ఆ మండలి లక్ష్యం... సహకార సమన్వయ సాధనే!

దేశంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సమన్వయపరచుకుంటూ తమ విధులను నిర్వర్తిస్తుంటాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌ల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది.

Updated : 10 Apr 2024 00:39 IST

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

దేశంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సమన్వయపరచుకుంటూ తమ విధులను నిర్వర్తిస్తుంటాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌ల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల రాబడి విభజన, రాష్ట్రాల వాటా బదిలీ ప్రాతిపదికను సూచిస్తుంది. నీతిఆయోగ్‌ కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేస్తూ, సహకార సమాఖ్యను మెరుగుపరుస్తూ ఉంటుంది.

భారత విత్త సంఘం - కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు

(Finance Commission of India)

అంతర్‌రాష్ట్ర మండలి

భారత రాజ్యాంగంలోని 263వ ప్రకరణం ఆధారంగా అంతర్‌రాష్ట్ర మండలి ఏర్పాటైంది.

  • రాష్ట్రాల మధ్య సహకార సమన్వయాలను సాధించే లక్ష్యంతో ఈ మండలి పనిచేస్తుంది.
  • రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చే ఆశయంతో రాష్ట్రపతి  అవసరమైన సందర్భాల్లో ఈ మండలిని నెలకొల్పుతారు.

విధులు

రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాల పరిష్కారంలో తగిన సూచనలివ్వడం.

  • దేశంలోని కొన్ని లేదా అన్ని రాష్ట్రాలు నిర్వహించే విధుల విషయంలో ఎదురయ్యే వివాదాలను పరిష్కరించడం.
  • ఏదైనా ఒక అంశంపై రాష్ట్రాల మధ్య విధానపరమైన సమన్వయాన్ని సూచించడం.

నిర్మాణం: భారత రాష్ట్రపతి 1990 మే 28న అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యులుగా కింద పేర్కొన్న వారు ఉంటారు.

ఎ) ప్రధానమంత్రి

బి) రాష్ట్ర ముఖ్యమంత్రులు

సి) కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, పరిపాలకులు

డి) ప్రధానమంత్రి సూచించిన ఆరుగురు కేంద్ర మంత్రులు

  • అంతర్‌రాష్ట్ర మండలికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండి, సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
  • కొన్ని సందర్భాల్లో ఆ మండలి సమావేశాలకు అధ్యక్షత వహించాల్సిందిగా కేంద్ర మంత్రుల్లో ఒకరిని నామినేట్‌ చేస్తారు.

నీతి ఆయోగ్‌

ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ (National Institution for Transforming India  - NITI     AAYOG)ను 2015 జనవరి 1న ఏర్పాటు చేసింది.
జాతీయాభివృద్ధి ప్రాధామ్యాల్లో కేంద్ర, రాష్ట్రాల సంబంధాలను మెరుగుపరచడం, వాటి మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయడం, సహకార సమాఖ్యను ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్రాలను బలోపేతం చేయడం దీని విధి.

ప్రధాన లక్ష్యాలు: నిరుద్యోగం, పేదరిక నిర్మూలన

  • అసమానతల తొలగింపు
  • గ్రామాల సమగ్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ అంచనా
  • దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. ఈయనతోపాటు ఒక ఉపాధ్యక్షుడు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు; ప్రాంతీయ మండళ్లతో కూడిన గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఉంటాయి.

కేంద్ర పన్నుల రాబడి విభజన - ఆర్థిక సంఘాల పాత్ర

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విత్త సంబంధాల్లోని కీలక అంశాలను పరిశీలిస్తుంది.

  • కేంద్ర పన్నుల రాబడి, వాటి విభజన, పంపిణీ, సహాయక విరాళాల మంజూరు, రాష్ట్రాలకు కేంద్రం సమకూర్చే పలు రంగాల సంబంధిత మార్పులను పరిశీలిస్తుంది. వీటికి సంబంధించి విత్తసంఘం తగిన సిఫార్సుల నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
  • ఈ సిఫార్సుల పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వం తగిన మార్పులు చేర్పులతో వాటిని అమలు చేస్తుంది.

కేంద్ర పన్నుల రాబడి విభజన పంపిణీ: ప్రధానంగా ఆదాయపు పన్ను, ఎక్సైజ్‌ సుంకం, అదనపు ఎక్సైజ్‌ సుంకం, రైల్వే ప్రయాణికులు, సరుకుల రవాణాపై పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించే రాబడిలో రాష్ట్రాలకు వాటా ఉంటుంది.

ఆర్థిక సంఘం ఈ వాటాను నిర్ణయించి, వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసే ప్రాతిపదికను సూచిస్తుంది.


ఆదాయపు పన్ను

వ్యక్తుల ఆదాయాలపై కేంద్రం పన్ను విధించి, వసూలు చేస్తుంది.

‘ ఈ రాబడిలో అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుంది. కాబట్టి ఆర్థిక సంఘం కింది రెండు అంశాలపై తన సిఫార్సులను వివరించాలి.

ఆదాయపు పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా: మొదటి ఆర్థిక సంఘం ఆదాయ పన్ను రాబడిలో 35% రాష్ట్రాలకు చెందాలని పేర్కొంది. రెండు, నాలుగు, అయిదో ఆర్థిక సంఘాలు 60%, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో విత్త సంఘాలు 85%గా ఉండాలని సిఫార్సు చేశాయి. పదకొండో ఆర్థిక సంఘం 80%గా నిర్ణయించింది. ఆ తర్వాత ఈ వాటాను 85%కి పెంచారు.


16వ ఆర్థిక సంఘం - వివరాలు

16వ ఆర్థిక సంఘాన్ని 2023 డిసెంబరు 31న ఏర్పాటు చేశారు.

  • ఈ సంఘం రూపొందించే సిఫార్సులను 2025 అక్టోబరు 31న అందుబాటులో ఉంచుతారు.
  • ఈ సిఫార్సులను 2026 ఏప్రిల్‌ 1న అమలు చేస్తారు.
  • ఈ సంఘ సిఫార్సుల అమలు కాలం 2026 - 2031
  • 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ప్రొఫెసర్‌ అరవింద్‌ పనగారియా నియమితులయ్యారు. ఈ సంఘంలో నలుగురు సభ్యులు ఉన్నారు.

1) అజయ్‌ నారాయణ్‌ ఝా 2) అన్నీ జార్జీ మాథ్యూ  

3) డా. నిరంజన్‌ రాజాద్యక్షా 4) డా. సౌమ్య కాంతి ఘోష్‌

16వ ఆర్థిక సంఘం సెక్రటరీ - రిత్విక్‌ రంజనామ్‌ పాండే


రాష్ట్రాలకు ఆదాయపన్ను వాటా పంపిణీకి ప్రాతిపదిక

ప్రధానంగా రాష్ట్ర జనాభా, పన్ను వసూలు మొత్తాల ప్రాతిపదికగా వివిధ రాష్ట్రాలకు ఆదాయ పన్ను రాబడిని పంపిణీ చేస్తారు.

  • మొదటి ఆర్థిక సంఘం ఆదాయ పన్ను రాబడి, వసూలు ప్రాతిపదికపై వాటాను 80%గా, జనాభా ప్రాతిపదికపై పన్ను వసూలు మొత్తం ఆధారంగా మిగిలిన 20% పంపిణీ చేయాలని నిర్ణయించింది.
  • రెండో ఆర్థిక సంఘం జనాభా ఆధారంగా 90%, పన్ను వసూలు మొత్తం ఆధారంగా 10% ఉండాలని సిఫార్సు చేసింది. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే ఈ నియమాన్ని అనుసరించారు.
  • అయిదో ఆర్థిక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘం వరకు ఆదాయపన్ను వసూలు మొత్తం ఆధారంగా 10% పన్ను రాబడిని రాష్ట్రాలకు విభజించాలని సూచించాయి.
  • మిగిలిన 90% పన్ను రాబడికి పదో ఆర్థిక సంఘం మార్గదర్శకాలను సూచించింది. అవి:

ఎ) 1971 జనాభా ప్రాతిపదికన 20%

బి) రాష్ట్ర తలసరి ఆదాయానికి గరిష్ఠ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రానికి మధ్య ఉన్న ఆదాయ వ్యత్యాసం ప్రాతిపదికన 60%

సి) అవస్థాపన సౌకర్యాల సూచీ ఆధారంగా 5%

డి) రాష్ట్ర విస్తీర్ణం ఆధారంగా 5% ఇవ్వాలి.

  • ఈ ప్రాతిపదికల రాబడి విభజన శాతాల్లో పదకొండు, పన్నెండో విత్త సంఘాల ప్రామాణిక కాలంలో వ్యత్యాసాలున్నాయి.
  • 13వ ఆర్థిక సంఘం అనుసరించిన ప్రాతిపదిక:

ఎ) జనాభా ప్రాతిపదికన 25%

బి) రాష్ట్ర తలసరి ఆదాయానికి గరిష్ఠ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రానికి మధ్య గల ఆదాయ వ్యత్యాసం ప్రాతిపదిక 47.5%

సి) రాష్ట్ర విస్తీర్ణం ఆధారంగా 10%

డి) బడ్జెట్‌లో విత్త క్రమశిక్షణ ఆధారంగా 7.5% ఇవ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని