సహజ వనరుల సద్వినియోగమే దేశాభివృద్ధికి సోపానం!

తన అవసరాలు, కోరికలను సంతృప్తి పరచడానికి పర్యావరణం ప్రసాదించిన ప్రతి వస్తువు మానవుడి దృష్టిలో ప్రకృతి వనరే. విశాలమైన జీవసంబంధ లేదా పర్యావరణ దృక్పథంలో ఒక జీవరాశి అవసరాలను తీర్చేవే వనరులు. ఇవి ఆర్థికాభివృద్ధికి పునాది.

Published : 02 Apr 2024 03:37 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ జాగ్రఫీ

తన అవసరాలు, కోరికలను సంతృప్తి పరచడానికి పర్యావరణం ప్రసాదించిన ప్రతి వస్తువు మానవుడి దృష్టిలో ప్రకృతి వనరే. విశాలమైన జీవసంబంధ లేదా పర్యావరణ దృక్పథంలో ఒక జీవరాశి అవసరాలను తీర్చేవే వనరులు. ఇవి ఆర్థికాభివృద్ధికి పునాది.

మానవుడి అవసరాలను తీర్చే సహజ కారకాలను వనరులుగా నిర్వచించవచ్చు.

 • మార్కెట్‌లో మనం చూసే అనేక ఉపయోగకరమైన వస్తువులను వనరులుగా పేర్కొంటారు.
 • భూమి, వాతావరణం, నీరు, అడవులు, జంతుజాలం, ఖనిజాలు, సూర్యరశ్మి లాంటి ప్రకృతి లేదా పర్యావరణ కారకాలు వనరులు అవుతాయని జిమ్మర్‌మాన్‌ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు.

వనరుల స్వభావం (Nature of Resources)

ఆర్థికాభివృద్ధికి, మానవ జీవనానికి మూలాధారమైన వనరులకు అధిక ప్రాధాన్యత లభించింది. వనరుల స్వభావం వైవిధ్యంగా ఉంటుంది.

 • జిమ్మర్‌మాన్‌ అభిప్రాయం ప్రకారం వనరులు క్రియాత్మక గతిశీలమైన స్వభావాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇవి పరిమితంగా, సర్వలభ్యంగా, గుప్తంగా, వెలికితీసేవిగా ఉంటాయి. వీటి వైవిధ్య స్వభావం వల్ల వీటిని అధికంగా వినియోగిస్తారు.

అస్థిరమైన వనరులు (Non-Sustainble Resources)

ఇవి రెండు రకాలుగా ఉంటాయి.

పరిమితమైన వనరులు (Finite Resources): కొన్ని వనరులను ఒకసారి వినియోగించిన తర్వాత వాటిని పునఃస్థాపించలేం. మరోవిధంగా చెప్పాలంటే, కొన్ని వనరులు ఒక నిర్దిష్ట మొత్తంలో మాత్రమే లభిస్తాయి. అలాంటి వాటినే పరిమిత వనరులు అంటారు.

ఉదా: చమురు, నేలబొగ్గు

అనంతమైన వనరులు (Infinite Resources): ఏవైనా వనరులు అపరిమితంగా లభిస్తూ, వాటికి పునఃస్థాపక సామర్థ్యం ఉన్నట్లయితే వాటిని అనంతమైన వనరులు అంటారు.

ఉదా: సౌరశక్తి, పవనశక్తి మొదలైనవి.


సక్రమ నిర్వహణకు పాటించాల్సిన నియమాలు

అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండటం

 • మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం
 • భూమి జీవశక్తి, వైవిధ్యతను కాపాడటం
 • సహజ వనరుల క్షీణతను తగ్గించడం
 • పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి, విధులను మార్చుకోవడం
 • భూమిపై విలువైన వనరులైన వృక్షాలు, నీటిని అవసరమైన మేరకు జాగ్రత్తగా వినియోగించడం
 • భవిష్యత్‌ తరాల వారికి వనరుల వినియోగం, వాటి విలువను తెలియజేయడం.

వనరులు - వర్గీకరణ

వనరులు విభిన్న రకాలుగా ఉంటాయి.

వీటిని సాధారణంగా సహజ వనరులు, మానవ వనరులు, జీవ, నిర్జీవ వనరులుగా వర్గీకరించవచ్చు.

జీవ, నిర్జీవ వనరులు (Biotic and Abiotic Resources): ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చలించే వనరులను, జీవ సంబంధ పెరుగుదల ఉన్న వాటిని జీవ వనరులు అంటారు.
ఉదా: వృక్షాలు, జంతువులు.

ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చలించడానికి వీలుకానివి, స్వతహాగా జీవచక్రాలు లేని వాటిని నిర్జీవ వనరులు లేదా అజీవ వనరులు అంటారు.

 • సాధారణంగా వీటి లక్షణం/స్వభావం ప్రాంతాన్ని బట్టి మారుతుంది.

ఉదా: నేల, వాతావరణం, నీరు, ఖనిజాలు, సౌరశక్తి మొదలైనవి.

పునరుత్పాదక యోగ్య వనరులు (Renewable Resources):

 • మానవుడు తన అవసరాల కోసం వనరులను ఎల్లప్పుడూ వాడుతూనే ఉంటాడు.
 • ఈ క్రమంలో వనరులు తరిగిపోయినప్పటికీ, పునరుత్పాదితమయ్యే, పునఃస్థాపించగల, ఎక్కువ కాలం లభించే వనరులను పునరుత్పాదక యోగ్య వనరులు అంటారు. సహజ చక్రాల వల్ల వనరులకు పునరుత్పాదక శక్తి కలుగుతుంది.

ఉదా: వృక్షాలు, నీరు, జంతువులు మొదలైనవి.

పునరుత్పాదక యోగ్యం లేని వనరులు

ప్రకృతి వల్ల గానీ, మానవ ప్రయత్నం వల్ల గానీ పునరుత్పత్తి చేయడం సాధ్యంకాని వనరులను పునరుత్పాదక యోగ్యం లేని వనరులు అంటారు.

 • ఒక నిర్దిష్ట కాలం తర్వాత అవి అంతరించిపోవడం లేదా తరిగిపోవడం జరుగుతుంది.

ఉదా: అన్ని రకాల ఖనిజాలు, నేల మొదలైనవి.

పునఃచక్రీయ వనరులు (Recycle Resources): ఏవైనా వనరులను ఒకసారి వినియోగించిన తర్వాత, వాటిని మరో విధంగా వినియోగించే వీలు ఉన్నట్లయితే ఆ వనరులను పునఃచక్రీయ వనరులు అంటారు.

ఉదా: కాగితం, అల్యూమినియం, ప్లాస్టిక్‌, స్టీల్‌ తదితరాలు.

సుస్థిరమైన వనరులు (Sustainable Resources): ఒక వనరు వినియోగ రేటు ఆ వనరుల్లో గ్రహించిన మొత్తాన్ని, తనంతటతాను పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యం ఏ మాత్రం ప్రభావితం కాదు. అదేవిధంగా ఉత్పాదక రేటును భవిష్యత్తులో సాధించవచ్చు.

ఉదా: ఒక కాలంలో కోతకు వచ్చిన వృక్షాలు, పండ్లు, చేపలు

సహజ వనరులు (Natural Resources):

భూమి మీద ప్రకృతిసిద్ధంగా ఆవిర్భవించిన వనరులను సహజ వనరులు అంటారు. ఈ వనరులు పురాతన కాలం నుంచి భూమిపై లభిస్తున్నాయి.

 • భూమిపై వీటి విస్తరణ అస్తవ్యస్తంగా ఉంది. ఇవి కొన్నిచోట్ల సమృద్ధిగా ఉంటే మరికొన్ని చోట్ల అరకొరగా ఉంటాయి.
 • వనరుల కొరత ఉన్న ప్రాంతాలు ఆర్థికంగా, రాజకీయంగా, బలహీనంగా ఉంటాయి.
 • నేల, గాలి, నీరు, అడవులు, జంతువులు, ఖనిజాలు, సౌరశక్తి మొదలైనవి సహజ వనరుల కారకాలు.
 • వనరులను ఎక్కువ కాలంపాటు లేదా సుదీర్ఘ భవిష్యత్‌ కాలంలో వినియోగించుకునేలా ప్రణాళికలు, విధానాలు రూపొందిస్తున్నారు.

మానవ వనరులు (Human Resources):

ఒక దేశ జనాభాను ఆ దేశ మానవ వనరులు అంటారు. జనాభా ప్రకృతిలో ఒక భాగమే అయినప్పటికీ, సహజ కారకాలతో పోల్చినప్పుడు ఇది విభిన్నమైన లక్షణాలను కలిగి ఉంటుంది.

 • అధిక జనాభా అభివృద్ధిని సాధిస్తుందనటంలో వాస్తవం లేదు, కానీ ఇది జనాభా స్వభావానికి లేదా యోగ్యతకు సంబంధించింది.
 • సమర్థత, నైపుణ్యత్వం, విద్య, మానసిక దృక్పథం, ప్రతిభ, దేశభక్తి, శాస్త్రీయ దృక్పథం అనేవి జనాభా స్వభావం/యోగ్యతకు సూచికలు.
 • గుణాత్మక జనాభా అందుబాటులో ఉన్న సహజ వనరులను సద్వినియోగపరచుకోవడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చు. దేశ జనాభా యోగ్యత తక్కువగా ఉన్నప్పుడు, వనరులను సరిగా వినియోగించలేక పోవడంతో ఆయా దేశాలు అభివృద్ధికి దూరంగా ఉంటాయి.

ఉదా: ఉష్ణమండల ప్రాంతాల్లోని దేశాలు అభివృద్ధికి దూరంగా ఉండటం.

 • ఏదైనా ఒక దేశం లేదా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలోని జనాభా, సహజ వనరులు సరిగా అనుసంధానమై ఉండాలి. అందువల్ల ఈ రెండు వనరులు అభివృద్ధికి చాలా ప్రధానమైంది.
 • మానవ వృత్తుల ఫలితంగా వస్తువులు, సేవలు లభిస్తాయి. వీటిలో ఉత్పత్తి అయిన వస్తువులు, ద్రవ్యం, విద్య, భవనాలు, సమాచారం మొదలైనవి ఉంటాయి.

వనరుల పరిరక్షణ

19వ శతాబ్దం చివరి భాగంలో పరిరక్షణ అనే పదం వాడుకలోకి వచ్చింది.

 • ప్రధానంగా అడవులు, మృత్తికలు, పచ్చిక బయళ్లు, ఖనిజాలు లాంటి విలువైన సహజ వనరులు, వన్యప్రాణులు, ఉద్యానవన భూములు, అరణ్యాలు, వాటర్‌షెడ్‌ ప్రాంతాలను సంరక్షించడం అనే అంశాల నిర్వహణ పరిరక్షణలో భాగంగా ఉంటుంది.
 • భూతలంపై ఉన్న వనరులను శీఘ్రగతిన వినియోగించడం వల్ల అవి క్షీణిస్తాయి.
 • ఈ చర్య భవిష్యత్‌ తరాల వారికి సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి వనరులను జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉంది.
 • వనరులను జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించడాన్నే వనరుల పరిరక్షణ అంటారు.
 • పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల అవసరాలు పెరుగుతాయి. వారి జీవన విధానం కూడా మారిపోతుంది.
 • మితిమీరిన వనరుల వినియోగం విధ్వంసానికి దారితీస్తుంది. దీంతో పరిమిత వనరులు కనుమరుగవడం లేదా క్షీణించిపోవడం జరుగుతుంది. నేలలు నిస్సారం అవుతాయి. ఖనిజ నిల్వలు తరిగిపోతాయి.
 • వనరుల పరిరక్షణ అనేది 3R విధానంపై ఆధారపడి ఉంటుంది.

 3R అంటే Reduce, Reuse, Recycle

వనరుల నిర్వహణ

వినియోగానికి అందుబాటులో ఉన్న వనరులను మానవులు తమ అవసరాల మేరకు జాగ్రత్తగా వాడుకోవడాన్ని వనరుల నిర్వహణగా పేర్కొనవచ్చు.

వనరుల నిర్వహణ అనేది వ్యక్తి జ్ఞానం, విద్య, పొదుపు, సహాయ సహకారం, ముందుచూపు, ప్రకృతి పట్ల గౌరవం, వనరులపై సరైన అవగాహన లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని