ఆర్థికాభివృద్ధికి సహాయపడని.. తప్పనిసరి నిర్వహణ!

ప్రభుత్వ వ్యయం ప్రజల ఆర్థిక, సామాజిక జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. దేశ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో కీలకం. అందుకే ప్రభుత్వం ప్రజాద్రవ్యాన్ని అత్యంత పొదుపుగా, న్యాయ సమ్మతంగా ఖర్చు చేయాలి. ప్రభుత్వం వివిధ నియమాల ఆధారంగా ప్రభుత్వ వ్యయాన్ని నిర్వహిస్తుంది.

Published : 21 Feb 2024 02:28 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

ప్రభుత్వ వ్యయం ప్రజల ఆర్థిక, సామాజిక జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. దేశ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో కీలకం. అందుకే ప్రభుత్వం ప్రజాద్రవ్యాన్ని అత్యంత పొదుపుగా, న్యాయ సమ్మతంగా ఖర్చు చేయాలి. ప్రభుత్వం వివిధ నియమాల ఆధారంగా ప్రభుత్వ వ్యయాన్ని నిర్వహిస్తుంది. ఇవన్నీ సమాజానికి గరిష్ఠ సాంఘిక ప్రయోజనాన్ని సమకూర్చేవిగా ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వ వ్యయం
(Union Government Expenditure)
పికాక్‌ - వైజ్‌మన్‌ల ప్రభుత్వ వ్యయ విశ్లేషణ

బ్రిటిష్‌ ఆర్థికవేత్తలైన అలెన్‌ టి. పికాక్‌, జాక్‌ వైజ్‌మన్‌లు 1890-1955 కాలానికి సంబంధించిన ఇంగ్లండ్‌ ప్రభుత్వ వ్యయ గణాంకాలను విశ్లేషించారు. ప్రభుత్వ వ్యయం క్రమక్రమంగా నిరవధికంగా పెరగకుండా జెర్క్స్‌ (jerks) లేదా మెట్ల (steps) తీరులో అంచెలంచెలుగా పెరుగుతుందని వారు పేర్కొన్నారు. వారు మూడు రకాల ప్రభావాలను ఇందులో వివరించారు. అవి:
1. తొలగింపు ప్రభావం: సామాజిక సంక్షోభం లేదా ఇతర అవాంతరాల (యుద్ధం, ప్రతి ద్రవ్యోల్బణం/ ఆర్థికమాంద్యం) కారణంగా ప్రభుత్వ వ్యయం పెరుగుదల అనివార్యమవుతుందని పికాక్‌, వైజ్‌మన్‌ పేర్కొన్నారు. వీటిని ప్రభుత్వం వద్ద ఉన్న ప్రస్తుత రాబడితో నిర్వహించలేమని వెల్లడించారు.

  • ప్రభుత్వ రాబడిని అధికం చేసేందుకు పన్ను రేట్లు పెంచాలి లేదా కొత్త పన్నులు విధించాలి. అయితే యుద్ధం లేదా ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితుల్లో ప్రజలు అధిక పన్ను భారాన్ని తట్టుకునే స్థితిలో ఉండరు. దీంతో ప్రభుత్వ వ్యయం అధిక స్థాయి వద్దే కొనసాగుతుంది.
  • దీని ఫలితంగా వ్యయం అధికమై, పన్నుల రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ విధంగా సామాజిక సంక్షోభాల తర్వాత కూడా పన్ను విధింపు, వ్యయంలో నిరపేక్ష, సాపేక్ష పెరుగుదల తొలగింపు ప్రభావాన్ని ఏర్పరుస్తుంది.

2. తనిఖీ ప్రభావం (Inspection Effect):
సామాజిక అవాంతరం ప్రత్యక్ష ఫలితంగా ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. తరచూ చేసే ఇతర వ్యయ అంశాలు ప్రభుత్వ కొత్త ఆర్థిక కార్యకలాపాల విస్తరణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ప్రస్తుత రాబడి ప్రభుత్వ వ్యయం కంటే తక్కువగా ఉంటే అది తనిఖీ ప్రభావాన్ని ఏర్పరుస్తుంది.

3. కేంద్రీకరణ ప్రభావం (Concentration Effect): సామాజిక అవాంతరం (SocialDisturbance) కారణంగా సాధారణ స్థాయి నుంచి ప్రభుత్వ వ్యయం పెరిగి, రాబడి తగ్గుతుంది. దీంతో ప్రభుత్వ వ్యయం, రాబడి కొత్త స్థాయి వద్ద స్థిరమవుతాయి. దీన్నే కేంద్రీకరణ ప్రభావం అంటారు.

పికాక్‌ - వైజ్‌మన్‌ పరికల్పన ప్రభుత్వవ్యయం, రాబడి పెరుగుదలకు దారితీసే అసాధారణమైన, అసంగతమైన పరిస్థితులను ప్రస్తావించి, ఒక ప్రత్యేక పరిస్థితిని వివరించింది.

పంచవర్ష ప్రణాళికలు - కేంద్ర ప్రభుత్వ వ్యయం

పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆర్థికవృద్ధి సాధించాలని ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేసింది. నాటి నుంచే ప్రభుత్వ వ్యయం పెరుగుతూ వచ్చింది.

రాబడిలాగానే వ్యయాన్ని కూడా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం అని రెండు రకాలుగా విభజించారు.

రెవెన్యూ వ్యయం: రెవెన్యూ వ్యయాన్ని ఎ) సాధారణ ఆర్థిక, సామాజిక సేవలపై చేసే వ్యయం, బి) రక్షణ వ్యయం సి) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే విరాళాలపై వ్యయం అని మూడు విధాలుగా వర్గీకరించారు.

  • 1990-91 నుంచి 2010-11 మధ్య భారతదేశ ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, రెవెన్యూ వ్యయం చాలా ఎక్కువగా, మూలధన వ్యయం చాలా తక్కువగా ఉన్నాయి. వాస్తవానికి పెట్టుబడికి ఉపయోగపడే మూలధన వ్యయం మొత్తం వ్యయాలలో 20 శాతం కంటే తక్కువగా ఉంది. రక్షణ వ్యయం పెరగడం, రుణాలు పెరిగి - వడ్డీ చెల్లింపులు అధికం కావడం, సబ్సిడీల కారణంగా రెవెన్యూ వ్యయం పెరుగుతుంది.
  • రెవెన్యూ వ్యయం అనేది ఆర్థికాభివృద్ధికి సహాయకారి కాదు. కాబట్టి దీన్ని తగ్గించి, నియంత్రించాలని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అయితే ప్రజల సామాజిక అవసరాల దృష్ట్యా దీన్ని ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహించాల్సి వస్తోంది.
  • 1990-2010 మధ్య స్థూలజాతీయోత్పత్తిలో మొత్తం రెవెన్యూ వ్యయం క్రమక్రమంగా పెరిగింది. ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ, సబ్సిడీలు పెరగడమే ఇందుకు కారణం. ఆ కాలంలో వడ్డీ చెల్లింపులు, సబ్సిడీ వ్యయం, రక్షణ వ్యయాలు స్థూలజాతీయోత్పత్తిలో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి.

మూలధన వ్యయం: మూలధన వ్యయాన్ని కాలక్రమంలో ఉపాధి, ఉద్యోగిత, ఆదాయాలను సృష్టించగల పెద్ద ప్రాజెక్టులు, నిర్మాణాలు లాంటి వాటిపై ఒకేసారి చేయగల భారీ వ్యయంగా పేర్కొంటారు.

  • పంచవర్ష ప్రణాళికల కాలంలో మూలధన కల్పన వ్యయంలో చాలా మార్పులు జరిగాయి. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో 33% ఉన్న మూలధన వ్యయం రెండో పంచవర్ష ప్రణాళికా కాలానికి 43.3 శాతానికి పెరిగింది. ఆ తర్వాత అనేక హెచ్చు-తగ్గులకులోనై క్రమంగా క్షీణించసాగింది. ఏడు, ఎనిమిది పంచవర్ష ప్రణాళికల కాలంలో ఇది దాదాపు 29 శాతానికి తగ్గింది. ఆ తర్వాత బాగా క్షీణించి, పదకొండో పంచవర్ష ప్రణాళికా కాలంలో 22.4 శాతానికి చేరింది.
  • తగ్గుతున్న మూలధన కల్పన వ్యయ శాతం అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం రుణాలపై ఆధారపడుతూ వచ్చింది.

2010-21 మధ్య కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం

ప్రభుత్వ మూలధన వ్యయవృద్ధి సగటున సంవత్సరానికి 2011-12 నుంచి 2020-21 మధ్యకాలంలో రూ.36,125 కోట్లు ఉండగా, ఇదే కాలంలో ప్రభుత్వ మొత్తం వ్యయ వృద్ధి రూ.2,48,266 కోట్లుగా ఉంది. అంటే ప్రభుత్వ మొత్తం వ్యయం పెరుగుదల కంటే మూలధన వ్యయ పెరుగుదల చాలా తక్కువ.

  • ప్రభుత్వ మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా 2015-16 నుంచి 2020-21 మధ్యకాలంలో బాగా క్షీణించింది. ఈ సమయంలో మూలధన వాటా 12 నుంచి 13 శాతంగా మాత్రమే ఉంది. అభివృద్ధి సాధించడానికి ఇంత తక్కువ మూలధనం ఉపయోగపడదు.
  • స్థూల జాతీయోత్పత్తిలో మూలధనవ్యయ శాతం కేవలం 1.5% నుంచి 1.9% మధ్యే ఉంది. అంటే స్థూల జాతీయోత్పత్తిలో కనీసం 2% కూడా మూలధన వ్యయంగా ఉపయోగపడలేదు. అందుకే దేశంలోని సహజ వనరులను, శ్రామిక శక్తిని ఎక్కువస్థాయిలో ఉపయోగించి ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం చేసే రుణం కూడా ఒక శక్తిమంతమైన సాధనమని ఆర్థికవేత్తలు భావించారు. కాలక్రమంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం రుణాలు సేకరించడం కూడా పెరిగిపోయింది.

ప్రభుత్వ వ్యయ ప్రభావాలు

ఉత్పత్తి, ఉద్యోగితపై ప్రభావాలు

ప్రొఫెసర్‌ హ్యూ డాల్టన్‌ ప్రకారం ఏ దేశంలో అయినా ఉత్పత్తి, ఉద్యోగిత స్థాయి మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

పని చేసే, పొదుపు చేసే, పెట్టుబడి పెట్టే ప్రజల సామర్థ్యం: ప్రభుత్వ వ్యయం అనేది ప్రజల పని, పొదుపు, పెట్టుబడి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉచిత వైద్యం, విద్య, ఆరోగ్య సేవలు; చౌకైన గృహ సౌకర్యాలు మొదలైనవాటిపై చేసే ప్రభుత్వ వ్యయం ప్రజలు పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది.

పని చేసే, పొదుపు చేసే, పెట్టుబడి పెట్టే ప్రజల కోరిక: పని, పొదుపు, పెట్టుబడి కోరిక ద్వారా ప్రభుత్వ వ్యయం ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

వివిధ ఉద్యోగితలు, వివిధ ప్రాంతాల మధ్య ఆర్థిక వనరుల మళ్లింపు: గరిష్ఠ జాతీయోత్పత్తి, సమాజ సంక్షేమ సాధన కోసం ప్రభుత్వం వ్యయాన్ని చేసేందుకు ప్రత్యేక ప్రాంతాన్ని లేదా స్థలాన్ని, పరిశ్రమను ఎంపిక చేస్తుంది.

సమష్టి ఆర్థిక అస్థిరతపై ప్రభుత్వ వ్యయ ప్రభావాలు

మష్టి ఆర్థిక అస్థిరత సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి: ఉత్పత్తి అస్థిరత, ధరల అస్థిరత.

  • జే.ఎం. కీన్స్‌ ప్రకారం, స్థిర ధరల స్థాయి వద్ద ఉన్న సంపూర్ణ ఉద్యోగిత ఆ స్థితి నుంచి వైదొలగడాన్ని ఆర్థిక అస్థిరత అంటారు. దీనికి ప్రధాన కారణం సమష్టి సార్థక డిమాండ్‌ కొరత.
  • తక్కువ ఉపాంత పెట్టుబడి సామర్థ్యంతో పాటు ఉపాంత వినియోగ ప్రవృత్తి సూత్రం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో సమష్టి సార్థక డిమాండ్‌ లోపానికి కారణాలుగా ఉన్నాయి.

మాంద్యం కాలంలో ప్రభుత్వ వ్యయ ప్రభావాలు

సాధారణంగా ఎప్పుడైతే పొదుపు అనేది పెట్టుబడిని అధిగమిస్తుందో తత్ఫలితంగా సమష్టి సార్థక డిమాండ్‌ తగ్గి, ధరలు తగ్గుతాయి. ఈ స్థితినే మాంద్యంగా పేర్కొంటారు.

ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వ వ్యయ ప్రభావాలు

దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణపరమైన పరిస్థితులను అరికట్టడంలో ప్రభుత్వ వ్యయం సహాయకారిగా ఉంటుంది.

ఆర్థికాభివృద్ధి, వృద్ధిలపై ప్రభుత్వ వ్యయ ప్రభావాలు

భివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ప్రాంతీయ అసమానతలను తగ్గించడంలో, సాంఘిక - అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో, మౌలిక వసతుల కల్పనలో, మూలధన వస్తు పరిశ్రమల వృద్ధి - పరిశోధన అభివృద్ధిలో ప్రభుత్వ వ్యయం ముఖ్యపాత్ర పోషిస్తుంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరీకరణకు, ఆర్థిక కార్యకలాపాల ఉద్దీపనకు ప్రభుత్వ వ్యయం ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని