కరెంట్‌ అఫైర్స్‌

2024, జనవరి 23న ఏ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడి 127వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు?

Updated : 02 Mar 2024 03:46 IST

మాదిరి ప్రశ్నలు

  • 2024, జనవరి 23న ఏ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడి 127వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు? (ఈయన జయంతిని ఏటా పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తారు.) 

జ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌


  • అయోధ్య భవ్య మందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను ఏ రోజున ఘనంగా నిర్వహించారు? (మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాన యజమాని (కర్త) హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం అధ్యక్షులు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ తదితరులతో కలిసి మొత్తం కార్యక్రమాన్ని మోదీ నిర్వహించారు.)

జ: 2024, జనవరి 22


  • 2024, జనవరి 19 నుంచి 31 వరకు 6వ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ను తమిళనాడులోని నాలుగు నగరాల్లో నిర్వహించారు. అవి ఏవి? (మొత్తం రాష్ట్రాలు(28), కేంద్రపాలిత ప్రాంతాలకు(8) చెందిన సుమారు 5600 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీల్లో పతకాల పట్టికలో మహారాష్ట్ర 158 పతకాలతో (57 స్వర్ణం, 48 రజతం, 53 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది. ఆతిథ్య తమిళనాడు 98 పతకాలతో (38+21+39) రెండో స్థానం, హరియాణా మూడో స్థానం (35 + 22 + 46)లో నిలిచాయి. తెలంగాణ 6వ, ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర ఈ పోటీల్లో అగ్రస్థానంలో నిలవడం ఇది నాలుగోసారి. మిగతా రెండు సార్లు హరియాణా మొదటిస్థానంలో నిలిచింది.

జ: చెన్నై, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరు


  • దేశంలోని కోటి గృహాలకు సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఇళ్ల కప్పులపై సౌర ఫలకాల (సోలార్‌ రూఫ్‌ టాప్‌) వ్యవస్థను నెలకొల్పడానికి 2024, జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కార్యక్రమం ఏది?

జ: ప్రధానమంత్రి సూర్యోదయ్‌ యోజన



కూచిపూడి రంగంలో విశేష సేవలందిస్తున్న సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి-రాధారెడ్డి దంపతులను కేంద్ర సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా ప్రతిష్ఠాత్మక ‘అకాడమీ రత్న’ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరితో పాటు మరో అయిదుగురు ప్రముఖులు- రచయిత/జానపద అధ్యయనకారుడు వినాయక్‌ ఖెడేకర్‌, వైణికుడు ఆర్‌.విశ్వేశ్వరన్‌, కథక్‌ నృత్యకారిణి సునయన హజారీలాల్‌, రంగస్థల దర్శకుడు దులాల్‌ రాయ్‌, నాటక రచయిత డి.పి.సిన్హా 2022, 2023 సంవత్సరాలకుగాను ‘అకాడమీ రత్న’ అవార్డు దక్కించుకున్నారు.

  • ‘అకాడమీ రత్న’ను ‘అకాడమీ ఫెలో’ అవార్డుగానూ పిలుస్తారు.
  • ‘అకాడమీ రత్న’ విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా రూ.3 లక్షల నగదు బహుమతితో పాటు తామ్రపత్రం, అంగవస్త్రం అందజేస్తారు.

దేశంలో 2023లో 318 వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ రూపొందించిన ‘స్టేట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌-2024’ నివేదిక వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనీసం ఒక్కరోజైనా ఇలాంటి విపత్తుల బారినపడ్డాయని వివరించింది. ఈ విపత్తుల కారణంగా 3,287 మంది మరణించారు. 1.24 లక్షల జంతువులు మృత్యువాత పడ్డాయి. 22.1 లక్షల హెక్టార్ల సాగుభూమి దెబ్బతింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా 149 రోజులు, మధ్యప్రదేశ్‌-141, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో 119 రోజులు విపత్తులు నమోదయ్యాయి. 100 రోజులకు పైగా విపత్తులు నమోదైన జాబితాలో ఎనిమిది రాష్ట్రాలున్నాయి. జూన్‌-సెప్టెంబరు మధ్య వరుసగా 123 రోజులు వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయి.

మరింత సమాచారం కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని