మార్కెట్‌ కోరుకుంటున్న మేటి నైపుణ్యాలు

ఒక ప్రముఖుడి ఇంట వివాహం జరుగుతోంది. వేడుకకు వేలాదిమంది ఆహూతులు తరలివచ్చారు. కల్యాణ మండపం లోపలికి వెళ్లేటప్పుడు అక్కడ ఉంచిన ఒక నోటీస్‌ ఆహూతుల్ని ఆకర్షిస్తోంది. ‘ఈ పెళ్లిలో మీరున్న ఫొటోలు కావాలంటే.. ఇక్కడున్న క్యూఆర్‌ కోడ్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్‌ చేయండి.

Published : 08 May 2024 00:40 IST

జాబ్‌ స్కిల్స్‌ - 2024

గాలివాటుగానే పడవ ప్రయాణం సాగుతుంది. మార్కెట్‌ ఎటువైపు పరుగెడుతుందో దాని వైపు మనమూ దృష్టి సారించాలి. ఎక్కడ అవకాశం ఉంటుందో అటువైపే ఉద్యోగార్థి లక్ష్యాన్ని సంధించాలి.

క ప్రముఖుడి ఇంట వివాహం జరుగుతోంది. వేడుకకు వేలాదిమంది ఆహూతులు తరలివచ్చారు. కల్యాణ మండపం లోపలికి వెళ్లేటప్పుడు అక్కడ ఉంచిన ఒక నోటీస్‌ ఆహూతుల్ని ఆకర్షిస్తోంది. ‘ఈ పెళ్లిలో మీరున్న ఫొటోలు కావాలంటే.. ఇక్కడున్న క్యూఆర్‌ కోడ్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్‌ చేయండి. ఆపై పెళ్లిలో ఫొటోగ్రాఫర్‌ తీసే ఏ ఫొటోలో మీరున్నా ఆ ఫొటో మీ ఫోన్‌కు చేరుతుంది’ అన్నది ఆ నోటీసు సారాంశం. నోటీసు గమనించిన అందరికీ ఇదేదో గమ్మత్తుగా అనిపించింది. ‘ఇదెలా సాధ్యం? వేలమందిలో నేను ఎక్కడ ఉన్నా.. ఫొటోలో పడితే మాత్రం.. ఆ ఫొటో మొబైల్‌కు చేరుతుందన్న భరోసాతో అందరూ.. స్కాన్‌ చేసి లోపలకు వెళ్లారు. నిజంగానే పెళ్లి వేడుక ముగిశాక.. వేదిక పైకి వెళ్లి వధూవరులకు శుభాకాంక్షలు చెప్పడం నుంచి, విశాలమైన హాలులో కూర్చుని ఉండగా ఉపరితలంపై ఎగురుతూ డ్రోన్‌లతో తీసిన ఫొటోలతో సహా.. సరిగ్గా వారున్న ఫొటోలు స్మార్ట్‌ఫోన్‌కు చేరడంతో ఆహుతులకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ‘ఇదేం చోద్యం.. కలికాలం’ అనుకున్నారు పెద్దవారు. టెక్నాలజీ తెలిసిన తెలివైన టెక్‌తరం ఈ వింత వెనుక ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పసిగట్టేశారు.

మెషీన్‌ లెర్నింగ్‌... ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నమ్మకశ్యంకాని వింతని నిజం చేయగలిగారు. క్యూఆర్‌ కోడ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్‌ చేసినప్పుడు మీ రూపురేఖలతో సహా మీ వివరాలను మెషీన్‌ లెర్నింగ్‌ (ఎం.ఎల్‌.) ఒక డేటాగా భద్రపరుచుకుంటుంది. అలా స్కాన్‌ చేసిన వేలాదిమంది వివరాలు డేటాలో ఎం.ఎంల్‌. నిక్షిప్తం చేసింది. దీని నుంచి కల్యాణ మండపంలో వేలాది మందిలో మీరు ఎక్కడ ఉన్నా.. కెమెరా దృష్టికి వెళితేచాలు దాని నుంచి ఈ రూపురేఖలు అప్పటికే ఫీడ్‌ అయి ఉన్నందున డేటా నుంచి పోల్చుకుని మిమ్మల్ని గుర్తుపట్టింది. మీ ఫొటోని మీ స్మార్ట్‌ఫోన్‌కు చేర్చే పనిని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానం చేసింది. మొత్తంమీద ఎంఎల్‌, ఏఐ ఈ రెండూ కలిసి మిమ్మల్ని ఆశ్చర్యపరిచాయి.

ఇది ఒక చిన్న ఉదాహరణ కాగా.. ఈ రెండూ జంటకవుల్లా వాణిజ్య, జన జీవితాల్లోకి చొరబడి అద్భుతాలు చేస్తున్నాయి. వైద్య, విద్య, వ్యాపార, వాణిజ్యం, ప్రజా జీవిత రంగాలను సస్యశ్యామలం చేస్తున్నాయి. అందుకే నాస్‌కామ్‌ ప్రకారం.. 2027 నాటికి ఎంఎల్‌, ఏఐ మార్కెట్‌ ఏటా 25 నుంచి 33 శాతం పెరుగుతూ వెళ్లి.. రూ. లక్షా 36 వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ రంగంలో ఉద్యోగాలు ఏటా 40 శాతం పెరుగుతూ.. మూడేళ్లలో పది లక్షల కొత్త ఉద్యోగాలు వివిధ రంగాలను ఆవరిస్తాయి. దేశంలోని పెద్ద ఐటీ కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తుండటం, ఇతర రంగాలు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని వినియోగదారులను ఆకట్టుకోవాలన్న తపనను చూస్తుంటే ఎంఎల్‌, ఏఐ ఉద్యోగాల తుపాన్‌ అంచనాలను మించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ నైపుణ్యాలను సమపార్జించడం విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రస్తుతం అనివార్యం.


రెండు కోణాల్లో అవసరం

విద్యార్థులు, ఉద్యోగార్థులు ఎంఎల్‌, ఏఐలను రెండు విధాలుగా చూడాలి. మొదటిది.. తన సాధనకు, ఉద్యోగాన్వేషణకు ఈ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకోవచ్చు. రెండోది.. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించి ఉద్యోగ నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎలా? ముందుగా ఎంఎల్‌, ఏఐ టెక్నాలజీని వినియోగదారుడిగా మారి ఆ అనుభవాన్ని చవిచూస్తే సహజంగా దాన్ని మార్చుకుని నిపుణుడిగా మారాలన్న తపన జనిస్తుంది.


సామర్థ్యాన్ని బట్టి సాధన

సాధారణంగా ఒక క్లాస్‌రూమ్‌లో 30 మంది విద్యార్థులుంటే.. అందరికీ ఒకే విధంగా బోధిస్తారు. ఒకే రకమైన ప్రశ్నపత్రం ఉంటుంది. అయితే వాస్తవంగా చూస్తే క్లాస్‌రూమ్‌లో 30 మంది విద్యార్థుల సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. నేర్చుకునే శక్తి (లెర్నింగ్‌ ఎబిలిటీ) భిన్నంగా ఉంటుంది. ఒక లాజికల్‌ ప్రాబ్లం ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా పట్టు పడుతుంది. కొందరు సునాయాసంగా పరిష్కరించేయొచ్చు. మరికొందరు దానితో గంటలకొద్దీ కుస్తీ పడుతుండవచ్చు. ఇక్కడే ఏఐ.. విద్యార్థి భుజం తడుతుంది. చేయిపట్టుకుని నడిపిస్తుంది. అభ్యసనను ఆనందదాయకం చేస్తుంది. ఏఐ అడాప్టివ్‌ లెర్నింగ్‌ లెక్నాలజీ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అతడు నేర్చుకునే వేగాన్ని గుర్తిస్తుంది. ఫలితంగా అతని స్థాయికి తగ్గ సవాళ్లను (ప్రాబ్లం) ఇస్తూ అంచెలంచెలుగా కఠినం వైపు తీసుకెళుతూ చివరికి అవసరమైన ఎత్తులో నిలుపుతుంది.


తెలివైన పాఠ్యపుస్తకాలు

పాఠ్యపుస్తకాల ద్వారా మనం తెలివితేటలను పెంచుకోవచ్చుననే ఇప్పటివరకూ తెలుసుకున్నాం. కానీ ఏఐ టెక్నాలజీ అనుసంధానిత టెక్స్ట్‌బుక్స్‌ తెలివి నేర్చి, విద్యార్థి తెలివితేటలకు అనుగుణంగా తమను తాము మలచుకుంటాయి. విద్యార్థి చదువుతుంటే అతడు చదివే వేగాన్ని, అతడి గ్రహింపును ఏఐ ఆధారిత ఈ-టెక్ట్స్‌బుక్‌ అంచనా వేస్తుంది. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి అప్పటికప్పుడు ప్రశ్నలు రూపొందించి ఇస్తుంది. విద్యార్థి అవగాహన స్థాయిని బట్టి చిత్రాలు, వీడియోలు ఎంపిక చేసి అందిస్తుంది. విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ మెటీరియల్‌ అనుసరించేందుకు ఈ తరహా ఈ-టెక్స్ట్‌బుక్స్‌ మంచి ఫలితాలను ఇస్తాయి.


గెలిపించే మదింపు

మూల్యాంకనం అంటే విద్యార్థి నేర్చుకున్న దాన్ని మదింపు చేయడం. సంప్రదాయ పద్ధతి ప్రకారం.. చదివిన పాఠ్యాంశాలపై వ్యాసరూప ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు అందరికీ వర్తించేలా ఇవ్వడమే మార్గం. అయితే కృత్రిమమేథ సాంకేతిక పరిజ్ఞాన సహాయం తీసుకుంటే ఏ విద్యార్థికి ఆ విద్యార్థిని ప్రత్యేకంగా అంచనా వేసేందుకు వీలవుతుంది. ఉదాహరణకు విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు ఉత్తీర్ణులు కావలసిన టెస్టులకు ఏఐ టెక్నాలజీ మేళవించి అభ్యసన చేయిస్తున్నారు. దీనివల్ల తొలిదశలో విద్యార్థికి ప్రస్తుతం ఉన్న భాషా పటిమను, విద్యార్థికి ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి ఏఐ అతడి సామర్థ్యానికి తగ్గట్టు పాఠ్యాంశాల మదింపు మోడల్స్‌ను రూపొందించడంతో హుషారుగా నేర్చుకోగలుగుతున్నాడు. ఏ దశలోనైనా విద్యార్థి ముందుకు వెళ్లలేక ఇబ్బంది పడుతుంటే ఏఐ సానుభూతితో అర్థంచేసుకుని చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తుంది.


హాయిగొలిపే స్వీయ అభ్యసన

లెక్చరర్‌ లేదా ప్రొఫెసర్‌ బోధన పూర్తయ్యాక విద్యార్థి ఏఐ ఆధారిత లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తనదైన శైలిలో నేర్చుకోవచ్చు. ఈ మార్గంలో ఒక కాన్సెప్టు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కడైనా అర్థంకాక అడిగితే.. అప్పటికప్పుడు ఎంచక్కా మీ సందేహన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఏఐ సాంకేతికత దీన్ని గుర్తించి అందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. ఏఐ టెక్నాలజీ ద్వారా సేవలందిస్తున్న చాట్‌జీపీటీ, సిరి లేదా అలెక్సా ఏ విధమైన సమాచారాన్ని, పరిష్కారాన్ని అందిస్తున్నాయో అదేవిధంగా సందేహ నివృత్తీ జరుగుతుంది. పైగా విద్యార్థి నేర్చుకోవడంలో పడుతున్న ఇబ్బందిని గుర్తించి తేలికైన టాస్క్‌లు ఇవ్వడం ద్వారా ప్రోత్సహిస్తుంది. విద్యార్థిని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళుతుంది. మనకు క్లిష్టంగా అనిపించిన కాన్సెప్టుల్లోకి పంపి, వివిధ మార్గాల ద్వారా దానితో సహవాసం చేయించి, చివరకు ఆ కాన్సెప్టులపై పట్టు సాధింపజేసేదాకా ఏఐ పట్టువదలదు.

గ్రాడ్యుయేషన్‌లోనో, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ (సీఆర్‌టీ) శిక్షణలోనో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏ విధంగా దోహదపడుతుందో తెలుసుకుందాం. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కి కూర్చున్నప్పుడు ఇదెంతగా ఉద్యోగార్థి బయోడేటాని ప్రకాశవంతం చేస్తుందో చూద్దాం.

  • పారిశ్రామిక సేవారంగాల్లో అగ్రస్థానంలో ఉన్న వివిధ కంపెనీలు తమ ఉత్పత్తి ప్రక్రియలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని వినియోగించి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆటోమొబైల్‌, మెడికల్‌, ఫార్మా, ఎడ్యుకేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ లాంటి విభిన్న రంగాలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ రంగంలో ఉన్న కంపెనీలన్నింటికీ ఎంఎల్‌, ఏఐ టెక్నాలజీలో అవగాహన ఉన్నవారు కావాలి. ఈ సాంకేతికతలో ప్రావీణ్యం ఉంటే ఇక ఆ అభ్యర్థిని అందలం ఎక్కిస్తాయి.

  • 21వ శతాబ్దాన్ని ఏలనున్న కొత్త టెక్నాలజీ ఎంఎల్‌, ఏఐగా గుర్తించినందువల్ల పారిశ్రామిక, తయారీ, సేవా రంగాల్లోని సంస్థలకు కావలసిన ఐటీ సొల్యూషన్స్‌ ఇచ్చి.. వ్యాపారావకాశాలను పెంచుకోవాలని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు దూకుడుగా ఉన్నాయి. ఇతర నైపుణ్యాలకు సంబంధించిన నియామకాల్లో ప్రస్తుతం స్తబ్దత ఉన్నా ఏఐ నేర్చుకున్న ఫ్రెషర్స్‌కు ఐటీ కంపెనీలు రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నాయి.

  • మాంగ్‌ కంపెనీలైన.. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఇంకా ఐబీఎం (వాట్సన్‌) ఏఐ వినియోగంలో దూసుకు వెళుతున్నాయి. ఏఐ నైపుణ్యం ఉన్నవారిని అత్యధిక సంఖ్యలో నియమించుకుని, కొత్త ఉత్పత్తులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

  • ప్రస్తుత కార్పొరేట్‌ వ్యాపార రంగంలో నిర్ణయాలన్నీ విస్తృత డేటా ఆధారంగానే జరుగుతున్నాయి. ఒక్కో నిర్ణయంపై కోట్ల రూపాయలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి శాస్త్రీయంగా విశ్లేషించిన డేటా కేంద్రంగా కంపెనీలు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ వినియోగదారులకు చేరేలా ప్రచారం నిర్వహించాలన్నా, సముద్రమంత సమాచారాన్ని మెషీన్‌ లెర్నింగ్‌ ద్వారా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి, అర్థం చేసుకున్నాక, కృత్రిమమేధ ద్వారా కావలసిన ఫలితాలు కంపెనీలు రాబట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ కీలక ప్రక్రియలోనే ఎంఎల్‌, ఏఐ నేర్చిన లేదా కనీసం అవగాహన ఉన్న అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి.

నీరు పల్లానికే ప్రవహిస్తుంది. నదులన్నీ సాగరంలోనే కలుస్తాయి. పక్షి వినీలాకాశంవైపే ఎగుతుంది. అలాగే ఉద్యోగార్థులు మార్కెట్‌కి ఏమి అవసరమో వాటిని నేర్చుకోవాలి. కంపెనీలు ఏ నైపుణ్యాల కోసం జల్లెడ పడుతున్నాయో వాటిపైనే మొగ్గుచూపాలి. ప్రాథమికంగా  గ్రాడ్యుయేషన్‌లో చదువుకున్న సబ్జెక్టులతోపాటు ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలి. దాన్ని నేర్చుకుని,   బయోడేటాలో చేర్చుకుని, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో రిక్రూటర్ల ముందుకు వెళితే.. విజయం తథ్యమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని