ప్రగతికీ.. పతనానికీ!
జీవుల మనుగడను, జాతి ఉనికిని చాటేది జనాభా. అది పర్యావరణ సమతౌల్యతకు, ఒక దేశ ప్రగతికీ, పతనానికీ నాందిగా నిలుస్తుంది. ఆర్థిక, సామాజిక స్థితిగతులను నిర్దేశిస్తుంది.
ఇండియన్ ఎకానమీ
జీవుల మనుగడను, జాతి ఉనికిని చాటేది జనాభా. అది పర్యావరణ సమతౌల్యతకు, ఒక దేశ ప్రగతికీ, పతనానికీ నాందిగా నిలుస్తుంది. ఆర్థిక, సామాజిక స్థితిగతులను నిర్దేశిస్తుంది. పెరుగుదల తగిన స్థాయిలో ఉంటే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పరిమితి దాటితే పరిస్థితి అదుపు తప్పుతుంది. పేదరికం, అనారోగ్యం, ఆకలి తదితర సమస్యలన్నీ తలెత్తుతాయి. ప్రపంచ దేశాలను ప్రధానంగా ప్రభావితం చేసే ఈ జనాభా పరిణామక్రమాన్ని, స్వరూపాన్ని, వృద్ధి ధోరణులను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.
మానవ వనరులు
ఆర్థికాభివృద్ధి అనేది భౌతికమైన సహజ వనరులపైనే కాకుండా మానవ వనరుల (Human Resources) మీద కూడా ఆధారపడి ఉంటుంది. మానవ వనరులంటే దేశంలోని జనాభా, వారి విద్యాప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్టికాహార విధానాలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆదాయ పంపిణీ లాంటివి. ఇందులో జనాభా ముఖ్యమైంది. ఒక దేశంలోని జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ప్రగతిని నిర్ణయించే అంశాలుగా జనాభా పెరుగుదల పోకడలను భావించవచ్చు.
ఒక దేశ జనాభా అభిలషణీయ స్థాయి కంటే తక్కువగా ఉంటే, జనాభా పెరుగుదల ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదే జనాభా అభిలషణీయ స్థాయిని దాటితే ప్రగతికి ప్రతిబంధకమవుతుంది. సాధించిన ఆర్థికాభివృద్ధిని హరించి అనర్థాలకు కారణమవుతుంది.
జనాభా: జనాభా అంటే ఒక నిర్ణీత కాలంలో దేశంలో నివసించే ప్రజలు. దేశాభివృద్ధికి జనాభా ఎంతో అవసరం.
లాభాలు:
* వస్తు ఉత్పత్తికి శ్రామిక శక్తిని సమకూరుస్తుంది.
* వస్తుసేవలకు మార్కెట్‌ను కల్పిస్తుంది.
* నూతన ఆవిష్కరణలకు అవకాశం ఇస్తుంది.
* శ్రమ విభజన, ప్రత్యేకీకరణ సాధ్యమవుతుంది.
అధిక జనాభా వల్ల నష్టాలు:
* జీవన విధానంపై ఒత్తిడి.
* నిరుద్యోగం పెరుగుతుంది.
* సామాజిక అవసరాలైన ఆస్పత్రులు, పాఠశాలలు, రవాణా సౌకర్యాలపై భారం అధికమవుతుంది.
* వస్తు వినియోగం పెరిగి, పొదుపు క్షీణించి, మూలధన సంచయనం తగ్గుతుంది.
* అనుత్పాదక శ్రామికులు ఎక్కువవుతారు.
జనాభా పరిణామ సిద్ధాంతం
ఆర్థికాభివృద్ధికి, జనన - మరణాల రేట్లకి మధ్య సంబంధాన్ని జనాభా పరిణామ సిద్ధాంతం వివరిస్తుంది. ఇంగ్లండ్‌కు చెందిన ‘థామస్ రాబర్ట్ మాల్థస్’ 1798లో ‘ఏన్ ఎస్సే ఆన్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ పాపులేషన్’ అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని వివరించారు. మాల్థస్ ప్రకారం ఆహారధాన్యాల ఉత్పత్తి అంకమధ్యమంలో (1, 2, 3, ..) పెరుగుతుంటే, జనాభా పెరుగుదల గుణమధ్యమంలో (1, 2, 4, 8, ..) వృద్ధి చెందుతోంది. దీంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోంది. ఈ సిద్ధాంతాన్ని థామ్సన్, నొటేస్టిన్ మొదటిసారిగా పేర్కొన్నారు. కోల్, హోవర్‌లు ‘ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఇన్ లో ఇన్‌కమ్ కంట్రీస్’ గ్రంథంలో జనాభా పరిణామ సిద్ధాంతాన్ని వివరించారు. దాని ప్రకారం ప్రతి దేశం 3 దశల్లో పయనిస్తుంది.
మొదటి దశ: ఈ దశలో జనన, మరణాల రేటు అధికంగా ఉండటం వల్ల జనాభా ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. వ్యవసాయం ఆధిక్యత వల్ల ఆర్థికాభివృద్ధి తక్కువగా ఉంటుంది. 1921కి పూర్వం భారతదేశంలో మొదటి దశ ఉండేది.
అధిక మరణాల రేటుకు కారణాలు: 1) తక్కువ తలసరి ఆదాయం, 2) అల్ప జీవన ప్రమాణం, 3) పౌష్టికాహార కొరత, 4) ఆరోగ్య సదుపాయాల లేమి, 5) ప్రాణాంతక వ్యాధులను నివారించలేకపోవడం, 6) అధిక శిశు మరణాల రేటు.
అధిక జననాల రేటుకు కారణాలు: 1) బాల్య వివాహాలు, 2) నిరక్షరాస్యత, 3) కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడం, 4) మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండటం.
రెండో దశ: ఈ దశలో మరణాల రేటు తగ్గి, జననాల రేటు అధికమవుతుంది. జననాల రేటు 30-40 మధ్యలో ఉంటే, మరణాల రేటు 15-20 మధ్య ఉంటుంది. ఆర్థికాభివృద్ధి నెమ్మదిగా సాగినప్పటికీ తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, పౌష్టికాహార లభ్యత పెరుగుతాయి. వైద్య సదుపాయాలు విస్తరించి మరణాల రేటు గణనీయంగా తగ్గుతుంది. అయితే అక్షరాస్యత దిగువ వర్గాల వారికి చేరకపోవడం వల్ల సాంఘిక పరిస్థితులు, మూఢ నమ్మకాలు, కుటుంబ నియంత్రణపై ప్రజల ఆలోచనా విధానంలో పెద్దగా మార్పు ఉండదు. ఫలితంగా జనాభా విస్ఫోటం చెందుతుంది. వార్షిక జనాభా వృద్ధి రేటు 2% పైనే నమోదవుతుంది. భారతదేశంలో 1921 నుంచి రెండో దశ ప్రారంభమైంది.
మూడో దశ: జననాల రేటు, జనాభావృద్ధి రేటు క్షీణి స్తాయి. జననాల రేటు 35-40 నుంచి 15-20కి తగ్గుతుంది.
కారణాలు: 1) వ్యవసాయాధార ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మారడం 2) గ్రామాలు, పట్టణాలుగా రూపొందడం 3) అక్షరాస్యత దిగువ వర్గాలకూ చేరడం 4) స్త్రీలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో అధిక సంతానాన్ని భారంగా భావించడం.
* ప్రొఫెసర్ మాక్స్ వెబర్ అనే ఆర్థికవేత్త జనాభా పరిణామ సిద్ధాంతాన్ని 4 దశలుగా విభజించారు. సీపీ బ్లాకర్ 5 దశలుగా పేర్కొన్నారు.
ప్రపంచ జనాభా స్వరూపం
ప్రపంచ జనాభా 1830 నాటికి 100 కోట్లకు చేరింది. ఆ తర్వాత 1930లో 200 కోట్లు అయ్యింది. నాటి నుంచి కేవలం 30 ఏళ్లలోనే మరో 100 కోట్ల జనాభా జత కలిసింది. అంటే 1960లో జనాభా 300 కోట్లు. 1974లో 400 కోట్లు, 1987 జులై 11 నాటికి 500 కోట్లకు చేరింది. (జులై 11ను ‘ప్రపంచ జనాభా దినోత్సవం’గా ప్రకటించారు.) ః 1999, అక్టోబరు 12 నాటికి ప్రపంచ జనాభా 600 కోట్లకు పెరిగింది. (అక్టోబరు 12ను ‘డే ఆఫ్ సిక్స్‌త్ బిలియన్’గా పిలుస్తారు.) 2011, అక్టోబరు 31 నాటికి 700 కోట్లు దాటిన జనాభా ప్రస్తుతం 800 కోట్లకు చేరిందని అంచనా. 98% జనాభా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంది.
ప్రపంచ విస్తీర్ణంలో భారత్ వాటా 2.4%. కానీ ప్రపంచ జనాభాలో 17.5% వాటాతో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ ఆదాయంలో భారత్ వాటా కేవలం 1.2%. ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయులే. ఏటా భారత్‌లో పెరిగే జనాభా ఆస్ట్రేలియా మొత్తం జనాభాకు సమానం. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1.23%. చైనా జనాభా వృద్ధి రేటు 0.53%. భారత్ జనాభా వృద్ధి రేటు 1.64%.
* పాపులేషన్ రెఫరెన్స్ బ్యూరో అంచనాల ప్రకారం జనాభా విషయంలో భారత్ 2030 నాటికి చైనాను అధిగమిస్తుంది.
* అమెరికన్ పాపులేషన్ బ్యూరో ప్రకారం 2025 నాటికే భారత్ జనాభా, చైనా జనాభాను మించిపోతుంది.
భారత్‌లో జనాభా వృద్ధి ధోరణులు
మన దేశంలో తొలిసారిగా 1872లో లార్డ్ మేయో జనాభా లెక్కలను సేకరించారు. పూర్తిస్థాయి జనాభా లెక్కలు (సిరీస్ ఆఫ్ సెన్సస్) మాత్రం 1881లో లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో జరిగాయి. స్వాతంత్య్రం తర్వాత 1948లో జనాభా లెక్కల (సెన్సస్) చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. దీని ద్వారా జనాభా లెక్కల కమిషనర్‌ను ఏర్పాటు చేశారు. జనాభా లెక్కల సేకరణ కేంద్ర జాబితాలోని అంశం. ఆర్టికల్ 246, 7వ షెడ్యూల్‌లో దీని గురించి ఉంటుంది. ‘ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్’ విభాగం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది.
* 2011 జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ - డాక్టర్ సి.చంద్రమౌళి.
* ప్రస్తుత రిజిస్ట్రార్ జనరల్ వివేక్ జోషి
* స్వతంత్ర భారత్‌లో 1951లో తొలిసారి జనాభా లెక్కలను సేకరించారు. 1872 నుంచి చూస్తే 2011 జనాభా లెక్కల సేకరణ పదిహేనోది, స్వాతంత్య్రం తర్వాత ఏడోది. 2011 జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరిగింది. 2010, ఏప్రిల్‌లో గృహ గణనను ప్రారంభించారు. 2011, ఫిబ్రవరి 9 నుంచి 28 మధ్య జనాభా లెక్కలు నిర్వహించారు. ఆ లెక్కలను మార్చి 31న విడుదల చేశారు.
* జనాభా లెక్కల సేకరణకు అయిన ఖర్చు రూ.2,200 కోట్లు. ఈ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది 27 లక్షల మంది. దేశంలో సగటున ఒక వ్యక్తిపై చేసిన వ్యయం రూ.18.19 పైసలు. ఉపయోగించిన కాగితం 8 వేల మెట్రిక్ టన్నులు.
* 2011 సెన్సస్ నినాదం ‘అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్’. దేశంలో జనాభా పెరుగుదలను 4 దశలుగా పేర్కొంటారు. 1) 1891 - 1921 దశ - స్తబ్దతతో కూడిన జనాభా. 2) 1921 - 1951 దశ - క్రమవృద్ధి జనాభా. 3) 1951 - 1981 దశ - సత్వర అధికవృద్ధి జనాభా. 4) 1981 - 2011 దశ - తగ్గుతున్న అధిక వృద్ధి జనాభా. 1911తో పోలిస్తే 1921లో జనాభా తగ్గి, రుణాత్మక వృద్ధి నమోదైంది. 1918లో వచ్చిన ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వల్ల జనాభా క్షీణించింది. 1921 తర్వాత జనాభా నిరంతరం పెరుగుతూ రావడంతో 1921ని ‘గ్రేట్ డివైడ్ ఇయర్’ అంటారు. 1951 నుంచి జనాభా దశాబ్ద పెరుగుదల రేటు 20% ఉండటంతో 1951ని స్మాల్ డివైడ్ ఇయర్ అంటారు. 1981 నుంచి జనాభా పెరుగుదల రేటు తగ్గడంతో 1981ను ‘ఓన్లీ డివైడ్ ఇయర్’ అంటారు.
భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకాన్ని సృష్టిస్తాడు.
- టి.ఆర్.మాల్థస్
భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థికాభివృద్ధికి కారకుడవుతాడు.
- ఎడ్విన్ కానన్
అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు: 1) ఉత్తర్‌ప్రదేశ్ - 19.95 కోట్లు, 2) మహారాష్ట్ర - 11.23 కోట్లు, 3) బిహార్ - 10.38 కోట్లు, 4) పశ్చిమ బెంగాల్ - 9.13 కోట్లు.
తక్కువ ఉన్న రాష్ట్రాలు: 1) సిక్కిం - 6.01 లక్షలు, 2) మిజోరం - 10.91 లక్షలు, 3) అరుణాచల్‌ప్రదేశ్ - 13.83 లక్షలు, 4) గోవా - 14.57 లక్షలు.
అధిక జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: 1) దిల్లీ - 1.671 కోట్లు, 2) పుదుచ్చేరి - 12.44 లక్షలు, 3) చండీగఢ్ - 10.55 లక్షలు
తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: 1) లక్షదీవులు - 64,473, 2) డామన్ - 2.43 లక్షలు, 3) దాద్రా నగర్ హవేలీ - 3.43 లక్షలు
అధిక జనాభా ఉన్న జిల్లా: థానే (మహారాష్ట్ర) - 1.10 కోట్లు.
తక్కువ జనాభా ఉన్న జిల్లా: దిబాంగ్ వ్యాలీ (అరుణాచల్ ప్రదేశ్) - 7,900 మంది.
* 2001లో దేశంలో 593 జిల్లాలుంటే, అవి 2011 నాటికి 640కి పెరిగాయి.
* ప్రస్తుతం దేశంలో జిల్లాల సంఖ్య - 739. భారత దేశంలో జనాభా పరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత 10వ స్థానానికి ఏపీ, 12వ స్థానానికి తెలంగాణ చేరాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్