నిత్య జీవితాన్ని ఆటంకపరిచేనీటిమట్టమే ‘వరద’!

అకస్మాత్తుగా సంభవించి, మానవులకు - సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదకర ఘటనను విపత్తు అంటారు. ఇది భూమిపై అధిక నష్టానికి కారణమవుతుంది. వీటిలో కొన్ని మానవ సంబంధమైనవిగా ఉంటే, మరికొన్ని సహజంగా సంభవించేవిగా ఉంటాయి.

Published : 20 Feb 2024 02:45 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ జాగ్రఫీ

అకస్మాత్తుగా సంభవించి, మానవులకు - సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదకర ఘటనను విపత్తు అంటారు. ఇది భూమిపై అధిక నష్టానికి కారణమవుతుంది. వీటిలో కొన్ని మానవ సంబంధమైనవిగా ఉంటే, మరికొన్ని సహజంగా సంభవించేవిగా ఉంటాయి. నీటి వల్ల సమాజానికి కలిగే నష్టాలను జల సంబంధ విపత్తులు అంటారు. వీటి ప్రభావం చాలాకాలం ఉంటుంది. జల సంబంధ విపత్తులు, వాటి వల్ల సంభవించే నష్టాలు మొదలైనవాటిపై పోటీపరీక్షార్థికి అవగాహన ఉండాలి.


జలసంబంధ విపత్తులు

ల సంబంధ/ సముద్ర విపత్తులు అంటే వరదలు, కొండచరియలు విరిగిపడడం, సునామీ, పోటు-పాటులు, తుపానులు మొదలైనవి.

వరదలు

అధిక వర్షాల కారణంగా వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలను ముంపునకు గురిచేయడాన్ని ‘వరద’ అంటారు.

  • నిత్య జీవితాన్ని ఆటంకపరిచే నీటిమట్టాన్ని వరదగా పేర్కొంటారు. ఇవి ప్రవాహం రూపంలో లేదా నిశ్చలంగా ఉంటాయి. భారీ వర్షాలు, ఉప్పెనల ఫలితంగా ఇవి సంభవిస్తాయి.

వరదలు - మానవ ప్రమేయ కారణాలు

అడవులను నిర్మూలించడం: మానవులు తమ అవసరాల కోసం అడవులపై ఎక్కువగా ఆధారపడతారు. అడవుల్లోని చెట్లను ఎక్కువగా నిర్మూలించడం వల్ల ఆ ప్రాంతాల్లో ప్రవహించే నదుల్లోకి ఎక్కువగా మట్టి చేరి, నీటి నిల్వ పరిమాణం తగ్గుతోంది. తద్వారా ఆ నదుల్లోకి నీటి ప్రవాహం ఎక్కువైతే అది వరదగా మారుతోంది.

  • అదే విధంగా చెట్లు, గడ్డి మొదలైనవి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తాయి. అటవీ నిర్మూలన వల్ల నీటి ప్రవాహం పెరిగి, వరదలు సంభవిస్తాయి.
  • భారతదేశంలో బ్రహ్మపుత్ర దాని ఉపనదులైన లోహిత, దిబాంగ్‌లు ప్రవహించే ప్రాంతాల్లో అడవులను నరకడం వల్ల ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా వరదలు సంభవిస్తున్నాయి.

పోడు వ్యవసాయం: దీన్ని అనాగరిక వ్యవసాయ పద్ధతిగా పేర్కొంటారు. అడవులను నిర్మూలించి పోడు వ్యవసాయాన్ని చేస్తారు. చెట్ల నరికివేతతో వర్షపు నీటి వేగం, ప్రవాహాలు పెరిగి వరదలు సంభవిస్తాయి.

అతిగా గడ్డి మేపడం: పర్వత సానువుల్లో పశువులను మేపడం వల్ల హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లో హిమాలయ నదులు కింది భాగానికి ప్రవహించేటప్పుడు వరదలు సంభవిస్తాయి.

నదీ ప్రవాహ ప్రాంతాల ఆక్రమణ: పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా భూభాగ విస్తీర్ణాన్ని పెంచడం సాధ్యం కాదు. పెరిగిన జనాభా వ్యవసాయ కార్యకలాపాల కోసం లేదా గృహ నిర్మాణాల కోసం నదీ ప్రవాహ ప్రాంతాలను, చెరువులను, కాలువ వంకలను పూడ్చి, చదును చేసి గృహ నిర్మాణాలు చేపడుతున్నారు.

  • వర్షాకాలంలో అధిక వర్షం సంభవించినప్పుడు ఇలాంటి నూతన గృహ నిర్మాణాలు ముంపునకు గురవుతాయి.

వరదలు - ఉపశమన వ్యూహాలు

భారతదేశ మొత్తం భూభాగంలో 1/8వ వంతు (12%) అంటే దాదాపు 40 మిలియన్‌ హెక్టార్ల భూభాగం వరదకు గురవుతోంది.

  • ఏటా సగటున 7.5 మిలియన్‌ హెక్టార్ల భూమి ముంపునకు గురికాగా, 3.6 మిలియన్‌ హెక్టార్ల వ్యవసాయ భూమి వరదలకు గురవుతోంది.

జాతీయ వరద ప్రమాద తీవ్రత తగ్గింపు ప్రాజెక్టు (National Flood Risk Mittigation Project): ఈ ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను అందించే బాధ్యతను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి అప్పగించారు.

  • వరదల సమయంలో ఉపశమన, పునరావాస, పునఃనిర్మాణ చర్యలకు అవసరమైన వనరులను తరలించడంతో పాటు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వరదలపై, తుపాను ప్రభావాలపై అవగాహనను కల్పించే కార్యక్రమాలు చేపడతారు.

రకాలు

నదుల వల్ల సంభవించే వరదలు: అధిక లేదా కుండపోత వర్షం లేదా తుపానుల వల్ల నదుల్లో/ నదీ ప్రవాహాల్లో నీటి శాతం పెరిగి, నదీ తీర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.

  • భారతదేశంలో నదుల ద్వారా ముఖ్యంగా హిమాలయ పర్వతాల్లో జన్మించే నదుల వల్ల సంభవించే వరదలు 60% నష్టానికి కారణమైతే; తుపానులు, అధిక వర్షాల కారణంగా 40% వరదలు సంభవిస్తున్నాయి.
  • భారతదేశంలో అధికంగా వరదలు సంభవించే నది బ్రహ్మపుత్ర.
  • బ్రహ్మపుత్ర నదిని భారతదేశ దుఃఖదాయని (Sorrow of India) అని పిలుస్తారు.
  • ప్రపంచంలో ఆయనరేఖా ప్రాంతాల్లో ఎక్కువగా వరదలకు గురయ్యే ప్రాంతం భారతదేశం.

తీర ప్రాంత వరదలు: సముద్ర జలాల్లో బలమైన పోటు-పాటులు కారణంగా సముద్ర తుపానులు ఏర్పడి, తీర ప్రాంతాల్లో వరదలు సంభవిస్తాయి.

  • భారతదేశంలో తుపాను వరదలకు ఎక్కువగా నష్టపోతున్న తీర ప్రాంతాలు - ఒడిశా, తమిళనాడు.

ఆకస్మిక వరదలు: అధిక వర్షం కారణంగా చెరువు కట్టలు తెగడం, గండిపడటం, నదులు తమ ప్రవాహ మార్గాలను మార్చుకోవడం వల్ల ఆకస్మిక వరదలు సంభవిస్తాయి.

  • సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడం వల్ల ఒక రకమైన మోస్తరు వర్షానికే కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.

భారతదేశం - వరదలు

ఉత్తర భారతదేశం: వేసవి కాలంలో హిమాలయ నదుల్లో ఎక్కువ నీరు ఉండదు. అయితే ఇవి జీవనదులు కాబట్టి కొంత మోతాదులో నీరు నదుల్లో ప్రవహిస్తుంది. కాబట్టి అవి ఉపరితల నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుని పోలేవు.

  • వర్షాకాలంలో ఆ నదుల్లో ఎక్కువ నీరు చేరి, నది పరిమాణం పెరుగుతుంది. దీంతో ఆ నదులు తమ దిశను మార్చుకుని వరదలకు కారణమవుతాయి.
  • దామోదర్‌ నది, కోసి నది, బ్రహ్మపుత్ర నదులను వరద నదులుగా పేర్కొంటారు.
  • దామోదర్‌ నదిని బెంగాల్‌ దుఃఖదాయని, కోసి నదిని బిహార్‌ దుఃఖదాయని, బ్రహ్మపుత్ర నదిని అసోం దుఃఖదాయని/ భారతదేశ దుఃఖదాయని అని పిలుస్తారు.

దక్షిణ భారతదేశం: దక్షిణ భారతదేశంలో నదులకు ప్రధాన ఆధారం వర్షాలు. ఇవి గట్టి స్తరాల వెంట ప్రయాణం చేస్తాయి.

  • ఈ నదీ ప్రవాహ ప్రాంతాలకు కోత తక్కువగా ఉండి, లోతు ఎక్కువగా ఉంటుంది.
  • ఈ కారణం వల్ల రుతుపవన కాలంలో అధిక వర్షం కారణంగా వరదలు సంభవిస్తాయి.
  • ఉత్తర భారతదేశంలో వరదలకు అధిక వర్షపాతం, మంచు కరగడం, అటవీ నిర్మూలన ప్రధాన కారణాలు కాగా, దక్షిణ భారతదేశంలో సంభవించే వరదలకు నదీప్రవాహ ప్రాంతాల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, తుపానులు ముఖ్య కారణాలు.
  • బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన వ్యవస్థ వల్ల తుపానులు సంభవించి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో వరదలకు కారణం అవుతాయి.
  • తుపానుల సమయంలో వీచే గాలులు ఎక్కువ వేగంగా ఉంటాయి. వీటివల్ల విపరీతమైన ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు కలుగుతాయి.
  • 2020-21లో బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుల వల్ల విపరీతమైన వర్షపాతం సంభవించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అకాల వరదలు సంభవించాయి.

భారత ప్రభుత్వం వరద నివారణ, నియంత్రణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు

1. జాతీయ వరద నివారణ కార్యక్రమం (National Flood Management Programme): మానవ జీవితం, దేశ ఆర్థిక వ్యవస్థపై వరదల ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం 1954లో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇందులోని అంశాలు..

1. కరకట్టల నిర్మాణం.
2. పరీవాహ మార్గాల నిర్మాణం
3. నదీ ఆక్రమణలను అడ్డుకోవడం
4. ప్రవాహ ప్రాంతాల్లో నీటి వేగాన్ని తగ్గించడానికి మొక్కలు, గడ్డిని పెంచడం.

  • కేంద్ర జలవనరుల సంఘం వరద దుర్భలత్వ ప్రాంతాల్లో ముందస్తు చర్య హెచ్చరికలు చేయడానికి న్యూదిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో వరద ముందస్తు సూచనా కేంద్రాన్ని (Flood Management Programme) 1958లో ప్రారంభించింది.

వరద నిర్వహణ కార్యక్రమం (Flood Management Programme): 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  • ఇందులో భాగంగా వరద నియంత్రణ, డ్రైనేజీ వ్యవస్థల పునరుద్ధరణ, ఫ్లడ్‌ ప్రూఫింగ్‌ స్టోరేజీ రిజర్వాయర్‌, వరద ఆనకట్టలు, నేల క్రమక్షయాన్ని అరికట్టడం మొదలైన కార్యక్రమాలను చేపడతారు.
  • భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధ విభాగమైన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (NRSC) వరదల నివారణకు 5 రకాల సేవలను అందిస్తోంది.

అవి:

1. వరదలు సంభవించే ప్రాంతాన్ని ముందుగానే గుర్తించి, పర్యవేక్షించడం (Near Real time Flood mapping and monitoring)
2. వరద నష్టం అంచనా (Flood Damage Assessment)
3. వరద ప్రమాద జోన్‌ను పర్యవేక్షించడం (Flood Hazard Zone Mapping)
4. నదీ తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడం (River Bank Erosion Mapping)
5. Mapping Changes in the River Course.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని