ప్రణాళిక... ఎలా ఉండాలి?

తరగతులు, పరీక్షలు, ఇంటర్వ్యూలు... దేన్నయినా సరే, చక్కగా  ఎదుర్కోవాలంటే సరైన ప్రణాళిక అవసరం.

Updated : 15 Nov 2022 05:05 IST

తరగతులు, పరీక్షలు, ఇంటర్వ్యూలు... దేన్నయినా సరే, చక్కగా  ఎదుర్కోవాలంటే సరైన ప్రణాళిక అవసరం. లోపాలు లేని ప్లాన్‌ను రచించుకున్నప్పుడే..అనుకున్న లక్ష్యాలను సకాలంలో అందుకోగలం. మరి అలాంటి సమర్థ ణాళిక ఎలా ఉండాలో చూద్దామా?

చదువు విషయంలో ప్రణాళిక వేసుకునేటప్పుడు మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... ప్రతి ఒక్కరికీ ఒక లెర్నింగ్‌ స్టైల్‌ ఉంటుంది. అందుకే ముందు... మీరు ఒకేసారి ఎక్కువ సమయం ఫోకస్‌ పెట్టగలరా, మధ్యమధ్యలో విరామం అవసరం అవుతుందా, రోజులో ఏ సమయంలో ఎక్కువ ఏకాగ్రతతో చదవగలరు... వంటి ప్రశ్నలన్నీ వేసుకోవాలి. వీటికి సరైన సమాధానం తెలుసుకుంటే ప్రణాళికలో సగం పని పూర్తయినట్టే.

* అందరూ అన్నీ ఒకేలా చదవలేరు. ఒక సబ్జెక్ట్‌కు ఎక్కువ సమయం అవసరం అయితే... మరో సబ్జెక్టును తక్కువ సమయంలోనే చదివేసే అవకాశం ఉండొచ్చు. అందువల్ల దేనికి ఎంత సమయం కేటాయించాలో తెలియడమూ ప్రణాళికలో ముఖ్యభాగం. 

* ఉన్న సమయాన్ని అన్ని పనులకూ సరిపోయేలా కేటాయించుకున్నారా లేదా అనేది గమనించాలి. చదువు, తరగతులు, అసైన్‌మెంట్లు, సొంత పనులు, ఇతర వ్యాపకాలు.. ఇలా అన్నింటికీ మీ ప్లాన్‌లో సమయం విడివిడిగా ఉండాలి. అప్పుడే ఒక పని కోసం సమయం కేటాయించి వేరే పని మానేయకుండా చక్కగా అన్నీ చేసుకోగలుగుతారు. 

* ప్రణాళికలో పాటించాల్సిన మరో ముఖ్య విషయం... చేయాల్సిన పనులన్నీ చేయగలిగేవిగా ఉండటం. అంటే లెక్కకు మించి లక్ష్యాలు పెట్టుకుంటే వాటిని చేరుకోలేక మొత్తానికే పక్కన పెట్టేసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎంతవరకూ చేయగలమో అంతే ప్రణాళిక రచించుకోవాలి. 

*ఏ పనికైనా గడువు అనేది చాలా ముఖ్యం. లేదంటే సహజంగానే వాయిదా వేసేయాలి అనిపిస్తుంటుంది. అందుకే ప్రతి పనికీ డెడ్‌లైన్‌ పెట్టుకుని పూర్తిచేయాలి. ప్లాన్‌ చేసేటప్పుడే దాని ముగింపు ఎప్పుడనేది స్పష్టంగా నిర్ణయించుకోవాలి. 

* ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. డబ్బు ఎంత విలువైనదో కాలం అంతకంటే విలువైనది. అందుకే విద్యార్థి దశ నుంచే దీన్ని సాధన చేయాలి. 

* లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. అప్పుడు వాటిని చేరుకోవడం సులభం అవుతుంది. నూతన ఉత్సాహంతో మరో టాస్క్‌ను మొదలుపెడతాం. 

* సానుకూల దృక్పథంతో ఉండటం, విరామానికి తగిన సమయం కేటాయించడం అవసరం. 

* ప్రణాళిక కేవలం మనసులో ఉండటం కంటే కాగితంపై రాసుకోవడం, కంటికి కనిపించేలా పెట్టుకోవడం వల్ల దాన్ని మరింత స్థిరంగా అమలు చేయగలుగుతాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని