చెన్నపట్నంలో తెల్లవారి.. నల్లవారి బస్తీలు!

భారత దేశానికి ప్రాచీనకాలం నుంచే ఐరోపా, ఇతర ఆసియా దేశాలతో సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. పోర్చుగీస్‌కి చెందిన వాస్కోడిగామా భారత్‌కి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాక ఐరోపా దేశాలు భారత్‌లో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి.

Published : 02 Mar 2024 03:36 IST

భారతదేశ చరిత్ర

భారత దేశానికి ప్రాచీనకాలం నుంచే ఐరోపా, ఇతర ఆసియా దేశాలతో సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. పోర్చుగీస్‌కి చెందిన వాస్కోడిగామా భారత్‌కి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాక ఐరోపా దేశాలు భారత్‌లో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. మొదట పోర్చుగీస్‌ వారు భారతదేశంలో వర్తక స్థావరాన్ని నెలకొల్పేందుకు అనుమతి పొందగా, తర్వాతి కాలంలో ఇతర దేశాలూ ఇక్కడ స్థావరాలు నెలకొల్పాయి. క్రమంగా వీరు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు.


భారతదేశం - యూరోపియన్ల రాక

డచ్‌వారు

 • 16వ శతాబ్దంలో భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఐరోపా వర్తక సంఘాల్లో డచ్‌వారు రెండోవారు. వీరు హాలండ్‌ దేశస్థులు.
 • వీరు క్రీ.శ. 1572-1580 వరకు నెదర్లాండ్స్‌ పౌరులుగా ఉన్నారు. తర్వాత స్పెయిన్‌ వారి అధీనం నుంచి స్వాతంత్య్రం పొందారు. క్రమంగా డచ్‌వారు బలీయమైన శక్తిగా ఎదిగారు.
 • డచ్‌వారు క్రీ.శ. 1595-97, 1598 లో భారతదేశాన్ని సందర్శించారు. క్రీ.శ.1602లో డచ్‌ ఈస్టిండియా కంపెనీ అనే వర్తక సంఘాన్ని నెలకొల్పారు.
 • పీటర్‌ బోథ్‌, జాన్‌ పీటర్స్‌జూన్‌ కొయన్‌ (Jan Pieterszoon) లాంటి సమర్థులైన డచ్‌ గవర్నర్ల నేతృత్వంలో డచ్‌ ఈస్టిండియా కంపెనీ అధికారం విస్తరించింది.
 • వీరు ఆగ్నేయాసియాలో కూడా తమ స్థావరాలు నెలకొల్పారు.
 • క్రీ.శ. 1605 - 1663 మధ్యకాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్తక కేంద్రాలు ఏర్పాటు చేశారు.
 • వీరి ముఖ్య స్థావరాలు: మచిలీపట్నం (1605), పులికాట్‌ (1610), సూరత్‌ (1616), భీమిలిపట్నం (1641), కరైకల్‌ (1645), చిన్సురా (1653), కాశింబజార్‌ (1658), బరనగోర్‌ (1658), పట్నా (1658), బాలాసోర్‌ (1658), నాగపట్నం (1658), కొచ్చి (1663).
 • క్రీ.శ. 1658లో డచ్‌వారు పోర్చుగీస్‌ వారి నుంచి సింహళాన్ని ఆక్రమించుకున్నారు.
 • క్రీ.శ.1690 వరకు డచ్‌వారికి పులికాట్‌ (తమిళనాడు) ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. తర్వాత దాన్ని నాగపట్నానికి మార్చారు. ఇదేకాలంలో ఇంగ్లండ్‌ - డచ్‌వారి మధ్య ఐరోపాలో శత్రుత్వం ఉన్నందున భారతదేశంలో డచ్‌వారు ఎక్కువ పురోగతిని సాధించలేక పోయారు.
 • ఐరోపాలో ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌లతో డచ్‌వారు యుద్ధాలు చేయడంతో వారి ఆర్థిక వనరులు సన్నగిల్లాయి. డచ్‌ వర్తకసంఘం ఉద్యోగుల అవినీతి కూడా వారి పతనానికి కారణమైంది.

ముఖ్యాంశాలు

 • డచ్‌ ఈస్టిండియా కంపెనీ ప్రధాన పరిపాలనా కేంద్రం బటావియా.
 • డచ్‌వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఆంధ్రాలోని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. వీరు గుజరాత్‌లోని సూరత్‌, బ్రోచ్‌, కాంబే, అహ్మదాబాద్‌; కేరళలోని కొచ్చిన్‌; బెంగాల్‌లోని చిన్సురా; బిహార్‌లోని పట్నా; యూపీలోని ఆగ్రాలో ట్రేడింగ్‌ డిపోలను స్థాపించారు.
 • 17వ శతాబ్దంలో వీరు పోర్చుగీస్‌ వారిపై విజయం సాధించి, వారి అధీనంలో ఉన్న అనేక భూభాగాలను ఆక్రమించారు.
 • క్రీ.శ.1657లో పులికాట్‌లో నాణేలు ముద్రించుకునేందుకు వీరికి అనుమతి లభించింది. డచ్‌ వారు వస్త్ర వ్యాపారాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. నీలిమందు, సాల్ట్‌పీటర్‌, ముడి పట్టును ఎగుమతి చేశారు.

డేన్స్‌ (డెన్మార్క్‌) ఈస్టిండియా కంపెనీ

 • దీన్ని క్రీ.శ.1616లో నెలకొల్పారు. క్రీ.శ.1620లో ట్రాన్క్విబార్‌ (తమిళనాడు)లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు.
 • వీరు క్రీ.శ.1676లో సేరంపూర్‌ (బెంగాల్‌)లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఎక్కువ కాలం తమ ప్రభావాన్ని చూపలేకపోయారు.
 • క్రీ.శ.1845లో భారతదేశంలోని తమ ఆస్తులను బ్రిటిష్‌ వారికి విక్రయించి, దేశం నుంచి వెళ్లిపోయారు.

బెదర యుద్ధం

 • 1759లో బ్రిటిష్‌, డచ్‌వారి మధ్య బెదర/ చిన్సురా యుద్ధం జరిగింది.
 • పశ్చిమ బెంగాల్‌లోని బెదర/ చిన్సురా ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
 • బ్రిటిష్‌ వారి చేతిలో ఓడిపోయిన డచ్‌వారు తూర్పు దేశాలకు చెందిన ఇండోనేసియాకు తరలివెళ్లారు.
 • ఈ యుద్ధంలో బ్రిటిష్‌ సైనిక జనరల్‌గా ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ ఉంటే, డచ్‌ సైనిక జనరల్‌గా జీన్‌ బాప్టిస్టే వ్యవహరించారు. బెంగాల్‌ నవాబు మీర్‌ జాఫర్‌ డచ్‌వారికి సాయం చేశాడు.

బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ స్థాపన

 • భారతదేశాన్ని మొగల్‌ చక్రవర్తులు పాలిస్తున్న కాలంలో ఇంగ్లండ్‌ దేశాన్ని ట్యూడర్‌ వంశస్థులు పరిపాలించారు. వీరిలో ఎనిమిదో హెన్రీ (క్రీ.శ.1509 - 1547), ఆరో ఎడ్వర్డ్‌ (క్రీ.శ.1547 - 1553), మొదటి ఎలిజబెత్‌ మహారాణి (క్రీ.శ.1558 - 1603) మొదలైనవారు ముఖ్యులు.
 • ఎలిజబెత్‌ రాణి కాలంలో ఇంగ్లండ్‌ సముద్రంపై తిరుగులేని శక్తిగా అవతరించింది. సముద్రమార్గం ద్వారా తూర్పు దేశాలతో ముఖ్యంగా భారత్‌తో విదేశీ వ్యాపారాన్ని పెంపొందించాలని ఆమె భావించారు.
 • ఆ సమయంలో భారతదేశాన్ని మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ పాలిస్తున్నాడు. అతడి స్నేహాన్ని కోరుతూ ఎలిజబెత్‌ రాణి మొగల్‌ దర్బారుకు తన రాయబారులను పంపింది. అక్బర్‌ వారిని గౌరవించాడు.
 • అప్పుడే తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ఈస్టిండియా కంపెనీ ఏర్పడింది.
 • క్రీ.శ.1599లో ‘ది మర్చంట్‌ అడ్వెంచర్స్‌’ అని పిలిచే ఆంగ్ల వ్యాపార బృందం భారత్‌లో తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ రాణి ఎలిజబెత్‌ ఖి దగ్గరకు వెళ్లారు. క్రీ.శ.1600 డిసెంబరు 31న ఆమె వ్యాపారానికి అంగీకరిస్తూ రాయల్‌ చార్టర్‌ (అధికారిక మంజూరు)ను చేశారు. ఈ విధంగా ‘బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ’ ఆవిర్భవించింది.
 • వ్యాపార నిమిత్తం మొదటిసారి భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయుడు జాన్‌ మిల్డెన్‌హాల్‌.
 • మొగల్‌ చక్రవర్తుల అనుమతితో క్రీ.శ.1605 - 1656 మధ్య
 • కాలంలో ఈస్టిండియా కంపెనీ తన వర్తక స్థావరాలను సూరత్‌, అహ్మదాబాద్‌, హుగ్లీ, ఢాకా, కాశింబజార్‌ మొదలైన చోట్ల స్థాపించింది.

స్థావరాలు

 • క్రీ.శ.1608లో సూరత్‌లో వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పేందుకు అనుమతి కోరుతూ విలియం హాకిన్స్‌ మొగల్‌ చక్రవర్తి జహంగీర్‌ ఆస్థానానికి వెళ్లాడు. దీనికి జహంగీర్‌ అనుమతించలేదు.
 • జహంగీర్‌ అనుమతి కోసం తర్వాతి కాలంలో ఇంగ్లండ్‌ రాజు రెండో జేమ్స్‌ తన రాయబారిగా సర్‌ థామస్‌రోని పంపారు. అతడి మధ్యవర్తిత్వంతో క్రీ.శ.1612లో జహంగీర్‌ సూరత్‌లో నిర్మాణానికి అనుమతిచ్చాడు.
 • ఇదే కాకుండా భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్తక స్థావరాలను నిర్మించడానికి అతడు అనుమతి తీసుకున్నాడు.
 • క్రీ.శ.1613లో కెప్టెన్‌ బస్ట్‌ సూరత్‌, కాంబాయా, అహ్మదాబాద్‌, గోవాల్లో ఫ్యాక్టరీలు స్థాపించేందుకు అనుమతి పొందాడు.
 • క్రీ.శ.1611 నాటికే గోల్కొండ సుల్తాన్‌ మహమ్మద్‌ కులీకుతుబ్‌షా అనుమతితో కెప్టెన్‌ హిప్సన్‌ మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు.
 • క్రీ.శ.1619లో ఆంగ్లేయులు ఆగ్రా, అహ్మదాబాద్‌, బరోడా, బ్రోచ్‌లలో ఫ్యాక్టరీలు స్థాపించారు. 1626లో గోవాలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు.
 • ఆంగ్లేయులు దక్షిణ భారతదేశంలో తమ మొదటి వర్తక స్థావరం క్రీ.శ.1626లో మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. కోరమండల్‌ తీరంలో (బెంగాల్‌, బిహార్‌, ఒడిశా) ఆంగ్లేయుల ప్రధాన
 • కార్యాలయంగా మచిలీపట్నం ఉండేది. క్రీ.శ. 1661లో దీన్ని మద్రాస్‌కు మార్చారు.
 • క్రీ.శ.1640 నాటికి ‘ఫ్రాన్సిస్‌ డే’ (మచిలీపట్నం కౌన్సిల్‌ సభ్యుడు) చంద్రగిరిని పరిపాలిస్తున్న హిందూ రాజు నుంచి మచిలీపట్నానికి దక్షిణాన విస్తరించి ఉన్న 230 మైళ్ల భూమిని కౌలుకు పొందాడు. అక్కడ ఒక కోటను నిర్మించి, దానికి ‘సెయింట్‌ జార్జి కోట’ అని పేరు పెట్టాడు. దీని చుట్టూ ఉన్న ప్రాంతంలోనే చెన్నపట్నం లేదా మద్రాసు పట్టణం అభివృద్ధి చెందింది. దీనిలో తెల్లవారి బస్తీ, నల్లవారి బస్తీ (భారతీయ వర్తకులు, నేత పనివారు) వేర్వేరుగా జీవితం గడిపేవారు.
 • క్రీ.శ.1633లో ఈస్టిండియా కంపెనీ మొదటిసారి తూర్పు భారతదేశంలో ఫ్యాక్టరీలు నెలకొల్పింది. ఒడిశా తీరంలోని హరిహరపూర్‌లో దీన్ని ఏర్పాటు చేశారు.
 • క్రీ.శ.1651లో హుగ్లీ వద్ద ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు.
 • మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ హుగ్లీ నదీ తీరంలో కొంత భూమిని గాబ్రియల్‌ బౌటన్‌ అనే బ్రిటిష్‌ వైద్యుడికి బహుమతిగా ఇచ్చాడు. దీన్ని బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ఖరీదు చేసి, క్రీ.శ.1687-90 మధ్యలో ‘కలకత్తా’ అనే కొత్త నగరాన్ని నిర్మించింది. ఈ నగరంలోనే విలియం కోటను కట్టారు. స్వల్ప కాలవ్యవధిలోనే ఇది కంపెనీ తరఫున పెద్ద వ్యాపార కేంద్రంగా, పాలనా కేంద్రంగా అభివృద్ధి చెందింది.
 • క్రీ.శ.1668లో పశ్చిమ తీరంలోని కంపెనీకి బొంబాయి ప్రధాన కార్యాలయంగా మారింది.
 • క్రీ.శ.1690లో జాబ్‌ చార్నాక్‌ బెంగాల్‌లోని సుతానుతి ప్రాంతంలో వర్తక స్థావరాన్ని స్థాపించాడు.

రచయిత: డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు