ఫార్మసీలో ఉన్నత విద్యకు.. జీప్యాట్‌ మార్గం

దేశంలో వేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో ముఖ్యమైంది ఔషధ పరిశ్రమ. ఇందులో ఫార్మసిస్టుల సేవలే కీలకం. ఏదైనా స్పెషలైజేషన్‌తో ఫార్మా రంగంలో దూసుకుపోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌) దీనికి దారిచూపుతుంది. పరీక్షలో ప్రతిభ చూపినవారు దేశంలోని ప్రముఖ ఫార్మసీ కళాశాలల్లో కోరుకున్న స్పెషలైజేషన్‌తో ఎంఫార్మసీ చదువుకోవచ్చు. ఇటీవలే వెలువడిన జీప్యాట్‌-2024 వివరాలు..

Published : 07 May 2024 01:05 IST

దేశంలో వేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో ముఖ్యమైంది ఔషధ పరిశ్రమ. ఇందులో ఫార్మసిస్టుల సేవలే కీలకం. ఏదైనా స్పెషలైజేషన్‌తో ఫార్మా రంగంలో దూసుకుపోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌) దీనికి దారిచూపుతుంది. పరీక్షలో ప్రతిభ చూపినవారు దేశంలోని ప్రముఖ ఫార్మసీ కళాశాలల్లో కోరుకున్న స్పెషలైజేషన్‌తో ఎంఫార్మసీ చదువుకోవచ్చు. ఇటీవలే వెలువడిన జీప్యాట్‌-2024 వివరాలు..

త ఏడాది వరకు ఈ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించేది. ఈ విద్యా సంవత్సరం నుంచీ ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరఫున నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష స్కోరు మూడేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. ఉమ్మడిగా కౌన్సెలింగ్‌ నిర్వహించరు. అభ్యర్థులు సీటు ఆశిస్తోన్న సంస్థకి విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కోరుతో ఎంఫార్మసీలో చేరినవారు నెలకు రూ.12,400 చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్పు పొందవచ్చు.

ప్రపంచ ఫార్మా హబ్‌గా ఇండియా అవతరిస్తోంది. శరవేగంగా విస్తరిస్తోన్న ఈ పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. నాణ్యమైన ఔషధాలు, కొత్త ఫార్ములాల రూపకల్పనలో మేటి ఫార్మసిస్టుల సేవలెంతో అనివార్యం. అందువల్ల ఉన్నత విద్య అభ్యసించిన ప్రతిభావంతులు ఆకర్షణీయ వేతనంతో మేటి సంస్థల్లో ఉద్యోగాలు పొందగలరు. మందుల పరిశ్రమలతో పాటు ఆసుపత్రులు, గొలుసుకట్టు ఔషధాల విక్రయ సంస్థల్లోనూ ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. వీరు బోధన రంగంలోనూ రాణించగలరు.

దేశంలో సుమారు 870 ఫార్మసీ కళాశాలల్లో ఎంఫార్మసీలో ప్రవేశానికి జీప్యాట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. జామియా హమ్‌దర్ద్‌, పంజాబ్‌, బాంబే ఫార్మసీ కాలేజీ, బిట్స్‌ పిలానీ లాంటి ఉత్తమ విద్యా సంస్థల్లో ఎం.ఫార్మసీలో చేరడానికి జీప్యాట్‌ కీలకం. దేశంలో ఫార్మా విద్యారంగంలో మేటి సంస్థలుగా పేరొందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మా ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌ (నైపర్‌)ల్లో ఎం.ఎస్‌. సీటు పొందాలంటే ఆ సంస్థలు ఉమ్మడిగా నిర్వహించే పరీక్ష రాయాలి. జీప్యాట్‌లో అర్హత సాధించిన వారికే ఆ అవకాశం ఉంటుంది. ప్రభుత్వరంగ పరిశోధనా సంస్థలూ జీప్యాట్‌ స్కోరుతోనే అభ్యర్థులను ఎంపిక చేసి ఉపకారవేతనం అందిస్తున్నాయి. అనేక బహుళజాతి ఫార్మా సంస్థలు, ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థలు ఉద్యోగాలివ్వడానికీ జీప్యాట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి.  

స్పెషలైజేషన్లు...

రెండేళ్ల ఎంఫార్మసీలో పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. విద్యార్థులు ఆసక్తిని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. ఎక్కువ సంస్థల్లో ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ ఎనాలసిస్‌, ఇండస్ట్రియల్‌ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మసీ ప్రాక్టీస్‌, ఫార్మాకాగ్నొసీ, ఫార్మాస్యూటికల్‌ బయోటెక్నాలజీ, రెగ్యులేటరీ అఫైర్స్‌...తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. తర్వాత, పరిశోధన, ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్నవారు పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్చు.

ప్రశ్నపత్రం ఇలా...

ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలు బహుళైచ్ఛిక (మల్టిపుల్‌చాయిస్‌) తరహాలో అడుగుతారు. పరీక్ష 500 మార్కులకు ఉంటుంది. 125 ప్రశ్నలు వస్తాయి. సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. విభాగాలవారీ ఫార్మస్యూటికల్‌ కెమిస్ట్రీ- 38, ఫార్మాస్యూటిక్స్‌- 38, ఫార్మకాగ్నసీ- 10, ఫార్మకాలజీ- 28, బీఫార్మసీ కోర్సులోని ఇతర సబ్జెక్టుల నుంచి- 11 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి 25 ప్రశ్నలూ ఒక సెక్షన్‌గా పరీక్షను 5 విభాగాలు చేశారు. సెక్షన్ల వారీ సమయ నిబంధన విధించారు. ఒక్కో సెక్షన్‌ 36 నిమిషాల్లో పూర్తిచేయాలి.


సన్నద్ధత...

 • జీప్యాట్‌లో మెరుగైన స్కోరు సాధించడానికి బీఫార్మసీ పాఠ్య పుస్తకాలే ప్రామాణికం. పాఠ్యాంశాలపై గట్టి పట్టున్నవారు ఎక్కువ మార్కులు పొంది, అత్యుత్తమ సంస్థలో సీటు సాధించవచ్చు.
 • పాఠ్యాంశాల్లో...ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్‌, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాగ్నసీ ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
 • ఫార్మాస్యూటిక్స్‌లోని ఇతర అంశాలతోపాటు ఫిజికల్‌ ఫార్మసీ, డిస్పెన్సింగ్‌, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్‌ ఫార్మసీలకు సంబంధించిన పాఠ్యాంశాలు క్షుణ్నంగా చదవాలి.
 • ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌, మెడిసినల్‌, బయో, ఫిజికల్‌ కెమిస్ట్రీల్లోని ముఖ్యాంశాలపై శ్రద్ధ చూపించాలి.
 • ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్‌లో వెట్‌ కెమిస్ట్రీలోని వివిధ అంశాలతోపాటు ఆధునిక ఎనలిటికల్‌ విధానాలు, పరికరాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి.
 • ఫార్మాకాలజీలో జనరల్‌ ఫార్మకాలజీతోపాటు, పాథో ఫిజియాలజీ, టాక్సికాలజీ, సెంట్రల్‌ నర్వస్‌ సిస్టంలపై దృష్టి కేంద్రీకరించాలి.
 • ఫార్మకాగ్నసీకి సంబంధించి క్రూడ్‌ డ్రగ్స్‌, వాటి నాణ్యత విశ్లేషణ, పిండి పదార్థాలు, వాలటైల్‌ ఆయిల్స్‌, లిపిడ్స్‌లపై ప్రత్యేక శ్రద్ధతో విజయానికి మార్గం సుగమం అవుతుంది.
 • పాఠ్యాంశాలు చదవడం పూర్తయ్యాక గత ప్రశ్నపత్రాలను సునిశితంగా పరిశీలించాలి. అందులో వివిధ అంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యం, ప్రశ్నల తీరును గమనించి పరీక్ష కోణంలో అధ్యయనం కొనసాగించాలి.
 • సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. నైపర్‌ పాతప్రశ్నపత్రాలూ ఉపయోగపడతాయి. జీప్యాట్‌ సన్నద్ధతతోనే నైపర్లు నిర్వహించే పరీక్షనూ ఎదుర్కోవచ్చు.

వివరాలు..

అర్హత: బీఫార్మసీ ఉత్తీర్ణత. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్న వారితోపాటు బీఫార్మసీ మూడో సంవత్సరం విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధన లేదు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2500. మిగిలిన అందరికీ రూ.3500.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 8 రాత్రి 11:55 వరకు.

పరీక్ష తేదీ: జూన్‌ 8. పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌.

వెబ్‌సైట్‌: https://natboard.edu.in/viewnbeexam?exam=gpat


దేశంలో టాప్‌-10 ఫార్మసీ కళాశాలలు

(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2023 ర్యాంకింగ్‌ ప్రకారం)

1. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, హైదరాబాద్‌
2. జామియా హమ్‌దార్డ్‌, న్యూదిల్లీ
3. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, పిలానీ
4. జేఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, ఊటీ
5. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, ముంబై
6. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, మొహాలీ
7. జేఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, మైసూరు
8. పంజాబ్‌ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌
9. మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, ఉడిపి
10. అమృత విశ్వవిద్యాపీఠం, కోయంబత్తూర్‌

తెలుగు రాష్ట్రాల్లో (టాప్‌-100లో ఉన్నవి)

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, హైదరాబాద్‌ 1
ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, విశాఖపట్నం 22
గీతం, విశాఖపట్నం 48
ఎస్వీ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, చిత్తూరు 57
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి 60
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు 63
విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, నర్సాపూర్‌ 75
శ్రీ విష్ణు కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, భీమవరం 76
అనురాగ్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ 81
కాకతీయ యూనివర్సిటీ, హనుమకొండ 82
నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, మంగళగిరి 83
సీఎంఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, రంగారెడ్డి 85
చలపతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, గుంటూరు 89
రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, అనంతపురం 92

101-125 బ్రాకెట్‌లో

 • గీతాంజలి కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, సికింద్రాబాద్‌
 • గోకరాజు రంగరాజు, హైదరాబాద్‌
 • మల్లారెడ్డి, సికింద్రాబాద్‌
 • శ్రీవిద్యానికేతన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ ఎ.రాజంపేట,
 • శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి... చోటు పొందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని