తన సార్వభౌమాధికార శక్తే.. ప్రభుత్వ రుణానికి హామీ!

ఒక దేశం తన పౌరులు లేదా సంస్థలు లేదా ఇతర దేశాల నుంచి తీసుకున్న రుణాన్ని ‘ప్రభుత్వ రుణం’ అంటారు. కేంద్ర ప్రభుత్వం వ్యయానికి/ ఖర్చుకి సేకరించిన ఆదాయ వనరులు చాలనప్పుడు రుణాల ద్వారా వనరులను సమకూర్చుకుంటుంది.

Published : 28 Feb 2024 04:16 IST

ఇండియన్‌ ఎకానమీ

ఒక దేశం తన పౌరులు లేదా సంస్థలు లేదా ఇతర దేశాల నుంచి తీసుకున్న రుణాన్ని ‘ప్రభుత్వ రుణం’ అంటారు. కేంద్ర ప్రభుత్వం వ్యయానికి/ ఖర్చుకి సేకరించిన ఆదాయ వనరులు చాలనప్పుడు రుణాల ద్వారా వనరులను సమకూర్చుకుంటుంది. అది బ్యాంకులు, వ్యాపార సంస్థలు, కార్పొరేట్‌ రంగం, వ్యక్తుల నుంచి రుణం తీసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం అంటే కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాలు. సాధారణంగా ప్రభుత్వ రుణం బాండ్లు, ట్రెజరీ బిల్లుల రూపంలో ఉంటుంది. వీటిని కొనుగోలు చేసినవారికి నిర్దిష్ట/ నిశ్చిత వడ్డీతో సహా చెల్లింపులకు ప్రభుత్వం హామీఇస్తుంది.

కేంద్ర ప్రభుత్వ రుణం

ప్రభుత్వం తన సార్వభౌమాధికార శక్తి ద్వారా రుణ సేకరణ ఒప్పందాన్ని చేసుకుంటుంది. ఇదే రుణానికి హామీ. ఒప్పందంలో భాగస్వామిగా ప్రైవేట్‌ వ్యక్తులు - సంస్థలు/ ప్రభుత్వరంగ సంస్థలు ఉండొచ్చు. సంబంధిత భాగస్వామి ప్రభుత్వ బాండ్‌ను తనఖాపెట్టే వీలుండదు. ఎందుకంటే అది ప్రభుత్వం తిరిగి చెల్లించేందుకు చేసిన వాగ్దానం మాత్రమే.

  • 17, 18వ శతాబ్దాల్లో డచ్‌వారు బ్రిటన్‌తో వాణిజ్య, విత్త, రుణ విధానాలను అనుసరించారు. వాటినే అప్పుడు మిగతా ప్రాంతాలు పాటించాయి. అవే ప్రస్తుత ఆధునిక రుణ విధానానికి మూలం.
  • 19వ శతాబ్దంలో స్వేచ్ఛా వ్యాపార విధానం ప్రభావం వల్ల ఆర్థిక జీవనం కనీస అంశాలకు పరిమితమై ఉండేది. దీంతో ప్రభుత్వ ఆదాయమే నాటి అవసరాలకు సరిపోయేది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల అవసరాలు తీర్చేందుకు, దేశ రక్షణ - భద్రత కోసం ప్రభుత్వం రుణాలు చేయాల్సి వస్తోంది.

ప్రభుత్వ రుణానికి ఆధారాలు

అభివృద్ధి కార్యక్రమాలకు, లోటు భర్తీకి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. అభివృద్ధి, సంక్షేమం, దీర్ఘకాలిక పథకాల కోసం ప్రభుత్వాలు రుణ సమీకరణ వైపు మొగ్గు చూపుతున్నాయి.

  • దీర్ఘకాలంలో ఎక్కువ మందికి ఉపయోగపడే బహళార్థసాధక ప్రాజెక్టులకు భారీ పెట్టుబడి అవసరం. ప్రస్తుత ప్రభుత్వాలు అభివృద్ధితోపాటు సంక్షేమ బాధ్యతలూ నిర్వర్తించాలి. అందువల్ల ప్రభుత్వాల బాధ్యతలు - విధులు నిర్విరామంగా విస్తరిస్తున్నాయి.
  • ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచే విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, వృద్ధి రేటు పెంచడం, రక్షణ - శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి మొదలైనవాటిపై తప్పనిసరి విధుల నిర్వహణకు ప్రభుత్వం రుణం తీసుకుంటోంది.
  • ప్రభుత్వాలు దేశీయంగా అంతర్గత రుణాన్ని, ఇతర దేశాల నుంచి బహిర్గత రుణాన్ని సేకరిస్తాయి. అంతర్గత రుణాన్ని దేశంలోని వ్యక్తులు, విత్తసంస్థలు, వాణిజ్య బ్యాంకులు, కేంద్ర బ్యాంకు నుంచి తీసుకుంటాయి. బహిర్గత రుణాన్ని విదేశాల్లోని వ్యక్తులు, బ్యాంకులు, అంతర్జాతీయ విత్త సంస్థలు, ఇతర దేశాల ప్రభుత్వాల నుంచి సేకరిస్తాయి.

ప్రభుత్వ రుణానికి ప్రధాన ఆధారాలు నాలుగు. అవి:

1. వ్యక్తుల నుంచి రుణ సేకరణ
2. బ్యాంకేతర విత్త సంస్థల నుంచి రుణ సేకరణ
3. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణ సేకరణ
4. బహిర్గత ఆధారాలు

వ్యక్తుల నుంచి రుణ సేకరణ

ప్రభుత్వం బాండ్లు జారీ చేయడం ద్వారా ప్రజల నుంచి రుణ సమీకరణ చేస్తుంది. ఆ నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లిస్తుంది.

  • ప్రభుత్వ బాండ్లు కొనేవారు తమ వర్తమాన వినియోగ వ్యయం తగ్గించుకుని (ఇది అరుదుగా జరుగుతుంది) లేదా వ్యాపార నిమిత్తం తమ వద్ద ఉంచుకున్న నిధులను బదలాయించడం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమకూరుస్తారు.
  • ప్రభుత్వ రుణ సేకరణ స్వచ్ఛందంగా ఉన్నప్పుడు ప్రజలు తమ వద్ద నిరుపయోగంగా ఉన్న నిధులతో బాండ్లు కొంటారు. ఇది వారి వినియోగంపై లేదా పెట్టుబడిపై ఎలాంటి ప్రభావం చూపదు. ఒకవేళ ప్రభుత్వ రుణం నిర్బంధమైనప్పుడు వినియోగం, పెట్టుబడులపై ప్రభావం ఉంటుంది.

బ్యాంకేతర విత్త సంస్థల నుంచి రుణసేకరణ

బీమా కంపెనీలు, పెట్టుబడి ట్రస్ట్‌లు లాంటివి ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేసినప్పుడు వారి వద్ద ఉన్న నిరుపయోగ నగదు నిల్వ తగ్గుతుంది. తద్వారా
ఆ మొత్తం ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా మారి, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది.

  • ప్రభుత్వ బాండ్లకు ఎలాంటి నష్టభయం ఉండదు. స్వీయ ద్రవ్యత్వం ఉండి, ఇతరులకు సులభంగా మార్చవచ్చు. కాబట్టి ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తాయి. అయితే ప్రభుత్వ బాండ్లపై చెల్లించే వడ్డీరేటు సహజంగా తక్కువగా ఉంటుంది.

వాణిజ్య బ్యాంకుల నుంచి రుణ సేకరణ

వాణిజ్య బ్యాంకులు సైతం ప్రభుత్వ బాండ్లను తీసుకుంటాయి. దీనికోసం అవి ఇతర రుణాలు, అడ్వాన్సులు, తగ్గించుకుని బాండ్లు కొనుగోలు చేస్తాయి.

  • ( బ్యాంకింగ్‌ వ్యవస్థలో మిగులు నగదు నిల్వలు ఉన్నప్పడు, వాటిని బాండ్ల రూపంలోకి మార్చుకుంటాయి. ప్రభుత్వ వ్యయం రూపంలోకి మారే ఈ నిల్వలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచుతాయి. (ఆర్థిక వ్యవస్థ అప్పటికే సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో పనిచేస్తున్నప్పుడు)

బహిర్గత ఆధారాలు

ప్రభుత్వం ఇతర దేశాల నుంచి కూడా రుణాలు సేకరిస్తుంది. యుద్ధ సమయంలో ఖర్చులకు, రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు, అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి చెల్లింపుల శేషంలో లోటు భర్తీకి ప్రభుత్వాలు విదేశీ సంస్థలు, అంతర్జాతీయ విత్త సంస్థలు, విదేశీ ప్రభుత్వాల నుంచి రుణాలు తీసుకుంటాయి.

  • కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పరపతి ఆధారాలతో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి(International Monetary Fund IMF), అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు (International Bank for Reconstruction and Development - IBRD), అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ (International Development Association - IDA),  అంతర్జాతీయ విత్త కార్పొరేషన్‌ (International Finance Corporation - IFC)  ఖినీద్శి లాంటి అంతర్జాతీయ విత్త సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంది.

ప్రముఖుల అభిప్రాయాలు

సమాజానికి మేలు చేసే ఉత్పాదకతతో కూడిన మూలధన ప్రాజెక్టులకు కావాల్సిన ఆర్థిక వనరుల కోసం ప్రభుత్వ రుణం తీసుకోవచ్చని సంప్రదాయ ఆర్థికవేత్తలు వెల్లడించారు.
ప్రభుత్వ రుణం అనేది ఆర్థిక వ్యవస్థను సమతూకంలో ఉంచేదిగా వారు పేర్కొన్నారు.

‘‘రుణపత్రం కలిగి ఉన్న వ్యక్తి లేదా సంస్థకు అసలు మొత్తంపై వడ్డీ చెల్లించేందుకు (అత్యధిక సందర్భాల్లో) ఇచ్చే హామీయే ప్రభుత్వ రుణం’’

ఫిలిప్‌ టేలర్‌, అమెరికన్‌ ఆర్థికవేత్త

  • ‘‘ప్రభుత్వం రాబడి రూపంలో సమకూర్చుకునే మొత్తానికి ప్రతిగా ఎవరికీ ప్రతిఫలం చెల్లించదు. ప్రభుత్వ రుణం విషయంలో మాత్రం ఎవరి నుంచి రుణం సేకరిస్తుందో వారికి తిరిగి చెల్లించాల్సిన తప్పనిసరి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది.’’
  • ‘‘ఆధునిక కాలంలో మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వ రుణం పెరగడమే కాకుండా ప్రాధాన్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాలు ఉనికిలోకి వచ్చాకే ప్రభుత్వ రుణం అనే భావన ఏర్పడింది.’’

జె.కె.మెహతా, భారతీయ ఆర్థికవేత్త

‘‘ప్రభుత్వం ఏ రుణాన్ని అయితే తన ప్రజలకు లేదా ఇతర దేశాల ప్రజలకు తిరిగి చెల్లించడానికి అంగీకరిస్తుందో దాన్ని ప్రభుత్వ రుణం అంటారు.’’

జార్జ్‌ ఫిండ్లే షిర్రాస్‌, స్కాట్లాండ్‌ ఆర్థికవేత్త

‘‘ప్రభుత్వం విత్త సాధనాలను వ్యక్తులు/ సంస్థలకు అమ్మడం ద్వారా సేకరించిన మొత్తాన్ని సంక్షేమ చెల్లింపుల కోసం ఉపయోగించడమే కాకుండా ప్రైవేట్‌ రంగంలోని మానవ, ఆర్థిక శక్తిని అభివృద్ధి వనరులకు మళ్లించడానికి చేసే ప్రయత్నమే ప్రభుత్వ రుణం.’’

కార్ల్‌ సమ్మర్‌ షోప్‌, అమెరికన్‌ ఆర్థికవేత్త

‘‘ప్రభుత్వ రుణాన్ని ఉపయోగించుకుని అనుపయుక్తంగా ఉన్న వనరులను ఉత్పాదక వనరులుగా మార్చినప్పుడు సమష్టి ఆదాయం, ఉత్పత్తిస్థాయులు పెరుగుతాయి’’

జె.ఎం.కీన్స్‌, బ్రిటన్‌ ఆర్థికవేత్త

‘‘సమష్టి డిమాండ్‌ తగ్గుతూ ఉత్పాదక పెట్టుబడికి నిధుల కొరత ఏర్పడినప్పుడు వాస్తవిక ఆదాయం, ఉద్యోగిత స్థాయులు తగ్గిపోకుండా ఉండేందుకు ప్రైవేట్‌ రంగం నుంచి రుణ సేకరణ చేసి ప్రభుత్వం తన ఖర్చు పెంచాలి. ప్రభుత్వ రుణం సంపూర్ణ ఉద్యోగితకు ఒక సాధనం’’

అబ్బా పి. లర్నర్‌, అమెరికన్‌ - బ్రిటన్‌ ఆర్థికవేత్త

‘‘ప్రభుత్వం తన రాబడుల ద్వారా సబ్సిడీ ఖర్చులను, వర్తమాన వ్యయాన్ని సర్దుబాటు చేసుకుని, మూలధన ఖర్చుల కోసం రుణ సేకరణ చేయాలి. ప్రభుత్వ వ్యయాన్ని కనీస స్థాయిలో ఉంచుకోవాలి. దీనికోసం రుణసేకరణ బదులు పన్ను విధింపుపై ఆధారపడటం మంచిది’’

రాజా జె.చెల్లయ్య, భారతీయ ఆర్థికవేత్త

‘‘భవిష్యత్తులో దేశ ప్రజల ఆదాయం తద్వారా పన్ను చెల్లించేవారి సంఖ్య పెంచే ప్రాజెక్టుల్లో ప్రభుత్వ రుణం ఉపయోగించాలి’’

జాన్‌ ఎస్‌. మిల్‌, బ్రిటన్‌ ఆర్థికవేత్త

రచయిత బండారి ధనుంజయ విషయ నిపుణులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని