రహస్య ఒప్పందాలు.. సంధి ఉల్లంఘనలే ఆ యుద్ధాలకు కారణాలు!

భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల రాజ్యవ్యాప్తి విధానంలో భాగంగా బెంగాల్‌ ఆక్రమణ తర్వాత వారి దృష్టి దక్షిణ పథంలోని మైసూర్‌ రాజ్యంపై పడింది.

Updated : 30 Mar 2024 18:34 IST

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర


ఆంగ్లో - మైసూరు యుద్ధాలు
(క్రీ.శ. 1767 - 99)

భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల రాజ్యవ్యాప్తి విధానంలో భాగంగా బెంగాల్‌ ఆక్రమణ తర్వాత వారి దృష్టి దక్షిణ పథంలోని మైసూర్‌ రాజ్యంపై పడింది. మైసూర్‌ రాజ్యాన్ని పరిపాలించిన హైదరలీ (1722 - 82), అతడి కుమారుడు, వారసుడైన టిప్పుసుల్తాన్‌ (1751 - 99)లు తమ రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకోవడానికి జరిపిన పోరాటం ఆంగ్లేయుల వ్యూహాలను బలహీనపరిచింది. ఫలితంగా మైసూరు పాలకులకు, ఆంగ్లేయులకు మధ్య మొత్తం నాలుగు మైసూరు యుద్ధాలు జరిగాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత బ్రిటిష్‌వారు అంతిమ విజయం సాధించారు.


మొదటి మైసూరు యుద్ధం (1767 - 69)

 • 18వ శతాబ్దపు మొదటి దశలో విజయనగర సామ్రాజ్య పునాదులపై వెలసిన స్వతంత్ర రాజ్యమే మైసూరు.
 • వడయార్‌ వంశపు రాజు చిన్న కృష్ణరాజు సోదరులైన దేవరాజు, నంజరాజుల నుంచి హైదరలీ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు.
 • హైదరలీ మైసూరు సింహాసనాన్ని ఆక్రమించడానికి ముందే అనేక యుద్ధాల్లో పాల్గొని వడయార్‌ రాజు అభిమానం, విశ్వాసం పొందాడు. దీంతో 1755 నాటికి అతడిని దిండిగల్లు ఫౌజ్‌దార్‌గా నియమించాడు.
 • ఈయన ఫ్రెంచ్‌ ఇంజినీర్ల సహాయంతో అక్కడ ఒక కోటను నిర్మించాడు.
 • మరాఠాలు, నిజాంతో రహస్యంగా ఒప్పందం చేసుకున్న మైసూరు ప్రధాని నంజరాజు వల్ల మైసూరు రాజుకు ముప్పు పొంచి ఉందనే విషయాన్ని హైదరలీ రాజుకు చేరవేశాడు.
 • ఆ తర్వాత నంజరాజును బంధించి, చంపించిన హైదరలీ రాజు సోదరులను నామమాత్రం చేసి తానే సర్వాధికారాలు చెలాయించడం ప్రారంభించాడు.
 • మొదటి మైసూరు యుద్ధం (1767 - 69) రెండేళ్ల పాటు జరిగింది.

కారణాలు:

హైదరలీ ఫ్రెంచ్‌ వారి సహాయం పొంది, తన సైన్యానికి వారితో శిక్షణ ఇప్పించాడు. తన పటిష్ట సైన్యంతో రాజ్యాన్ని నలుదిశలా విస్తరింపజేయాలని వ్యూహం రూపొందించాడు.

 • బెద్నూరు, సేరా, కెనరా, గుత్తిలను ఆక్రమించాడు. అనేకమంది పాలెగాళ్లను అణచివేశాడు.
 • పీష్వా మొదటి మాధవరావు మరణానంతరం బళ్లారి, కడప, కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతాన్ని, కొన్ని మరాఠా ప్రాంతాలనూ ఆక్రమించుకున్నాడు. మరాఠాల నుంచి 2 లక్షల రూపాయల కప్పం వసూలు చేశాడు.
 • హైదరాబాద్‌ నిజాం, మరాఠాలు ఐక్యంగా హైదరలీని ఎదిరించడానికి ప్రయత్నించి, విఫలమయ్యారు.
 • దీన్ని గమనించిన ఆంగ్లేయులు హైదరలీ తమ భవిష్యత్‌కు ప్రమాదమని గ్రహించి, అతడిని అణచివేయడానికి సిద్ధపడ్డారు.
 • ఆంగ్లేయులు హైదరలీని అంతం చేయాలని భావించడానికి మరో కారణం - కర్ణాటక నవాబు మహ్మద్‌ అలీ శత్రువైన ‘మవూజ్‌ఖాన్‌’కు అతడు ఆశ్రయం ఇవ్వడం.
 • ఇదే సమయంలో హైదరలీ చందాసాహెబ్‌ కొడుకైన రాజాసాహెబ్‌కు కూడా తన రాజ్యంలో ఉద్యోగమిచ్చాడు.
 • ఈ విధంగా తమ శత్రువులకు రక్షణ కల్పిస్తున్న హైదరలీ తీరుపై బ్రిటిష్‌వారికి తీవ్ర ఆగ్రహం కలిగింది.
 • మైసూరు పాలకుడికి సంబంధించిన వెల్లూరులో ఆంగ్లేయులు తమ సైన్యాలను నిలిపారు. దీన్ని హైదరలీ వ్యతిరేకించాడు. దీంతో 1767లో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైంది.
 • ఆంగ్లేయులు మొదట హైదరలీపైకి మహారాష్ట్రులను పంపారు.
 • అతడు ఆ సైన్యాలను తన వైపు తిప్పుకోవడమే కాకుండా వారికి కొంచెం ధనం ఇచ్చి ఆంగ్లేయులతో కలవకుండా ఉండేలా ఒప్పందం చేసుకున్నాడు.
 • మవూజ్‌ఖాన్‌ రహస్యంగా నిజాంతో చేతులు కలిపి, వారికి, హైదరలీకి మధ్య సంధి కుదిర్చాడు.
 • క్రీ.శ. 1767లో కల్నల్‌ స్మిత్‌ హైదరలీని చంగామా, ట్రింకోమలై ప్రాంతాల్లో ఓడించాడు.
 • హైదరలీ ఓడిపోగానే నిజాం అతడిని విడిచిపెట్టి తిరిగి ఆంగ్లేయులతో చేరాడు.
 • ముంబయి నుంచి వచ్చిన బ్రిటిష్‌ సేనలను వెళ్లగొట్టి హైదరలీ క్రీ.శ.1769లో మంగుళూరును స్వాధీనం చేసుకున్నాడు.
 • యుద్ధానికి సిద్ధంగాలేని బ్రిటిష్‌ వారు హైదరలీతో మద్రాస్‌ సంధి చేసుకున్నారు.

సంధి షరతులు:

క్రీ.శ. 1769 ఏప్రిల్‌ 4న ఆంగ్లేయులతో జరిగిన సంధి ప్రకారం హైదరలీ స్వాధీనం చేసుకున్న కరూర్‌, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు అతడి ఆధీనంలోనే ఉంటాయి.

 • మిగిలిన ప్రాంతాలెవరు జయించినా యుద్ధానికి పూర్వం ఎవరికి చెంది ఉండేవో తిరిగి వారికే ఇవ్వాలి.
 • యుద్ధ ఖైదీలను విడుదల చేయాలి. యుద్ధాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఈ విధంగా మొదటి మైసూర్‌ యుద్ధం ముగిసింది.

రెండో మైసూరు యుద్ధం (క్రీ.శ. 1780 - 84)

క్రీ.శ.1769లో హైదరలీకి ఆంగ్లేయులకు మధ్య జరిగిన సంధి తర్వాత ఆంగ్లేయులతో ఘర్షణ ఉండదని, తమ ఇద్దరి మధ్య శాశ్వతమైన పొత్తు ఉంటుందని హైదరలీ విశ్వసించాడు.

 • అయితే, యుద్ధం విరమించినా, ఆంగ్లేయులకు హైదరలీపై కోపం పోలేదు. ఏదో ఒక విధంగా అతడితో తిరిగి యుద్ధం చేయడానికి ప్రయత్నించారు. వారి ధోరణి రెండో మైసూరు యుద్ధానికి దారితీసింది.

కారణాలు

క్రీ.శ. 1770లో మహారాష్ట్రులు మైసూరుపై దండెత్తారు.

 • మద్రాస్‌ సంధిలో భాగంగా ఆంగ్లేయులు, హైదరలీ యుద్ధ సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సి ఉంది. హైదరలీ ఆంగ్లేయులను సహాయం అడిగాడు. కానీ వారు పట్టించుకోలేదు.
 • క్రీ.శ.1771-72లో మహారాష్ట్రులు రెండుసార్లు హైదరలీని ఓడించి, అతడితో సంధి చేసుకున్నారు. ఈ సంధి షరతులకు ఆంగ్లేయులు ఒప్పుకున్నారు.
 • తనకు కాకుండా మహారాష్ట్రులకు లాభదాయకంగా వ్యవహరించినందుకు హైదరలీ బ్రిటిష్‌వారిపై కోపం పెంచుకున్నాడు. రెండో మైసూరు యుద్ధానికి ఇదీ ఒక కారణమైంది.
 • క్రీ.శ.1770లో ఆంగ్లేయులు ఓనోర్‌లో ఒక కర్మాగారాన్ని నిర్మించారు. మలబార్‌, కోస్తాలో ఉండే ఎర్రచందనం కట్టె, మిరియాలు పూర్తిగా ఆంగ్లేయులకే విక్రయించాలని, దానికి బదులుగా బొంబాయి ప్రభుత్వం హైదరలీకి అవసరమైనప్పుడు యుద్ధసామాగ్రి సరఫరా చేస్తుందని ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు. హైదరలీకి, మహారాష్ట్రులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అతడు బొంబాయి ప్రభుత్వానికి సంధి షరతులను గుర్తు చేయాల్సిందిగా కోరాడు. ఈ కోరికనూ ఆంగ్లేయులు పట్టించుకోలేదు. ఇది యుద్ధానికి రెండో కారణం.
 • ఆంగ్లేయుల సహాయం అందకపోవడంతో హైదరలీ ఫ్రెంచ్‌ వారి సహాయాన్ని కోరాడు. ఫ్రెంచ్‌ వారికి, ఆంగ్లేయులకు మధ్య శత్రుత్వం ఉంది.
 • హైదరలీ అధీనంలోని మలబార్‌ కోస్తాలోని ‘మహి’ రేవు పట్టణాన్ని ఫ్రెంచ్‌ వారు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. ఈ రేవు ద్వారా హైదరలీ విదేశాలకు వస్తువులను ఎగుమతి చేసేవాడు. ఐరోపా దేశాల నుంచి యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకునేవాడు.
 • ఫ్రెంచ్‌వారికి, ఆంగ్లేయులకు మధ్య శత్రుత్వం కారణంగా బ్రిటిష్‌వారు ఫ్రెంచ్‌ వారి స్వాధీనంలో ఉన్న పాండిచ్చేరిని గెలిచి, మహిని కూడా స్వాధీనం చేసుకోవాలని భావించారు. మహి విషయంలో జోక్యం చేసుకోవద్దని హైదరలీ ఆంగ్లేయులను కోరగా వారు పట్టించుకోలేదు.
 • దీంతో అతడు ఫ్రెంచ్‌ వారి సహాయంతో మహిని కాపాడుకుని, వారి పతాకాన్ని ఎగురవేయించాడు.  ఆంగ్లేయులకు హైదరలీకి మధ్య యుద్ధం జరగడానికి ఇదీ ఒక కారణమైంది.

యుద్ధం

హైదరలీ క్రీ.శ.1780లో 80,000 మంది సైనికులు, 100 ఫిరంగులతో ఆర్కాట్‌ను ముట్టడించి, కల్నల్‌ బైలీ నాయకత్వంలోని ఆంగ్ల సైన్యాన్ని ఓడించాడు.

 • పరిస్థితులను అర్థం చేసుకున్న వారన్‌ హేస్టింగ్స్‌ సర్‌ ఐర్‌కూట్‌ ఆధ్వర్యంలో ఒక సైన్యాన్ని ఆర్కాట్‌పైకి పంపడమే కాకుండా మహారాష్ట్రులు, నిజాం హైదరలీతో కలవకుండా చేశాడు.
 • సర్‌ ఐర్‌కూట్‌ హైదరలీని షోలింగర్‌ దగ్గర ఓడించి, అక్కడి నుంచి నాగపట్నం వెళ్లి ట్రింకోమలైను కూడా ఆక్రమించుకున్నాడు.
 • మహారాష్ట్రులు తనను మోసగించడంతో ఆంగ్లేయులతో పోరాడలేక హైదరలీ ఫ్రెంచ్‌ వారి సైన్యసహకారం కోరాడు.
 • క్రీ.శ. 1782లో ఫ్రెంచ్‌ సైన్యం తూర్పు తీరం చేరి కడలూరు, ట్రింకోమలైను ఆక్రమించింది.
 • కానీ యుద్ధం ముగియకుండానే హైదరలీ క్యాన్సర్‌ వ్యాధితో మరణించాడు. తండ్రి చేస్తున్న యుద్ధాన్ని కొనసాగించిన కుమారుడు టిప్పు సుల్తాన్‌ మలబార్‌లో ఉన్న ఆంగ్లేయులను ఓడించాడు.
 • యుద్ధ ఫలితం మైసూరుకు అనుకూలంగా ఉన్నా అమెరికాలో ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌ వారికి సంధి కుదరగానే ఫ్రెంచ్‌వారు టిప్పు సుల్తాన్‌కు సహాయం చేయడానికి నిరాకరించారు. ఆంగ్ల సైన్యం వెంటనే మైసూరును ముట్టడించింది.
 • బొంబాయి నుంచి వచ్చిన సైన్యం హోనోవర్‌, బెద్నూర్‌, మంగుళూరు ప్రాంతాలను ఆక్రమించింది.
 • ఆంగ్లేయులు పంపిన మరో బృందం దిండిగల్లు, కోయంబత్తూరు, పాల్‌ఘాట్‌లను ఆక్రమించి టిప్పు సుల్తాన్‌ రాజ్య ముఖ్య పట్టణమైన శ్రీరంగపట్టణాన్ని ముట్టడించడానికి బయలుదేరింది.
 • ఈలోగా మద్రాసు గవర్నర్‌ మెకార్టెనీ ఆంగ్లేయుల తరఫున టిప్పుతో సంధి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.
 • అలా రెండో మైసూరు యుద్ధం మంగుళూరు సంధితో ముగిసింది. కానీ ఈ విధంగా యుద్ధాన్ని విరమించడం వారన్‌ హేస్టింగ్స్‌కు నచ్చలేదు.

మంగుళూరు సంధి:

క్రీ.శ.1784లో మంగుళూరు దగ్గర జరిగిన సంధిలో హైదరలీకి ఆంగ్లేయులకు మధ్య జరిగిన మద్రాస్‌ సంధినే బలపరిచారు.

 • ఈ సంధి ప్రకారం టిప్పు సుల్తాన్‌ గెలిచిన కర్ణాటకను ఆంగ్లేయులకు తిరిగి ఇవ్వాలి. మైసూరులో ఆంగ్లేయులు గెలిచినవి టిప్పుకు తిరిగి ఇవ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు