కరెంట్‌ అఫైర్స్‌

భారత్‌ను పశ్చిమాసియా మీదుగా ఐరోపాతో అనుసంధానించే ఐమెక్‌ ప్రాజెక్టుకు సంబంధించి 2024, ఫిబ్రవరి 1న భారత్‌ ఏ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది?

Published : 04 Apr 2024 01:56 IST

మాదిరి ప్రశ్నలు

  • భారత్‌ను పశ్చిమాసియా మీదుగా ఐరోపాతో అనుసంధానించే ఐమెక్‌ ప్రాజెక్టుకు సంబంధించి 2024, ఫిబ్రవరి 1న భారత్‌ ఏ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది? (చారిత్రకంగా భారత ఉపఖండం, పశ్చిమాసియా, ఐరోపా దేశాల మధ్య వాణిజ్యం జరిగిన మార్గాన్ని ‘ఇండియా - పశ్చిమాసియా - ఐరోపా ఆర్థిక నడవా (ఐఎంఈసీ - ఐమెక్‌)’ పునరుద్ధరిస్తుంది. ఇది బిల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం (బీఆర్‌ఐ) ద్వారా పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఉపకరిస్తుంది. భారత్‌ నుంచి పశ్చిమాసియా మీదుగా ఐరోపాకు సరకుల రవాణాను వేగవంతం చేస్తుంది. గతేడాది జీ20 సదస్సులో ఐమెక్‌ అవగాహన ఒప్పందంపై భారత్‌, అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ), ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ సౌదీ అరేబియా, యూఏఈ సంతకాలు చేశాయి. ఈ నడవాలో భారత్‌, యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, గ్రీస్‌ల మీదుగా ఐరోపాకు వాణిజ్య మార్గం నిర్మితమవుతుంది. ఇజ్రాయెల్‌, జోర్డాన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేయకపోయినా అవి కూడా భాగస్వాములవుతాయి.)

జ: యూఏఈ

  • భారత్‌లో మొదటిసారిగా లిథియం అయాన్‌ బ్యాటరీ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? (నేడు అతిపెద్ద లిథియం ఎగుమతి దేశం ఆస్ట్రేలియా. అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది చైనా. లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీలో చైనాదే అగ్రస్థానం. 2023 చివరి నాటికి ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదారు హోదాను అమెరికన్‌ కంపెనీ టెస్లా నుంచి బీవైడీ అనే చైనా కంపెనీ చేజిక్కించుకుంది. ప్రపంచంలో 2022 నాటికి 9.8 కోట్ల టన్నుల లిథియం నిక్షేపాలను కనుక్కున్నారు. వీటిలో సగానికి పైగా దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా, బొలీవియా, చిలీ దేశాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ మూడు దేశాలను లిథియం త్రికోణంగా అభివర్ణిస్తున్నారు. 62 లక్షల టన్నుల నిక్షేపాలతో ఆస్ట్రేలియా కూడా అగ్రశ్రేణిలో ఉంది.)

జ: వడోదరా (గుజరాత్‌)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని