ప్రాంతాలను ఆక్రమించి.. ఆధిపత్యాన్ని ప్రదర్శించారు!

వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాక, ఇతర దేశాలతో భారత్‌కు వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి.

Updated : 24 Feb 2024 06:31 IST

భారతదేశ చరిత్ర

వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాక, ఇతర దేశాలతో భారత్‌కు వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. అనేక వాణిజ్య సంస్థలు ఇక్కడికి వచ్చి తమ వ్యాపార కేంద్రాలను నెలకొల్పాయి. మొదటగా మనదేశంలో వ్యాపారానికి అనుమతులు పొందింది పోర్చుగీస్‌ వారు. వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు కాలక్రమేణా వారు దేశంలోని ప్రాంతాలను ఆక్రమించి, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పోర్చుగీస్‌ వారి రాక, గవర్నర్లు, పతనానికి కారణాలు మొదలైనవాటిపైపోటీపరీక్షార్థికి అవగాహన ఉండాలి.

భారతదేశం - యూరోపియన్ల రాక

చారిత్రక నేపథ్యం

భారతదేశానికి ప్రాచీనకాలం నుంచే ఐరోపా, ఇతర ఆసియా దేశాలతో సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఒట్టోమాన్‌ టర్క్స్‌ రాజ్యం భారత్‌, ఐరోపా మధ్య వారధిగా ఉండేది. క్రీ.శ.1453లో ఒట్టోమాన్‌ టర్క్స్‌ రాజైన రెండో మహమ్మద్‌ చివరి ‘క్రూసేడ్‌’ యుద్ధంలో బైజాంటైన్‌ చక్రవర్తి కాన్‌స్టాంటైన్‌ - XI (Constantine - XI) ను ఓడించాడు. తర్వాత ఐరోపా - తూర్పు దేశాలతో ఉన్న భూమార్గాన్ని ఒట్టోమాన్‌ టర్క్‌లు మూసివేశారు. అప్పటికే భారతదేశంలో లభ్యమయ్యే ఉప్పు, మిరియాలు మొదలైన వస్తువులపై యూరోపియన్లు ఆధారపడ్డారు. దీంతో వాటిని దిగుమతి చేసుకోవడానికి మరో మార్గాన్ని కనుక్కోవాలని ఐరోపా పాలకులు భావించారు. భూమార్గానికి బదులు సముద్ర మార్గాన్ని అన్వేషించాలని వారు నావికులను పంపారు.

పశ్చిమ తీరంపై ఆధిపత్య స్థాపన

క్రీ.శ. 1499లో వాస్కోడిగామా అపార ధనంతో పోర్చుగీస్‌ తిరిగి వెళ్లిపోయాడు. తర్వాత క్రీ.శ.1500లో పెడ్రో అల్వారెస్‌ కాబ్రల్‌ అనే మరో పోర్చుగీస్‌ యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు.

 • క్రీ.శ. 1502 లో వాస్కోడిగామా రెండోసారి కాలికట్‌ వచ్చి, జామోరిన్‌తో వర్తక సదుపాయాల కోసం చర్చలు జరిపాడు. పశ్చిమతీరంలో అరబ్‌ వర్తకులు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని కోరాడు. దీన్ని తిరస్కరించిన కాలికట్‌ రాజుపై దాడిచేసిన పోర్చుగీస్‌ సేనలు కాలికట్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి.
 • ఓడిపోయిన జామోరిన్‌ వాస్కోడిగామా షరతులను అంగీకరించాడు. వాస్కోడిగామా కాలికట్‌లో పోర్చుగీస్‌ వారి కోసం కోటను నిర్మించాడు. కాలికట్‌, కొచ్చిన్‌, కాననోర్‌లో తమ వాణిజ్య స్థావరాలను ఏర్పాటు చేశాడు.

ఫ్రాన్సిస్‌ డి అల్మడా (Francisco de Almeida)

వాస్కోడిగామా స్వదేశం తిరిగి వెళ్లాక పోర్చుగీస్‌ ప్రభుత్వం ఫ్రాన్సిస్‌ డి-అల్మడాను భారతదేశంలో ఉన్న తమ వర్తక స్థావరాల పరిరక్షణ కోసం గవర్నర్‌గా (క్రీ.శ.1505-09) నియమించింది.

 • అతడు 1500 మంది సైనికులతో పశ్చిమ తీరానికి వచ్చాడు. కొచ్చిన్‌లో కోటను పటిష్ఠం చేశాడు. కన్ననూర్‌లో సెయింట్‌ ఏంజిల్స్‌  కోటను(St. Angelo’s Fort)నిర్మించాడు.
 • భూస్థావరాలు, కోటల నిర్మాణం, సైన్యాభివృద్ధి కంటే నౌకలు, నౌకాదళ నిర్మాణం, సముద్రంపై ఆధిపత్యానికి అల్మడా ప్రాధాన్యం ఇచ్చాడు. సముద్రంపై పోర్చుగీస్‌ వారి అధికారాన్ని స్థాపిస్తే కానీ, భూమిపై తమ ఆధిపత్యానికి స్థానం ఉండదని అతడు భావించి, బలమైన నౌకాదళాన్ని నిర్మించాడు. దీన్నే బ్లూ వాటర్‌ పాలసీ అంటారు.
 • ఇందులో భాగంగానే ఈజిప్ట్‌పై నౌకాయుద్ధం చేస్తూ క్రీ.శ. 1509లో అల్మడా, అతని కుమారుడు మరణించారు.
 • వాస్కోడిగామా కాలికట్‌ చేరినప్పటి నుంచి అల్మడా మరణించే వరకు భారతదేశ పశ్చిమ తీరంలో పోర్చుగీస్‌ వారి అధికారం బాగా విస్తరించింది. అంతవరకు హిందూ మహాసముద్రంపై వ్యాపారం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదిగిన మహమ్మదీయులు బలహీనపడ్డారు.
 • పోర్చుగీస్‌ నౌకలు మహమ్మదీయుల నౌకల కంటే పెద్దవి, బలిష్టమైనవి.
 • పర్షియాలో అంతఃకలహాలు చెలరేగడం, ఉత్తర భారతదేశంలో లోడీ వంశం బలహీనపడటం, దక్షిణ భారతదేశంలో రెండో దేవరాయల తర్వాత విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన సంగమ రాజులు బలహీనులవ్వడం, స్థానిక మలబార్‌ తీరం ప్రజలు అరబ్‌ వర్తకుల దోపిడీ నుంచి రక్షణ కోసం పోర్చుగీస్‌ వారి సహాయం కోరడం మొదలైనన్నీ పోర్చుగీస్‌ వారు భారత్‌లో తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాయి.

పోర్చుగీస్‌ వారి పతనానికి కారణాలు

భారతదేశంలోకి మొదటగా ప్రవేశించి, వర్తక స్థావరాలను,రాజకీయ అధికారాన్ని నెలకొల్పిన పోర్చుగీస్‌ వారి పతనానికి అనేక కారణాలు ఉన్నాయి.

 • పోర్చుగీస్‌ వారు లాటిన్‌ అమెరికాలో ‘బ్రెజిల్‌’ను కనుక్కున్నాక, చాలామంది భారతదేశం కంటే బ్రెజిల్‌ వెళ్లడానికి ఆసక్తి చూపించారు.
 • పోర్చుగీస్‌ దేశ విస్తీర్ణం భారతదేశం కంటే చాలా చిన్నది. సువిశాల భారతదేశాన్ని ఆక్రమించడం తమకు అసాధ్యమని వారు గ్రహించారు.
 • అఫోన్సో డి అల్బెర్క్‌ తర్వాత భారతదేశానికి వచ్చిన గవర్నర్ల అసమర్థత.
 • ఉత్తర భారతదేశంలో మొగల్‌ చక్రవర్తులు బలమైన రాజకీయశక్తిగా అవతరించడం.
 • క్రీ.శ.1580లో స్పెయిన్‌లో పోర్చుగల్‌ విలీనం కావడం.
 • నౌకాదళాన్ని ఉపసంహరించడం.
 • ఇతర ఐరోపా కంపెనీలు భారతదేశంలో ప్రవేశించడం.

పోర్చుగీస్‌ వారు

భారత్‌కు సముద్ర మార్గాన్ని అన్వేషించాలని పోర్చుగీస్‌ యువరాజైన హెన్రీ ఒక ప్రత్యేక నౌకాయాన పాఠశాలను నెలకొల్పాడు. అందులో సాహసవంతులైన నావికులకు శిక్షణ ఇప్పించాడు.

 • హెన్రీ వారసుడైన రెండో జాన్‌ (1481 - 1495) ప్రోత్సాహంతో బార్టోలోమియ డయాస్‌ (Bartolomeu Dias) క్రీ.శ.1487లో ఆఫ్రికా దక్షిణ భాగం వరకు సముద్ర ప్రయాణం చేసి కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ (తుపానుల అగ్రం)ను కనుక్కున్నాడు.
 • క్రీ.శ. 1497లో పోర్చుగల్‌ రాజు మాన్యుయేల్‌-I (Manuel-I) సహాయంతో వాస్కోడిగామా ‘లిస్బన్‌’ ఓడరేవు నుంచి బయలుదేరాడు. అతడు కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మీదుగా ఆఫ్రికా చుట్టూ తిరిగి 1498, మేలో ‘కళ్లికోట’ (కాలికట్‌) చేరుకున్నాడు.
 • ఆ సమయంలో కాలికట్‌ను జామోరిన్‌ పాలిస్తున్నాడు. అతడు పోర్చుగీస్‌ వారికి వర్తక కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చాడు. ఈ సంఘటనే ఆధునిక భారతదేశ చరిత్రను విశేషంగా ప్రభావితం చేసింది. బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ నెలకొల్పడానికి 102 ఏళ్ల ముందే పోర్చుగీస్‌ వారు భారతదేశంలో వర్తక అనుమతి పొందారు.
 • వీరు భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు. మనదేశం నుంచి చివరగా వెళ్లింది కూడా వీరే.

అల్ఫాన్సో డి అల్బుకర్క్‌ (Alfonso de Albuerque)

క్రీ.శ. 1509లో అల్మడా స్థానంలో అల్ఫాన్సో డి అల్బుకర్క్‌ గవర్నర్‌ అయ్యాడు. భారతదేశంలో పోర్చుగీస్‌ ప్రభుత్వం తరఫున పనిచేసిన అధికారుల్లో సమర్థుడిగా పేరొందాడు.

 • అల్బుకర్క్‌ విజయనగర రాజైన శ్రీ కృష్ణదేవరాయలతో స్నేహం చేశాడు.
 • ఇతడు క్రీ.శ. 1510లో బీజాపూర్‌ సుల్తాన్‌ యూసుఫ్‌ ఆదిల్‌షాను ఓడించి గోవాను ఆక్రమించాడు. ఇది భారతదేశంలోని పోర్చుగీస్‌ స్థావరాలకు రాజధానిగా మారింది.
 • ఇతడు బ్లూ వాటర్‌ పాలసీకి బదులు సాధ్యమైనన్ని ఎక్కువ వలస స్థావరాల విస్తరణ కోసం కృషి చేశాడు. దీని కోసం గోవా చుట్టుపక్కల ఉన్న కొన్ని కీలక తీర ప్రదేశాలు, రేవులను ఆక్రమించాడు.
 • ఎర్ర సముద్రతీరంలో సొకొట్ర, పారశీక అఖాతంలో అర్ముజ్‌, గుజరాత్‌లో డయ్యూ, తూర్పు ఇండియా దీవుల్లో మలక్కా, చైనాలో మాకోలును జయించాడు.
 • పోర్చుగీస్‌ పాలనా యంత్రాంగాన్ని పటిష్ఠం చేసేందుకు స్వదేశం నుంచి శిక్షితులైన అధికారులను, సైనికులను భారతదేశానికి రప్పించాడు. స్థానికులను పరిపాలనా యంత్రాంగంలో భాగస్వాములను చేశాడు.
 • పోర్చుగీస్‌ వారికి, భారతీయులతో వివాహ సంబంధాలను ప్రోత్సహించాడు. మహమ్మదీయుల పట్ల క్రూరంగా వ్యవహరించాడు. భారతదేశ పశ్చిమతీరంలో మిశ్రమ వివాహాల ఫలితంగా పోర్చుగీస్‌ జాతి, మతం, భాషలతో కూడిన నూతన వర్గం ఏర్పడింది. వీరు పోర్చుగీస్‌ వారికి ఎంతో విధేయతతో సేవలందించారు.
 • ఇతడి కాలంలో పోర్చుగీస్‌ వారు పర్షియన్‌ గల్ఫ్‌లోని హూర్చుజ్‌ నుంచి మలయాలోని మలక్కా; ఇండోనేసియాలోని సుగంధ ద్వీపాల వరకు మొత్తం ఆసియాపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
 • క్రీ.శ. 1530లో నినో డా కున్హా ్బవిi-్న ద్చీ ద్యి-్త్చ్శ గవర్నర్‌ అయ్యాడు. ఇతడు గుజరాత్‌లోని బహదూర్‌ షా నుంచి డయ్యూ, బేసిన్‌లను స్వాధీనం చేసుకున్నాడు.

పోర్చుగీస్‌ వారి చర్యలు

క్రీ.శ. 1515-60 మధ్యకాలంలో భారతదేశంలో పోర్చుగీస్‌ వారి అధికారం బాగా విస్తరించింది.

 • డొమింగో పేస్‌, ఫెర్నావో న్యూనిజ్‌(Fernao Nunes) లాంటి వర్తకులు విజయనగర రాజుల ఆస్థానంలో గౌరవం పొందారు.
 • విజయనగర రాజులు మేలు రకం అశ్వాలను పోర్చుగీస్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. గుజరాత్‌ సుల్తాన్‌ బహదూర్‌షా వీరి సహాయంతో ఫిరంగి దళాన్ని సమకూర్చుకున్నాడు.
 • శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగరాన్ని పాలించిన రాజులు అసమర్థులు కావడంతో వారు పోర్చుగీస్‌ వారిని ఎదుర్కోలేకపోయారు.
 • మక్కాకు వెళ్లే యాత్రికులకు వీరు అనేక రకాల ఇబ్బందులు కలిగించారు. సముద్ర దోపిడీలు సాగించారు.
 • గుజరాత్‌, బీజాపూర్‌, గోల్కొండ పాలకులను ఓడించారు.
 • పోర్చుగీస్‌ వారు భారతదేశానికి పొగాకు సాగును తీసుకొచ్చారు.
 • క్రీ.శ. 1556లో మొదటి ప్రింటింగ్‌ ప్రెస్‌ను గోవాలో ఏర్పాటు చేశారు.
 • క్రీ.శ. 1563లో మొదటిసారి ‘ది ఇండియన్‌ మెడిసినల్‌ ప్లాంట్స్‌’ అనే శాస్త్రీయ రచనను గోవాలో ప్రచురించారు.
 • వీరు సుగంధ ద్రవ్యాల (మిరియాలు) వ్యాపారాన్ని ఎక్కువగా నిర్వహించారు.
 • ఉత్తర భారతదేశంలో మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ సింహాసనాన్ని అధిష్టించాక పోర్చుగీస్‌ వారు అతడితో స్నేహం చేశారు.
 • డయ్యూ, బేసిన్‌, డామన్‌, నాగపట్నం, శాంథోమ్‌, చిట్టగాంగ్‌, హుగ్లీ మొదలైన చోట్ల పోర్చుగీస్‌ స్థావరాలు నెలకొల్పారు.
 • అక్బర్‌ మరణించాక పోర్చుగీస్‌ - మొగల్‌ల మధ్య సంబంధాలు చెడిపోయాయి.
 • భారతదేశంలోకి ఈస్టిండియా కంపెనీ రాకతో పోర్చుగీస్‌ వారి కార్యక్రమాలకు పెద్ద అవరోధం ఏర్పడింది. క్రమంగా వీరి రాజకీయ, వర్తక ఆధిపత్యం క్షీణదశకు చేరుకున్నాయి.
 •  క్రీ.శ 1666, ఫిబ్రవరిలో ఔరంగజేబు సేనలు పోర్చుగీస్‌ సైన్యాన్ని ఓడించి ‘చిట్టగాంగ్‌’ స్థావరాన్ని ఆక్రమించాయి.
 • వారు క్రీ.శ.1656లో సింహళాన్ని, 1662లో అర్మజ్‌ను, 1739లో బేసిన్‌ను కోల్పోయాయి.

రచయిత: డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు