీల ప్రాతిపదికగా ప్రాజెక్టు గానీ అప్రెంటిస్‌షిప్‌ గానీ చేసివుండాలి. ఈ తరహా కపెనీలను ఆకట్టుకోవాలంటే ఒక ప్రాజెక్టు అని కాకుండా సాధ్యమైనన్ని ఎక్కువ, వైవిధ్యభరిత ప్రాజెక్టులు చేసి ఉండాలి.  
  • ఎంపికకు వెళుతున్న కంపెనీ గురించి ఆమూలాగ్రం తెలుసుకొని ఉండాలి. సాధారణంగా ఏ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లినా ఆ కంపెనీ గురించి తెలుసుకొని వెళ్లడం తప్పనిసరే కానీ మాంగ్‌ కంపెనీల విషయంలో మరో వంద అడుగులు ముందుకు వేయాలి. ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్‌ కంపెనీ ఇంటర్వ్యూలో కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సి.ఇ.ఒ. ఎవరు? మార్కెట్‌లో షేరు విలువ ఎంత? వంటి  వివరాలనే కాదు, ప్రస్తుత నెట్‌ఫ్లిక్స్‌ చేతిలో ఉన్న ప్రాజెక్టులేమిటి? ఆ ప్రాజెక్టును ఏ ప్ల్లాట్‌ఫారంపై చేస్తున్నారు?.. ఇలాంటి లోతైన విషయాలు తెలుసుకొని ఉండాలి. అంటే అంతగా ఉద్యోగార్థి నుంచి కంపెనీ సమాచారం ఆశిస్తుంది. దీనివల్ల అభ్యర్థి కేవలం ఇంటర్వ్యూకి మాత్రమే వచ్చాడా? ఎంపిక చేస్తే తక్షణం ప్రాజెక్టులో నిమగ్నం కాగలిగే ఆసక్తి, సత్తా కూడా ఉందా అని చూస్తారు.  
  • వీటితో పాటు ఒక వ్యక్తిత్వ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ఒత్తిడి తట్టుకోగల స్థితప్రజ్ఞత, ఎటువంటి ప్రతికూల- సానుకూల పరిస్థితులనైనా ఎదుర్కోగల మానసిక శక్తి అభ్యర్థిలో ఉందో, లేదోనని పరీక్షిస్తారు.

ఎంపిక ఎలా?  

మాంగ్‌ కంపెనీల్లో ఎంపిక  క్లిష్టంగా ఉంటుంది. ఇతర సంస్థల నియామకాల్లో ఒకటి, రెండు టెక్నికల్‌, ఒక హెచ్‌.ఆర్‌.రౌండ్‌ ఉంటాయి. కానీ, మాంగ్‌ కంపెనీల ఎంపికలో ఏకంగా నాలుగైదు టెక్నికల్‌ రౌండ్స్‌ ఉంటాయి. వీటికంటే ముందు అభ్యర్థి సబ్జెక్టుపై ఇచ్చే టెస్ట్‌లో మంచి స్కోరు సాధించాలి. టెస్ట్‌ను క్లియర్‌ చేసినవారు టెక్నికల్‌ ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపాలి. ఇంటర్వ్యూ రౌండ్స్‌ అన్నీ థియరిటికల్‌ ప్రశ్నలతో కాకుండా సబ్జెక్టును ఉపయోగిస్తూ చేసే ప్రోగ్రామింగ్స్‌, కేస్‌ స్టడీస్‌, తాజా టెక్నాలజీలపై ఉంటాయి.  

ఇన్ని రౌండ్స్‌ ద్వారా అభ్యర్థిని పరీక్షించడం ఎందుకు? ఎంపిక చేసుకోదలచుకుంటున్నది తాము నేర్పించుకోవాల్సిన విద్యార్థిని కాదు. కంపెనీలో చేరిన వెంటనే ఉత్పత్తిలో పాల్గొనగలిగే సామర్ధ్యం గలవారిని గుర్తించాలన్న ఉద్దేశంతోనే!  

  • మైక్రోసాఫ్ట్‌ కంపెనీ అత్యంత ప్రతిభావంతులు, నైపుణ్యాలు కలిగినవారిని ఎంపిక చేసుకునేందుకు హ్యాకథాన్‌ను ఆశ్రయిస్తుంది. కంపెనీ నిర్వహించే హ్యాకథాన్‌లో అత్యుత్తమంగా నిలిచినవారిని భారీ ప్యాకేజీతో ఉద్యోగంలోకి తీసుకుంటుంది..  
  • గూగుల్‌ కంపెనీ రెండు, మూడు మార్గాల ద్వారా అత్యుత్తమ ప్రతిభ చూపేవారిని ఎంచుకుంటుంది. గూగుల్‌- ఉమన్‌ ఇంజినీర్స్‌ ఎంపికల ద్వారా మహిళా అభ్యర్థులను నియమిస్తుంది. గూగుల్‌ వావ్‌ అనే డ్రైౖవ్‌ ద్వారా సృజనాత్మకత, అసాధారణ ఆలోచనా ధోరణి గల విద్యార్థులకోసం అన్వేషిస్తుంది. మూడో మార్గంగా జాతీయస్థాయిలో ఒక పరీక్ష పెట్టి నిర్దేశించిన స్కోరు సాధించినవారిని మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఇంటర్న్‌షిప్‌ చేయించి ఆపై రెగ్యులర్‌ ఉద్యోగిగా తీసుకుంటోంది.

ఆరు అంచెల్లో..

కోటి రూపాయల ప్యాకేజీ అందుకోవాలంటే ఈమాత్రం కష్టమైన ఎంపిక ప్రక్రియను దాటాల్సి ఉంటుంది. ఆసక్తి గలవారు అంతటి అవకాశాన్ని అందుకోవడానికి కొన్ని సూచనలు.  

1 జాబ్‌ ఓపెనింగ్స్‌: అవకాశాలను గమనిస్తుండాలి. ఎప్పుడు ఏ అవకాశం వచ్చి వెళ్లిపోతుందా అని పరిశీలిస్తుండాలి. కంపెనీల వెబ్‌సైట్స్‌, జాబ్‌ పోర్టల్స్‌, ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ఎప్పటికప్పుడు చూస్తుండాలి. వాటిద్వారా క్యాంపస్‌ డ్రైౖవ్స్‌, ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్స్‌ సమాచారం తెలుసుకోవచ్చు.  

2 నైపుణ్యాల నగిషీ: పటిష్ఠమైన నైపుణ్యాలున్న అభ్యర్థులను కళ్లు చెదిరే ప్యాకేజీతో కంపెనీలు ఎంపిక చేసుకుంటాయి. అందువల్ల ఉద్యోగార్థులు తమ సాంకేతిక, ఉద్యోగ నైపుణ్యాలకు (సాఫ్ట్‌ స్కిల్స్‌) పదును పెట్టుకోవాలి. ఎంపిక పోటీలో అగ్రస్థానంలో నిలిచేలా నైపుణ్యాలు పెంచుకోవాలి.  

3 ఆన్‌లైన్‌లో అభ్యర్థిత్వం: ఆర్జించిన నైపుణ్యాలు, చేసిన ప్రతి ప్రాజెక్టులతో బలమైన ప్రొఫైల్‌ తయారుచేసుకొని లింక్డ్‌ ఇన్‌, ఇతర ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్స్‌లో ప్రచారం చేసుకోవాలి. క్యాంపస్‌ సెలక్షన్స్‌తో పాటు ఆఫ్‌ క్యాంపస్‌ అవకాశాలపైనా దృష్టి పెట్టాలి.  

4 నెట్‌వర్క్‌ విస్తరణ: ఆఫ్‌ క్యాంపస్‌ అవకాశాలు పెంపొందించుకునేందుకు ఇండస్ట్రీ ఈవెంట్స్‌, వెబినార్స్‌, కాన్ఫరెన్స్‌ల్లో హైరింగ్‌కు సమయాన్ని తెలుసుకుంటూ సన్నద్ధం కావాలి.  

5 కంపెనీని బట్టి రెజ్యూమె: మూస పద్ధతి రెజ్యూమెలకు స్వస్తి పలికి నైపుణ్యాలు, విజయాలు స్పష్టంగా తెలిసేలా రెజ్యూమె సిద్ధం చేసుకోవాలి. అలాగే దరఖాస్తు చేస్తున్న కంపెనీని బట్టి రెజ్యూమెలో తగిన మార్పులు చేసుకోవాలి. అన్ని కంపెనీలకూ ఒకే తరహా దరఖాస్తు వినియోగించకూడదు.  

6 ఇంటర్వ్యూ ప్రాక్టీస్‌: నేరుగా కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరవడం కంటే కంపెనీల గత ఇంటర్వ్యూ నమూనాలను యూట్యూబ్‌ లాంటి సామాజిక వేదికల ద్వారా తెలుసుకొని వాటి ఆధారంగా ప్రాక్టీస్‌ చేయడం మంచిది. అభ్యర్థి తన ఇంటర్వ్యూను వీడియో తీయించుకొని తప్పొప్పులను సరిచేసుకోవాలి. ఇంటర్వ్యూలో తన తీరును మెరుగుపరచుకోవాలి.


కోటి రూపాయల ఆఫర్‌ ఇచ్చే ‘మాంగ్‌’ కంపెనీల్లో చోటు పొందాలంటే సాధారణ సెలక్షన్స్‌ కంటే భిన్నంగా సన్నద్ధం కావాలి. స్వీయ ప్రతిభతోపాటు తగిన గైడెన్స్‌ తీసుకోవడం ద్వారా ప్లేస్‌మెంట్స్‌లో శిఖర సమాన మాంగ్‌ కంపెనీలకు ఎంపిక కావచ్చు. అందుకు తగినంత శ్రమ పడాలి. డబ్బులు ఎవరికీ ఊరికే రావుగా!  

యస్‌.వి.సురేశ్‌ (సంపాదకుడు, ఉద్యోగ సోపానం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని