కరెంట్‌ అఫైర్స్‌

న్యాయ రంగంలో భీష్మ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫాలీ శామ్‌ నారీమన్‌ (95) 2024, ఫిబ్రవరి 21న దిల్లీలో మరణించారు.

Published : 24 Feb 2024 03:45 IST

న్యాయ రంగంలో భీష్మ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫాలీ శామ్‌ నారీమన్‌ (95) 2024, ఫిబ్రవరి 21న దిల్లీలో మరణించారు. ‘కేశవానంద భారతి’ లాంటి ఎన్నో కీలక కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు. నారీమన్‌ 1929 జనవరి 10న మయన్మార్‌లోని రంగూన్‌లో (ప్రస్తుతం యాంగూన్‌) జన్మించారు. ఈయన్ను కేంద్ర ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. 1972లో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులైన ఆయన 1975 జూన్‌ 26న దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు నిరసనగా మరుసటి రోజే రాజీనామా చేశారు. 1991 నుంచి 2010 వరకు బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు నారీమన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ‘బిఫోర్‌ ద మెమరీ ఫేడ్స్‌, ద స్టేట్‌ ఆఫ్‌ ద నేషన్‌, ఇండియాస్‌ లీగల్‌ సిస్టం: కెన్‌ ఇట్‌ బి సేవ్డ్‌?, గాడ్‌ సేవ్‌ ద హానరబుల్‌ సుప్రీంకోర్టు’ పుస్తకాలను నారీమన్‌ రచించారు.


భారత మాజీ క్రికెటర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ (62) యూఏఈ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ముదస్సర్‌ నాజర్‌ (పాకిస్థాన్‌) స్థానంలో రాజ్‌పుత్‌ నియామకం జరిగింది. గతంలో 2007 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు రాజ్‌పుత్‌ కోచ్‌గా వ్యవహరించారు.


ప్రపంచంలోని అత్యుత్తమ 300 సహకార (కో-ఆపరేటివ్‌) సంస్థల్లో ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్స్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ (ఇఫ్కో)కు మళ్లీ అగ్రస్థానం దక్కింది. 2023లోనూ ఇఫ్కో మొదటి స్థానంలో నిలిచింది. స్థూల దేశీయోత్పత్తి, సంస్థ టర్నోవర్‌ మధ్య నిష్పత్తి ఆధారంగా ఈ ర్యాంకులను ఇస్తారు.

మరింత సమాచారం కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని