పౌర ప్రమాణాలకు శాసన చట్రాలు!

పౌరసత్వం అంటే ఒక గుర్తింపు, హక్కు, అనేక ప్రయోజనాలను అందించే అర్హత. జాతీయస్థాయిలో అత్యంత ప్రాధాన్యాన్ని కలిగిన ఈ పౌరసత్వ స్థితిని నిర్ణయించడానికి, అందించడానికి, రద్దు చేయడానికి భారత ప్రభుత్వం పలు ప్రమాణాలను పాటిస్తుంది.

Published : 22 Feb 2024 02:03 IST

భారత రాజ్యాంగం రాజకీయాలు

పౌరసత్వం అంటే ఒక గుర్తింపు, హక్కు, అనేక ప్రయోజనాలను అందించే అర్హత. జాతీయస్థాయిలో అత్యంత ప్రాధాన్యాన్ని కలిగిన ఈ పౌరసత్వ స్థితిని నిర్ణయించడానికి, అందించడానికి, రద్దు చేయడానికి భారత ప్రభుత్వం పలు ప్రమాణాలను పాటిస్తుంది. అందుకోసం అనేక చట్టాలను రూపొందిస్తుంది. అవసరమైనప్పుడు మార్పులుచేర్పులు, సవరణలు చేస్తుంటుంది. కోట్లమంది జీవితాలను ప్రభావితం చేసే ఆ శాసన చట్రాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు ద్వంద్వ పౌరసత్వం, జాతీయ జనాభా పట్టిక తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

పౌరసత్వ సవరణ చట్టాలు

భారత పార్లమెంటు దేశ పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందిస్తుంది. అవసరమైనప్పుడు సవరణలు చేస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ మూలాలు ఉండి, ఇతర దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను దేశ ప్రగతిలో భాగస్వాములను చేయడానికి ‘ద్వంద్వ పౌరసత్వం’ కల్పించే చట్టాన్ని కూడా చేసింది.

భారత పౌరసత్వ సవరణ చట్టం-1986:  రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో 1986లో పార్లమెంటు పౌరసత్వ చట్టాన్ని సవరించింది. విదేశీయులు అక్రమంగా ఇక్కడి పౌరసత్వాన్ని పొందకుండా నియంత్రించేందుకు 1955లో రూపొందించిన భారత పౌరసత్వ చట్టాన్ని సవరించింది.

ముఖ్యాంశాలు:

 • నమోదు ద్వారా భారత పౌరసత్వాన్ని పొందాలంటే ఈ చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తి భారతదేశంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం ఉండాలని నిర్దేశించారు.
 • ఈ చట్టం ద్వారా ‘మహిళలు’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘వ్యక్తులు’ అనే పదాన్ని చేర్చారు. (1955 నాటి భారత పౌరసత్వ చట్టంలో భారతీయుడిని వివాహమాడిన విదేశీ ‘మహిళ’ అని పేర్కొన్నారు)
 • సహజ సిద్ధంగా భారత పౌరసత్వాన్ని పొందాలనుకునే విదేశీయులు ఈ చట్టం ప్రకారం భారతదేశంలో 10 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం ఉండాలని నిర్దేశించారు. (1955 నాటి భారత పౌరసత్వ చట్టంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసం అని పేర్కొన్నారు).

భారత పౌరసత్వ సవరణ చట్టం-2003:  ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ సిఫార్సుల మేరకు దేశప్రగతిలో ప్రవాస భారతీయులను భాగస్వాములను చేసే లక్ష్యంతో అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో పార్లమెంటు 2003లో ‘భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని’ రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ)కు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు. దీని ఫలితంగా, వారు విదేశీ పౌరసత్వంతో పాటు భారతీయ పౌరసత్వాన్ని కూడా పొందారు. ఈ చట్టం ప్రకారం 2004లో 16 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు మనదేశం భారతీయ పౌరసత్వాన్ని (ద్వంద్వ పౌరసత్వం) కల్పించింది. అవి.. అమెరికా, బ్రిటన్‌, స్విట్జర్లాండ్‌, కెనడా, పోర్చుగల్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌, స్వీడన్‌, గ్రీస్‌, న్యూజిలాండ్‌, ఫిన్లాండ్‌, సైప్రస్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌.

ప్రవాస భారతీయ దివస్‌:

 • గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తిని వదిలి, దేశ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని 2003 నుంచి జనవరి 9ని ‘ప్రవాస భారతీయ దివస్‌’గా పాటిస్తున్నారు.
 • 2006, జనవరి 9న నిర్వహించిన ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లను మినహాయించి, మిగిలిన అన్ని దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరూ ద్వంద్వ పౌరసత్వాన్ని పొందేందుకు అవకాశం కల్పించారు.

ద్వంద్వ పౌరసత్వం-ప్రయోజనాలు-పరిమితులు:

 • ద్వంద్వ పౌరసత్వాన్ని పొందిన ప్రవాస భారతీయులు భారతదేశంలో ఆస్తులను సంపాదించుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు. భారతీయ పాస్‌పోర్టును పొందవచ్చు. విద్య, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతీయులతో సమానమైన అవకాశాలు ఉంటాయి. అయితే ప్రవాస  భారతీయులు ఎన్నికల్లో పోటీ చేయడానికి, రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టడానికి అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భారతీయులతో సమానంగా అవకాశాలు పొందే హక్కు లేదు.
 • 2010, జనవరి 1 నుంచి ప్రవాస భారతీయులకు మనదేశంలో ఓటు హక్కు కల్పించారు.
 • ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 2004లో ఏర్పాటు చేశారు.

ద్వంద్వ పౌరసత్వాన్ని పొందే పద్ధతులు:

1) భారతీయ సంతతి వ్యక్తుల పథకం (పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌):

 • 1999, మార్చిలో భారత ప్రభుత్వం ‘పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌’ (పీఐఓ) కార్డు పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. దీనిని 2002, సెప్టెంబరు 15న పునః సమీక్షించి కొత్త పీఐఓ కార్డు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
 • పీఐఓ కార్డు పొందడానికి ప్రవాస భారతీయులు అర్హులు. పెద్దలు రూ.15,000, 18 ఏళ్ల లోపు పిల్లలు రూ.7,500 చెల్లించాలి. ఈ కార్డు కాలపరిమితి 15 ఏళ్లు. దీన్ని 6 నెలలకోసారి పునరుద్ధరించుకోవాలి.
 • బంగ్లాదేశ్‌, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌, చైనా, నేపాల్‌, పాకిస్థాన్‌లలోని ప్రవాస భారతీయులకు పీఐఓ కార్డులు మంజూరు చేయరు.
 • పీఐఓ కార్డు పొందినవారికి మనదేశంలో వ్యాపార, వాణిజ్య హక్కులు; విద్య, స్థిర నివాసానికి సంబంధించిన హక్కులు ఉంటాయి. కానీ రాజకీయ హక్కులు లభించవు.

2) ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా పథకం (ఓసీఐ):

 • 2003 భారత పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ‘ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా పథకం’ (ఓసీఐ) కార్డులను ప్రవేశపెట్టారు.2004 నుంచి పీఐఓ కార్డుల స్థానంలో ఓసీఐ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
 • ఈ కార్డును పొందినవారు భారతదేశాన్ని సందర్శించడానికి ‘వీసా’ పొందాల్సిన అవసరం లేదు.
 • 5 సంవత్సరాలు ఓసీఐగా కొనసాగిన ప్రవాస భారతీయులు భారతదేశంలో 2 సంవత్సరాలు సాధారణ జీవితాన్ని గడిపితే భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు.
 • 1950, జనవరి 26 తర్వాత భారతదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లినవారికి ఓసీఐ కార్డు ఇస్తారు.

భారత పౌరసత్వ సవరణ చట్టం-2015:

 • 2015, మార్చి 10న రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం ‘భారత పౌరసత్వ సవరణ చట్టం-2015’ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం పౌరసత్వ చట్టం 1955లోని 7తి, 7తీ, 7ది, 7దీ సెక్షన్లలో మార్పులు చేశారు. 

భారత పౌరసత్వ సవరణ చట్టం-2019:

 • భారత పౌరసత్వ చట్టాన్ని సవరించేందుకు 2019, డిసెంబరు 12న పార్లమెంటు ‘పౌరసత్వ సవరణ బిల్లు’ను ఆమోదించింది. తర్వాత అది సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సీఏఏ)గా అమల్లోకి వచ్చింది.
 • ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి శరణు కోరివచ్చే ముస్లిమేతరులైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు భారత పౌరసత్వం పొందేందుకు అర్హులవుతారు. 2014, డిసెంబరు 31 కంటే ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారికే ఈ అవకాశం ఉంటుంది.
 • పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వలసవచ్చిన ముస్లింలకు ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం భారత పౌరసత్వం లభించదు.
 • అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయలను మినహాయించారు.

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌):

 • దేశంలోని ప్రతి పౌరుడి వివరాలను సేకరించి ‘జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)’ను రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని ప్రకారం ప్రజల డెమోగ్రాఫిక్‌, బయోమెట్రిక్‌ వివరాలను సేకరిస్తారు. ప్రభుత్వం 2010లో ఎన్‌పీఆర్‌ కోసం ప్రజల వివరాలను సేకరించింది. 2011 జనాభా గణాంకాల్లో ఈ ప్రక్రియను చేపట్టారు.
 • 2010లో ‘జాతీయ జనాభా పట్టిక’ రూపకల్పనలో భాగంగా 15 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. 2020-21లో జాతీయ జనాభా పట్టిక రూపకల్పనలో భాగంగా 21 అంశాలతో కూడిన వివరాలను నమోదు చేశారు.
 • 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు కార్డుల జారీ కోసం దేశంలో పౌరులు ఎవరైనా ఒక ప్రాంతంలో 6 నెలల కంటే ఎక్కువ కాలం నివాసం ఉంటే వారంతా తప్పనిసరిగా ‘జాతీయ జనాభా పట్టిక’లో పేరు నమోదు చేయించుకోవాలని నిర్దేశించారు.

జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ):

 • 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరులుగా అర్హత సాధించిన వారి సమగ్ర సమాచారాన్ని ఎన్‌ఆర్‌సీలో నమోదు చేస్తారు. ఎన్‌ఆర్‌సీ అనేది ఒక చట్టబద్ధమైన భారతీయ పౌరుల అధికారిక రికార్డు.
 • 1951లో జరిగిన భారత జనాభా గణాంకాల సేకరణ తర్వాత మొదటిసారిగా ఎన్‌ఆర్‌సీ రూపొందింది.
 • అస్సాంలో ఎన్‌ఆర్‌సీని రూపొందించడం తప్పనిసరని భారత పౌరసత్వ సవరణ చట్టం - 2003లో పేర్కొన్నారు.
 • అస్సాం రాష్ట్రంలో చేపట్టిన నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ తుది జాబితా 2019, ఆగస్టు 31న విడుదలైంది. దాని ప్రకారం అస్సాం పౌరుల్లో 19 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీలో చోటుదక్కలేదు. వారిని ఇకపై విదేశీయులుగా గుర్తిస్తారు.

అస్సాం ఒప్పందం-1985:

 • 1971, మార్చి 24 తర్వాత అస్సాంకి వచ్చిన విదేశీయులను మతంతో సంబంధం లేకుండా బయటకు పంపాలని 1985లో జరిగిన ‘అస్సాం ఒప్పందం’లో పేర్కొన్నారు.
 • ఈ ఒప్పందాన్ని కొత్త పౌరసత్వ సవరణబిల్లు ఉల్లంఘిస్తోందని నిరసనలు చెలరేగాయి.

సుప్రీంకోర్టు తీర్పు: డేవిడ్‌ జాన్‌ హాప్‌కిన్స్‌ జు( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు-1997: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ విదేశీయులకు పౌరసత్వాన్ని ఇచ్చే విషయంలో భారతదేశం విచక్షణాధికారాన్ని కలిగి ఉంటుందని, విదేశీయులు మనదేశ పౌరసత్వాన్ని పొందడమనేది ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదని పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు