ప్రముఖ సంస్థల్లో ఫార్మసీ ప్రవేశాలు

దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో ఫార్మా ముఖ్యమైనది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఫార్మా సంస్థలు ఔషధాల తయారీలో సేవలందిస్తున్నాయి. లక్షల మంది ఫార్మా పట్టభద్రులు ఇందులో ఉపాధీ పొందుతున్నారు. మేటి సంస్థల్లో పీజీ స్థాయిలో ఫార్మసీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలు అందుకుంటున్నారు. అలాంటి వాటిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌)లు ముఖ్యమైనవి. ఈ సంస్థలు ఫార్మసీలో పీజీతోపాటు పీహెచ్‌డీ కోర్సులనూ అందిస్తున్నాయి.

Published : 16 May 2024 00:29 IST

నైపర్‌ జేఈఈ ప్రకటన

దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో ఫార్మా ముఖ్యమైనది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఫార్మా సంస్థలు ఔషధాల తయారీలో సేవలందిస్తున్నాయి. లక్షల మంది ఫార్మా పట్టభద్రులు ఇందులో ఉపాధీ పొందుతున్నారు. మేటి సంస్థల్లో పీజీ స్థాయిలో ఫార్మసీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలు అందుకుంటున్నారు. అలాంటి వాటిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌)లు ముఖ్యమైనవి. ఈ సంస్థలు ఫార్మసీలో పీజీతోపాటు పీహెచ్‌డీ కోర్సులనూ అందిస్తున్నాయి. వాటిలో ప్రవేశానికి నైపర్‌ జేఈఈ రాయాలి. ఆ ప్రకటన ఇటీవలే వెలువడింది.

ఫార్మసీ చదువుల్లో జాతీయ ప్రాధాన్య సంస్థలుగా నైపర్లను దేశవ్యాప్తంగా 7 కేంద్రాల్లో నెలకొల్పారు. ఇవి.. అహ్మదాబాద్‌, గువాహటి, హాజీపూర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, రాయ్‌బరేలీ, మొహాలిల్లో ఉన్నాయి.

ఈ ఏడాది ప్రవేశ పరీక్షను నైపర్‌, గువాహటి నిర్వహిస్తోంది. ఈ సంస్థల్లో ఫార్మసీ పీజీ కోర్సుల్లో చేరినవారు రెండేళ్ల పాటు ప్రతి నెలా రూ.12,400 స్టైపెండ్‌ పొందవచ్చు. ఎంబీఏ ఫార్మా కోర్సుకు మాత్రం ఇది వర్తించదు. ఈ కోర్సులో చేరిన మెరిట్‌ విద్యార్థులకు ఆ సంస్థలు ప్రత్యేకంగా స్టైపెండ్‌ చెల్లిస్తున్నాయి.


కోర్సులు, స్పెషలైజేషన్ల్చు

ఎంఫార్మసీ, ఎంటెక్‌ (ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ), ఎంఎస్‌ (ఫార్మసీ), ఎంబీఏ (ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌)

అన్ని సంస్థలూ, అన్ని కోర్సుల్లోనూ కలిపి 990 పీజీ సీట్లను నైపర్‌ జేఈఈ-2024తో భర్తీ చేస్తారు.

ఎంఎస్‌ ఫార్మసీ: 9 స్పెషలైజేషన్లు ఉన్నాయి. మెడిసినల్‌ కెమిస్ట్రీలో 122, నేచురల్‌ ప్రొడక్ట్స్‌లో 58, ట్రెడిషినల్‌ మెడిసిన్‌లో 5, ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్‌లో 108, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీలో 140, రెగ్యులేటరీ టాక్సికాలజీలో 21, ఫార్మాస్యూటిక్స్‌లో 142, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్‌లో 37, రెగ్యులేటరీ అఫైర్స్‌లో 18 సీట్లు ఉన్నాయి.

ఎంఫార్మసీ: ఫార్మస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌)లో 23, ఫార్మసీ ప్రాక్టీస్‌లో 35, క్లినికల్‌ రిసెర్చ్‌లో 9 సీట్లు లభిస్తున్నాయి.

ఎంటెక్‌: బయోటెక్నాలజీలో 120, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీలో 40, మెడికల్‌ డివైజెస్‌లో 62 సీట్లు ఉన్నాయి.
ఎంబీఏ ఫార్మా: ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌లో 50 సీట్లు ఉన్నాయి.

అర్హత: బీఫార్మసీ ఉత్తీర్ణత. కొన్ని కోర్సులకు బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, నిర్దేశిత విభాగాల్లో ఎమ్మెస్సీ, బీటెక్‌ పూర్తిచేసుకున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత కోర్సుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం, దివ్యాంగులైతే 50 శాతం ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. అలాగే నైపర్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారు జీప్యాట్‌ /గేట్‌ /నెట్‌లో 2022/2023/2024లో ఎప్పుడైనా అర్హత సాధించడం తప్పనిసరి. బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, బీడీఎస్‌ విద్యార్హతలతో దరఖాస్తు చేసుకున్నవారికి ఈ స్కోర్లు అవసరం లేదు.


పీజీ పరీక్ష ఇలా...

దీన్ని ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న కోర్సు ప్రకారం ఏదో ఒక సెషన్‌లో రాయాలి. రెండు రకాల కోర్సులకు పోటీ పడేవారు రెండు సెషన్లకూ హాజరుకావాలి. పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో రెండు సెక్షన్ల నుంచి 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. వీటికి వంద మార్కులు. ప్రతి ప్రశ్నకూ అర మార్కు. తప్పు సమాధానానికి ఇందులో పావు శాతం అంటే 0.125 మార్కులు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. మొత్తం పేపర్‌లో.. సెక్షన్‌ ఏలో 25 శాతం, సెక్షన్‌ బీలో 75 శాతం ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌ ఏలో.. జనరల్‌ ఇంగ్లిష్‌, ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ బీలో బీఫార్మసీ లేదా సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ సబ్జెక్టుల నుంచి వీటిని అడుగుతారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఈ స్కోరుతో పలు ప్రైవేటు సంస్థల్లోనూ ఫార్మసీ కోర్సుల్లో చేరవచ్చు.

  • పరీక్షలో విజయానికి బీఫార్మసీ పుస్తకాల్లోని ముఖ్యాంశాలను బాగా చదవాలి.
  • పాఠ్యాంశాలు చదవడం పూర్తయిన తర్వాత గత ప్రశ్నపత్రాలను సునిశితంగా పరిశీలించాలి. అందులో వివిధ అంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యం, ప్రశ్నల తీరును గమనించి పరీక్ష కోణంలో అధ్యయనం కొనసాగించాలి.
  • సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకుని, క్రమంగా మెరుగవ్వాలి.

ఇంజినీరింగ్‌కు ఐఐటీలు, వైద్యవిద్యకు ఎయిమ్స్‌ల మాదిరి ఫార్మసీలో మేటి చదువులకు నైపర్లు వేదికలు.
ఇక్కడ పలు స్పెషలైజేషన్లతో ఎంఫార్మసీతోపాటు ఎంబీఏ ఫార్మా కోర్సు అందుబాటులో ఉంది. అలాగే ఫార్మా రంగంలో పీహెచ్‌డీనీ పూర్తి చేసుకోవచ్చు. ఉన్నత బోధన ప్రమాణాలు, ఆధునిక ప్రయోగశాలలు, వసతులు ఈ సంస్థల ప్రత్యేకత. ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులు ఫార్మాకు సంబంధించి బోధన, పరిశోధన రంగాల్లోనూ రాణించడానికి అవకాశాలు ఎక్కువ. నైపర్లు ప్రపంచంలో పేరొందిన సంస్థలతో కలిసి ఫార్మసీలో బోధన, పరిశోధనను కొనసాగిస్తున్నాయి. అలాగే కోర్సులో ఉన్నప్పుడే ప్రాంగణ నియామకాల్లో కొలువులు పొందవచ్చు.


పీహెచ్‌డీ పరీక్ష

యొలాజికల్‌ సైన్సెస్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌లకు చెందిన పలు విభాగాల్లో పీహెచ్‌డీ అందిస్తున్నారు. మొత్తం 73 సీట్లు ఉన్నాయి. ఎంఎస్‌ ఫార్మ్‌/ ఎం.ఫార్మసీ/ ఎంటెక్‌ ఫార్మ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో సీట్లు కేటాయిస్తారు.
పరీక్షలో 170 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 85 మార్కులు. రెండు సెక్షన్ల నుంచి వీటిని అడుగుతారు. సెక్షన్‌ ఏలో 25 శాతం, సెక్షన్‌ బీలో 75 శాతం ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ ఏ ప్రశ్నలు.. ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ విభాగాల నుంచి వస్తాయి. సెక్షన్‌ బీలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి ఇవి ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా సమాధానం గుర్తిస్తే పావుశాతం 0.125 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో అర్హత సాధించినవారికి 15 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


గమనించండి

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 24 సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు రుసుము: పీజీ కోర్సులకు.. ఎస్సీ, ఎస్టీలకు రూ.1500. మిగిలిన అందరికీ రూ.3000. పీహెచ్‌డీకి ఎస్సీ, ఎస్టీలకు రూ.2000. మిగిలిన అందరికీ రూ.4000.

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.

వెబ్‌సైట్‌: https://niperguwahati.ac.in/niperjee/index.html


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని