మొదటి సారే.. మంచి ముద్ర!

ఒక సర్వే ప్రకారం.. ఇంటర్వ్యూల్లో అభ్యర్థులను చూసిన తొలి నిమిషంలోనే రిక్రూటర్లు వారిపట్ల ఒక అభిప్రాయానికి వచ్చేస్తారట! ఫస్ట్‌ ఇంప్రెషన్‌ అనేది అంతగా అభ్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. మరి తొలి సందర్భంలోనే మనదైన ముద్ర వేయడానికి, సరైన ఫస్ట్‌ ఇంప్రెషన్‌ కలిగించడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో చూద్దామా!

Updated : 09 May 2024 04:27 IST

ఒక సర్వే ప్రకారం.. ఇంటర్వ్యూల్లో అభ్యర్థులను చూసిన తొలి నిమిషంలోనే రిక్రూటర్లు వారిపట్ల ఒక అభిప్రాయానికి వచ్చేస్తారట! ఫస్ట్‌ ఇంప్రెషన్‌ అనేది అంతగా అభ్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. మరి తొలి సందర్భంలోనే మనదైన ముద్ర వేయడానికి, సరైన ఫస్ట్‌ ఇంప్రెషన్‌ కలిగించడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో చూద్దామా!

ఇంటర్వ్యూలకు అందరూ చదువుతారు, ప్రిపర్‌ అయ్యే వస్తారు, కానీ కొందరే విజయం సాధిస్తారు.. కారణం ఏమిటి? మిగతావారికంటే ఆ విజయం సాధించిన అభ్యర్థులు రిక్రూటర్ల మీద విభిన్నమైన ముద్ర వేయడమే! అలా ఆసక్తి కలిగించడంలో ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌’ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎవరినైనా మొదటిసారి చూసినప్పుడు.. వారి ఆహార్యం, ప్రవర్తన, మాటతీరును బట్టి ఎలాంటి వారో అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంటాం, అది మానవ సహజం. ముఖాముఖి సమయంలో కూడా ఇలాగే తొలిసారి చూసినప్పుడు కలిగే ఫస్ట్‌ ఇంప్రెషన్‌ అభ్యర్థిని రిక్రూటర్లు అడిగే ప్రశ్నల తీరును ప్రభావితం చేస్తుంది. ఇంటర్వ్యూ ఆసాంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగేందుకు ఇది చాలా ముఖ్యం. ఇందుకోసం చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలు అందుకోవచ్చు.

ముఖాముఖిలో వీలైనంత వేగంగా ఇంటర్వ్యూయర్‌ ఆసక్తిని, ఏకాగ్రతను మనపై నిలుపుకొనేందుకు ప్రయత్నించాలి. వారు ఎటువంటి లక్షణాలు కలిగిన అభ్యర్థి కోసం వెతుకుతున్నారో అది మనమే అని గుర్తించేలా చేయాలి. సాధారణంగా యాజమాన్యాలు, మేనేజర్లు తమతో కలిసి పనిచేసేందుకు అనుకూలమైన, నలుగురితో కలిసిపోయే మనస్తత్వం కలిగిన నిపుణులు కావాలి అనుకుంటారు. ఫస్ట్‌ ఇంప్రెషన్‌లోనే అభ్యర్థి అటువంటి వారా కాదా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అభ్యర్థి అందుకు తగిన వారు అనిపిస్తే ప్రొఫైల్‌ పట్ల మరింత ఆసక్తి కనబరుస్తారు.

ఏం చేయకూడదు?

మాట్లాడే సమయంలో ఒకవేళ అప్పటికే ఉద్యోగ అనుభవం ఉంటే పాత కంపెనీ గురించి కానీ, బాస్‌ గురించి కానీ చెడుగా మాట్లాడకూడదు. నిజంగా అక్కడి పరిస్థితులు బాలేకపోయినా సరే.. అవేంటో ఇక్కడివారికి తెలియదు కదా, దాని వల్ల అనవసరంగా మన మీద చెడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది.

  • ఇంటర్వ్యూకి తగిన విధంగా దుస్తులు ఉండాలి. ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాం అనే దాన్ని బట్టి తయారవ్వాలి.
  • మాట్లాడటంలో తడబాటు ఉండకూడదు. ఏం చెప్పినా స్పష్టంగా, అర్థమయ్యేలా ఉండాలి.
  • కొందరు మొదటి ఇంప్రెషన్‌లోనే మార్కులు కొట్టేయాలన్న గాబరాతో అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు, అదీ సరికాదు. ఏది ఎంతవరకూ అవసరమో అంతవరకే మాట్లాడాలి.
  • ఒక అంచనా ప్రకారం..ప్రొఫైల్‌ ఎంత బాగున్నా, ఇంటర్వ్యూకి ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకోవడానికి సంస్థలు ఇష్టపడవట! అందువల్ల నిర్దేశిత సమయానికే ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంగణానికి చేరుకోవాలి. .

సన్నద్ధత

ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ కంపెనీ గురించి, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీని వల్ల సంస్థ మన నుంచి ఏం కోరుకుంటుందో తెలుస్తుంది. మన గురించి మనం ఇచ్చే పరిచయం సంస్థ అవసరాలకు సరిపోతుందో లేదో తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏం చేస్తే మంచి ఫస్ట్‌ ఇంప్రెషన్‌ కలిగించగలమో అర్థం అవుతుంది. పూర్తిగా తెలుసుకోకుండా వెళ్లడం వల్ల ఆత్మవిశ్వాసం సడలి సరిగ్గా ప్రదర్శన ఇవ్వలేం.

కళ్లలోకి చూస్తూ..

రిచయం చేసుకునే సమయంలో ఐ కాంటాక్ట్‌ ముఖ్యం. పక్కకు చూడటం, గదిలో ఇతర వస్తువుల మీద ధ్యాస ఉంచడం అంత మంచిది కాదు. ఇంటర్వ్యూయర్‌ మీదే ధ్యాస ఉంచడానికి ప్రయత్నించాలి. దీని ద్వారా మనం వారి సమయాన్ని గౌరవిస్తున్నామని, ఇంటర్వ్యూ సమయంలో ఫోకస్‌తో ఉన్నామని వారికి అర్థమవుతుంది. వారు చెప్పేది శ్రద్ధగా వింటూ అవసరమైనప్పుడు తల ఆడించడం అవసరం. మన ఆసక్తి దేహ భాషలో (బాడీ లాంగ్వేజ్‌) స్పష్టం కావాలి. ఇవన్నీ మనపై మంచి ఫస్ట్‌ ఇంప్రెషన్‌ కలిగేందుకు దోహదం చేస్తాయి.

ప్రశ్నలు అడగడం

ఇంటర్వ్యూ సమయంలో ప్రశ్నలు అడగడం ద్వారా మనం ఆ సంభాషణలో మిళితమై ఉన్నామని రిక్రూటర్లకు తెలుస్తుంది. ఉద్యోగం పట్ల మనకున్న ఆసక్తి అర్థమవుతుంది. పనిలో ఉత్సాహం ఎటువంటి ఉద్యోగానికైనా ఉండాల్సిన లక్షణం. అలా కుతూహలం చూపే  ఉద్యోగార్థులను ఎవరూ వదులుకోరు.


మాటల ద్వారా..

రిచయ సమయంలో బలమైన, స్పష్టమైన గొంతును వినిపించాలి. ఎదుటివారికి అర్థమయ్యేలా నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడుతూనే ఆత్మవిశ్వాసాన్ని కనబరచాలి. ఇది పూర్తిగా సన్నద్ధమై వచ్చామనే విషయాన్ని తెలియజేస్తుంది.


జాగ్రత్తగా వినడం

ఇంటర్వ్యూ సమయాల్లో మాట్లాడటం ఎంత ముఖ్యమో జాగ్రత్తగా వినడం కూడా అంతే ముఖ్యం. వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ సంభాషణలను గమనించాలి. బాడీ లాంగ్వేజ్‌, ముఖ కవళికలను దృష్టిలో ఉంచుకుని సమాధానాలు ఇస్తుండాలి.


ఆత్మవిశ్వాసం

లాగే మొత్తంగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించేలా ఉండాలి. స్పష్టంగా, కచ్చితంగా మాట్లాడాలి. అవసరం అయినప్పుడు చిన్నగా నవ్వడం అక్కడి వాతావరణాన్ని తేలికపరుస్తుంది. చక్కని భంగిమలో, సౌకర్యవంతంగా కూర్చోవాలి.


ప్రాధాన్యం

ఇంటర్వ్యూ వరకూ ప్రపంచంలో అందరికంటే, అన్నింటికంటే మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తే మనకు ముఖ్యం. పూర్తిగా వారి మీదనే ఏకాగ్రత ఉంచాలి. వీలైనంత వరకూ అక్కడే మనసుపెట్టి మాట్లాడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని