దేశ ప్రగతికి చోదకం.. ఆర్థిక వృద్ధికి ఇంధనం!

శాస్త్ర సాంకేతిక రంగం దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు సైతం ఈ రంగానికి ప్రాధాన్యం ఇచ్చి, అత్యధిక నిధులు కేటాయిస్తున్నాయి. కేవలం ఆర్థిక సంబంధ అంశాలపైనే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని నివారించి, జీవవైవిధ్యతను కాపాడటంలోనూ ఈ రంగం ఎంతగానో తోడ్పడుతుంది.

Updated : 23 Feb 2024 03:28 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

శాస్త్ర సాంకేతిక రంగం దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు సైతం ఈ రంగానికి ప్రాధాన్యం ఇచ్చి, అత్యధిక నిధులు కేటాయిస్తున్నాయి. కేవలం ఆర్థిక సంబంధ అంశాలపైనే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని నివారించి, జీవవైవిధ్యతను కాపాడటంలోనూ ఈ రంగం ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ శాస్త్ర సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగం దేశ ప్రగతికి చోదక శక్తిలా, ఆర్థికాభివృద్ధికి ఇంధనంలా తన వంతు కృషి చేస్తోంది. వివిధ పోటీ పరీక్షల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ఎంతో కీలకం. ఎక్కువ శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచే వస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో జరిగిన పురోగతి, మార్పులు, చేపట్టిన చర్యలు మొదలైనవాటిపై పోటీపరీక్షార్థికి అవగాహన ఉండాలి.

శాస్త్ర సాంకేతిక రంగంలో ఇటీవలి సంఘటనలు/ ప్రగతి
హైడ్రోజన్‌ - నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌

హైడ్రోజన్‌ అత్యంత తేలికైన, విశ్వంలో విస్తారంగా లభ్యమయ్యే రసాయన మూలకం. దీన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు.

హైడ్రోజన్‌కు అత్యంత తక్కువ ద్రవ్యరాశి, అత్యధిక కెలోరిఫిక్‌ విలువ ఉంటాయి. దీన్ని వినియోగించినప్పుడు తక్కువ కాలుష్య కారకాలు వెలువడతాయి. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా
హైడ్రోజన్‌పై ఎక్కువగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

వివిధ రకాల హైడ్రోజన్లు

గ్రే హైడ్రోజన్‌: సహజవాయువుల నుంచి వెలువడుతుంది.

బ్లూ హైడ్రోజన్‌: సహజవాయువుల నుంచి వెలువడుతుంది

గ్రీన్‌ హైడ్రోజన్‌: రెన్యువబుల్‌ (పునరుద్ధరించే) శక్తి వనరుల నుంచి వెలువడుతుంది.

బ్లాక్‌ హైడ్రోజన్‌: బొగ్గు నుంచి సంగ్రహిస్తారు.

పింక్‌ హైడ్రోజన్‌: అణుశక్తి నుంచి వెలువడుతుంది.

టర్కోయిస్‌ హైడ్రోజన్‌: సహజవాయువు నుంచి వెలువడుతుంది.

ఎల్లో హైడ్రోజన్‌: సూర్యరశ్మి నుంచి తయారు చేస్తారు.

 • భారత ప్రభుత్వం శిలాజ ఇంధనాల స్థానంలో శుద్ధ శక్తి వనరుల (క్లీన్‌ ఎనర్జీ రిసోర్సెస్‌)ను వినియోగించే కార్యక్రమంలో భాగంగా నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రారంభించింది. దీని కార్యాచరణకు కావాల్సిన విధివిధానాలను మినిస్ట్రీ ఆఫ్‌ న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ రూపొందిస్తుంది.
 • Strategic Interventions for Green Hydrogen Transition (SIGHT) ద్వారా దేశీయంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తారు. Strategic Hydrogen Innovation Partnership (SHIP) ద్వారా అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు హైడ్రోజన్‌ ఉత్పత్తికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ - ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)లో చేపడతారు.  

నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ లక్ష్యాలు: 2030 నాటికి కనీసం అయిదు మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ వార్షిక ఉత్పత్తి.

 • 50 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలను వార్షికంగా తగ్గించడం.
 • 60 నుంచి 100 గిగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయటానికి కావాల్సిన ఎలక్ట్రోలైజర్ల ఏర్పాటు.
 • ఆరు లక్షల కొత్త ఉద్యోగాల కల్పన.
 • 125 గిగా వాట్ల సామర్థ్యం కలిగిన గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి.
 • హైడ్రోజన్‌ ఇంధన ఉత్పత్తిలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలుకు రూ.19,744 కోట్లను కేటాయించింది.  

హైడ్రోజన్‌ ఫర్‌ హెరిటేజ్‌ స్కీమ్‌

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత వారసత్వ, పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి అవసరమైన హరిత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

దీనికోసం 35 హైడ్రోజన్‌ ట్రైన్లను తయారు చేస్తారు. తద్వారా హరిత రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం.

సూపర్‌ కంప్యూటర్లు

2023, మేలో జర్మనీలో 61వ ఇంటర్నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో భారతదేశానికి చెందిన ఏఐ సూపర్‌ కంప్యూటర్‌ ‘ఐరావత్‌’ ప్రపంచవ్యాప్తంగా టాప్‌-500 కంప్యూటర్ల జాబితాలో చేరింది. ఇది లిస్ట్‌లో 75వ స్థానంలో నిలిచింది. దీన్ని పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC) రూపొందించింది.

ఇదే జాబితాలో పరంసిద్ధి - ఏఐ సూపర్‌ కంప్యూటర్‌ 131వ స్థానంలో ఉంది. ప్రత్యూష సూపర్‌ కంప్యూటర్‌ 169, మిహిర్‌ సూపర్‌ కంప్యూటర్‌ 316వ ర్యాంకులో ఉన్నాయి.

అమెరికాకు చెందిన FRONTIER సూపర్‌ కంప్యూటర్‌ మొదటి ర్యాంక్‌లో ఉండగా, జపాన్‌కు చెందిన FUGAKU రెండో, ఫిన్లాండ్‌కు చెందిన LUMI SYSTEM మూడో, ఇటలీకి చెందిన లియోనార్డో నాలుగో, అమెరికాకి చెందిన సుమిత్‌ అయిదో స్థానంలో నిలిచాయి.

REPLACE కార్యక్రమం

ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికంగా ఉత్పత్తి అయిన ట్రాన్స్‌ ఫాటీ ఆమ్లాల (టీఎఫ్‌ఏ) తొలగింపు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పాక్షికంగా హైడ్రోజన్‌ ఆధారిత నూనెల వాడకాన్ని నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం.

2024, జనవరి 24 నాటి నివేదికలో ఈ ట్రాన్స్‌ ఫాటీ ఆమ్లాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2,78,000 మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేసింది. ట్రాన్స్‌ కొవ్వుల నిర్మూలన కోసం డబ్ల్యూహెచ్‌ఓ సర్టిఫికేషన్‌ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని ప్రపంచ దేశాలను సూచించింది.

ళినిశిలితిదిని అంటే..?

రివ్యూ: ఆహార పదార్థాల్లో పారిశ్రామికంగా ఉత్పత్తి అయిన ట్రాన్స్‌ కొవ్వులు ఉన్నాయో లేదో పరిశీలించటం.

ప్రమోట్‌: పారిశ్రామికంగా ఉత్పత్తి అయిన ట్రాన్స్‌ ఫాటీ ఆమ్లాల స్థానంలో సహజంగా ఉత్పత్తి అయ్యి, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, నూనెలను వినియోగించేలా ప్రోత్సహించటం.

లెజిస్లేట్‌: ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికంగా ఉత్పత్తి అయ్యే ట్రాన్స్‌ కొవ్వులను నిర్మూలించేందుకు చట్టపరంగా చర్యలు అమలయ్యేలా చేయడం.

అస్సెస్‌: ప్రజలకు హానికర ట్రాన్స్‌ ఫాటీ ఆమ్లాలు ఏయే పదార్థాల ద్వారా అందుతున్నాయో గుర్తించి, వాటి వినియోగం ఎంతవరకు జరుగుతుందో అంచనా వేయడం.

క్రియేట్‌: ఈ హానికర ట్రాన్స్‌ ఫాటీ ఆమ్లాల గురించి ఉత్పత్తిదారులు, ప్రజలు, వ్యాపారస్తుల్లో చైతన్యం కలిగించడం.

ఎన్‌ఫోర్స్‌: వీటి నిర్మూలనకు సంబంధించిన విధివిధానాలు, కార్యక్రమాలు, చట్టాలు విధిగా అమలయ్యేలా చూడటం.]

టీఎఫ్‌ఏ నివారణకు భారతదేశ చర్యలు: ట్రాన్స్‌ ఫాటీ ఆమ్లాలను అధికంగా వినియోగించడం వల్ల హృద్రోగ సమస్యలు అధికమవుతాయి.

 • 100 గ్రాముల కొవ్వు పదార్థాల్లో రెండు గ్రాములకు మించి ట్రాన్స్‌ ఫాటీ ఆమ్లాలు ఉండకూడదని భారతదేశంలో నిబంధన ఉంది.
 • భారతదేశంలో ఆహార పదార్థాల భద్రత, స్టాండర్డ్స్‌ను ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తోంది.

డిజిటల్‌ ఇండియా అవార్డులు (2022)

 • భారతదేశంలో ఎలక్ట్రానిక్స్‌ - సమాచార మంత్రిత్వ శాఖ 2009లో ఈ అవార్డులను నెలకొల్పింది. మొదట్లో దీన్ని వెబ్‌ రత్న అవార్డ్స్‌ అని పిలిచేవారు. 2014లో ఈ పేరును డిజిట్‌ ఇండియా అవార్డులుగా మార్చారు. వీటిని భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయుల్లోని అన్ని శాఖలు, సంస్థలు, కార్యాలయాలు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
 • 2022 ఏడాదికి సంబంధించిన అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023, జనవరి 7న ప్రదానం చేశారు.

Bhar OS

గూగుల్‌ యాప్‌లతో సంబంధం లేకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆండ్రాయిడ్‌ల కోసం రూపొందించిన ఆపరేటింగ్‌ సిస్టం. దీన్ని ఐఐటీ మద్రాస్‌కు అనుబంధ సంస్థ అయిన జే అండ్‌ కే ఆపరేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారు చేసింది.

భారత్‌లో లిథియం నిల్వలు

జమ్మూ - కశ్మీర్‌ ప్రాంతంలోని రియాసి జిల్లాలో లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. లిథియం లోహం అత్యంత మెరుపు కలిగి, మెత్తగా, బూడిద వర్ణంలో భూ అంతర్భాగంలో ఉంటుంది.

ఉపయోగాలు: మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించే రీచార్జబుల్‌ బ్యాటరీల్లో ఉపయోగిస్తారు.

 • లిథియం మిశ్రమ లోహాలు తేలిగ్గా, అత్యంత బలంగా ఉంటాయి. మెగ్నీషియం-లిథియం మిశ్రమలోహాన్ని ఆయుధాలపై ప్లేటింగ్‌గా; అల్యూమినియం-లిథియం మిశ్రమలోహాన్ని హైస్పీడ్‌ ట్రైన్లు, ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, సైకిళ్ల తయారీలో వినియోగిస్తున్నారు.
 • లిథియం ఆక్సైడ్‌ను ప్రత్యేక అద్దాలు, గాజు వస్తువులు, సిరామిక్స్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు.
 • లిథియం క్లోరైడ్‌కు నీటిని ఎక్కువగా ఆకర్షించే స్వభావం (హైగ్రోస్కోపిక్‌) ఉంటుంది. దీన్ని పారిశ్రామికంగా, ఎయిర్‌ కండిషనర్లలో ఆరబెట్టడం (Drying) కోసం ఉపయోగిస్తున్నారు.
 • లిథియం స్టిరేట్‌ను అత్యధిక ఉష్ణోగ్రతలలో పనిచేసే కందెన (lubricant) గా వాడుతున్నారు.
 • మానవుల్లో డిప్రెషన్‌ను తగ్గించడానికి కూడా లిథియం కార్బోనేట్‌ను వినియోగిస్తున్నారు.

2023లో ప్రయోగించిన ముఖ్యమైన ఉపగ్రహాలు

చంద్రయాన్‌ 3

చంద్రయాన్‌ 2 ప్రయోగానికి కొనసాగింపుగా 2023, జులైలో లిజులీ 3 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇందులో విక్రమ్‌ (ల్యాండర్‌), ప్రజ్ఞాన్‌ (రోవర్‌) ఉన్నాయి.

ది 2023, ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యింది. ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది.

ఆదిత్య-ఎల్‌1

సూర్యుడి అధ్యయనం కోసం ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) చేపట్టిన మొదటి సోలార్‌ మిషన్‌. దీన్ని PSLV - C57 సాయంతో 2023, సెప్టెంబరు 2న ప్రయోగించారు. సూర్యుడి లెగ్రాంజ్‌ పాయింట్‌ లి1 నుంచి సౌర వ్యవస్థను అధ్యయనం చేసేలా దీన్ని రూపొందించారు. 2024, జనవరి 6న ఈ ఉపగ్రహం దాని గమ్యస్థానమైన లి1కి దగ్గరగా చేరినట్లు ఇస్రో ప్రకటించింది.

XPoSat 

PSLV - C58 సాయంతో ఇస్రో 2024, జనవరి 1న ఎక్స్‌రే పొలారిమీటర్‌ శాటిలైట్‌ (ఎక్స్‌పోశాట్‌)ను ప్రయోగించింది. ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్‌రే తరంగాల జననస్థానాన్ని గుర్తించే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. XPOsat  ద్వారా  POLIX, XSPECT అనే పేలోడ్లను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. 2021లో నాసా ఎక్స్‌రే పొలారిటమెట్రీ ఎక్స్‌ప్లోరర్‌ మిషన్‌ పేరుతో ఓ ప్రయోగాన్ని నిర్వహించింది. తర్వాత ఈ లక్ష్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండో దేశం మనదే. అబ్జర్వేటరీగా పనిచేసే ఎక్స్‌పోశాట్‌ బ్లాక్‌హోల్స్‌, న్యూట్రాన్‌ నక్షత్రాలను అధ్యయనం చేస్తుంది.

NISAR  (నాసా - ఇస్రో సింథటిక్‌ అపర్చర్‌ ఆర్డర్‌)

నిసార్‌ ఒక భూ పరిశీలన ఉపగ్రహం. ఇది ఇస్రో, నాసాల ఉమ్మడి ప్రాజెక్ట్‌. దీన్ని 2024లో ప్రయోగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఉపగ్రహం మొత్తం భూగోళాన్ని అంటే భూమిని, మంచుతో కప్పి ఉన్న ప్రాంతాలతో సహా 12 రోజులు పరిశీలించి మ్యాప్‌లు గీస్తుంది. ఈ ఉపగ్రహం మూడేళ్లు పనిచేస్తుంది. భూగర్భ వనరులు, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, అటవీ సంపద, శీతోష్ణస్థితి మార్పు మొదలైన వాటిపై అధ్యయనానికి ఇది తోడ్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని