రాసేద్దాం.. విజయగాథ కృత్రిమ మేధతో!

ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ జోడీతో సరికొత్త ఉద్యోగ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది. అందుకు ఏయే మెలకువలు పాటించాలి? ఎలా ముందడుగు వేయాలి?

Updated : 15 May 2024 07:26 IST

జాబ్‌ స్కిల్స్‌ 2024

ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ జోడీతో సరికొత్త ఉద్యోగ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది. అందుకు ఏయే మెలకువలు పాటించాలి? ఎలా ముందడుగు వేయాలి?
బంగారం మెరుపు చూడాలంటే గోడ చేర్పు తీసుకోవాలి. ఆకాశం అందాన్ని తిలకించాలంటే లిప్తపాటు మెరుపు రావాలి. వర్షపు చుక్క ఆల్చిప్పలో పడితేనే ముత్యమై మెరిసేది. గాలి పారిజాత పుష్పాల పైనుంచి వస్తేనే అనిర్వచనీయ సువాసనల్ని ఆస్వాదించగలిగేది. 

వట్టి డిగ్రీతో ఉద్యోగార్థికి గట్టిమేలు జరిగే రోజులు పోయాయి. డిగ్రీ పునాదితోపాటు అద్భుత భవన నిర్మాణ నైపుణ్యం సొంతమైతేనే విద్యార్థి నేటి ఉద్యోగ ప్రపంచంలో రాణించగలిగేది. ఇందుకు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- ఏఐ) పదునైన సాధనమని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. రాబోయే మూడేళ్లలో ఏఐ నైపుణ్య ఆధారంగా పది లక్షల ఉద్యోగాలు మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. 

ఏమిటా కొలువులు? 

రకరకాల పేర్లతో ఏఐ హోదాలు సిద్ధమవుతున్నాయి. పేర్లు వేరయినా అన్నింటికీ కావలసిన నైపుణ్యం కృత్రిమ మేధే. దీనికి అనుబంధంగా ఉండే మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌). ఈ నైపుణ్యాలను డిగ్రీలో భాగంగా నేర్చుకోవచ్చు. డిగ్రీకి సమాంతరంగానూ సాధన చేయవచ్చు. ఏఐ అనేది ఒక అదనపు నైపుణ్యం. ఇప్పటికే అందుబాటులో ఉన్న విజ్ఞానానికి ఈ నైపుణ్యం జోడీ కట్టడంతో ఎన్నో రంగాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఐటీ రంగంలో విరివిగా అందుబాటులో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో దీన్ని పోల్చి చూద్దాం. 

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌- ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌: ఇప్పటివరకున్న మోడల్‌ ప్రకారం ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒక సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ముందుగా ప్రోగ్రామింగ్‌ సిద్ధంచేసి ఉంచుతాడు. దీని ప్రకారం భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సమాధానాలు సాఫ్ట్‌వేర్‌లో లభ్యమతాయి. ఉదాహరణకు వైద్యరంగంలో రోగ నిర్థరణకు ఒక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారనుకుందాం. వ్యాధి లక్షణాల ఆధారంగా అప్పటికే సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచి ఉన్న జబ్బుల్లో ఒకదాన్ని ఎంపిక చేసి నివేదికలో ఇస్తుంది. దీన్ని వైద్యులు ఒక సూచనగా తీసుకొని భౌతికంగా రోగి ఆరోగ్య సమస్యలు, కనిపిస్తున్న లక్షణాలను పోల్చిచూసుకొని రోగ నిర్థరణకు వస్తారు.

కానీ, అదే ఏఐ నైపుణ్యాన్ని ఇక్కడ వర్తింపజేస్తే సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచిన వ్యాధులే కాకుండా, రోగి లక్షణాలకు వర్తించే వ్యాధుల గుర్తింపునకు ఏఐ వెబ్‌ ప్రపంచం మొత్తాన్నీ శోధించి సమాచారం సేకరిస్తుంది. విస్తృత డేటా ప్రాతిపదికగా రోగ నిర్థరణను సూచిస్తుంది. దీనివల్ల వైద్యులకు మరింత సహాయకారి అవుతుంది.

సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పనితీరును పోల్చిచూస్తే సహజంగానే ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌దే పైచేయి అవుతుంది. 

డేేటా సైంటిస్ట్‌- ఏఐ డేటా సైంటిస్ట్‌: స్టాటిస్టిక్స్‌, డేేటాసైన్స్‌ల ఆధారంగా డేటా సైంటిస్ట్‌ సమాచార సేకరణ చేస్తాడు. దీనికి టెక్నాలజీ జోడించి ఆ డేటాకి అర్థవంతమైన ముగింపు ఇస్తాడు. ఏఐ డేటా సైంటిస్ట్‌ అయితే దీనిపై ఓ అడుగు ముందుకు వేస్తాడు. ఈ ముగింపునకు కృత్రిమ మేధ]ను జతచేసి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను ఆవిష్కరిస్తాడు. కేవలం డేటాకు ముగింపు ఇవ్వడం వేరు. దీని ప్రాతిపదికపై వివిధ సవాళ్లకు పరిష్కారాలు చూపడం ఎంతో విలువైనదిగా కంపెనీలు భావిస్తాయి. 

ప్రొడక్ట్‌ మేనేజర్‌- ఏఐ ప్రొడక్ట్‌ మేనేజర్‌: సాధారణంగా ఏదైనా మాన్యుఫాక్చరింగ్‌/ సర్వీస్‌ కంపెనీలో ప్రొడక్ట్‌ మేనేజర్లు రెండు రకాలు. ప్రొడక్ట్‌ మేనేజర్‌- రిసెర్చ్‌, ప్రొడక్ట్‌ మేనేజర్‌ సేల్స్‌, ప్రమోషన్‌ బాధ్యతల్లో ఉంటారు. ఏఐ ప్రొడక్ట్‌ మేనేజర్లకు కూడా ఇవే విధులుంటాయి. కానీ, ఏఐ ప్రొడక్ట్‌ మేనేజర్‌ కృత్రిమ మేధ ఉపకరణాలతో ఉత్పత్తి/ సేవలను మెరుగుపరుస్తాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిధి విశాలం కాబట్టి ఫలితాలు ప్రభావవంతంగా ఉంటాయని ఇప్పటికే నిరూపితమయ్యాయి. ఇదేవిధంగా వివిధ ఏఐ హోదాలు, బాధ్యతలు సాంప్రదాయిక పనితీరులో నిమగ్నమైన ఉద్యోగులకంటే మెరుగ్గా ఉండటంతో కంపెనీలు ఏఐ స్పెషలిస్టుల కోసం వెతుకుతున్నాయి.  

ఏఐ ఇంజినీర్‌, ఇంటలిమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, ఏఐ అసోసియేట్‌, ఏఐ -ఎంఎల్‌ ఇంజినీర్‌, కన్సల్టెంట్‌ ఏఐ డెవలపర్‌, జనరేటివ్‌ ఏఐ మెషిన్‌ లెర్నింగ్‌ రిసెర్చ్‌ ఇంజినీర్‌, ఏఐ ఆర్టిస్ట్‌, ఏఐ- ఎంఎల్‌ డెవలపర్‌, పైతాన్‌ ఏఐ డెవలపర్‌, డేటా ఏఐ స్పెషలిస్ట్‌.. మరెన్నో.

ఫ్రెషర్లు ఏం చేయాలి?

చుట్టూ నీరున్నా... మన దగ్గర పాత్ర ఉంటేనే ఎంత కావాలో అంత తీసుకోగలం. ఏఐ ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నా తాజా అభ్యర్థులు ఈ నైపుణ్యాలను సముపార్జిస్తేనే సాధించగలిగేది. ఇందుకు మూడు మార్గాలున్నాయి. 

  • డిగ్రీలోని బేసిక్‌ సబ్జెక్ట్టులతోపాటు ఏఐ స్కిల్స్‌ను నేర్చుకోవడం.  
  • డిగ్రీలో ఏఐ భాగం కానప్పుడు సమాంతరంగా విడిగా నేర్చుకోవడం.  
  • డిగ్రీ పూర్తయ్యాక ఏఐ టెక్నాలజీపై స్వల్పకాలిక కోర్సు చేయడం. 

సమాంతరంగా కానీ, వేరుగా కానీ ఏఐ కోర్సు చేయడంతోనే ఉద్యోగం రాదు. ఏఐ టూల్స్‌ సాధన చేసేందుకు ఇంటర్న్‌షిప్‌ చేయడం, ఏఐ కాంపిటిషన్స్‌లో పాల్గొనడం ఉద్యోగార్థులకు లాభిస్తుంది.

ఏఐకి తొలిమెట్టు అయిన మెషిన్‌ లెర్నింగ్‌కి సంబంధించిన కొన్ని మౌలిక విషయాలు తెలుసు కునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

  • స్టాటిస్టిక్స్‌ డిగ్రీలో భాగంగా నేర్చుకొని ఉండకపోతే ఈ సబ్జెక్టుపై అవగాహన ఏర్పరచుకోవాలి.  
  • డిజిటల్‌ రంగంలో డేటా ఏవిధంగా నిర్మితమవుతుందో అధ్యయనం చేయాలి.  
  • డేటా ఆధారంగా ఎంఎల్‌ ప్లాట్‌ఫారం పనితీరుపై అవగాహన పెంచుకోవాలి.

ఈ కృషి వల్ల ఉద్యోగార్థికి జరిగే మేలు..

  • ఏఐ- ఎంఎల్‌ చేసిన విద్యార్థులు తమ బయోడేటాలో వాటిని పేర్కొనాలి. వాటిపై చేసిన ప్రాక్టికల్స్‌ను కూడా తెలపాలి.  
  • దీనివల్ల క్యాంపస్‌ ఎంపికల సమయంలో మిగతా విద్యార్థుల కంటే ప్రాధాన్యం లభిస్తుంది. ఇంటర్వ్యూలో ఏఐ-ఎంఎల్‌పై విద్యార్థికి ఉన్న అవగాహనను కంపెనీ ప్రతినిధులు గుర్తిస్తే సెలక్షన్స్‌లో తొలి ప్రాధాన్యం లభిస్తుంది.

ఉద్యోగాన్వేషణలోనూ..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నైపుణ్యం అలవర్చుకుంటే తేలిగ్గా ఉద్యోగాలు అందుకోవచ్చునని తెలుసుకున్నాం. వివిధ రంగాల్లో ఏఐ చాప కింద నీరులా ప్రవేశిస్తుండటమే ఇందుకు కారణం. అయితే ఏఐ టూల్స్‌ని వినియోగించుకుంటూ టెక్‌వరల్డ్‌లో ఉద్యోగాలు వెతుక్కోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నాయి కొన్ని ప్లేస్‌మెంట్‌ కంపెనీలు. రెజ్యూమె బిల్డర్‌ డాట్‌ కామ్‌ చేసిన సర్వే ప్రకారం- చాట్‌ జీపీటీని ఉపయోగించి రెజ్యూమె, కవర్‌ లెటర్లను రూపొందించుకున్న 59 శాతం మంది వేగంగా కొలువులు సొంతం చేసుకున్నారు. 

ఒక ఉద్యోగార్థి రెజ్యూమెను రాగరంజితం చేసి రిక్రూటర్లను ఆకట్టుకునేందుకు ఏడు విధాలుగా జనరేటివ్‌ ఏఐ దోహదపడుతుంది. 

1. రెజ్యూమె క్రియేటర్‌ 

మీ రెజ్యూమెపై హెచ్‌.ఆర్‌. అధికారి దృష్టి నిలిపేది అతి స్వల్ప వ్యవధి మాత్రమేనని మీకు తెలుసా? ఒక అధ్యయనం ప్రకారం వందలు, వేలల్లో రెజ్యూమెలను నిత్యం పరిశీలించే కంపెనీ కీలక అధికారులు ఒక అభ్యర్థి రెజ్యూమెపై దృష్టి నిలిపేది కేవలం ఆరు సెకండ్లేనట. ఈ కొద్ది సమయంలో రెజ్యూమెలోని శీర్షికలు, విభాగాలు, బుల్లెట్‌ పాయింట్లను వారి కళ్లు స్కాన్‌ చేసేస్తాయి. మూసగా ఉంటే.. ఫస్ట్‌ ఇంప్రెషన్‌ పోతుంది. కాస్త భిన్నంగా ఉంటే ఆ రెజ్యూమెను హెచ్‌.ఆర్‌. అధికారి మరికొన్ని సెకండ్లు పరిశీలిస్తారు.

చాట్‌ జీపీటీ ఉపయోగించడంతోపాటు తగిన కీ వర్డ్స్‌ ప్రయోగిస్తే మంచి రెజ్యూమె రూపొందుతుంది. మీరు చాట్‌ జీపీటీకి ఫీడ్‌ చేసే పదాలను బట్టే మీకు కావలసిన అవుట్‌పుట్‌ వస్తుంది. ఏఐ- చాట్‌ జీపీటీని సమర్థంగా వినియోగించి రెజ్యూమె సిద్ధం చేసుకోవాలి. 

2. కవర్‌ లెటర్‌ 

ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు కవర్‌ లెటర్‌ రాయాల్సిన రోజులకు కాలం చెల్లిందన్నది నిజం కాదు. ఇప్పటికే చాలా కంపెనీలు వివిధ పొజిషన్లకు కవర్‌ లెటర్లను ప్రోత్సహిస్తున్నాయి. ఈ లెటర్‌ మూసగా లేకుండా ఏఐ- చాట్‌ జీపీటీ కాపాడుతుంది. అయితే మీరు చెప్పాలనుకున్న విషయాలకు సంబంధించిన కీలక పదాలు/వాక్యాలను ప్రామ్టింగ్‌తో ఇవ్వాల్సివుంటుంది. ఉదాహరణకు ఏఐ టూల్స్‌ ఉపయోగించే జాబ్స్‌ అంటే మీకు ఇష్టం అనే విషయాన్ని మీరు చాట్‌ జీపీటీకి ఫీడ్‌ చేస్తే అందుకు తగ్గ కంటెంట్‌ లెటర్‌ను ఏఐ సృష్టిస్తుంది. 

3. లింక్డ్‌ ఇన్‌తో అనుసంధానం 

ప్రొఫెషనల్స్‌, కంపెనీల హెచ్‌.ఆర్‌. నిపుణులూ, ఉద్యోగ ఖాళీల సోషల్‌ మీడియా వేదిక ‘లింక్డ్‌ ఇన్‌’. ఫ్రెÆషర్‌ అయినా ఈ వేదికను పంచుకోవడం వల్ల ఉద్యోగాన్వేషణలో ప్రయోజనం ఉంటుంది. దీనిలో పోస్ట్‌ చేస్తే విభిన్న కంపెనీలు చూసే అవకాశం ఉంది. మీ రెజ్యూమెకి ఏఐ టూల్‌ని జోడించడం వల్ల వినూత్నంగా రూపొంది రిక్రూటర్స్‌ను ఆకర్షిస్తుంది. 

4 ఏఐ చేయూతతో ఇంటర్వ్యూ సాధన

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూల విషయంలోనూ ఏఐ సహకారం తీసుకోవచ్చు. ప్లేస్‌మెంట్‌కు వస్తున్న కంపెనీ గురించి గూగుల్‌ సెర్చ్‌ చేస్తే గత ఇంటర్వ్యూలు, మోడల్‌ ఇంటర్వ్యూలు లభ్యమవుతాయి. వీటికి సమాధానాలు, మౌఖిక పరీక్షలో అడిగిన ప్రశ్నలకు ప్రభావవంతమైన జవాబులు చాట్‌ జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూ సరళి, అందులో చేసే పొరపాట్లు, మెరుగైన జవాబులను చాట్‌ జీపీటీ ద్వారా గుర్తించవచ్చు. 

5. తగిన పొజిషన్‌ గుర్తింపు 

అందుబాటులో ఉన్న స్థానానికి పోటీపడి, ఎంపికయితే చేరిపోయి ఆ తర్వాత ఆ హోదాలో నిర్వహించాల్సిన బాధ్యతలు నచ్చక బాధపడే దుస్థితిని ఏఐ టూల్స్‌ ద్వారా నివారించవచ్చు. ఉద్యోగార్థి తన నైపుణ్యాలు, విద్యార్హతలు, తన ఆసక్తి, అనుభవాలను చాట్‌ జీపీటీకి తెలిపి తనకు సరిపోయే పొజిషన్లను సూచించమని కోరవచ్చు. దీనివల్ల నచ్చని ఉద్యోగంలో పనిచేయాల్సిన అగత్యం ఏర్పడదు. చాట్‌ జీపీటీ సూచించే పొజిషన్ల కోసమే ప్రయత్నం చేయవచ్చు. 

6. ఏఐ తోడ్పాటుతో ఈ-మెయిల్‌ 

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ డ్రైవ్‌ ముగిశాక ఫలితాల గురించీ, ఇచ్చే ప్యాకేజీల గురించీ, ఇంకా ఇతర విషయాల గురించీ కంపెనీకి వందల ఈ-మెయిల్స్‌ వెళతాయి. హెచ్‌ఆర్‌ విభాగం వాటినుంచి మీ మెయిల్‌ వైపు చూపు తిప్పుకోవాలంటే జీపీటీ సహకారం తీసుకొని ఈ-మెయిల్స్‌ రాయడం మంచిదే. దీనివల్ల మీ మెయిల్‌లో కొత్తదనం ఉట్టిపడుతూ హెచ్‌ఆర్‌ అధికారి దృష్టిని ఆకర్షిస్తుంది.

7. మీ అప్లికేషన్‌ ఆటోమేట్‌

ఆఫ్‌ క్యాంపస్‌ మార్గంలో వివిధ కంపెనీలకు దరఖాస్తు చేస్తున్నట్టు ప్రతిసారీ వర్చువల్‌గా దరఖాస్తు చేయడం కష్టమైన పని. సాధ్యమైనంతవరకు టెక్నాలజీ సహకారంతో ఆటోమేట్‌ చేస్తే ఎన్నో అవకాశాలను వినియోగించుకోవచ్చు.

  • ఏఐ టూల్‌లో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ‘సొనారా’ సహకారం తీసుకుంటే వేల ఉద్యోగాలకు మీ దరఖాస్తును సిద్ధం చేస్తుంది.
  • ‘సింప్లిఫై కో పైలెట్‌’ అనే క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ ద్వారా కొన్ని క్లిక్స్‌తో మీ ఉద్యోగ దరఖాస్తు గుర్తింపు జరుగుతుంది.
  • దరఖాస్తు చేశాక వేలాది అప్లికేషన్ల మధ్య మీ దరఖాస్తును ట్రాక్‌ చేసేందుకు ‘కెరియర్‌ ఫ్లో డాట్‌ ఏఐ’ దోహదం చేస్తుంది.

మొత్తం మీద ఏఐ నైపుణ్యాలతో ఉద్యోగ సాధన తేలిక   కావడమే కాదు, ఉద్యోగ దరఖాస్తుకూ ఏఐ టూల్స్‌ సహాయపడతాయి. కావలసిందల్లా ఉద్యోగార్థికి ఏఐపై మెరుగైన అవగాహనే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని