పశ్చిమ గాలులతో.. ‘రాక్షసి వర్షం’!

వర్షాలు, వర్షపునీటి ప్రవాహం, తుపానులు, భూకంపాలు లాంటి కారణాల వల్ల కొండలు, గుట్టలపై ఉన్న రాళ్లు లేదా మట్టి దిబ్బలు జారి కిందకు పడటాన్ని కొండచరియలు విరగడం అంటారు.

Updated : 27 Feb 2024 03:46 IST

ఇండియన్‌ జాగ్రఫీ

వర్షాలు, వర్షపునీటి ప్రవాహం, తుపానులు, భూకంపాలు లాంటి కారణాల వల్ల కొండలు, గుట్టలపై ఉన్న రాళ్లు లేదా మట్టి దిబ్బలు జారి కిందకు పడటాన్ని కొండచరియలు విరగడం అంటారు. ఎత్తయిన నదీ తీర ప్రాంతాలు, హిమాలయాలు, తూర్పు కనుమలు, ఈశాన్య భారతదేశ ప్రాంతాల్లో పర్వతాలు అధికంగా ఉంటాయి. ఈ ప్రదేశాల్లో కొండచరియలు విరగడం సర్వసాధారణం.


జలసంబంధ విపత్తులు

కొండచరియలు విరగడం (Land Sliders)

  • కొండచరియలు విరగడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు సమాచార, రవాణా వ్యవస్థలకు తీవ్రనష్టం వాటిల్లుతుంది.
  • మొత్తం దేశ భూభాగంలో 15% భూపాతాల దుర్భలత్వం కింద ఉంది.
  • దేశంలో భూపాతాల దుర్భలత్వం ఎక్కువగా ఉన్న ప్రాంతం హిమాలయ పర్వత ప్రాంతాలు.
  • భారతదేశంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) 2004, జనవరి 29 నుంచి భూపాత విపత్తులకు సంబంధించి నోడల్‌ ఏజెన్సీగా పని చేస్తోంది.

భారతదేశంలో భూపాత ప్రభావిత ప్రాంతాలు

1. హిమాలయ పర్వత ప్రాంతాలు
2. ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలు
3. పశ్చిమ కనుమలు
4. వింధ్య పర్వతాలు
5. నీలగిరి పర్వతాలు
6. తూర్పు కనుమలు


మంచు చరియలు
(Snow Avalanches)

మంచు లేదా మంచు చరియలు ఎత్తయిన పర్వత శ్రేణులపై దట్టంగా అలుముకుని ఉంటాయి. ఇవి జీవ నదులకు ఆధారాలు. మంచు ఎక్కువగా కరిగితే నదుల నీటి మట్టం పెరిగి, అవి అతివేగంగా ప్రవహించి, వరదలకు కారణమవుతాయి.

  • ఆకస్మిక మంచు చరియలు విరిగి పడటం అనేది హిమాలయాల్లో అత్యధికం. సియాచిన్‌, డ్రాస్‌ ప్రాంతం, పిర్‌ పంజాల్‌, లాహోర్‌, స్పిటి, బద్రీనాథ్‌ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సంభవిస్తుంది.

భారతదేశంలో మంచు చరియలు విరిగిపడే ముప్పు ఉన్న ప్రాంతాలు:

పశ్చిమ హిమాలయాలు: జమ్మూ-కశ్మీర్‌లోని మంచు ప్రాంతాలు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, తెహ్రి గర్వాల్‌, చమోలి ప్రాంతాలు.

  • హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడటం ద్వారా మన దేశంలో సంవత్సరానికి సరాసరి 30 నుంచి 100 మంది మరణిస్తున్నారు.
  • దేశవ్యాప్తంగా మంచు చరియలు విరిగి పడటంపై ‘స్నో అండ్‌ అవలాంచ్‌ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఎస్‌ఏఎస్‌ఈ)’ అనే సంస్థ పరిశోధనలు నిర్వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇది డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో పని చేస్తుంది.

ఉపశమన చర్యలు

అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొండచరియలు విరగడానికి గల కారణాలను, వాటిని నియంత్రించే మార్గాలను తెలుసుకోవచ్చు. తద్వారా వీటి నుంచి రక్షణ పొందే ఉపశమన చర్యలు పాటించవచ్చు.

  • ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ నివాస స్థావరాలు ఏర్పర్చుకోవడాన్ని నివారించాలి.
  • ఏటవాలు నుంచి నేలలు జారిపడే ప్రాంతాల్లో వాటిని ఆపేందుకు కొండ/ పర్వతాలకు సమీపంలో గోడలు నిర్మించడం.

ఉదా: విజయవాడ ఇంద్రకీలాద్రి కొండచరియలు విరిగిపడకుండా రిటైనింగ్‌వాల్స్‌ నిర్మించారు.

  • కొండచరియలు విరిగిపడటాన్ని ఆపాలంటే గడ్డి, చెట్లను ఎక్కువగా పెంచాలి.
  • వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండచరియల కదలికను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి.
  • ఘాట్‌రోడ్లు నిర్మించేటప్పుడు వర్షపు నీరు వేళ్లేందుకు తగిన నిర్మాణాలను ముందే చేపట్టాలి.

దేశంలో జరిగిన కొండచరియల ప్రమాదాలు

చార్‌ధామ్‌ యాత్ర: ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో యమునోత్రి, గంగోత్రి, కేథార్‌నాథ్‌, బద్రీనాథ్‌ పుణ్యక్షేత్రాలు సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉంటాయి. వీటి సందర్శనను చార్‌ధామ్‌ యాత్ర అంటారు. వీటిని చేరుకోవాలంటే ఇరుకైన లోయలు, ఘాట్‌రోడ్లలో ప్రయాణించాలి.

  • వర్షాకాలంలో ఈ ఘాట్‌ మార్గంలో కొండచరియలు విరిగిపడటం, వరదలు లాంటివి సంభవించి, జన జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. వీటి ప్రభావం వల్ల యాత్రికుల ప్రాణాలకు ముప్పు కూడా వాటిల్లుతుంది.
  • ఉత్తరాఖండ్‌లో 2013లో వరదల కారణంగా కొండచరియలు విరిగి సుమారు 3000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
  • రాక్షసి వర్షం: ఐరోపా నుంచి ఆఫ్గనిస్థాన్‌ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించే పశ్చిమ గాలులు హిమాలయాల్లో బలహీన రుతుపవనాలను ఢీకొనడం వల్ల అధిక వర్షం కురుస్తుంది. దీన్నే ‘రాక్షసి వర్షం’ అంటారు.
  • ఈ అధిక వర్షపాతం వల్ల కొండచరియలు విరిగిపడి పర్యాటక రంగానికి, రవాణా - కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది.
  • నదులు: ఉత్తరాఖండ్‌లోని భగీరథ, మందాకిని, అలక్‌నందా నదులు హిమాలయాల్లో ఉద్భవించి, ప్రవహిస్తాయి.
  • రుతుపవన కాలంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల ఇవి ప్రయాణించే ప్రాంతాల్లో నదులు వరదగా పోటెత్తి కొండచరియలు, మంచుగడ్డలు, ఏపుగా పెరిగిన వృక్షాలను విరిచేస్తాయి.
  • సాధారణంగా ఉత్తరాఖండ్‌లో జూన్‌ నెలలో వర్షపాతం 4.3 మీ.మీ. ఉంటుంది. ఆ కాలంలో రుతుపవనాలను పడమటి గాలులు ఢీకొనడం వల్ల సాధారణ వర్షపాతం కంటే 30 రెట్లు ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. దీంతో కొండచరియలు విగిపడటంతో పాటు ఉత్తర కాశీ, రుద్ర ప్రయాగ, చమౌలి, డెహ్రాడూన్‌ ప్రాంతాల్లో వరదలు సంభవిస్తాయి.
  • ప్రాంతాల వారీ ప్రమాదాలు: 2014, జులై 31న మహారాష్ట్రలోని పుణెలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 151 మంది మరణించారు.
  • 2016, ఏప్రిల్‌ 23న అరుణాచల్‌ ప్రదేశ్‌లో అధిక వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 16 మంది మరణించారు.
  • 2017, ఆగస్టు 12న హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి-పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడి 46 మంది మరణించారు.
  • 2019, ఆగస్టులో కేరళలో కొండచరియలు విరిగిపడి 50 మంది మరణించారు.
  • 2020లో పశ్చిమ కనుమల ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడటం వల్ల కేరళ రాష్ట్రానికి చెందిన 60 మంది మరణించారు.
  • 2021, ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్‌లోని థౌలీ గంగానదికి వరదలు సంభవించి, కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలో 10 మందికిపైగా మరణించగా, 170 మంది గల్లంతయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల కొండ ప్రాంతాలు, విజయవాడ కనకదుర్గ ఆలయం ప్రాంత కొండలు, విశాఖపట్టణంలోని కొండ ప్రాతాల్లో ఈ దుర్ఘటనలు అప్పుడప్పుడు సంభవిస్తాయి.
  • 2021లో ఏపీలో సంభవించిన తుపాను కారణంగా తిరుమలలో అధిక వర్షం సంభవించి, అక్కడి కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో రవాణా వ్యవస్థకి, భక్తులకు తీవ్రనష్టం, అసౌకర్యం కలిగాయి.

మాదిరి ప్రశ్నలు

1. భారతదేశంలో దుమ్ము తుఫానులు ఏ నెలలో ఎక్కువగా సంభవిస్తాయి?
1) మార్చి    2) ఏప్రిల్‌    3) మే     4) అక్టోబరు
2. 1980 నుంచి భారతదేశంలో భూపాతాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి కింది ఏ పద్ధతిని వాడుతున్నారు?
1) లాండ్‌ స్లయిడ్‌ జొనేషన్‌ మాపింగ్‌
2) లాండ్‌ డెవలప్‌మెంట్‌ జూమింగ్‌
3) లాండ్‌ రిక్లమేషన్‌ జూమింగ్‌ 4) లాండ్‌ డిజాస్టర్‌ మాపింగ్‌
3. భూపాతం ఏర్పడటానికి ప్రధాన కారణం?
1) జలాశయాల్లో మార్పు 2) భూగర్భ జలాల్లో కదలిక
3) భూ కంపనాలు 4) పైవన్నీ
4. భారతదేశంలో జాతీయ వరద నివారణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1952    2) 1954     3) 1978    4) 1984
5. భారత ప్రభుత్వం వరద నివారణ కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టింది?
1) రెండో పంచవర్ష ప్రణాళిక 2) తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక
3) పదకొండో పంచవర్ష ప్రణాళిక
4) పన్నెండో పంచవర్ష ప్రణాళిక
6. ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలు?
1) పెన్నార్‌ డెల్టా ప్రాంతాలు
2) కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాలు
3) రాయలసీమ ప్రాంతం   4) ఉత్తర కోస్తా ప్రాంతం
7. భారతదేశంలో ఎక్కువగా వరదలకు కారణం అయ్యే నది?
1) గోదావరి   2) బ్రహ్మపుత్ర   3) గంగా   4) కావేరి
8. వరద హెచ్చరిక సమాచారం దేని ద్వారా ప్రసారం అవుతుంది?
1) ఆల్‌ ఇండియా రేడియో   2) దూరదర్శన్‌
3) వార్తా పత్రికలు   4) పైవన్నీ
9. భారతదేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం వరదలు సంభవించే అవకాశం ఉంది?
1) 10%   2) 12%    3) 15%   4) 11%
10. కిందివాటిలో వరదల తీవ్రతను తగ్గించే మార్గం గుర్తించండి.
1) అడవుల సంరక్షణ   2) గడ్డి పెంపకం
3) నదీమార్గాల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టకుండా ఉండటం
4) పైవన్నీ
11. అకాల వరదలకు ప్రధాన కారణం?
1) అధిక వర్షపాతం  2) జలాశయాలు, చెరువులు తెగిపోవడం
3) అటవీ నిర్మూలన  4) 1, 2


సమాధానాలు

1-3         2-1         3-4         4-2         5-3         6-2
7-2         8-4         9-2         10-4       11-4



రచయిత- పి.కె. వీరాంజనేయులు, విషయ నిపుణులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని