కరెంట్‌అఫైర్స్‌

దేశంలో 2013-14లో 29.17 శాతంగా నమోదైన పేదరిక నిష్పత్తి 2022-23 నాటికి ఎంత శాతానికి దిగివచ్చినట్లు నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన చర్చాపత్రంలో వెల్లడించింది?

Published : 21 Feb 2024 01:39 IST

మాదిరి ప్రశ్నలు

దేశంలో 2013-14లో 29.17 శాతంగా నమోదైన పేదరిక నిష్పత్తి 2022-23 నాటికి ఎంత శాతానికి దిగివచ్చినట్లు నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన చర్చాపత్రంలో వెల్లడించింది? (నిరుపేదల సంఖ్య తగ్గుదలలో బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మెరుగ్గా రాణించినట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది).

జ: 11.28%


కొవిడ్‌ కాలంలో, ఆ తర్వాత ఉపాధి కల్పనకు ఉద్దేశించిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ (ఏబీఆర్‌వై) పరిధిలోకి ఎంత మంది కార్మికులను తేవాలని కేంద్రం తలపెట్టింది? (2020, అక్టోబరు 1 నుంచి ఏబీఆర్‌వై ప్రారంభమైంది. ఇప్పటికే లక్ష్యాన్ని అధిగమించినట్లు కేంద్రం ప్రకటించింది. ఉద్యోగులు, యజమానులు పీఎఫ్‌ కింద చెల్లించాల్సిన చెరి 12 శాతం వాటాలను ఏబీఆర్‌వై కింద రెండేళ్ల పాటు ప్రభుత్వమే జమ చేస్తుంది. దీని వల్ల సంస్థలపై పీఎఫ్‌ భారం తగ్గి, ఉద్యోగ కల్పన పెరుగుతుందని భావించింది. నెలకు రూ.15,000 కంటే తక్కువ వేతనం పొందేవారే దీనికి అర్హులు ఈ పథకం కింద కేంద్రం రూ.10 వేల కోట్లు వెచ్చించింది.)

జ: 71.8 లక్షల మంది.


భారత్‌లో వృద్ధుల జనాభా ఏ సంవత్సరం కల్లా రెండింతలు అవుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా వ్యవహారాల సంస్థ అంచనా వేసింది? (2022లో దాదాపు 15 కోట్లు ఉన్న వృద్ధుల జనాభా అప్పటికి 34.7 కోట్లకు చేరుతుంది.)

జ: 2050  


2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా ఎవరి కుటుంబం అవతరించింది? (ఈ కుటుంబం ఆస్తి విలువ 305 బిలియన్‌ డాలర్లు. అంటే అక్షరాల రూ.25,38,667 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో ఆరు శాతం ఈ కుటుంబం ఆధీనంలోనే ఉన్నాయి.)  

జ: యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ రాజ కుటుంబం


‘హెన్లీ పాస్‌పోర్టు సూచీ 2024’లో భారతదేశం 85వ స్థానంలో నిలిచింది. 2023లో భారత్‌ 84వ ర్యాంకులో ఉంది. అయితే భారత పాస్‌పోర్టుతో వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఇంతకు ముందు 60గా ఉండగా, 2024లో 62కు పెరిగాయి. హెన్లీ పాస్‌పోర్టు సూచీలో వీసారహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్‌పోర్టు శక్తిని లెక్కిస్తారు.

2024లో ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, సింగపూర్‌, స్పెయిన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. వాటి పాస్‌పోర్టుతో ప్రపంచవ్యాప్తంగా 194 దేశాలకు వీసారహిత ప్రయాణం చేయొచ్చు. ఈ సూచీల్లో పాకిస్థాన్‌ 106వ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌ 102, మాల్దీవులు 58వ స్థానంలో ఉన్నాయి.


టాటా గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 365 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.30.30 లక్షల కోట్ల)కు చేరింది. ఇది స్టాక్‌ మార్కెట్లో ఆ గ్రూప్‌ నమోదు చేసిన దాదాపు పాతిక కంపెనీల విలువ. మన పొరుగు దేశం పాకిస్థాన్‌ జీడీపీ 341 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.28.30 లక్షల కోట్ల) కంటే ఈ మొత్తం ఎక్కువ. టాటా గ్రూప్‌లోని ఐటీ సేవల దిగ్గజ సంస్థ టీసీఎస్‌ మార్కెట్‌ విలువ (14.93 లక్షల కోట్లు) ఒక్కటే, పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థలో సగానికి సమానం.


లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది 2024, ఫిబ్రవరి 19న సైనిక ఉప అధిపతి (వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌)గా దిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకానికి ముందు ఆయన ఉదంపుర్‌ నార్తర్న్‌ కమాండ్‌కు జనరల్‌ ఆఫీసర్‌ కమాండ్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్నారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎంవీ సుచీంద్ర కుమార్‌ స్థానంలో ద్వివేది వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా నియమితులయ్యారు.


దేశంలోని ప్రతి జిల్లాలోని వ్యవసాయ, అటవీ భూముల వాస్తవిక స్థితిని సమీక్షించే ఉద్దేశంతో ఇండియన్‌ స్సేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ‘భువన్‌ పోర్టల్‌’ను రూపొందించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో దీన్ని తయారు చేశారు. దేశవ్యాప్తంగా వృథాగా ఉన్న బంజరు భూములను పునరుద్ధరించి అటవీ, వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచాలన్న నీతి ఆయోగ్‌ సూచనతో భువన్‌ పోర్టల్‌ను రూపొందించినట్లు ఇస్రో అధికారులు 2024, ఫిబ్రవరి 19న ప్రకటించారు.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు