పద్ధతిగా వచ్చి వెళ్లే ప్రత్యేక గాలులు!

భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన కారణం రుతుపవనాలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేక రుతుపవన వ్యవస్థ మన దేశానికి ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది. ఇక్కడి వైవిధ్య వాతావరణ పరిస్థితులకు మూలకారణం రుతుపవనాలే.

Published : 21 Feb 2024 01:39 IST

జనరల్‌ స్టడీస్‌ ప్రపంచ భూగోళశాస్త్రం

భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన కారణం రుతుపవనాలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేక రుతుపవన వ్యవస్థ మన దేశానికి ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది. ఇక్కడి వైవిధ్య వాతావరణ పరిస్థితులకు మూలకారణం రుతుపవనాలే. వర్షాన్ని మోసుకొచ్చే ఈ ఆకస్మిక గాలుల లక్షణాలు, కాలానుగుణంగా సంభవించడంలో ఉన్న శాస్త్రీయత, సంబంధిత సిద్ధాంతాల గురించి పరీక్షార్థులకు సమగ్ర పరిజ్ఞానం ఉండాలి. భౌగోళికంగా ఈ దేశానికి ఉన్న ప్రత్యేకతలు, భూ వాతావరణంలో క్రమానుగతంగా జరిగే మార్పులు భారత్‌ను రుతుపవన దేశంగా మార్చిన తీరును అర్థంచేసుకోవాలి.

రుతుపవనాలు

రుతుపవనాలు ప్రత్యేకమైన వర్షాన్నిచ్చే శక్తి ఉన్న తాత్కాలిక పవనాలు. అవి ఏడాదంతా వీయకుండా కొన్ని రుతువుల్లో, కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయి. భూ, జలభాగాల మధ్య రుతువును అనుసరించి, దిశను మార్చుకుంటూ వీస్తుంటాయి. రుతుపవనం అనే పదం ‘మౌసం’ అనే   అరబిక్‌ పదం నుంచి తీసుకున్నారు. ‘మౌసం’ అంటే రుతువు అని అర్థం.  అరేబియా సముద్రంలో రుతువును అనుసరించి వచ్చిన పవనాలకు  క్రీ.శ. 7వ శతాబ్ద నావికులు ఈ పేరు పెట్టి ఉండొచ్చని శాస్త్రజ్ఞుల అంచనా. సూర్యగమనం, ఉష్ణోగ్రతలో కలిగే మార్పుల వల్ల ఈ పవనాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఉష్ణోగ్రత విషయంలో నీరు, నేల స్పందించే విధానంపై రుతుపవన వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. అంటే స్థానిక పవనాలైన ‘స్థల, జల, పవన వ్యవస్థ’ పెద్దఎత్తున జరిగితే రుతుపవన వ్యవస్థగా మారుతుంది.

ఆసియా ఖండంలోని ఇండియా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, మయన్మార్‌, వియత్నాం, లావోస్‌, కంబోడియా, మలేసియా, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్‌, చైనా, హాంగ్‌కాంగ్‌, కొరియా, జపాన్‌ మొదలైన దేశాలు ఈ రుతుపవనాలతో వర్షాన్ని పొందుతున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ‘రుతుపవన ఆసియా’గా పిలుస్తారు. రుతుపవన వ్యవస్థ దక్షిణార్ధ గోళంలో కంటే, ఉత్తరార్ధ గోళంలోనే నిర్దిష్టంగా ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలో భూ, జల విస్తరణ ఇంచుమించు సమానంగా ఉండటం వల్ల పీడన వ్యవస్థలో మార్పులతో రుతుపవన వ్యవస్థ మొదలైంది. అయితే దక్షిణార్ధ గోళంలో సముద్ర భాగం ఎక్కువగా ఉండటంతో పీడన వ్యవస్థలో మార్పులు తక్కువగా జరిగి, రుతుపవన వ్యవస్థ పటిష్టంగా లేదు.


రుతుపవనాలు ఏర్పడటానికి ముఖ్య కారణాలు

1) భూమి, నీరు భిన్న రీతుల్లో ఉష్ణాన్ని గ్రహించడం, చల్లబడటం: వేసవి కాలంలో సముద్రం కంటే భూమి వేడిగా, శీతాకాలంలో చల్లగా ఉంటుంది. వేసవిలో ఆసియా ఖండం వేడెక్కడం వల్ల సైబీరియాపై అల్పపీడనం కేంద్రీకృతం అవుతుంది. దీంతో పవనాలు సముద్రం పైనుంచి భూభాగం మీదకు వీస్తాయి. ఈ పవనాల్లో నీటిఆవిరి అధికంగా ఉండటం వల్ల ఇవి వర్షం కురిపిస్తాయి. ఉత్తరార్ధ గోళంలోని సైబీరియాపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసం దక్షిణార్ధ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు పయనించడం ప్రారంభిస్తాయి. భూమధ్యరేఖను దాటగానే భూభ్రమణం, కొరియాలిస్‌ ప్రభావం వల్ల ఇవి నైరుతి రుతుపవనాలుగా మారి ఆసియా ఖండంపై వీచి వర్షాన్ని ఇస్తాయి. వర్షాన్నిచ్చే ఈ నైరుతి వ్యాపార   పవనాలను నైరుతి రుతుపవనాలుగా పిలుస్తున్నారు. నీ శీతాకాలం మొదలవగానే ఆసియా ఖండం (సైబీరియా)పై అధిక పీడనం, హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కేంద్రీకృతమవుతాయి. ఈ అల్పపీడన ఆక్రమణకు ఉత్తరార్ధ గోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు వీచడం ప్రారంభించి క్రమంగా ఈశాన్య రుతుపవనాలుగా రూపుదిద్దుకుంటాయి. భూభాగంపై నుంచి వీచే ఈ పవనాల్లో నీటిఆవిరి అంతగా ఉండకపోవడంతో అల్ప వర్షాన్ని కలగజేస్తాయి.

2) ట్రోపో ఆవరణ పైభాగంలో అతివేగంగా వీచే ‘జెట్‌ వాయు ప్రవాహాలు: శీతాకాలంలో ఆసియా ఖండంపై ఏర్పడిన అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడనం ఉన్న హిందూ మహాసముద్రం వైపు ఈశాన్య వ్యాపార పవనాలు వీస్తాయి. ఇవి ఎక్కువ వేగంతో వీయడానికి ట్రోపో ఆవరణంపై భాగంలోని పశ్చిమ జెట్‌ స్ట్రీమ్‌ దోహదం చేస్తుంది. ఇది రెండు శాఖలుగా చీలి, ఒక శాఖ హిమాలయాలకు ఉత్తరంగా, మరో శాఖ దక్షిణ దిశకు పయనిస్తూ చైనా తూర్పు తీరంలో కలుస్తాయి. ఈశాన్య వ్యాపార పవనాలు వేగంగా సముద్రంపైకి వీయడానికి ఇవి దోహదం చేస్తాయి.


భారతదేశంలో రుతుపవన వ్యవస్థ

భారత్‌ ప్రధానంగా రుతుపవన దేశం. ఇక్కడ రుతుపవన వ్యవస్థ ఉన్నంత పటిష్టంగా ఇతర ఏ ప్రాంతంలోనూ లేదు. రుతుపవనాల వల్ల వర్షం పొందే దేశాల్లో ప్రధానమైంది, పెద్దది మన దేశమే.అందుకే భారతదేశ శీతోష్ణస్థితికి అయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి అని పేరు.భారతదేశం రుతుపవన ఆసియాలో రుతుపవన మండలంలో ఉండి, రుతుపవనాలతో వర్షాన్ని పొందుతోంది.

రుతుపవన దేశంగా మారడానికి కారణాలు: భారతదేశం అక్షాంశపరంగా ఉత్తరార్ధ గోళంలో, రేఖాంశ పరంగా పూర్వార్ధ గోళంలో ఉంది. దేశానికి ఇరువైపులా భూ, జల విస్తరణ ఇంచుమించు సమానంగా ఉండి పీడన వ్యవస్థలో మార్పులు జరిగి రుతుపవన వ్యవస్థ స్థిరపడింది. కర్కాటకరేఖ భారత్‌ మధ్యలో నుంచి వెళుతుండటంతో సూర్యగమనంలోని మార్పుల ప్రభావానికి గురైంది. భారత్‌కు ఉత్తరంగా పెద్ద భూభాగమైన ఆసియా ఖండం, దక్షిణాన పెద్ద జలభాగమైన హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఇలాంటి అమరిక ప్రపంచంలో మరెక్కడా లేదు. రుతుపవనాలు పయనించే దారిలో ప్రథమ దేశంగా, పెద్ద భూభాగంగా ఉన్నది భారతదేశమే. అతిపెద్ద పర్వతాలైన హిమాలయాలు దేశంలో ఉత్తర దిక్కున పెట్టని కోటలా ఉండి రుతుపవనాలను అడ్డగించి వర్షపాతానికి తోడ్పడుతున్నాయి. హిమాలయాలు లేకపోతే మాసిన్రామ్‌లో అత్యధిక వర్షపాతం నమోదయ్యేది కాదు. కన్యాకుమారి అగ్రం ఆకారం వల్ల రుతుపవనాలు రెండు శాఖలుగా మారి దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్షాన్నిస్తున్నాయి. దేశానికి మూడువైపులా సముద్రం ఉండటం రుతుపవన విషయంలో అనుకూలాంశం.

భారత్‌లో రుతుపవనాల లక్షణాలు: రుతువును అనుసరించి పవన దిశలు సుమారు 180 డిగ్రీల కోణంతో అపవర్తనం చెందుతాయి.

  • ఇవి రుతు సంబంధమైనవి. రుతుపవన గాలులు వేసవిలో జలభాగం నుంచి భూభాగం వైపు, శీతాకాలంలో భూభాగం నుంచి జలభాగం వైపు తమ దిశను మార్చుకుని వీస్తాయి.
  • వేసవి, శీతాకాలాల్లో పరస్పర విరుద్ధ లక్షణాలున్న వాయురాశులతో ఉంటాయి.
  • దేశంలో వర్షపాతం రుతు సంబంధమైంది. అంటే ఒక రుతువులో అధిక వర్షపాతం, మరో రుతువులో అల్ప వర్షపాతం కారణంగా వరదలు, దుర్భిక్షం లాంటివి దేశంలో ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయాయి.
  • శీతోష్ణస్థితిలో అనేక ప్రాంతీయ వైవిధ్యతలు ఉన్నప్పటికీ రుతుపవన వ్యవస్థ దేశ భూభాగాన్నంతటినీ ప్రభావితం చేస్తూ మొత్తం దేశాన్ని రుతుపవన దేశంగా ఉంచుతుంది.
  • రుతుపవన వ్యవస్థ అనిశ్చిత స్థితిలో ఉండటానికి దాని స్వభావంలోని మార్పులే కారణం. అవి
  • దేశ భూభాగంలోకి ఆకస్మికంగా ప్రవేశిస్తాయి.
  • దేశ భూభాగమంతా క్రమపద్ధతిలో విస్తరిస్తాయి.
  • క్రమపద్ధతిలో దేశ భూభాగం నుంచి తిరోగమిస్తాయి.
  • అనిశ్చితత్వంతో ఉంటాయి.

రుతుపవనాల విరామం

భారతదేశ రుతుపవన వ్యవస్థ మరో లక్షణం ఇది. నైరుతి రుతుపవన కాలంలో అంటే జులై, సెప్టెంబరు నెలల మధ్య ప్రతి వారం లేదా 10 రోజులకోసారి వాతావరణంలో పొడి పరిస్థితులేర్పడి వర్షం కురవని స్థితినే రుతుపవనాల విరామం అని పిలుస్తారు.


రుతుపవనాల క్రియాశీలత/ ఆవిర్భావ సిద్ధాంతాలు

భారతదేశంలో రుతుపవనాల ఆవిర్భావం లేదా క్రియాశీలతను వివరిస్తూ అనేక సిద్ధాంతాలు అమలులో ఉన్నాయి. అవి 1) హేలీ ఉష్ణగతిక సిద్ధాంతం 2) ఫ్లోన్‌ గతిశీల సిద్ధాంతం 3) టిబెట్‌ హీట్‌ ఇంజిన్‌ సిద్ధాంతం 4) జెట్‌ స్ట్రీమ్‌ సిద్ధాంతం


జెట్‌ స్ట్రీమ్స్‌

ప్రముఖ భారతీయ వాతావరణ శాస్త్రవేత్త త్రివార్థ ప్రకారం జెట్‌ స్ట్రీమ్స్‌ అంటే, వ్యాపార పవనాలకు వ్యతిరేక దిశలో ట్రోపో ఆవరణం పై సరిహద్దులో పశ్చిమ పవనాలను అనుసరించి, పశ్చిమం నుంచి తూర్పునకు అత్యంత వేగంతో వంకర్లు తిరుగుతూ కదిలే జియోస్ట్రోపిక్‌ పవనాలు. భారతదేశంలో రుతుపవన వ్యవస్థను ఏర్పరచడంలో వీటిది కీలకపాత్ర. వీచే భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు.

1) అయన భూమధ్యరేఖ ప్రాంత తూర్పు జెట్‌ స్ట్రీమ్స్‌:  ఇవి దేశంలో రుతుపవన విస్ఫోటానికి, పురోగమనానికి తోడ్పడతాయి. నైరుతి రుతుపవనాలు మంగళూరు నుంచి కోల్‌కతా అక్షం వైపు (నైరుతి నుంచి ఈశాన్యం) భూ ఉపరితలం మీదుగా వీస్తూ ఉంటే, తూర్పు జెట్‌ స్ట్రీమ్స్‌ కోల్‌కతా నుంచి మంగళూరు అక్షం దిశ (ఈశాన్యం నుంచి నైరుతి)లో ట్రోపో ఆవరణం పైభాగంలో వీస్తాయి. టిబెట్‌ పీఠభూమిలో ఏర్పడిన అల్పపీడన గాలుల రూపమే ఇవి. అత్యంత వేగంతో వీస్తూ (60 నాట్స్‌/ 1 గంటకి (లేదా) 111 కి.మీ./ 1 గంటకి) నైరుతి రుతుపవనాల పురోగమనానికి తోడ్పడతాయి. అంటే టిబెట్‌ పీఠభూమిలోని గాలులను ఖాళీ చేయడంతో, రుతుపవనాలు పురోగమిస్తాయి. నీ తూర్పు జెట్‌ స్ట్రీమ్స్‌ చల్లగా ఉండే వాయురాశులు. తమ కింద ప్రయాణించే నైరుతి రుతుపవనాలను తాకినప్పుడు చల్లబరచి వర్షానికి కారణమవుతాయి.

2) ఉప అయన రేఖ/ ఉష్ణమండల ప్రాంత పశ్చిమ జెట్‌ స్ట్రీమ్స్‌: ఇవి శీతాకాలంలో మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఏర్పడే అల్ప పీడనాలను భారతదేశ వాయవ్య ప్రాంతంలోకి లాగడంలో కీలకపాత్ర వహిస్తాయి.

3) ధ్రువ వాతాగ్రపు ప్రాంతపు జెట్‌ స్ట్రీమ్స్‌: మధ్య అక్షాంశ ప్రాంతాల్లో ఏర్పడే సమశీతోష్ణ మండల చక్రవాతాలు రూపుదిద్దుకోవడంలో ముఖ్యపాత్రవహిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని