ఏఐసీటీఈ... కెరియర్‌ పోర్టల్‌

టెక్నికల్‌ అంశాలు చదువుకునే విద్యార్థులకు కెరియర్‌పరంగా అన్నివిధాలా సహకరించేలా.. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ), అప్నా.. సంస్థలు రెండూ కలిసి నూతనంగా ఓ కెరియర్‌ పోర్టల్‌ను ప్రారంభించాయి.

Published : 09 May 2024 00:54 IST

టెక్నికల్‌ అంశాలు చదువుకునే విద్యార్థులకు కెరియర్‌పరంగా అన్నివిధాలా సహకరించేలా.. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ), అప్నా.. సంస్థలు రెండూ కలిసి నూతనంగా ఓ కెరియర్‌ పోర్టల్‌ను ప్రారంభించాయి. దాదాపు 12వేలకు పైగా ఉన్న ఏఐసీటీఈ అనుబంధ కళాశాలల్లో చదువుకుంటున్న 30 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు.


ఉద్యోగాల గురించి వెతికే విభాగంలోనూ ఫ్రెషర్స్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌, జాబ్స్‌ ఫర్‌ ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ జాబ్స్‌.. ఇలా విభిన్న రకాలైన కేటగిరీలు ఉన్నాయి. ఇందులోనే టాప్‌ కంపెనీల నుంచి వచ్చే నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటాయి. వీటి ద్వారా ఎంచుకుని విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు.


  • దీని ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే సమాచారం, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవచ్చు. ఏఐసీటీఈ, అప్నా సంస్థలు ఎంతో కసరత్తు చేసి విద్యార్థులకు దీన్ని అందించాయి. ఎంప్లాయిమెంట్‌తోపాటుగా ఇంటర్న్‌షిప్‌ సౌకర్యాలనూ ఇది కల్పించనుంది.  
  • ఈ పోర్టల్‌ విద్యార్థులకు సిలికాన్‌ వ్యాలీ ఇమ్మెర్షన్‌ ప్రోగ్రాంలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో జరిగే ఈ కార్యక్రమం విద్యార్థులకు గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అత్యున్నత కంపెనీల టెక్నికల్‌ టీమ్స్‌తో నేరుగా కలిసి మాట్లాడే అవకాశం కల్పిస్తుంది. అయితే ఇది ఆచరణలోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది.
  • ఈ పోర్టల్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 30 నుంచి అందుబాటులోకి వచ్చింది. కెరియర్‌ ప్రణాళికలో ఉపయోగ పడేలా అనేక ఫీచర్లను ఇందులో చేర్చింది. ఏఐ ఆధారిత రెజ్యుమె రైటింగ్‌ సైతం పొందుపర్చారు. ఉద్యోగాల గురించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఇతర విద్యార్థులు, సంస్థలు, నిపుణులతో అనుసంధానం కావొచ్చు. దేశీయంగానే కాకుండా విదేశాల్లో ఉన్న ఉద్యోగావకాశాల గురించి కూడా దీని ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు కెరియర్‌లో విజయవంతం కావడానికి కావాల్సిన అన్ని రకాల టూల్స్‌ను అందుబాటులోకి తేవడమే దీని ప్రధాన లక్ష్యం. అధికారుల ఆలోచన ప్రకారం.. మార్కెట్‌లో అత్యున్నత స్థాయి వ్యాపార సంస్థలతో విద్యార్థులకు పరిచయం పెరగడమే కాకుండా, వారి నైపుణ్య శిక్షణకు ఉపయోగపడటం, తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ఇది ఉండనుంది.

ఇంకా..

పోర్టల్‌లో ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్స్‌, రెజ్యుమె బిల్డింగ్‌, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌.. ఇలా అన్నీ ఉంటాయి. అలాగే అప్నా సంస్థలో సభ్యులైన ఇతర అభ్యర్థులతో అనుసంధానం కావొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌, జొమాటో, జియో, ఊబర్‌, టెక్‌ మహీంద్ర, పేటీఎం వంటి అనేక ఉన్నతశ్రేణి సంస్థల్లో అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేలా ఈ పోర్టల్‌ సహాయ పడుతుంది. ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆదిత్యబిర్లా వంటి సంస్థల్లో ప్రస్తుతం ఉద్యోగావకాశాలు ఏం ఉన్నాయో చూసి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.  అప్నా సంస్థ హెచ్‌ఆర్‌ ఆధారిత సేవలను ఉపయోగించుకుని, చక్కని ప్రొఫైల్‌ను సిద్ధం చేసుకునేలా చేస్తుంది. నిపుణులతో నేరుగా మాట్లాడి కెరియర్‌ సలహాలు తీసుకోవచ్చు. అప్నా కమ్యూనిటీలతో చేరడం ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

యూఆర్‌ఎల్‌: https://career-portal.aicte-india.org/login


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు