పొరపాట్లు దిద్దుకుంటే పక్కాగా గెలుపు బాటే!

కొందరు విద్యార్థులు ఎన్నో పనులను విజయవంతంగా పూర్తిచేయాలనుకుంటారు. ఇందు కోసం కచ్చితమైన ప్రణాళికలూ వేసుకుంటారు. కానీ వాటి కంటే ముందు తాము చేసిన పొరపాట్లను గ్రహించటం, అవి సరిదిద్దుకోవడం ఎంతో అవసరం.

Published : 07 May 2024 00:56 IST

కొందరు విద్యార్థులు ఎన్నో పనులను విజయవంతంగా పూర్తిచేయాలనుకుంటారు. ఇందు కోసం కచ్చితమైన ప్రణాళికలూ వేసుకుంటారు. కానీ వాటి కంటే ముందు తాము చేసిన పొరపాట్లను గ్రహించటం, అవి సరిదిద్దుకోవడం ఎంతో అవసరం. అప్పుడు మాత్రమే  అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతారు!  

  • కొంతమంది విద్యార్థులు చేసే పనుల్లో ఎలాంటి మార్పులూ చేసుకోరు. కానీ ఫలితాలు మాత్రం భిన్నంగా రావాలని కోరుకుంటారు. ఇది ఎంత వరకూ సమంజసమో ఆలోచించుకోవాలి. ఉదాహరణకు... గడచిన సంవత్సరంలో సమయాన్ని వృథా చేశారనుకుందాం. ఈ ఏడాది కూడా అలాగే చేస్తున్నారు. ప్రణాళిక వేసుకున్నారుగానీ.. సరిగా అమలుచేయడం లేదు. అంటే చేసిన పొరపాట్లే మళ్లీమళ్లీ చేస్తుంటే ఫలితాలు మాత్రం భిన్నంగా ఎందుకు వస్తాయి? ముందుగా ఈ పద్ధతి నుంచి బయటపడాలి.
  • ‘ప్రతి పనినీ నేను మాత్రమే సరిగా చేయగలను. మిగతావాళ్ల వల్ల ఏదీ సాధ్యం కాదు’ అనే ధోరణి సరి కాదు. అన్ని పనుల భారాన్నీ తమ మీదే వేసుకోవడం వల్ల ఒత్తిడి బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం ఆరోగ్యం మీదా పడుతుంది. ఉదాహరణకు మీరు పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సమయంలో.. ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న పనీ మీరే చేయాలనుకోకూడదు. మీరు చేస్తేగానీ సక్రమంగా పూర్తికాదని అనుకోవడం వల్ల విలువైన సమయమెంతో వృథా అవుతుంది. దాంతో మీరే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
  • ఎవరు ఏ పని చెప్పినా కాదని చెప్పలేని మొహమాటం ఎంతోమంది విద్యార్థులకు ఉంటుంది. పరీక్షలకు సన్నద్ధం అవుతుంటే స్నేహితులు సినిమాకు వెళదామని బలవంతం పెట్టొచ్చు. లేదా బంధువుల ఇళ్లలో వేడుకలకు ఆహ్వానాలూ అందవచ్చు. వీటన్నింటినీ సున్నితంగా తిరస్కరించొచ్చు. కాదని చెప్పలేని మొహమాటం వల్ల మీరే నష్టపోవాల్సి వస్తుంది. నిజానికి ఎదుటివారు నొచ్చుకోకుండా.. కాదని సున్నితంగా చెప్పడమూ కళే. అవసరమైనప్పుడు కాదని చెప్పడాన్ని అలవాటు చేసుకోవాలి. స్నేహబంధాలు, బంధుత్వాలు దెబ్బతింటాయేమోనని ఎక్కువగా ఊహించుకుని ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. విద్యార్థిగా మీ ప్రధాన కర్తవ్యం చక్కగా చదువుకుని.. పరీక్షలు బాగా రాయడం. ఆ తర్వాతే మిగతావన్నీ అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
  • చేయాల్సిన పనిని వాయిదాలు వేస్తూ వెళ్లడం కొందరికి అలవాటు. ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటారు. ఈ రోజు, రేపు అని వాయిదాలు వేస్తూ గడువు ముగిసే తేదీన దరఖాస్తు చేయాలనుకోవచ్చు. ఆ రోజున సర్వర్‌ డౌన్‌ కావడమో, వేరే రకమైన అవాంతరమో రావచ్చు. కారణం ఏదైనా కానీ అమూల్యమైన అవకాశాన్ని జారవిడుచుకోవాల్సిరావచ్చు.  
  • ‘లెక్కలంటే భయం. ఫార్ములాలు గుర్తుండవు. సైన్స్‌ ఎంత చదివినా అర్థంకాదు. స్కూలు రోజుల నుంచే ఇంతే. ఇక కొత్తగా ఏం నేర్చుకుంటాను.’ ఇలా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేరు.. అంటే సమస్యకున్న అసలు కారణాన్ని తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నాలు చేయకుండా సమస్య గురించి మాత్రమే ఆలోచించి ఊరుకుంటున్నారన్నమాట. ఇది ఎంతమాత్రం సరైన పద్ధతి కాదు. ఇబ్బంది గురించి కాకుండా దాన్నుంచి బైటపడే మార్గాల మీద దృష్టి సారించాలి.
  • చివరిగా.. ప్రతికూల ఆలోచనలు చేసే స్నేహితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్లు మీకు తెలియకుండానే మీ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతుంటారు. మీరు ఉత్సాహంగా ఏ పని మొదలుపెట్టబోయినా నిరుత్సాహపరుస్తుంటారు. దాంతో మీ సానుకూల ఆలోచనలకు కళ్లెం పడుతుంది. మీ కృషినీ అంతటితో ఆపేస్తారు. ప్రయత్నమంటూ లేకుండా ఫలితాన్ని ఊహించలేరు కదా.   నిజంగానే మీరు అనుకున్న ఫలితాలు సాధించలేదు అనుకోండి... అనుభవ పాఠాలైనా నేర్చుకుంటారు కదా. ఎలా ప్రయత్నించకూడదో గ్రహించి ఈసారి మరోదారిలో వెళ్లి విజయం సాధిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని