ప్రజలే పాలకులు.. పాలితులు!

ప్రస్తుత ప్రపంచంలో అత్యధికులు ఆమోదించి, ఆచరిస్తున్న ప్రభుత్వ ఏర్పాటు విధానమే ప్రజాస్వామ్యం. ఈ భావనే ఆధునిక, నైతిక, ఆదర్శవంతమైన, మహోన్నత జీవనశైలిగా మారింది. అందరూ సమానం, అందరికీ స్వాతంత్య్రం అనేవి ఇందులో ప్రధాన నియమాలు. ఇక్కడ పాలకులు, పాలితులు ప్రజలే. నిర్ణయాధికారం వారికే ఉంటుంది.

Published : 22 Nov 2023 01:12 IST
భారత రాజ్యాంగంరాజకీయాలు
ప్రస్తుత ప్రపంచంలో అత్యధికులు ఆమోదించి, ఆచరిస్తున్న ప్రభుత్వ ఏర్పాటు విధానమే ప్రజాస్వామ్యం. ఈ భావనే ఆధునిక, నైతిక, ఆదర్శవంతమైన, మహోన్నత జీవనశైలిగా మారింది. అందరూ సమానం, అందరికీ స్వాతంత్య్రం అనేవి ఇందులో ప్రధాన నియమాలు. ఇక్కడ పాలకులు, పాలితులు ప్రజలే. నిర్ణయాధికారం వారికే ఉంటుంది. ప్రజాస్వామ్యం ఆవిర్భావం, అర్థ వివరణ, మూలాలు, మౌలిక లక్షణాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన అవసరం. స్వేచ్ఛ, మానవ హక్కులకు ప్రాధాన్యం కోణంలో ఇతర పాలనా విధానాలకంటే ప్రజాస్వామ్యం ఎందుకు మెరుగైనదో స్పష్టమైన అవగాహనతో ఉండాలి.
ప్రజాస్వామ్యం - అర్థవివరణ
ప్రజాస్వామ్యంలో అధికసంఖ్యాక ప్రజలకు అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది. ఇది రాజకీయ ఆదర్శాలు, ఆర్థిక విధానాలు, సామాజిక వాడుకలు, నైతిక నియమాలతో కూడిన ప్రభుత్వ సముదాయం. ఆధునిక ప్రభుత్వాలను 1) ప్రజాస్వామ్యం 2) నియంతృత్వం అని రెండు ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వాతంత్య్రం, సమానత్వం, న్యాయాలకు హామీ ఉంటుంది.
ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో 'Democracy' అంటారు. ఇది 'Demos, 'Kratos' అనే రెండు గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది. 'Demos' అంటే ప్రజలు, 'Kratos' అంటే అధికారం/పాలన అని అర్థం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అధికారం ఉండటం. గ్రీకు పౌరులు మొదటిసారిగా నగర రాజ్యానికి సంబంధించిన వివిధ చట్టాలపై ప్రత్యక్షంగా ఓటు వేశారు. ప్రజాస్వామ్య ఆవిర్భావం అనేది ప్రథమంగా ఏథెన్స్‌ (గ్రీస్‌) అసెంబ్లీతో ముడిపడి ఉంది.
ప్రజాస్వామ్యం - వివిధ దృక్కోణాలు: ప్రజాస్వామ్యాన్ని పలు దృక్కోణాల్లో పేర్కొనవచ్చు. రాజకీయ కోణంలో ప్రజాస్వామ్యమంటే ప్రభుత్వంలో ప్రతిఒక్కరికీ భాగస్వామ్యం కల్పించడంగా భావించవచ్చు. ఆర్థిక కోణంలో ప్రజాస్వామ్యమంటే దోపిడీని నిషేధించడం. సాంఘిక కోణంలో ప్రజాస్వామ్యమనేది వ్యక్తుల మధ్య కులం, వర్ణం, పుట్టుక, మతం, భాష లాంటి అంశాల ప్రాతిపదికపై అన్ని వివక్షలను నిర్మూలించడం.
ప్రజాస్వామ్యం వికాసం: సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణలనేవి వర్తమాన పాశ్చాత్య దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థకు అవకాశం కల్పించాయి. ఇంగ్లండ్‌లో 1215లో వెలువడిన 'Magna carta' (హక్కుల ప్రకటన) ద్వారా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను వివరించారు. ఇంగ్లండ్‌లో సంభవించిన 'Glorious Revolution' (మహావిప్లవం) పాలకుల అపరిమిత అధికారాలను తగ్గించింది. అమెరికా స్వాతంత్య్ర పోరాటం, ఫ్రెంచ్‌ విప్లవం మానవ హక్కులకు ప్రాధాన్యాన్ని ఇస్తూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ భావాల వ్యాప్తికి తోడ్పడ్డాయి.
  • 17వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో ప్రజాస్వామ్య సంస్థలు పనిచేయడం ప్రారంభించాయి. నిరపేక్ష రాచరికాలు పతనమైన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వ భావాల గురించి జాన్‌లాక్‌, రూసో, థామస్‌ పెయిన్‌ లాంటి మేధావులు తమ రచనల్లో పేర్కొన్నారు.
  • 1970 దశకంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 1980 దశకం ద్వితీయార్ధంలో యూరప్‌లోని దక్షిణ, మధ్య, ప్రాచ్య దేశాల్లో ప్రాతినిధ్య అంశాలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని  అనుసరించారు.
  • లాటిన్‌ అమెరికా, ఆగ్నేయాసియా, తైవాన్‌, దక్షిణ కొరియా, పాలస్తీనా, ఆఫ్రికా దేశం లెబనాన్‌ లాంటివి 1900, 2000 దశకాల్లో ఉదారవాద ప్రజాస్వామ్యం వైపు పయనించాయి.
  • ‘ఫ్రీడమ్‌ హౌజ్‌’ అనే సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 1900 సంవత్సరం నాటికి వయోజన ఓటు హక్కును ఇచ్చిన దేశం ఒక్కటీ లేదు. కానీ 2000 నాటికి ప్రపంచంలోని 192 రాజ్యాల్లో 120 రాజ్యాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాయని ఆ సంస్థ విశ్లేషించింది.
 

లక్షణాలు
 
 
 
ఎన్నికలు: రాజ్యాంగ సూత్రాల ప్రకారం ప్రజాస్వామ్యం నిర్ణీత సమయంలో ఎన్నికల నిర్వహణకు వీలు కల్పిస్తుంది. ప్రజాస్వామ్యం, ఎన్నికలు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. అర్హత ఉన్న వయోజన పౌరులు వివిధ ప్రాతినిధ్య సంస్థలకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఓటును వజ్రాయుధంగా మలచుకుంటారు.
ప్రజల భాగస్వామ్యం: ప్రజాస్వామ్యంలో పాలకులు, పాలితులు ప్రజలే. ఇది ప్రజలు నిర్వహించే ప్రభుత్వం. ఓటర్లతో పాటు వారి ప్రతినిధులు ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తారు. చట్టసభల్లో ప్రజల సంక్షేమం కోసం శాసనాలను రూపొందిస్తారు.
జవాబుదారీతనం: ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే శాసన వ్యవస్థకు, అంతిమంగా ఓటర్లకు బాధ్యత వహిస్తుంది. ప్రజల విశ్వాసం ఉన్నంత వరకు ప్రభుత్వం కొనసాగుతుంది.
వ్యక్తి హుందాతనం: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం వ్యక్తుల హుందాతనాన్ని గౌరవిస్తుంది. సామాన్య వ్యక్తులు కూడా తమ అభిప్రాయాల వ్యక్తీకరణలో ప్రత్యేకమైన అవకాశాలను పొందగలుగుతారు. వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాధాన్యం ఇస్తారు.
ప్రజల నియంత్రణ: ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవహారాల్లో ప్రజల నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలను నియంత్రించడంలో అనేక విధానాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను వెలువరిస్తారు. ప్రజాభీష్టాన్ని విస్మరించే లేదా అతిక్రమించే నాయకులను అధికారానికి దూరంగా పెడతారు.
సమానత్వం: ప్రజాస్వామ్యం సమానత్వ భావనలపై ఆధారపడి కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ముఖ్య నిబంధనే సమానత్వం. ప్రజలకు కుల, మత, జాతి, లింగ, ప్రాంత, అక్షరాస్య, నిరక్షరాస్య, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తారు.
ప్రాథమిక స్వేచ్ఛ: ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాథమిక స్వేచ్ఛ ఉంటుంది. పౌర, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల్లో ఈ స్వేచ్ఛను పొందుతారు. రాజ్యాంగంలో ప్రాథమిక స్వేచ్ఛను పొందుపరచడం ద్వారా ప్రజలు దాన్ని అనుభవించేందుకు తగిన హామీ ఉంటుంది.
స్వతంత్ర న్యాయవ్యవస్థ: ప్రజాస్వామ్యంలో మరో కీలక లక్షణం స్వతంత్ర న్యాయవ్యవస్థ. దీనిద్వారా రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను న్యాయవ్యవస్థ రద్దు చేస్తుంది. ప్రజల స్వేచ్ఛ సంరక్షణకు కాపలాదారు పాత్ర పోషిస్తుంది.
రిట్స్‌ జారీ: ప్రజల ప్రాథమిక స్వేచ్ఛా సంరక్షణకు న్యాయవ్యవస్థ రిట్స్‌ను జారీ చేస్తుంది. భారతదేశంలో సుప్రీంకోర్టు ఆర్టికల్‌-32 ప్రకారం, హైకోర్టులు ఆర్టికల్‌-226 ప్రకారం అయిదు రకాల రిట్స్‌ జారీ చేస్తాయి. అవి 1) హెబియస్‌ కార్పస్‌  2) మాండమస్‌ 3) ప్రొహిబిషన్‌  4) సెర్షియోరరి  5) కోవారెంటో
  • ఆర్టికల్‌ 39(ఎ) ప్రకారం భారతదేశంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని పొందే హక్కుంది.
స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ:  ప్రజాస్వామ్యంలో నిర్ణీత పదవీ కాలానికి ప్రజాప్రతినిధుల ఎన్నిక జరుగుతుంది. ఎన్నికలను స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ఉదా: ఆర్టికల్‌-324 ప్రకారం ఏర్పడిన భారత ఎన్నికల సంఘం.
రాజకీయ పార్టీలు: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకపాత్ర వహిస్తూ, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి. ప్రజల అభిమానాన్ని పొందడానికి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తాయి. తద్వారా తమ పార్టీ అధికారం చేపడితే ప్రజలకు ఏంచేయబోతున్నాయో హామీలు ఇస్తాయి. అధిక మెజార్టీ పొందిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ప్రాధాన్యం
ప్రజాస్వామ్యంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. ఎందుకంటే సామాన్యుల్లో అతి సామాన్యులు, పేదల్లో నిరుపేదలు కూడా ఉన్నత పదవుల్లోని పాలకులు, అధికారుల గౌరవాన్ని అందుకుంటారు. ఉన్నత స్థానాల్లో అధికారం చెలాయించే రాజకీయ నేతలు, పరిపాలనా అధిపతులు, శాసనసభ్యులు అందరూ సామాన్య పౌరుల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ప్రజాస్వామ్యం వివక్ష లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తుంది.
  • ప్రబలమైన రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక ఒత్తిళ్లు ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం శాంతియుత, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలను అందిస్తుంది.
  • ప్రజాస్వామ్యంలో అసమ్మతివాదులు, వ్యతిరేకులు, విరుద్ధభావాలున్న వారికి కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియలో సంప్రదింపులు, సఖ్యత, రాజీ, ఏకాభిప్రాయం లాంటివి కీలకంగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని