పరిశోధనలకు ప్రోత్సాహం!

సామాజిక వికాసంలో సైన్స్‌ కోర్సుల్లో పరిశోధనలే కీలకం. ఔత్సాహికులను ఈ దిశగా ప్రోత్సహించడానికే దేశవ్యాప్తంగా కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో ప్రతి నెలా ఫెలోషిప్‌ అందుకుంటూ మెచ్చిన విభాగంలో పరిశోధనలు కొనసాగించవచ్చు.

Updated : 06 May 2024 00:13 IST

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌

సామాజిక వికాసంలో సైన్స్‌ కోర్సుల్లో పరిశోధనలే కీలకం. ఔత్సాహికులను ఈ దిశగా ప్రోత్సహించడానికే దేశవ్యాప్తంగా కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో ప్రతి నెలా ఫెలోషిప్‌ అందుకుంటూ మెచ్చిన విభాగంలో పరిశోధనలు కొనసాగించవచ్చు. ఇందుకోసం సీఎస్‌ఐఆర్‌ - యూజీసీ నెట్‌లో అర్హత సాధించాలి. ఈ స్కోరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులకు పోటీ పడటానికీ, ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికీ ఉపయోగపడుతుంది. ఇటీవలే వెలువడిన సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ జూన్‌- 2024 ప్రకటన వివరాలు..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఏడాదికి రెండుసార్లు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) - యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తరఫున నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్‌) నిర్వహిస్తున్నారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల యూజీ లేదా పీజీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవాళ్లు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించినవారు భవిష్యత్తులో శాస్త్రవేత్తగానూ రాణించవచ్చు. వీరు పరిశోధన, అభివృద్ధి (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)లో భాగం కావచ్చు.

ఇవీ ప్రయోజనాలు

  • జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే ప్రతి నెలా స్టైపెండ్‌ అందుకుంటూ పరిశోధన కొనసాగించవచ్చు.
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జాతీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు.
  • డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యా సంస్థలు మేటి స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి.
  • వివిధ పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ నెట్‌ స్కోరుకు ప్రాధాన్యమిస్తున్నాయి.
  • జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ విభాగాల్లో నేషనల్‌ ఫెలోషిప్పులు పొందడానికి నెట్‌ తప్పనిసరి.
  • ప్రైవేటు సంస్థలు సైతం నెట్‌ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.
  • తాజా మార్పులతో రాష్ట్రస్థాయి సంస్థల్లోనూ పీహెచ్‌డీలో చేరవచ్చు.

ఏ సబ్జెక్టుల్లో?

  • కెమికల్‌ సైన్సెస్‌
  • ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌, ప్లానిటరీ సైన్సెస్‌
  • లైఫ్‌ సైన్సెస్‌
  • మ్యాథమెటికల్‌ సైన్సెస్‌
  • ఫిజికల్‌ సైన్సెస్‌

అభ్యర్థులు చదువుకున్న కోర్సు ప్రకారం వీటిలో ఏదో ఒక సబ్జెక్టులో పరీక్ష రాయాలి. నాలుగేళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్‌, బీఫార్మసీ...మొదలైనవి పూర్తిచేసుకున్నవారు జేఆర్‌ఎఫ్‌, పీహెచ్‌డీలో ప్రవేశానికి అర్హులు. పీజీ చదవనందున అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులకు అనర్హులు.  

పరీక్ష ఇలా..

అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 200 మార్కులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో మూడు విభాగాలు (ఎ, బి, సి) ఉంటాయి.

పార్ట్‌ ఎ: ఏ సబ్జెక్టు ఎంచుకున్నప్పటికీ అందరికీ ఈ విభాగం ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో లాజికల్‌ రీజనింగ్‌, గ్రాఫికల్‌ అనాలిసిస్‌, అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్‌, సిరీస్‌ ఫార్మేషన్‌, పజిల్స్‌ మొదలైన అంశాల్లో 20 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 15 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే చాలు. ఈ విభాగానికి 30 మార్కులు. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.  
పార్ట్‌ బి: ఈ విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ సబ్జెక్టు ప్రకారం ప్రశ్నల సంఖ్య మారుతుంది. సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఛాయిస్‌ ఉంది. ఈ విభాగానికి ఆ సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం చొప్పున తగ్గిస్తారు.
పార్ట్‌ సి: ఈ విభాగంలో ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్‌ ఉంది. మ్యాథ్స్‌లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఈ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్‌ తప్ప మిగిలిన వాటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌, ప్లానిటరీ సైన్సెస్‌ విభాగంలో తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు తగ్గిస్తారు. మిగిలిన విభాగాలకు పావు శాతం తగ్గిస్తారు. ప్రశ్నలన్నీ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి.

సబ్జెక్టులవారీగా...

లైఫ్‌ సైన్సెస్‌: బోటనీ లేదా జువాలజీలో పీజీ పూర్తిచేసుకున్నవాళ్లు ఆధునిక బయాలజీ (మాలిక్యులార్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్‌ టెక్నిక్స్‌, బయోఫిజిక్స్‌, స్పెక్ట్రోస్కోపీ) పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆధునిక బయాలజీలో పీజీ చేసినవారు క్లాసికల్‌ బయాలజీ, ఎకాలజీ, ఎవల్యూషన్‌, బయోడైవర్సిటీపై ఎక్కువ దృష్టి సారించాలి.
కెమికల్‌ సైన్సెస్‌: ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో.. రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎసెమిట్రిక్‌ సింథసిస్‌, కన్ఫర్మేషనల్‌ అనాలిసిస్‌, ఆర్గానిక్‌ స్పెక్ట్రోస్కోపీ, రియేజెంట్స్‌, పెరిసైక్లిక్‌ చర్యలు, కాంతి రసాయనశాస్త్రం తదితర అంశాలనూ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో.. సంశ్లిష్ట సమ్మేళనాలు, అనలిటికల్‌ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మెటల్‌ క్లస్టర్స్‌ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో.. క్వాంటమ్‌ కెమిస్ట్రీ, సాలిడ్‌స్టేట్‌, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపీ, స్టాటిస్టికల్‌ థర్మోడైనమిక్స్‌, కెమికల్‌ కైనెటిక్స్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
ఫిజికల్‌ సైన్సెస్‌: మోడరన్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌, పార్టికల్‌ ఫిజిక్స్‌, హీట్‌, థర్మోడైనమిక్స్‌ (క్లాసికల్‌, స్టాటిస్టికల్‌), ఎలక్ట్రోమాగ్నటిక్‌ థియరీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ మెథడ్స్‌, ఆప్టిక్స్‌, మెకానిక్స్‌ విభాగాలను క్షుణ్నంగా చదవాలి.
మ్యాథమెటికల్‌ సైన్సెస్‌: స్టాటిస్టిక్స్‌, ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్‌, కాంప్లెక్స్‌, డిఫరెన్షియల్‌ అనాలిసిస్‌, మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, వెక్టర్‌, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌, ప్లానిటరీ సైన్సెస్‌: భూమి, సౌరవ్యవస్థ, సముద్రాలు, వాతావరణం, పర్యావరణం, భూగర్భశాస్త్రం, జియో కెమిస్ట్రీ, ఎకనామిక్‌ జియాలజీ, ఫిజికల్‌ జాగ్రఫీ, జియో ఫిజిక్స్‌, మెటీరియాలజీ, ఓషన్‌ సైన్స్‌ అంశాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి.

సబ్జెక్టులు.. ఛాయిస్‌

ఫిజికల్‌ సైన్సెస్‌లో 75 ప్రశ్నలకు 55, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌లో 120కి 60, లైఫ్‌ సైన్సెస్‌లో 145కి 75, కెమికల్‌ సైన్సెస్‌లో 120కి 75, ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానిటరీ సైన్సెస్‌లో 150కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. సిలబస్‌, మాదిరి ప్రశ్నపత్రాలను https://www.csirhrdg.res.in/ నుంచి పొందవచ్చు.

జేఆర్‌ఎఫ్‌

జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై, పరిశోధనల్లో చేరినవారికి తొలి రెండేళ్లు ప్రతి నెల రూ.37,000 స్టైపెండ్‌ ఇస్తారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌ అర్హత సాధించినవారికి ప్రతి నెల రూ.42,000 చొప్పున అందుతుంది. ఉచిత వసతి కల్పిస్తారు లేదా స్టైపెండ్‌లో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

తాజా ప్రకటనలో పలు మార్పులు చేశారు. ఎక్కువ మంది అభ్యర్థుల అవసరాలు తీరేలా మూడు కేటగిరీల్లో ఎంపికలుంటాయి.

తాజా మార్పులివీ

నెట్‌లో అర్హత సాధించడానికి 3 కేటగిరీలు ఉన్నాయి. ఎవరి అవసరం ప్రకారం వారు ఆ కేటగిరీని ఎంచుకోవచ్చు.

కేటగిరీ-1: జేఆర్‌ఎఫ్‌. దీనికి ఎంపికైనవారు ప్రతి నెలా నిర్దేశిత స్టైపెండ్‌ పొందుతూ పరిశోధన (పీహెచ్‌డీ) కొనసాగించుకోవచ్చు. వీరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, జేఆర్‌ఎఫ్‌ లేకుండా జరిపే పీహెచ్‌డీ ప్రవేశాలకూ అర్హులే.
కేటగిరీ-2: ఈ విధానంలో ఎంపికైనవారికి జేఆర్‌ఎఫ్‌ దక్కదు. అయితే వీరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకూ అర్హులే.
కేటగిరీ-3: వీరు పీహెచ్‌డీలో ప్రవేశానికే అర్హులు. జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు అర్హత లేదు.  
ఈ మార్పుల ద్వారా: రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలూ, ఉన్నత విద్యా సంస్థలూ పీహెచ్‌డీలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలను విడిగా రాయనవసరం లేదు. కేటగిరీ 2, కేటగిరీ 3ల్లో ఎంపికైనవారు పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూతో పీహెచ్‌డీ ప్రవేశం పొందవచ్చు. ఇలా అవకాశం వచ్చినవారికి యూజీసీ నిర్దేశిత    స్టైపెండ్‌ దక్కదు. ఆ సంస్థ నిబంధనల మేరకు  ఎంతో కొంత చెల్లిస్తారు. ఈ స్కోరు ఏడాది వరకు చెల్లుతుంది. ఈ తరహా పీహెచ్‌డీలో చేరడానికి వయసు నిబంధన లేదు. అందువల్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న ఎవరైనా ప్రయత్నించవచ్చు.  

స్కోరు కోసం..

సిలబస్‌ వివరాలు గమనించాలి. అధ్యయనాన్ని అందులోని అంశాలకే పరిమితం చేయాలి.

  • పరీక్షలో విజయానికి ప్రాథమికాంశాలపై పట్టుతోపాటు సబ్జెక్టుపై లోతైన అవగాహన ఉండాలి. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా చదవడం తప్పనిసరి. ఇలా చేస్తేనే వీలైనన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. రెండుమూడు అంశాలను కలిపి ఒక ప్రశ్నగా అడుగుతారు. అలాగే అనువర్తనం రూపంలోనూ ఇవి ఉంటాయి. అందువల్ల అధ్యయనం సమగ్రంగా ఉండాలి.
  • సిలబస్‌లోని అంశాల ప్రకారం ముందు ఇంటర్మీడియట్‌, తర్వాత డిగ్రీ, అనంతరం పీజీ, ఆ తర్వాత రిఫరెన్స్‌ పుస్తకాలు చదవాలి. పరిమిత పుస్తకాలనే బాగా అధ్యయనం చేయాలి.
  • ఒకసారి చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలను శ్రద్ధగా గమనించాలి. ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వాటిని ఏ స్థాయిలో చదవాలో తెలుసుకుని ఉన్న వ్యవధిలో ఆచరించాలి.
  • అన్ని సబ్జెక్టుల్లోనూ పార్ట్‌ సీ విభాగానికి ఎక్కువ వెయిటేజీ ఉంది. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలు, పరిశోధన జర్నల్‌్్సను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
  • సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది మాక్‌ పరీక్షలు రాసి, ఫలితాలు విశ్లేషించుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇలా ప్రతి పరీక్షనూ సమీక్షించుకుని, సన్నద్ధతను మెరుగుపరచుకోవాలి. పరీక్ష రాస్తున్నప్పుడు సమయానికీ ప్రాధాన్యమివ్వాలి.  
  • రుణాత్మక మార్కులు ఉన్నందున, ఏ మాత్రం తెలియని వాటిని వదిలేయాలి.

ముఖ్య వివరాలు

అర్హత: ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులవారైతే ఎందులోనైనా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్‌, ఓబీసీలు, 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌ జండర్‌, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్‌ లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మసీ తదితర కోర్సులవారికి డిగ్రీలో 75 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ విభాగాలైతే 70 శాతం సరిపోతాయి. ప్రస్తుతం పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, నాలుగేళ్ల యూజీ చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు జూన్‌ 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించరాదు. ఓబీసీ-ఎన్‌సీఎల్‌, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జండర్‌, మహిళలకు ఐదేళ్లు మినహాయింపు వర్తిస్తుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పీహెచ్‌డీకి గరిష్ఠ వయసు నిబంధన లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 21 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: జనరల్‌ కేటగిరీకి రూ.1150, జనరల్‌- ఈడబ్ల్యుఎస్‌, ఓబీసీ- నాన్‌ క్రీమీలేయర్‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జండర్లకు రూ.325.  
పరీక్షలు: జూన్‌ 25, 26, 27 తేదీల్లో.
వెబ్‌సైట్‌: https://csirnet.nta.ac.in/#


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని