గణ రాజ్యాలే మహా సామ్రాజ్యాలై!

ప్రాచీన భారతదేశంలో మలివేద ఆర్యులు గంగా మైదాన ప్రాంతానికి  వలసవచ్చి స్థిరపడటంతో చిన్నచిన్న గణతంత్ర రాజ్యాలు ఏర్పాటయ్యాయి. వ్యవసాయ వృద్ధి, ఇనుము వినియోగం కారణంగా ఆర్థిక, సైనిక వనరులు పోగుపడటం, బలవంతులైన పాలకుల కారణంగా రాజ్యకాంక్ష రగిలి రాజ్యాలు విస్తరించాయి.

Published : 29 Mar 2024 00:06 IST

 

ప్రాచీన భారతదేశ చరిత్ర

ప్రాచీన భారతదేశంలో మలివేద ఆర్యులు గంగా మైదాన ప్రాంతానికి  వలసవచ్చి స్థిరపడటంతో చిన్నచిన్న గణతంత్ర రాజ్యాలు ఏర్పాటయ్యాయి. వ్యవసాయ వృద్ధి, ఇనుము వినియోగం కారణంగా ఆర్థిక, సైనిక వనరులు పోగుపడటం, బలవంతులైన పాలకుల కారణంగా రాజ్యకాంక్ష రగిలి రాజ్యాలు విస్తరించాయి. ఈ పరిణామంలో మగధ పాలకులు తొలి మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి ఉపఖండంలో రాజకీయ ఏకీకరణకు నాంది పలికారు. నాటి గణ రాజ్యాలు, పరిధి, వాటన్నింటిపై మగధ పాలకులు ఆధిపత్యం సాధించేందుకు అనుకూలించిన పరిస్థితులు, ఈ క్రతువులో భాగమైన పాలక వంశాలు, గొప్ప పాలకులు, వారు అనుసరించిన విధానాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. మౌర్య వంశ పాలనకు ముందు ఉన్న పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకోవాలి.

మౌర్యుల  పూర్వయుగం

(క్రీ.పూ.6వ శతాబ్దం - అనంతర రాజకీయ పరిస్థితులు)

ప్రాచీన భారతదేశ రాజకీయ చరిత్రలో క్రీ.పూ.6వ శతాబ్దం అనంతర కాలం ప్రాముఖ్యమైంది. ఈ యుగ రాజకీయ పరిస్థితుల అధ్యయనానికి ప్రధాన ఆధారాలు ఆనాటి బౌద్ధ, జైన సాహిత్యం. వాటి ప్రకారం నాటి రాజకీయాలకు గంగ, యమున మైదానాలు ప్రధాన కేంద్రాలని, ఉత్తర భారతదేశంలో 16 మహాజనపదాలు (షోడశ మహాజనపదాలు) ఉండగా, అందులో 14 రాచరిక వ్యవస్థ ఉన్న రాజ్యాలు, 2 గణతంత్ర రాజ్యాలని తెలుస్తోంది. అంగుత్తర నికాయ (సుత్త పిటక) లాంటి పురాతన బౌద్ధ గ్రంథాలు 16 మహాజనపదాల గురించి పేర్కొన్నాయి. ఈ షోడశ మహాజనపదాలు నిరంతరం, పరస్పరం కలహించుకుంటూ ఉండేవి. మలివేద యుగంలో ఇనుము వాడకంలోకి రావడంతో దానితో పనిముట్లు చేసి  అడవులు Ëనరికి అధిక భూమిని సాగులోకి తెచ్చారు. వ్యవసాయ మిగులు వాణిజ్యానికి దారితీసి వ్యాపార కూడళ్లు ఏర్పడి పట్టణాలుగా వృద్ధి చెందాయి. ప్రజలకు భూమితో అనుబంధం ఏర్పడింది. సంచార జీవనం వదిలి స్థిరజీవనానికి అలవాటుపడ్డారు. క్రమంగా వివిధ వృత్తులు   ఏర్పడ్డాయి. రాజు పన్నులు (భాగ) వసూలు చేసి ఆర్థికంగా, సైనికంగా బలవంతుడయ్యాడు. ఇలాంటి పరిస్థితులే ప్రాదేశిక రాజ్య (మహాజనపదాలు) ఆవిర్భావానికి దారితీశాయి.

షోడశ మహాజనపదాలు: అంగ, అస్సక (అస్మక), అవంతి, ఛేది, గాంధార, కాశీ, కాంభోజ, కోసల,Ë కురు, మగధ, మల్ల, మత్స్య, పాంచాల, శూరసేన, వజ్జి, వత్స. ఈ మహాజనపదాలు ప్రధానంగా ఎగువ మధ్య గంగా మైదానాల్లో, గంగ - యమున, వాటి అంతర్వేదిలో ఏర్పడ్డాయి. ఇందులో మగధ, కాశి, కోసల, అవంతి, వత్స రాజ్యాలు శక్తిమంతమైనవి.

1) అంగ: రాజధాని చంపనగరం. గంగానది ఒడ్డున ఉంది. గొప్ప  వాణిజ్యకేంద్రం. మగధను పాలించే బింబిసారుడు అంగను జయించి  మగధలో కలిపాడు.
2) అస్సక: దక్షిణ భారతదేశంలో ఉంది. ఇందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలు భాగంగా ఉండేవి. అస్సకుల రాజధాని పొటానా లేదా పొటాలి. ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బోధన్‌ అని నిర్ధారించారు.
3) అవంతి: మాల్వా ప్రాంతం. రాజధాని ఉజ్జయిని. అవంతి, కోసల, మగధ రాజ్యాల మధ్య తరచూ సంఘర్షణలు జరిగేవి. శిశునాగ వంశ కాలంలో మగధ అవంతిని జయించింది.
4) ఛేది: బుందేల్‌Ëఖండ్‌ ప్రాంతం (మధ్యప్రదేశ్‌). రాజధాని సుక్తిమతి.
5) గాంధార: భారత ఉపఖండ వాయవ్య ప్రాంతంలో (ప్రస్తుత పాకిస్థాన్‌లోని రావల్పిండి-పెషావర్‌ ప్రాంతం)లో ఉంది. రాజధాని తక్షశిల గొప్ప విద్యాకేంద్రం.
6) కాశీ: తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌. వారణాసి (వరుణ, అసి నదుల సంగమ ప్రాంతం) రాజధాని. కోసల రాజ్యం దీన్ని జయించింది.
7) కాంభోజ: భారత ఉపఖండ వాయవ్య ప్రాంతంలో (ప్రస్తుత
పాకిస్థాన్‌) ఉంది. రాజధాని రాజపుర.
8) కోసల: ప్రస్తుత అయోధ్య ప్రాంతం. రాజధాని మొదట అయోధ్య, తర్వాత శ్రావస్తి. సరయు నది అయోధ్యను ఉత్తర దక్షిణాలుగా విభజిస్తుంది. కోసల, మగధ రాజ్యాల మధ్య దీర్ఘకాలం సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. చివరకు కోసల రాజ్యాన్ని మగధ ఆక్రమించింది.
9) కురు: పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీ, మీరట్‌, స్థానేశ్వర్‌ ప్రాంతం. రాజధాని ఇంద్రప్రస్థం/హస్తినాపురం.
10) మగధ: నేటి పట్నా, గయా, షహబాద్‌ జిల్లాలున్న ప్రాంతం. షోడశ మహాజనపదాలలో మహాశక్తిమంతమైన రాజ్యం. గంగ సొన్‌, గంఢక్‌ నదుల సంగమంలో ఉంది. క్రీ.పూ.6వ శతాబ్దిలో హర్యంక వంశం పాలనలో ఉంది. మగధను పాలించిన రాజవంశాలు, మగధను మహా సామ్రాజ్య స్థాయికి తీసుకెళ్లాయి.
11) మల్ల సమాఖ్య: కుశీనగర రాజధాని. బుద్ధుడి మహాపరినిర్వాణం తర్వాత మగధలో కలిసిపోయింది.
12) మత్స్య: ప్రస్తుత రాజస్థాన్‌లోని జైపుర్‌ ప్రాంతం. రాజధాని విరాట్‌ నగరం.
13) పాంచాల: పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌, ఫరూఖాబాద్‌ జిల్లాల ప్రాంతం. గంగానది ఈ రాజ్యాన్ని రెండు  భాగాలుగా విభజిస్తుంది. దీని రాజధాని అహిచ్ఛత్రము.
14) శూరసేన: యమునా నది తీరాన ఉంది. రాజధాని మధుర.
15) వజ్జి: ఇది తొమ్మిది గణరాజ్యాల సమాఖ్య. ప్రతి తెగకు ప్రభుత్వం, రాజధాని ఉండేవి. వజ్జి సమాఖ్యకు రాజధాని వైశాలి.
16) వత్స: యమునా నదికి దక్షిణంగా ఉంది. రాజధాని కౌశాంబి.

క్రీ.పూ. 6వ శతాబ్దం నుంచి గంగ యమునా మైదానాల ఆక్రమణకు మహాజనపదాలు ఒకదాంతో మరొకటి సంఘర్షణకు దిగేవి. ఈ పోరాటంలో ప్రధానంగా మగధ, అవంతి, కాశి, కోసల, వజ్జి రాజ్యాలు చురుగ్గా పాల్గొన్నాయి. పరస్పర వైరాలతో బలహీనమైన ఈ జనపదాలన్నింటినీ మగధ జయించి, ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దింది. ఈ ఘనత క్రీ.పూ.6వ శతాబ్ది నుంచి 4వ శతాబ్ది వరకు మగధను పాలించిన హర్యంక, శిశునాగ , నంద వంశాలది. రాజ్యకాంక్షతో రగిలిన ఆ వంశాల రాజులు మగధను ఒక సామ్రాజ్య శక్తిగా తీర్చిదిద్దారు.

మగధ మహాజనపదం విజృంభణకు కారణాలు:  1) హర్యంక, శిశునాగ, నంద వంశాల్లో బింబిసారుడు, అజాతశత్రువు, శిశునాగుడు, మహాపద్మనందుడు లాంటి రాజులు రాజ్యకాంక్షతో మగధ మహాజనపదాన్ని గొప్ప సామ్రాజ్యశక్తిగా తీర్చిదిద్దడానికి నడుం బిగించారు. 2) భౌగోళికంగా సొన్‌, గండక్‌, గంగ, గోగ్రా నదుల మధ్య ఉండి, విదేశీ దండయాత్రలకు దూరంగా ఉండటం. 3) గంగ, దాని ఉపనదుల ప్రవాహంతో సారవంతమైన భూములు ఏర్పడి, వ్యవసాయాభివృద్ధి జరగడం. 4) మగధ ప్రాంతం ఖనిజాల పుట్టిల్లు. ఇనుము కనుక్కోవడం, దాంతో అనేక    పనిముట్లు తయారుచేసి అడవులు నరికి, అధిక వ్యవసాయ భూమి సాగులోకి తేవడం, అధిక ఉత్పత్తి జరిగి, వ్యాపారవాణిజ్యాలు వృద్ధి చెందడం.5) పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతో ఆర్థికంగా బలపడటం, తద్వారా అధికార బృందం, సైనిక శక్తి పెరిగి రాజ్యవిస్తరణకు దారితీయడం.

హర్యంక వంశం (క్రీ.పూ. 544-430): ఈ వంశంలో ముఖ్య రాజులు బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు. మగధ ఔన్నత్యానికి పునాదులు వేసింది బింబిసారుడు. రాజ్యవ్యాప్తికి వైవాహిక సంబంధాలను ఒక మార్గంగా ఎంచుకుని కోసల, లిచ్ఛవి, మాద్ర రాకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాలతో తన పలుకుబడిని పశ్చిమాన పంజాబ్‌ నుంచి తూర్పున బెంగాల్‌ వరకు విస్తరించాడు. తూర్పున ఉన్న అంగ రాజ్యంపై దండెత్తి బ్రహ్మదత్తుడిని ఓడించాడు. గాంధార, అవంతి రాజులు అతడితో మైత్రి ఏర్పరచుకున్నారు. బింబిసారుడి రాజ్యం 80 వేల గ్రామాలతో ఉండేదని; బుద్ధుడికి, మహావీరుడికి ఇతడు సమకాలికుడని, బింబిసారుడిని చంపి అతడి కుమారుడు అజాతశత్రువు రాజు అయ్యాడని జైన, బౌద్ధ గ్రంథాలు పేర్కొంటున్నాయి. బింబిసారుడి రాజధాని రాజగృహం.
అజాతశత్రువు: తండ్రి మాదిరిగా గొప్ప సామ్రాజ్యకాంక్ష కలిగినవాడు. దిగ్విజయ యాత్రలతో రాజ్యవిస్తరణ చేశాడు. కోసల రాజైన ప్రసేనజిత్తుడిని, లిచ్ఛవిలను ఓడించాడు. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలోనే జరిగింది. తండ్రిని చంపినందుకు అజాతశత్రువు పశ్చాత్తాపపడినట్లు బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. అనంతరం వచ్చిన ఉదయనుడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాతి రాజులు కూడా పితృహంతకులు అవడంతో, వారి అకృత్యాలు భరించలేక మంత్రి శిశునాగుడి ఆధ్వర్యంలో ప్రజలు తిరుగుబాటు చేసి, శిశునాగుడిని రాజుగా చేశారు.

శిశునాగ వంశం (క్రీ.పూ. 430-364): వంశ స్థాపకుడు శిశునాగుడు. అవంతి, వత్స, కోసల రాజ్యాలను మగధలో విలీనం చేశాడు. ఇతడి గొప్ప విజయం అవంతిని జయించడం. తర్వాత కాలఅశోకుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడి హయాంలోనే రెండో బౌద్ధ సంగీతి జరిగింది.

నంద వంశం (క్రీ.పూ. 364-324): నంద వంశ స్థాపకుడు మహాపద్మనందుడు. ఇతడు క్షత్రియేతరుడు. కాశీ, పాంచాల, మిథిల, కురు, అస్మక రాజ్యాలను జయించి ఉత్తరాన సట్లెజ్‌ నుంచి దక్షిణాన గోదావరి వరకు మగధ రాజ్యాన్ని విస్తరించి మొదటి భారత సామ్రాజ్య నిర్మాతగా చరిత్రకెక్కాడు. ఇతడి తర్వాత తొమ్మిది మంది నంద రాజులు అసమర్థులు. ఆఖరి రాజైన ధననందుడు అలెగ్జాండర్‌ సమకాలికుడు. గ్రీకులు ధన  నందుడిని అగ్రేమ్స్‌ అని పిలిచారు. అతడి నిరంకుశ పాలన, పన్నుల భారం, ప్రజల అసంతృప్తి వల్ల చంద్రగుప్త మౌర్యుడు, తన గురువు చాణుక్యుడి సహాయంతో నంద వంశం పాలనను నిర్మూలించాడు. పాటలీపుత్ర సింహాసనంపై మౌర్యుల పాలన ప్రారంభమై భారత ఉపఖండాన్ని రాజకీయంగా ఒకే పాలనా ఛత్రం కిందకి తెచ్చారు. ఈ పరిణామంతో భారతదేశ చరిత్ర మహా సామ్రాజ్య యుగం వైపు ప్రయాణించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు