వృద్ధి పథంలో.. వ్యూహ రచనలో!

స్థానిక స్వపరిపాలన వ్యవస్థలో కిందిస్థాయిలో పంచాయతీ ఉంటే, ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్‌ ఉంటుంది. అది మండల పరిషత్‌లను తద్వారా పంచాయతీలను సమన్వయ పరుస్తూ అభివృద్ధి కార్యక్రమాల వ్యూహాలను రూపొందించి, అమలు చేస్తుంది.

Published : 25 May 2023 03:59 IST

భారత రాజ్యాంగం, రాజకీయాలు

స్థానిక స్వపరిపాలన వ్యవస్థలో కిందిస్థాయిలో పంచాయతీ ఉంటే, ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్‌ ఉంటుంది. అది మండల పరిషత్‌లను తద్వారా పంచాయతీలను సమన్వయ పరుస్తూ అభివృద్ధి కార్యక్రమాల వ్యూహాలను రూపొందించి, అమలు చేస్తుంది. సంక్షేమ పాలన అందించడంలో స్థానికులను భాగస్వాములను చేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుంది. చిన్న నీటిపారుదల, గ్రామీణ పరిశ్రమలు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, పాఠశాలల నిర్వహణ తదితర కీలక బాధ్యతలు ఈ  జడ్పీ పరిధిలోనే ఉంటాయి. అధికార వికేంద్రీకరణ, సమ్మిళిత వృద్ధి సాధన లక్ష్యంగా జవాబుదారీతనం, పారదర్శకత ప్రధానంగా దాని కార్యకలాపాలు  సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ నిర్మాణం, ఎన్నికలు, అధికారాలు, విధులు,  ఏర్పాటు చేసే స్థాయీ సంఘాల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి.

జిల్లా పరిషత్‌

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ‘జిల్లా పరిషత్‌’ ఉన్నత స్థాయి పరిపాలనా విభాగం. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల సమగ్రాభివృద్ధికి అవసరమైన వ్యూహాల రూపకల్పనలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.

జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాలు: జిల్లాలోని ‘ప్రతి మండల పరిషత్‌’ను ‘జిల్లా ప్రాదేశిక నియోజక వర్గం’ (జడ్పీటీసీ)గా పరిగణిస్తారు. ఒక జిల్లాలో ఎన్ని మండల పరిషత్‌లుంటే అన్ని ‘జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు’గా పరిగణిస్తారు. ‘జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల (జడ్పీటీసీలు)ను ఓటర్లు ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు.

అర్హతలు, అనర్హతలు: 21 ఏళ్లు నిండి ఉండాలి.
జిల్లా పరిషత్‌ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. దివాళా తీసి ఉండకూడదు. 1995, మే 30 తర్వాత వివాహమైన దంపతులకు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు.

రిజర్వేషన్లు: ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ వర్గాలకు రిజర్వు చేసిన స్థానాల్లో ఆ వర్గాల మహిళలకు 1/3వ వంతు రిజర్వు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారు. ఈ రాష్ట్రాల్లో ఓబీసీ వర్గాల వారికి 34% స్థానాలు రిజర్వు చేశారు.

ఎన్నికలు: ఆర్టికల్‌ 243(రీ) ప్రకారం ఏర్పడిన ‘రాష్ట్ర ఎన్నికల సంఘం’ జిల్లా పరిషత్‌కు ఎన్నికలు నిర్వహిస్తుంది. జడ్పీటీసీ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి. జిల్లా పరిషత్‌లో అల్పసంఖ్యాక వర్గాల వారి(మైనారిటీస్‌)కి తగిన ప్రాతినిధ్యం లేకపోతే ఆ వర్గం నుంచి ఇద్దరు సభ్యులను ‘కో-ఆప్టెడ్‌ మెంబర్స్‌’గా జిల్లా పరిషత్‌కు నామినేట్‌ చేస్తారు.

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక, పదవీకాలం: జిల్లా పరిషత్‌కు ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు తమలో నుంచి ఒకరిని జిల్లా పరిషత్‌కు ఛైర్మన్‌గా, మరొకరిని వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సభ్యుల పదవీకాలం అయిదేళ్లు. పదవీకాలం కంటే ముందే ఏదైనా పదవికి ఖాళీ ఏర్పడితే ఆరు నెలల్లోగా ఎన్నిక ద్వారా భర్తీ చేయాలి.

తొలగింపు:  జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లను నిర్దిష్ట కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది.

అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడినట్లు ధ్రువీకరణ జరిగినప్పుడు.

 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించినట్లు ధ్రువీకరణ జరిగినప్పుడు.

 పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా తమకు సంక్రమించిన అధికార విధులను నిర్వహించడంలో అనేకసార్లు విఫలమైనప్పుడు.

అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగింపు:  జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లను తొలగించే అవిశ్వాస తీర్మానంపై 2/3వ వంతు జడ్పీటీసీ సభ్యులు సంతకాలు చేసి ఆ నోటీసును జడ్పీ సీఈఓకి అందజేయాలి.

జిల్లా పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులు కోల్పోతారు.

జిల్లా పరిషత్‌లోని సభ్యులు

జిల్లాలోని మొత్తం శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు)

జిల్లాలోని మొత్తం లోక్‌సభ సభ్యులు (ఎంపీలు)

జిల్లాలో ఓటరుగా నమోదైన శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు)

 జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు (ఎంపీలు).

శాశ్వత ఆహ్వానితులు

కలెక్టర్‌

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ 

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌

జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ 

జిల్లాలోని మండల పరిషత్‌ల అధ్యక్షులు.  వీరంతా జిల్లా పరిషత్‌ సమావేశాలు, చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ, ఏదైనా తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పుడు ఓటుహక్కు మాత్రం ఉండదు.

స్థాయీ సంఘాలు: ప్రతి జిల్లా పరిషత్‌కు కార్యకలాపాల నిర్వహణ కోసం ఏడు స్థాయీ సంఘాలు ఉంటాయి. అవి 1) ప్రణాళిక, ఆర్థిక స్థాయీ సంఘం 2) గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం 3) వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘం 4) సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం 5) విద్య, వైద్య స్థాయీ సంఘం 6) స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం 7) అభివృద్ధి పనుల స్థాయీ సంఘం. వీటిలో జడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు. స్థాయీ సంఘాల సమావేశాలు రెండు నెలలకోసారి జరుగుతాయి. ఇందుకు ఉండాల్సిన కోరం 1/3వ వంతు.

వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘానికి జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

కనీసం రెండు స్థాయీ సంఘాలకు అధ్యక్షులుగా మహిళలు ఉంటారు.

మిగిలిన నాలుగు స్థాయీ సంఘాలకు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

స్థాయీ సంఘాలు జిల్లా పరిషత్‌ పనులు, కార్యక్రమాలను రంగాల వారీగా వర్గీకరించి, వాటి పనితీరును అధ్యయనం చేస్తాయి. వివిధ అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించి, పర్యవేక్షించి, అవసరమైన సూచనలు, సలహాలను జిల్లా పరిషత్‌కు ఇస్తాయి. ఈ సూచనలను జిల్లా పరిషత్‌ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. స్థాయీ సంఘాల సమావేశాలకు కలెక్టర్‌ హాజరుకావచ్చు.

జిల్లా పరిషత్‌ అధికారాలు-విధులు

జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన.

జిల్లాలోని మండల పరిషత్‌ల పనితీరును సమీక్షించడం.

జిల్లాకు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదించడం.

మండలాల వారీగా రూపొందించిన ప్రణాళిక కార్యక్రమాలను సమన్వయపరచి క్రమబద్ధీకరించడం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం.

ప్రాథమికోన్నత పాఠశాలలు, వృత్తి విద్యాసంస్థలను నిర్వహించడం.

వయోజన విద్యా కార్యక్రమాల నిర్వహణ.

జీవ వైవిధ్య కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం.

స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించిన గణాంక సమాచారాన్ని ప్రచురించడం.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మండల పరిషత్‌ నిధులపై ‘లెవీ’ విధించడం.

గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల మధ్య వనరుల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను మండల పరిషత్‌లకు పంపిణీ చేయడం.

క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మత సామరస్యం సాధనకు కృషి చేయడం.

పార్కులు, ఆటస్థలాలు, స్టేడియంల నిర్మాణం, నిర్వహణ.

ఉపాధిహామీ పనులను మండల పరిషత్‌లకు కేటాయించడం, పర్యవేక్షించడం.

ఆదాయ వనరులు:  జిల్లా పరిషత్‌కు విస్తృతమైన ఆదాయ వనరులుంటాయి. అవి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు, అఖిలభారత సంస్థలు మంజూరు చేసే నిధులు.

జిల్లా పరిషత్‌ ఆధీనంలోని ఎండోమెంట్స్‌, ట్రస్టుల ఆదాయం.

కుటీర, చిన్నతరహా పరిశ్రమల నుంచి వసూలయ్యే పన్నులు.

భూమి సెస్సు, ఫీజులు, పన్నులు.

రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు, ఫీజుల్లో వాటా.

ఇసుక క్వారీలకు సంబంధించిన సీనరేజీ ఫీజు.

జిల్లా పరిషత్‌ స్థిరాస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం.ః ఉపాధిహామీ పథకం ద్వారా వచ్చే నిధులు. ః వివిధ వర్గాల వారు ఇచ్చే విరాళాలు.

జిల్లా పరిషత్‌కు లభించే ఆదాయ వనరులన్నింటినీ ‘జిల్లా పరిషత్‌ నిధి’గా పరిగణిస్తారు. ఈ నిధిని సమీపంలోని ‘ప్రభుత్వ ట్రెజరీ’లో జమ చేయాల్సి ఉంటుంది.

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ - అధికారాలు, విధులు

జిల్లా పరిషత్‌ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

జిల్లా పరిషత్‌ ఆమోదించిన తీర్మానాల అమలు కోసం ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)కి ఆదేశాలు జారీ చేయడం.

జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల రికార్డులను తనిఖీ చేయడం.

జిల్లా పరిషత్‌ సమావేశాలను ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించడం.

వివిధ స్థాయీ సంఘాల నివేదికలపై సమీక్ష జరపడం, వాటి అమలు కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం.

 హోదారీత్యా జిల్లా విద్యా కమిటీ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా గ్రామీణ ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన మిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి

జిల్లా పరిషత్‌ పరిపాలనలో సహకరించేందుకు ముఖ్య కార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈఓ)ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. సీఈఓ జీతభత్యాలు, పింఛన్లు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ను సంప్రదించి జిల్లా పరిషత్‌ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారు.

జిల్లా పరిషత్‌, స్థాయీ సంఘాల సమావేశాలకు సంబంధించిన రికార్డులను భద్రపరుస్తారు.

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందగలరు.

జిల్లా పరిషత్‌ ఆమోదించిన తీర్మానాల అమలు కోసం కృషి చేస్తారు. జిల్లా పరిషత్‌ చేపట్టే వివిధ అభివృద్ధి పథకాల అమల్లో కీలకపాత్ర పోషిస్తారు.

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ సమావేశాల్లో పాల్గొనవచ్చు. కానీ ఏదైనా తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు ఓటు హక్కు ఉండదు.

జిల్లా పరిషత్‌ అధికార పరిధిలోని కార్యాలయ సిబ్బంది, అకౌంట్స్‌ వ్యవహారాలపై నియంత్రణ కలిగి ఉంటారు.

జిల్లా పరిషత్‌ పరిధిలోని వివిధ కార్యాలయాలు, పథకాల అమలు తీరును తనిఖీ చేస్తారు.

జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘం సూచనల మేరకు మండల పరిషత్‌ పరిధిలోని పనులు, పథకాలు, సంస్థలను తనిఖీ చేస్తారు.

జడ్పీ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యల గురించి ప్రభుత్వానికి నివేదిస్తారు.

జిల్లా పరిషత్‌ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోపు మరో సమావేశాన్ని నిర్వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వం జడ్పీ సీఈఓపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని