పోటీ ప్రపంచంలో ‘డేటా’ విశ్వరూపం!

గణాంక సమాచారాన్ని అధ్యయనం చేయడమే డేటా సైన్స్‌. గణాంకాలు అపార జలరాశిని తలపిస్తుంటే దాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తేనే అందులో దాగివున్న ఆణిముత్యాలను కనుగొనేది.

Published : 20 May 2024 00:43 IST

జాబ్‌ స్కిల్స్‌ 2024

సాధారణ గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్‌లోనూ డేటాసైన్స్‌ కాంబినేషన్‌లో కోర్సులు విరివిగా లభిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. బీఎస్‌సీ డేటాసైన్స్‌ చేసినా,  ఇంజినీరింగ్‌ను డేటాసైన్స్‌ కాంబినేషన్‌తో పూర్తి చేసినా ఏఐతో ఇంజినీరింగ్‌/ స్వల్పకాలిక కోర్సు చదివిన తాజా అభ్యర్థులకు ప్రాంగణ ఎంపికల్లో ప్రాధాన్యం లభిస్తోంది. 


‘టైమ్‌ ఈజ్‌ మనీ’ అన్నది ఒకనాటి మాట. అంకెలూ, గణాంకాలే లంకె బిందెలన్నది నేటి మాట. సంఖ్యా సమాచారమే అపార సంపద.      గణాంకాల్లో కాసుల గలగలలు కంపెనీలకు కనిపిస్తున్నాయి. దీన్నే డేటాసైన్స్‌ అంటున్నారు. డేటానే దివ్యౌషధంగా కార్పొరేట్‌ సంస్థలు భావిస్తున్నాయి. 


డేేటా అంటే అంకెల, సంఖ్యల సమూహం కాదు. తటస్థంగా నిలిచిపోయే తటాకం కాదు. గలగలా పారే సెలయేరు. పరవళ్లు తొక్కుతూ పరుగెత్తే నదీ ప్రవాహం. ఇటువంటి సమాచారాన్ని ఒడిసిపట్టి శాస్త్రంగా మలచి మథిస్తే  అద్భుతాలు జరుగుతాయి. వ్యాపార విజయాలు ప్రాప్తిస్తాయి. దీనికోసం డేటాను పరిపరి విధాల అధ్యయనం చేస్తారు. 


ణాంక సమాచారాన్ని అధ్యయనం చేయడమే డేటా సైన్స్‌. గణాంకాలు అపార జలరాశిని తలపిస్తుంటే దాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తేనే అందులో దాగివున్న ఆణిముత్యాలను కనుగొనేది. విస్తృతంగా లభ్యమవుతున్న గణాంక సమాచారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యాపారాభివృద్ధికి దోహదం చేయగల సోపానాలను అందజేయడమే డేటా సైన్స్‌.  
ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు మన దేశంలో పది కోట్లమంది వినియోగదారులున్నారు. వీరంతా వేర్వేరు కుల, మత, భాషా ప్రాంతాలకు చెందినవారూ, విభిన్న ఆదాయ వర్గాలవారూ. కానీ అమెజాన్‌ అప్పుడప్పుడూ తీసుకువచ్చే ఆఫర్‌ సేల్స్‌కు అనూహ్య స్పందన వస్తుంటుంది. నిర్ణీత గడువులోగానే ఈ ఆఫర్‌ సేల్‌ ముగిసిపోతుంటుంది. ఇదెలా సాధ్యమవుతోంది?  
దీనికి సమాధానం డేటా సైన్సే. అమెజాన్‌కు ఉండే పది కోట్లమంది భారతీయ వినియోగదారుల్లో కనీసం కోటిమంది రకరకాల ఆర్డర్లు పెడుతుంటారు. ఈలెక్కన చూస్తే సంవత్సరానికి అమెజాన్‌కి 365 కోట్ల ఆర్డర్లు వస్తుంటాయి. అంటే కొన్ని కోట్ల వస్తువులు, కొన్ని కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంటుంది. అంతటి డేటా పెద్ద కుప్పలా అందుబాటులో ఉంటుంది. దీన్ని అధ్యయనం చేయడం ద్వారా అనేక విషయాలు వెల్లడవుతాయి. దేశంలోని ఏ ప్రాంతం నుంచి ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి? ఎంతటి ధర గల వస్తువులకు ఆర్డర్లుంటున్నాయి? ఏ తరహా వస్తువులకు వినియోగదారుల నుంచి గిరాకీ ఉంటోంది? ఏ ఆదాయ వర్గాలవారు ఎక్కువ స్పందిస్తున్నారు? ఆర్డర్లను ఏ ప్రాతిపదికన పెడుతున్నారు?.. ఇలాంటి ఎన్నో విషయాలు డేటా నిపుణుల అధ్యయనంలో బహిర్గతమవుతాయి.  
దీని ఆధారంగా అమెజాన్‌ సీజనల్‌ ఆఫర్‌ సేల్స్‌ రూపొందిస్తున్నందువల్ల వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది.   చీకటిలో బాణం వదిలినట్టు కాకుండా గురిచూసి వినియోగదారుల అవసరాలపై ఆఫర్లు ఎక్కుపెట్టేందుకు ఊతంలా ఉపకరిస్తున్నది డేటా సైన్సే!  
ప్రతి వ్యాపారంలోనూ సమాచారం కుప్పలుతెప్పలుగా వచ్చేస్తుంటుంది. ఒకరోజు బిజినెస్‌ అమోఘంగా ఉంటుంది. మరో రోజు వెలవెల పోతుంటుంది. ఒక నెల కళకళలాడి మరో నెల స్తబ్ధుగా ఉంటుంది. మరి ఇలాంటి అస్తవ్యస్త వ్యాపారంలో నిలబడేదెలా? దీన్ని అర్థం చేసుకొని రాబోయే రోజులకు సంసిద్ధం కావడం ఎలా? అని తలలు పట్టుకుంటున్న వ్యాపారవేత్తలకు డేటాసైన్స్‌ బలమైన చేయూత, గొప్ప ఊరట.  
అనిశ్చిత వ్యాపారాన్ని ప్రతిబింబించే గణాంకాలను పోగుచేసి... మూడేళ్లనో, ఐదేళ్లనో ప్రామాణికంగా తీసుకొని అధ్యయనం చేసి డేటా అనలిస్ట్‌లు చంచల స్వరూపంగల వ్యాపారానికి కళ్లాలు వేసి నడిపేందుకు స్థిర నమూనాలను అందిస్తారు. ఒక ఏడాదిలో వ్యాపారం ఏ రోజుల్లో, వారాల్లో, నెలల్లో కాసులు కురిపిస్తుంది? ఏయే సమయాల్లో ఒక మోస్తరుగా ఉంటుంది? ఎప్పుడు కళ తప్పుతుంది? అన్న విశ్లేషణ సాధికారికంగా గణాంక సహితంగా చేతికి వస్తే వ్యాపారవేత్తకు అంతకంటే కావలసిందేముంది? దీని ఆధారంగా భవిష్యత్తుకు సన్నద్ధం అయ్యేందుకు ఎంత మంచి అవకాశం! ఎప్పుడెంత స్టాక్‌ పెట్టాలి? ఎప్పుడెంతమంది సిబ్బంది ఉండాలి? ఎప్పుడెంత పెట్టుబడికి సిద్ధం కావాలన్న ప్రణాళిక వ్యాపార సమర్థ నిర్వహణకు బాట వేసినట్టే. 
అందుకే నేడు డేటాసైన్స్‌ ప్రాణం లేని అంకెల గుంపు కాదు. వ్యాపార సంస్థలకు ప్రాణం పోసే జీవ నాడి. దీన్నే ‘డయోగ్నస్టిక్‌ అనాలిసిస్‌’ అంటున్నారు. వ్యాపార నిర్వాహకులకు సైతం గజిబిజిగా కనిపించే వ్యాపారాన్ని అధ్యయనం చేసి ఒక స్థిర నమూనాను అందివ్వడం.

ఎందుకింత ప్రాముఖ్యం?

గణాంక సమాచారం మనకు కొత్తేం కాదు. స్టాటిస్టిక్స్‌ పేరుతో అందుబాటులో ఉన్నదే. కానీ ఇటీవలి కాలంలో ఎందుకింత ప్రాచుర్యంలోకి వచ్చిందన్న సందేహం ఇక్కడ ఉత్పన్నమవుతుంది. గతంలో స్టాటిస్టిక్స్‌ పేరుతో గణాంక సమాచారం పరిమితంగానే అందుబాటులో ఉండేది. కానీ నేడు ఈ-కామర్స్, వైద్యం, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి విభిన్న రంగాల్లో సేవలు, వస్తువులకు చెల్లింపులు పేమెంట్‌ పోర్టల్స్‌ ద్వారా జరుగుతున్నందున అపారమైన డేటా పోగవుతోంది. ఇంకా చెప్పాలంటే కేవలం గణాంక రూపంలోనే కాక ఆడియో, వీడియో, ఇమేజ్‌ల రూపంలో విస్తృతంగా సమాచారం వచ్చి చేరుతోంది.  
అందుకే విస్తృత గణాంక సమాచార రాశి డేటాసైన్స్‌గా అవతరించింది. శాస్త్రీయంగా అధ్యయనం చేసి వాణిజ్య వికాసానికి నిచ్చెన వేస్తోంది. కాబట్టే 2021లో 95 బిలియన్‌ డాలర్లుగా ఉన్న డేటా మార్కెట్‌ 2026 నాటికి 322 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇంతటి వృద్ధి సాధిస్తున్న డేటా జగత్తులో అంతర్భాగాలేమిటో తెలుసుకోవడంవల్ల మరింతగా అర్థం చేసుకోవచ్చు.

భవిష్యత్‌ అవసరాల కోసం.. 

డేటాసైన్స్‌లో మరో తరహా అధ్యయనం ‘ప్రిడిక్షన్‌ అనాలిసిస్‌’. రాబోయే వ్యాపార అవకాశాలను ఊహించడం, భవిష్యత్తు అవకాశాలను అంచనా వేయడం. వ్యాపార సంస్థలకు ప్రస్తుత అవకాశాలే కాదు, రాబోయే అవకాశాలపై అంచనా ఉండాలి. అప్పుడే పెట్టుబడి, స్టాక్, ప్రకటనల విడుదల వంటి వ్యయ ప్రధాన విషయాల్లో తగిన నిర్ణయం తీసుకోగలుగుతాయి. ఉదాహరణకు ఒక అగ్రగామి విమానయాన సంస్థ రాబోయే మూడేళ్లలో తమ వ్యాపారం ఎంతగా ఎదుగుతుందో అంచనా వేసుకోవాలంటే అందుకు ఆధారం డేటా సైన్సే. గడచిన మూడేళ్ల గణాంక సమాచారం ఆధారం చేసుకొని ప్రయాణికుల అలవాట్లపై ఒక అంచనాకు డేటా అనలిస్టులు వస్తారు. కాలేజీలకు సెలవులు, పండుగలు వంటి రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం, పిల్లలకు పరీక్షలు, అన్ని ఆఫీసులూ పనిచేసే రోజుల్లో ప్రయాణాలు తక్కువ ఉండటం వంటి ధోరణులను గత గణాంకాల సాయంతో గుర్తించి భవిష్యత్‌ వ్యాపార గమనాన్ని సూచిస్తారు. దీని ఆధారంగా బిజినెస్‌ స్ట్రాటజిస్టులు వ్యాపారాభివృద్ధికి వ్యూహాలు రూపొందిస్తారు. 

వశీకరణ వ్యూహాలు

వినియోగదారులను ఆకట్టుకునేదెలా? వారిని ఉత్సాహపరచి తమ బుట్టలో పడేసుకోవడం ఎలా? అంటూ అనాదిగా వ్యాపార సంస్థలు తలలు పట్టుకొని కూర్చునేవి. దేశంలో రిటైల్‌ విప్లవానికి తెరతీసిన ‘బిగ్‌ బజార్‌’ వ్యవస్థాపకుడు కిషోర్‌ బియాని అప్పట్లో వినియోగదారుల ఇష్టాయిష్టాలను పసిగట్టేందుకు తన స్టోర్లలో ఒకదానిలో ఓమూల నిల్చొని కస్టమర్లు ఏం కొంటున్నారు? తాము ప్రదర్శనకు ఉంచిన సరుకుల్లో దేనిపట్ల ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? ఏ తరహా వస్తువుల జోలికి అసలేమీ పోవడంలేదన్న విషయాలను గ్రహించేవారు. ఆపై ఏవిధమైన ఆఫర్లు తీసుకురావాలో సిబ్బందికి సూచించేవారు.  
ఇప్పటి రిటైల్‌ సంస్థలకు ఈ అవస్థలు లేవు. డేటాసైన్స్‌ తోడ్పాటుతో విక్రయాల (పర్చేజెస్‌) నుంచి, స్టాక్‌ కదలికల నుంచి సమాచారం తీసుకొని అమ్మకాల ధోరణులను గుర్తిస్తాయి. ఆపై రాబోయే రోజుల్లో తీసుకురావలసిన ఆఫర్లను బిజినెస్‌ స్ట్రాటజిస్టులు సిద్ధం చేస్తారు.


నష్ట నివారణ మంత్రం

వ్యాపారంలో లాభాల కోసం వెంపర్లాడటం ఎంత సహజమో, నష్టాలు రాకుండా ఆపసోపాలు పడటమూ అంతే సహజం. వ్యాపారం ఎందుకు క్షీణిస్తుందో తెలియక యజమానులు కిందామీదా అయ్యేవారు. అసలు నష్టాలు ఎప్పుడొస్తాయి? ఎందుకు వస్తాయో తెలియక సతమతమవుతుండేవారు. కానీ డేటాసైన్స్‌ పుణ్యమా అని ఇప్పుడా సమస్య లేదు.  
విక్రయాల్లో హెచ్చుతగ్గులను డేటా అనలిస్టులు అరటిపండు వలిచిపెట్టినట్లు అందిస్తారు. ఉదాహరణకు దేశవ్యాప్తంగా అమ్మకాలు సాగించే ఒక ఐస్‌క్రీమ్‌ కంపెనీకి సహజంగానే వేసవిలో విపరీత అమ్మకాలు, మిగతా సీజన్లలో తక్కువ అమ్మకాలు ఉంటాయి. మూడు కాలాల్లో ఎంతెంత అమ్మకాలకు అవకాశం ఉందో తెలిస్తే దానికి అనుగుణంగా ఉత్పత్తి ప్రణాళికలు చేసుకుంటారు. అందుకు తగ్గట్టు ముడి సరుకులు సిద్ధం చేస్తారు. డేటాసైన్స్‌ ఈ పనిని చక్కగా చేసిపెడుతుంది. గత మూడేళ్లకో ఐదేళ్లకో డేటా సేకరించి దాని ఆధారంగా అమ్మకాల సరళిని సూచిస్తుంది. అంతే కాదు- ప్రాంతాలవారీగా అమ్మకాలనూ ఇస్తుంది. ఫలితంగా ఆ ఐస్‌క్రీమ్‌ కంపెనీ అధిక ఉత్పత్తి చేసి ‘స్టాక్‌’ నిల్వలపాలవ్వకుండా, నష్టాల్లో పడిపోకుండా డేటాసైన్స్‌ అధ్యయనాలే ఆధారంగా నిలుస్తాయి.


జత కలిసిన కొత్త శక్తులు

సాధారణ స్టాటిస్టిక్స్‌ కాలక్రమేణా డేటాసైన్స్‌గా అవతరిస్తే దీనికి మరో రెండు కొత్త శక్తులు-  ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లు జత కలిశాయి. డేటా సైన్స్‌ని అల్గారిథమ్స్‌ పట్టాలపై ఎక్కించడంతో పరుగులెత్తడం మొదలుపెట్టింది. ఇప్పుడిక కృత్రిమ మేధ (ఏఐ) కూడా తోడవ్వడంతో డేటాసైన్స్‌కి రెక్కలొచ్చి ఆకాశమే హద్దుగా పయనిస్తోంది. దీని మహిమను ఇప్పుడు ప్రపంచం బాగా గుర్తిస్తోంది. ఫలితంగా డిమాండ్‌ మరింతగా పెరిగింది.  
ఇప్పుడు డేటాసైన్స్‌ గురించి ఇంతగా తెలుసుకోవడమెందుకంటే- ఇంజినీరింగ్, సాధారణ గ్రాడ్యుయేషన్‌లోనూ డేటాసైన్స్‌ కాంబినేషన్‌లో కోర్సులు విరివిగా లభిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. బీఎస్‌సీ డేటాసైన్స్‌ చేసినా, ఇంజినీరింగ్‌ను డేటాసైన్స్‌ కాంబినేషన్‌తో పూర్తి చేసినా ఏఐతో ఇంజినీరింగ్‌/ స్వల్పకాలిక కోర్సు చదివిన తాజా అభ్యర్థులకు ప్రాంగణ ఎంపికల్లో ప్రాధాన్యం లభిస్తోంది. పోటీ ప్రపంచంలో మేటి నైపుణ్యాలుంటేనే కదా సాటివారికంటే మించి రాణించేది! 

యస్‌.వి. సురేష్‌
సంపాదకుడు, ఉద్యోగ సోపానం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని